సర్ ఈజ్ లవ్ ఇనఫ్ ? ప్రేమ ఉంటే చాలా ? అంటే అవుననే అంటాయి దాదాపు అన్ని కమర్షియల్ సినిమాలు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రేమ ఒక్కటే సరిపోదని సున్నితంగా, స్పష్టంగా చెప్పలేని చూపించలేని చిత్రాలే ఎక్కువ. ఒకవేళ చూపించిన ప్రాక్టికల్‌గా వచ్చే సమస్యల గురించి సూటిగా చెప్పిన సినిమాలు చాలా తక్కువ. కానీ అలాంటిదే Sir- Is love Enough? ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్లోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం రండి..
సర్.. ఈజ్ లవ్ ఇనఫ్?
ముంబయి మహానగరంలో సంపన్నులుండే ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌లో అమెరికా నుంచి వచ్చి కాంట్రాక్టర్‌గా పనిచేస్తుంటాడు హీరో. వాళ్ల అమ్మా నాన్న వేరే ఇంట్లో ఉంటారు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఇంటికొచ్చేస్తాడు. మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో పెళ్లైన రెండు నెలలకే భర్త చనిపోయిన రత్న అతని ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది.
పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో కొంచెం బాధపడుతుంటాడు. అతని స్నేహితులు తోడుగా ఉంటారు. రోజూ సైట్ కి వెళ్లి పనిచేసుకొని ఇంటికి రావడం.. ఇదే అతని రొటీన్. అతనికి కావాల్సినవన్నీ సమాయనికి చేస్తూ ఉంటుంది రత్న. తను చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనర్ కావాలి అనుకున్నా కాలేకపోయానని ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటానని రత్న అడిగితే సరే అంటాడు యజమాని.
రత్నకు తన యజమానిపట్ల గౌరవం, యజమానికి ఆమె పట్ల అభిమానం ఉంటాయి. ఓ రోజు పార్టీలో పరిచయమైన అమ్మాయి ఫ్లాట్ కి వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆమె ఇంటి నుంచి వెళ్తుంటే చూసిన రత్న బాధపడుతుంది.
కొంతకాలానికి రత్నపట్ల ఇష్టం పెంచుకున్న ఆమె యజమాని ఆ విషయం ఆమెకు చెప్తాడు. తనను సార్ అని పిలవద్దని పేరు పెట్టి పిలవమంటారు. అందుకు తను నిరాకరిస్తుంది. ఇద్దరి ఇష్టాఇష్టాలు ఎలా ఉన్నా తానొక పనిమనిషన్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్తుంది. గతంలో ఫ్లాట్‌కు అమ్మాయి వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకున్న రత్న తనను కూడా అవసరానికి వాడుకుంటారా అని ప్రశ్నిస్తుంది. అతను తనకా ఉద్దేశం లేదని చెప్తాడు.
ఈ విషయం తన ఫ్రెండ్‌కి తెలిసి పనిమనిషిని ప్రేమించడం సరైంది కాదని వారిస్తాడు. నిజంగా ప్రేమిస్తే ఆమెను వదిలెయ్యడమే ఆమెకు మేలు చేస్తుందని అనునయిస్తాడు.
యజమాని తనను ఇష్టపడటం ఎక్కడికి దారితీస్తుందో అన్న బాధతో రత్న ఇల్లు విడిచి తన చెల్లెలు దగ్గరికి వెళ్లిపోతుంది.
తను ప్రేమించిన రత్న వెళ్లిపోవడం ఒకవైపు, తానేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి ఓవైపు.. ఆ సమయంలో అతని తండ్రి ఫోన్ చేసి పనిమనిషితో ‘సన్నిహితంగా’ ఉంటున్నావా అని అడుగుతాడు. లేదని చెప్తూనే తాను అమెరికా వెళ్లిపోతున్నాని చెప్తాడు. అలాగే చేస్తాడు. తాను పనిమనిషిని ప్రేమిస్తే సమాజం ఏవిధంగా చూస్తుందో ఆ ఒక్కమాటతో అర్థమైపోతుంది అతనికి. అలా అని రత్నపై ఉన్న ఇష్టాన్ని చంపుకోలేడు.
