రుణాలపై కేంద్రం విధించిన మారటోరియం (అప్పు చెల్లింపు వాయిదా) క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు కూడా వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అయితే క్రెడిట్ కార్డ్ బకాయిల విషయంలో కనీస మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది. కనీస మొత్తాన్ని చెల్లించని పక్షంలో క్రెడిట్ బ్యూరోలకు నివేదించనున్నట్టు తెలిపింది.
అలాగే క్రెడిట్ కార్డు జారీ చేసే వారు చెల్లించని మొత్తానికి వడ్డీ వసూలు చేస్తారని, క్రెడిట్ కార్డు చెల్లింపు పై వడ్డీని తెలుసుకోవడానికి మీరు మీ క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ ను సంప్రదించాలని స్పష్టం చేసింది. ఈ కాలంలో ఎటువంటి జరిమానా వడ్డీ వసూలు చేయరని, కానీ సాధారణ బ్యాంక్ క్రెడిట్ తో పోలిస్తే క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీరేటు సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆర్బీఐ 2020 మార్చి 1 నాటికి ఉన్న అన్ని టర్మ్ రుణాల చెల్లింపులపై, అదే విధంగా వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలపై మూడు నెలల మారటోరియంను ప్రకటించేందుకు బ్యాంకులను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మారటోరియం విషయంలో తలెత్తే ప్రశ్నలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సమాధానం ఇచ్చిందని చెబుతూ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటన వెలువరించింది.
కోవిడ్ –19 మహమ్మారి కారణంగా వ్యాపారాలు లేదా వ్యక్తులు ఆదాయం కోల్పోవడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో ఆయా వ్యక్తులు లేదా వ్యాపారాలకు ఈ మారటోరియం ఉపశమనం కలిగించవచ్చని కేంద్రం భావించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల టర్మ్ రుణాలకు ఇది వర్తిస్తుంది. వ్యవసాయ టర్మ్ రుణాలు, రిటైల్, పంట రుణాలు, కొనుగోళ్ల కోసం తీసుకున్న రుణాలు, క్యాష్ క్రెడిట్, ఓవర్డ్రాఫ్ట్ ప్యాకేజీ వంటివన్నీ ఈ మారటోరియంలోకి వస్తాయి. టర్మ్ లోన్స్ విషయంలో అసలును తిరిగి చెల్లించే కాలాన్ని 90 రోజులు పొడిగించారు.
మీకు క్రమం తప్పకుండా ఆదాయం వస్తూ ఉంటే ఈ ప్రయోజం ఆశించాల్సిన అవసరం లేదు. ఆదాయంలో అంతరాయం ఉంటే మీరు ఈ ప్యాకేజీ కింద ప్రయోజనాలు పొందవచ్చు.
అయితే వడ్డీ 3 నెలలు వాయిదా పడినప్పటికీ, తరువాత ఇది భారంగా మారుతుందనే అంశం పరిగణనలోకి తీసుకోవాలి.
ఉదాహరణకు మీ రుణం బకాయి రూ. లక్ష ఉందనుకుందాం. మీకు 12 శాంత వడ్డీరేటు ఉందనకుందాం. ప్రతినెలా మీరు రూ.1000 వడ్డీగా చెల్లించవలసి ఉంటుంది. ఒక వేళ మీరు ప్రతినెలా వడ్డీ కట్టకపోతే ఏడాదికి 12 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అంటే 3వ నెల చివరికి మీరు రూ. 3,030 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా 10 శాతం వడ్డీ ఉంటే, మీరు నెలకు రూ. 833 లేదా మూడు నెలలకు రూ. 2,521 చెల్లించవలసి ఉంటుంది.
ఇవీ చదవండి