పీసీఓఎస్‌ : పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ లక్షణాలు చికిత్స

pcos
Image Source: Istock

పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ ( పీసీఓఎస్ ‌) అనేది శరీరంలో హార్మోన్లు సక్రమంగా లేకపోవడం వల్ల మహిళల్లో కలిగే అనారోగ్య సమస్య. ఇది కేవలం సంతానం పొందగలిగే వయస్సు ఉన్న మహిళల్లో మాత్రమే వస్తుంది. పాలిసిస్టిక్‌ అంటే.. సిస్ట్‌లు ఎక్కువగా ఉండడం. అండాశయాల్లో ఉంటున్నందున పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ అంటారు. దక్షిణ భారతదేశంలో, మహారాష్ట్రలో నూటికి 9 నుంచి 22 మందికి ఉన్నట్టు ఒక అధ్యయనంలో తేలింది.

ప్రధానంగా పీరియడ్స్‌ (రుతుస్రావం) లేదా నెలసరి సమయానికి రాకుండా క్రమం తప్పి రావడం, ఎక్కువ రోజుల పాటు రుతుస్రావం కావడం, ఆండ్రోజెన్‌ అనే పురుష హార్మోన్‌ అధిక మోతాదులో ఉండడం ఈ పీసీఓఎస్‌లో గమనించవచ్చు.

ఓవరీస్‌ (అండాశయాలు )లో అనేక చిన్నచిన్న నీటి తిత్తులు ఏర్పడి అండాల విడుదలను అడ్డుకుంటాయి. పీసీఓఎస్‌కు కచ్చితమైన కారణం తెలియనప్పటికీ స్త్రీలలో ఉండే ఈస్ట్రోజెన్‌. ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లలో బ్యాలెన్స్‌ లేకపోవడం కారణంగా చెబుతారు.

పీసీఓఎస్‌ లక్షణాలు ఏంటి?

పీసీఓఎస్‌ లక్షణాలు టీనేజ్‌ వయస్సులో రుతుస్రావం మొదలైనప్పుడే వృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు ఆలస్యంగా మొదలవుతాయి. అయితే పీసీవోఎస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా కనిపిస్తాయి. ప్రధానంగా మూడు లక్షణాలు వీటిలో కనిపిస్తాయి.

1. పీరియడ్స్‌ రెగ్యులర్‌గా రాకపోవడం :  పీరియడ్స్‌ లేదా రుతుచక్రం ప్రతి 28 రోజులకోసారి కాకుండా చాలా ఆలస్యంగా లేదా క్రమం తప్పుతూ రావడం, అలాగే పీరియడ్స్‌ ఎక్కువ రోజులు ఉండడం, ఏడాదిలో 12 సార్లకు గాను 9 సార్ల కంటే తక్కువ రావడం, బ్లీడింగ్‌ ఎక్కువగా కావడం.

2. ఆండ్రోజెన్‌ స్థాయి ఎక్కువగా ఉండడం పీసీఓఎస్‌ :  ఆండ్రోజెన్‌ అనేది పురుష హార్మోన్‌. ఆండ్రోజెన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మహిళల్లో పురుష లక్షణాలు కనిపిస్తాయి. అంటే ముఖంపై మగవారిలా మీసాలు, గడ్డాలు ఉండడం, శరీరంపై కూడా ఎక్కువగా అవాంఛిత రోమాలు ఉండడం, ఎక్కువగా మొటిమలు రావడం, స్కిన్ ప్రాబ్లెమ్స్, బరువు పెరగడం కూడా ఉంటుంది.

3. పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ :  అండాశయాల ఆకృతి పెద్దగా మారడం, అండాల చుట్టూ ఫోలికల్స్‌ చేరడం, దీని కారణంగా ఓవరీస్‌ తన విధులను సక్రమంగా నిర్వర్వించలేకపోవడం.

పీసీఓఎస్‌ కారణాలు ఏంటి?

పీసీఓఎస్‌కు కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే ఈ క్రింది వాటి వల్ల పీసీఓఎస్‌ రావొచ్చని వైద్య శాస్త్రం చెబుతోంది.

అధిక ఇన్సులిన్ :  మన రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంచేది ఇన్సులిన్‌. ఒక్కోసారి ఇన్సులిన్‌ రెసిస్టెంట్‌గా మారి షుగర్‌ లెవెల్స్‌ అదుపుతప్పుతుంటాయి. అప్పుడు ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఆండ్రోజెన్‌ లెవెల్స్‌ కూడా పెరుగుతాయి. ఇది పీసీఓఎస్‌కు కారణమవుతుంది.

