ఈ ఏడాది మొదటిసారిగా జూన్ 21న ఆదివారం రానున్న సూర్యగ్రహణం మన దేశంలోని కురుక్షేత్ర, యమునానగర్, డెహ్రాడూన్, తపోవన్, జోషీమఠ్ ప్రాంతాల్లో కనిపించనుంది.
ఆగ్రా, అహ్మదాబాద్, అమృత్‌సర్, బెంగళూరు, భుజ్, చెన్నై, డిబ్రూగఢ్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కాండ్లా, కన్యాకుమారి, కోచి, కోల్‌కతా, లేహ్, మౌంట్ అబూ, ముంబై, నాందేడ్, న్యూఢిల్లీ, పోర్ట్‌బ్లెయిర్, పూణే, రాజ్‌కోట్, షిల్లాంగ్, శ్రీనగర్, త్రివేండ్రం, ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాల్లో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించనుంది.
సూర్యుడికి, భూగోళానికి మధ్య చంద్రుడు అడ్డువచ్చినపుడు సూర్యడిని చంద్రుడు కప్పివేసినట్టుగా అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ కారణంగా చీకటి ఏర్పడుతుంది. కొన్నిచోట్ల పాక్షికంగా కాంతితగ్గుతుంది.
సూర్యగోళం కాంతివంతమైనది కాబట్టి నేరుగా చూడటం, కంటికి, కంటి చూపునకు హాని కలిగిస్తుంది. అయితే గ్రహణం చూసేందుకు ప్రత్యేక గాగుల్స్ అందుబాటులో ఉన్నాయి. సూర్యుడి అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా ఇవి మనల్ని కాపాడుతాయి.
సూర్యగ్రహణం భూమిపై ఉన్న సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావంచూపదని సైంటిస్ట్స్ చెబుతున్నారు. గ్రహణ సమయంలో భోజనం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఈ సందర్భంలో ఎలాంటి అంతుపట్టని కిరణాలు వెలువడని చెబుతున్నారు.
గ్రహణం చూసేందుకు సన్ గ్లాసెస్ సురక్షితం కాదు. వీటిని వాడరాదు. మసిపూసిన గాజుపలక వంటివి కూడా సురక్షితం కాదు. వెల్డింగ్‌లో వాడే గ్లాసెస్ సురక్షితం. అలాగే ప్రత్యేక గాగుల్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి.
దేశంలో గుజరాత్‌లోని భుజ్ పట్టణంలో సూర్యగ్రహణం ముందుగా కనిపిస్తుంది. ఉదయం 9.58 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.29 గంటలకు ముగుస్తుంది.
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం, అలా జరగనప్పుడు పాక్షిక సూర్యగ్రహణం చోటుచేసుకుంటుంది.
సంపూర్ణ సూర్యగ్రహణం జరిగేటప్పుడు కంకణాకార వలయం కనిపిస్తుంది. మధ్య భాగాన్ని మాత్రమే ఆక్రమించినపుడు అగ్నివలయం కనిపిస్తుంది.
గ్రహణం ప్రారంభమైనపుడు సూర్యుడు కొరికిన పండులా కనిపిస్తాడు. సూర్యుడిలో ఒక చిన్న భాగాన్ని చంద్రుడు ఆక్రమించడం వల్ల గ్రహణం ఇలా మొదలవుతుంది.
తదుపరి చంద్రుడు మరింత భాగాన్ని కప్పేస్తుంటాడు. చంద్రుడు సూర్యుడి మధ్యభాగాన్ని కప్పేసినప్పుడు అంచులు మాత్రం కనిపిస్తూ అగ్నివలయం గోచరిస్తుంది. దీనిని అగ్నివలయ గ్రహణం అని అంటారు.
మరో 28 నెలల తరువాత 2022 అక్టోబర్ 22న మరో సూర్యగ్రహణం సంభవించనుంది.