రాజస్తాన్‌లో రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. మధ్యప్రదేశ్‌లో నేత జ్యోతిరాధిత్య సింథియా బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మారారు. సచిన్ పైలట్ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి గురుగ్రామ్ హోటల్ లో మకాం వేశారు. తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రకటించారు.
సోమవారం ఉదయం జరిగే సీఎల్పీ సమావేశానికి రావాలని విప్ జారీచేసినా పట్టించుకోలేదు. సాయంత్రానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసి బీజేపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరగుతోంది. మరోవైపు తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని గెహ్లాట్ చెబుతన్నారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 15 కోట్లు బీజేపీ ఆఫర్ చేసిందంటా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపణలు చేసినప్పటి నుంచి రాజస్తాన్ రాజకీయాల్లో వేడి మొదలైంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పడిపోయి.. బీజేపీ సర్కారు గద్దెనెక్కింది. రాజస్థాన్‌లోనూ బీజేపీ ఇదే చేయబోతోందంటూ అశోక్ గెహ్లాట్ మండిపడుతున్నారు. కానీ బీజేపీ దీన్ని తిప్పికొట్టింది.
‘గోవా, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఇలాగే చేసింది రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి గత నెల గుజరాత్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇప్పుడు రాజస్తాన్‌లో కూడా అదే పద్దతి అవలంభించాలని చూస్తున్నారు. కానీ మేం వారికి తగిన గుణపాఠం చెబుతాం. ఏళ్లపాటు గుర్తుండిపోతుంది..’ అని అన్నారు.
అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా కౌంటర్ ఇచ్చారు. తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఒక కన్నింగ్ పొలిటీషియన్ అని సతీష్ విమర్శించారు. తన పరిపాలనా వైఫల్యాలను కప్పపుచ్చుకోవడానికి గెహ్లాట్ బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి ఎవరు రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చూస్తున్నారో గెహ్లాట్‌కు తెలుసని పూనియా చెప్పారు.
సచిన్ పైలట్ తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో ఆదివారం ఢిల్లీ వచ్చారు. ఇప్పటివరకు అధిష్ఠానం పెద్దలతో కలవలేదు. తన అడుగులు బీజేపీ వైపు పడే అవకాశం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాజస్తాన్ అసెంబ్లీలో 200 సీట్లకు గాను కాంగ్రెస్ కు 106 సీట్ల బలం ఉంది. ఇందులో ఆరుగురు బీఎస్పీ సభ్యులు సొంత పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరినవారే. వీటికి తోడు మొత్తం 13 స్వతంత్ర అభ్యర్థులు ఉండగా.. అందులో 12 మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు.
ఇక బీజేపీకి 72 మంది సభ్యులు ఉన్నారు. దీనికి తోడు ఆర్ఎల్పీ సభ్యులు ముగ్గురు కూడా బీజేపీకి మద్దతుగా ఉన్నారు. మొత్తంగా బీజేపీ కంటే కాంగ్రెస్ కు 48 మంది సభ్యుల బలం ఎక్కువగా ఉంది.
కాంగ్రెస్ నుంచి సచిన్ పైలట్ వెంట 30 మంది వీడితే ప్రభుత్వం మైనారిటీలో పడనుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారన్న ఆరోపణలతో రాజస్తాన్ హోం శాఖకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నుంచి పైలట్‌కు నోటీసు అందిన నేపథ్యంలోనే పైలట్ ఈ వేరు కుంపటికి దిగారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కూడా. పైలట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీలోకి వచ్చినా.. ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చే అవకాశం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వసుంధర రాజే సింథియాకే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ తరహా కాకుండా.. ఈసారి ఎలాగైనా రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు ప్రారంభించింది.