తక్కువస్థాయి ఇన్‌ఫ్లమేషన్ : మన శరీరంలో ఏవైనా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు తెల్లరక్తకణాలు ఆ వ్యాధితో పోరాడడం ప్రారంభిస్తాయి. మహిళల్లో పీసీఓఎస్‌ ఉన్నట్టయితే ఈ పోరాడేశక్తి తక్కువగా ఉంటుంది. ఇవి పాలిసిస్టిక్‌ ఓవరీస్‌కు కారణమై ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి అధికమవుతుంది. ఇది రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడడానికి, గుండె జబ్బులు రావడానికి కారణమవుతుంది.

వంశపారంపర్యంగా : జన్యువుల కారణంగా కూడా పీసీఓఎస్‌ వచ్చే అవకాశం ఉంది. అంటే వంశపారంపర్యంగా పీసీఓఎస్‌ వచ్చిన ఉదంతాలు చాలా ఉన్నాయని వైద్య శాస్త్రం చెబుతోంది.

పీసీఓఎస్‌ కారణంగా తలెత్తే ఇబ్బందులు :

1. సంతానలేమి
2. గర్భం ధరించినప్పుడు డయాబెటిస్‌ రావడం
3. టెప్‌ 2 డైబెటీస్‌
4. గర్భం ధరించినప్పుడు హైబీపీ రావడం
5. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ :  షుగర్‌ లెవెల్స్, బీపీ లెవెల్స్, కొలెస్ట్రాల్‌ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్‌ పెరిగి గుంyð జబ్బులు, బ్రెయిన్‌ హామరేజ్‌ వంటి జబ్బులకు దారితీస్తుంది.
6. లివర్‌పై కొవ్వు పేరుకుపోయి నాన్‌ఆల్కహాలిక్‌ స్టీటో హెపటైటిస్‌ అనే వ్యాధి రావొచ్చు.
7. డ్రిపెషన్, యాంగై్జటీ, ఆహార అలవాట్లలో మార్పులు
8. గర్భాశయం నుంచి అసాధారణ రక్తస్రావం (పీరియడ్స్‌కు పీరియడ్స్‌కు మధ్యలో రక్తస్రావం)
9. యుటెరిన్‌ లైనింగ్‌ క్యాన్సర్‌ (ఎండోమెట్రియల్‌ కాన్సర్‌)
10. ఒబెసిటీ (బరువు పెరగడం)
11. నిద్ర పోతున్నప్పుడు కొద్దిసేపు శ్వాస ఆడకపోవడం
12. మెడ, చంక, రొమ్ములు, తొడల భాగంలో డార్క్‌ బ్రౌన్, బ్లాక్‌ కలర్‌లో ప్యాచెస్‌ రావడం

పీసీఓఎస్‌ టెస్ట్స్‌ ఏంటి? ఎలా తెలుసుకోవచ్చు?

మెడికల్‌ హిస్టరీ :  పేషెంట్‌ మెడికల్‌ హిస్టరీని బట్టి వైద్యులు అంచనాకు వస్తారు. పీరియడ్స్‌లో మార్పులు, బరువులో మార్పులు.. ఇలా అన్నీ గమనిస్తారు. వెంట్రుకల పెరుగుదల, మొటిమలు, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌.. ఇలా అన్నీ పరిశీలిస్తారు.

పెల్విక్‌ టెస్ట్ : తదుపరి పెల్విక్‌ పరీక్ష నిర్వహిస్తారు.ఈ పరీక్ష ద్వారా ప్రత్యుత్పత్తి అవయవాల పనితీరును పరిశీలిస్తారు. అసాధరణంగా ఉంటే పసిగడతారు.

బ్లడ్‌ టెస్ట్స్‌ : దీంతోపాటు లిపిడ్‌ ప్రొఫైల్, హెచ్‌బీఏ1సీ వంటి సాధారణ రక్తపరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా హార్మోన్ల స్థాయిలను తెలుసుకునేందుకు ఈ రక్తపరీక్షలు నిర్వహిస్తారు. గ్లూకోజ్‌ లెవెల్స్, ట్రెగ్లైజరైడ్స్‌ లెవెల్స్‌ వంటివి తెలుసుకుంటారు.

ఆల్ట్రాసౌండ్ : అండాశయం పరిమాణాన్ని, గర్భాశయం గోడల మందాన్ని ఈ ఆల్ట్రాసౌండ్‌ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు.