చెల్లెలి ఇంట్లో ఉన్న రత్నకి అకస్మాత్తుగా ఓ ఫోన్ వస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ దగ్గర పని దొరుకుతుంది. ఆ ప్యాషన్ డిజైనర్ తన యజమాని స్నేహితురాలని తెలిసి వెంటనే అతని ఫ్లాట్‌కి వెళ్తుంది. అప్పుడు కానీ ఆమెకు తెలియదు అతను ఆమెరికా వెళ్లిపోయాడని. ఆ బిల్డింగ్‌లో తనకిష్టమైన టెర్రస్ పై బాధపడుతున్నప్పుడు తన యజమాని ఫోన్ చేస్తాడు. అప్పుడు పిలుస్తుంది అతన్ని ‘అశ్విన్’ అని.
గుండెల్ని మెలి పెడుతుంది..
ఈ కథలో రొమాన్స్, సస్పెన్స్, కొట్టొచ్చినట్లు కనిపించే లవ్, థ్రిల్ ఏముంది అంటే ఏమీ లేదు. ఒక ప్లాట్‌లో కూర్చొని మన కళ్లముందు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లే ఉంటుంది సర్ సినిమా.
మనం కూడా ఓ మూలన సోఫాలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. టైటిల్ లో చెప్పినట్లుగా ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదని సూటిగా స్పష్టంగా గుండెలో గుండుపిన్ను గుచ్చినట్లుగా చెప్తుందీ చిత్రం. అసాధారణ ఉదాహరణలు పక్కనపెడితే సమాజంలో సగటు ప్రేమ ఎలా ఉంటుందో హృద్యంగా చెప్పిన చిత్రం. అక్కడో ఇక్కడో తప్ప కనీసం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా లేదు. జీనేమే క్యా జాతా హై, అంటే జీవిస్తే పోయేదేముందీ అంటూ బతుకుపై ఆశను పుట్టించే పాట మధ్యలో చిరునవ్వు తెప్పిస్తుంది.
రత్నపాత్రధారి పేరు తిలోత్తమ షోమ్ అని, అశ్విన్ పాత్రధారి పేరు వివేక్ గోంబెర్ అని చెప్పినా సినిమా చూసిన తర్వాత ఒప్పుకోవాలనిపించదు. వివేక గోంబెర్ అశ్విన్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తిలోత్తమ షోమ్ రత్న పాత్రకు న్యాయం చేసింది అనడం కంటే సినిమా ఆసాంతం రత్న చుట్టే వీక్షకుడి ఆలోచనలను తిప్పుకునేలా చేసిందని చెప్తే బాగుంటుంది. సినిమా పూర్తయినా రత్న కళ్లలోని బాధ వెంటాడుతుంది. అశ్విన్ అమెరికా వెళ్లిపోయాడే అన్న బాధతో గుండె నిండిపోతుంది.
కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం అస్సలు నచ్చదు. ఆర్ట్ ఫిల్మ్, ఆఫ్ బీట్ చిత్రాలంటే ఆసక్తి ఉన్నవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. కథా గమనం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇక సగటు సినిమా ప్రేమికుడికి కచ్చితంగా నచ్చే చిత్రం. కాకపోతే ఈ సినిమా చూడాలి అనుకునేవారికి ఒక సూచన.. ముందు ట్రైలర్ చూడండి సినిమా పూర్తిగా చూస్తారు.
మూవీ రివ్యూ : సర్ .. ఈజ్ లవ్ ఇనఫ్?
మూవీ రేటింగ్ : 3.5/5
డైరెక్టర్ : రొహెనా గెరా
ప్లాట్ ఫాం : నెట్ ఫ్లిక్స్
రివ్యూ : కే