పీసీఓఎస్‌ ట్రీట్‌మెంట్‌ ఏంటి?

పీసీఓఎస్‌ ట్రీట్‌మెంట్‌ ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కనిపించే లక్షణాలను బట్టి వాటిపై ఫోకస్‌ చేస్తారు. అయితే అందరికీ వైద్యులు సలహా ఇచ్చేది జీవనశైలి మార్పులు.

జీవనశైలి మార్పులు : 

తిండి నిద్ర శారీరక శ్రమలో క్వాలిటీ పెంచడం ముఖ్యం. అంటే మనం తినే తిండిలో అన్నీ సమతుల్యంగా ఉన్నాయా? లేదా సరిచూసుకోవాలి. అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్పొహైడ్రేట్స్‌.. ఇలా సంపూర్ణ పోషకాహారం ఉందా లేదా చూడాలి.

రోజుకు 8 గంటలపాటు నిద్ర పోవాలి. శారీరక శ్రమ ఉన్నా.. వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. కచ్చితంగా రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వీలైతే యోగా.. ప్రాణాయామం, ధ్యానం చేయాలి. ఇవన్నీ హార్మోన్ల సమతుల్యానికి సహకరిస్తాయి.

పీసీఓఎస్‌ నుంచి ఇలా ఉపశమనం పొందండి..

బరువు :  శరీర బరువును క్రమంతప్పకుండా పరిశీలించి పెరగకుండా చూసుకోవాలి. బరువుతగ్గడం వల్ల ఆండ్రోజెన్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. ఇన్సులిన్‌ లెవెల్స్‌ సక్రమంగా ఉంటాయి.

కార్బొహైడ్రేట్స్ :  మనం తినే తిండిలో కార్బొహైడ్రేట్స్‌ తగ్గించాలి. అంటే పిండిపదార్థాలు తగ్గించాలి. కార్బొహైడ్రేట్స్‌ పెరిగితే షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. దీనిని గమనించి ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్‌ ఉంటే ఆహారం తీసుకోవాలి. 

ఫ్లాక్స్ సీడ్స్: ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) కాస్త వేయించి పొడి చేసి 40 గ్రాములు రోజూ ఉదయం వేడి నీటిలో కలుపుకొని తాగాలి. ఫ్లాక్స్ సీడ్స్లో ఉండే లిగ్నన్స్ (lignans), ఫైబర్, ఒమెగా ఆయిల్స్ హార్మోనల్ బ్యాలెన్స్ ను రెగ్యులేట్ చేస్తాయి. క్రమంగా పీసీఓఎస్ లక్షణాలను నయం చేస్తాయి. పరిగడుపున తాగడం మంచిది. 

ఆరెంజెస్, ఫాక్స్ నట్స్ (మఖానా), వాల్ నట్స్, పాలకూర, ఎగ్స్, అరటి పండ్లు, బ్రౌన్ రైస్ మీ డైట్లో భాగం చేసుకోవాలి. ఆయిల్స్ తగ్గించాలి. ఆలివ్ ఆయిల్ వాడుకోవాలి. కాఫీ మానేయాలి. ప్యాకేజ్డ్ ఫుడ్, ఫ్రోజెన్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. 

జింక్, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, తదితర విటమిన్లు ఉండే ఆహారం ఎక్కువగా వాడాలి. సిస్టైన్ సప్లిమెంట్ డాక్టర్ సలహా మేరకు వాడాలి.

వ్యాయామం :  మనం శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచితే షుగర్‌ లెవెల్స్‌ అదుపులో ఉండడమే కాకుండా.. హార్మోన్లు కూడా బాలెన్స్‌గా ఉంటాయి. రక్తనాళాలు గడ్డ కట్టడం వంటి సమస్యలు ఎదురవ్వవు.

మెడికేషన్‌ ట్రీట్‌మెంట్‌ ఇలా..

హార్మోన్ల సమతుల్యంగా ఉండడం కోసం ఆండ్రోజెన్‌ను నియంత్రించి, ఈస్ట్రోజెన్‌ను క్రమబద్ధీకరించేందుకు వైద్యులు మందులు సూచిస్తారు. అలాగే ప్రొజెస్టిన్‌ థెరపి ద్వారా హార్మోన్ల సమతుల్యత కోసం మందులు ఇస్తారు.

Previous articleఆన్​ లైన్​ లో ఎల్ఆర్ఎస్​ సేవలు ప్రారంభం
Next articleఅద్దె ఇల్లు వర్సెస్ సొంతిల్లు .. ఏది లాభం?