స్పేస్ టూరిజం : కుబేరుల నయా ట్రావెల్ డెస్టినేషన్

virgingalactic
Richard branson's space travel

అంతరిక్షాన్ని టూరిజంలో భాగం చేయాలన్నది కొంతమంది బిలియనీర్ల కల. అందుకోసం స్పేస్ టూరిజం పేరుతో గత పదిహేనేళ్లుగా రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ ఇప్పటికే రెండు మూడు ప్రయోగాలు చేసింది.

తాజాగా ఆ సంస్థ తమ వీఎస్ఎస్ యూనిటీ 22 వ్యోమనౌక ద్వారా ఆరుగురిని అంతరిక్షంలోకి తీసుకెళ్లి దిగ్విజయంగా తిరిగివచ్చింది. దీంతో ప్రపంచమంతా ఇప్పుడు దాని గురించే చర్చ. త్వరలో స్పేస్ టూరిజం ఊపందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నమ్మకం పెరిగింది.

అయితే ఈ క్రమంలో ఓ కొత్తవాదన పుట్టుకొచ్చింది. వర్జిన్ గెలాక్టిక్ చేసింది అసలు రోదసీ యాత్రే కాదని కొందరి వాదన. వారు అంతరిక్షంలోకి వెళ్లలేదని, ఆ అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చేసారని, కాబట్టి అది రోదసీ యాత్ర ఎలా అవుతుందని వాదిస్తున్నారు.

స్పేస్ టూరిజంలో కొత్త అధ్యాయం

జూలై 11, 2021 అంతరిక్ష చరిత్రలో ఓ కొత్త అధ్యాయం. స్పేస్ టూరిజంలో తొలి విజయం. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌక 90 నిమిషాలలో అంతరిక్షంలోకి అడుగుపెట్టడం, అక్కడ అయిదు నిమిషాల పాటు గడపడం, తిరిగి భూమికి చేరి ల్యాండవ్వడం జరిగిపోయాయి. త్వరలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సైతం అంతరిక్ష యాత్ర చేయబోతున్నారు. 

బ్రాన్సన్ వ్యోమనౌక భూమి నుంచి 86 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ అయిదు నిమిషాల పాటూ చక్కర్లు కొట్టింది. బ్రాన్సన్ బృందం భార రహిత స్థితిలో నౌకలో తేలియాడారు కూడా. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ నాసా కూడా అంతరిక్షం మొదలయ్యేది భూమికి 80 కిలోమీటర్ల ఎత్తునుంచేనని గుర్తించింది. ఆ దూరాన్ని దాటితే అంతరిక్షంలోకి వెళ్లినట్లేనని చెబుతోంది. వర్జిన్ వ్యోమనౌక 86 కిలోమీటర్లు ప్రయాణించింది కనుక వారు అంతరిక్షంలోకి వెళ్లినట్టేనని నాసా కూడా నిర్ధారించింది.

వారి అద్భుత ప్రయాణాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ కూడా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్షం ఎక్కడి నుంచి మొదలవుతుందని ఎక్కడా అధికారిక ఒప్పందం లేదా లెక్క మాత్రం లేదు. 

జెఫ్ బెజోస్‌కు చెందిన రోదసీ సంస్థ బ్లూ ఆరిజన్ మాత్రం భూమికి, అంతరిక్షానికి సరిహద్దుగా భావించే కర్మన్ రేఖను దాటితేనే అంతరిక్షంలోకి వెళ్లినట్టని వాదిస్తోంది. ఇటీవల దీనిపై వరస ట్వీట్లు చేసింది. జూలై 20న తన సోదరుడితో కలిసి తమ రోదసీ సంస్థ ‘బ్లూ ఆరిజన్’కు చెందిన వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ కర్మన్ లైన్ దాటి వస్తానని చెబుతున్నాడు. 

అంతేకాదు వర్జిన్ గెలాక్టిక్ వారి యూనిటీ 22 అసలు వ్యోమనౌకే కాదని, అది కేవలం ఒక విమానం మాత్రమేనని అంటోంది. దీంతో వర్జిన్ వారి రోదసి యాత్రపై కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇద్దరు బిలియనీర్ల మధ్య అంతరిక్ష యుద్ధం మొదలైనట్టు కనిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా బ్రాన్సన్ ఏమీ స్పందించలేదు. 

స్పేస్ టూరిజం ఖర్చు ఆకాశమంత..

మొన్నటికి మొన్న వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షంలోకి చక్కర్లు కొట్టి వచ్చింది కదా. అందుకు ఎంత ఖర్చయ్యిందో తెలుసా? అక్షరాలా 400 కోట్ల రూపాయలు. స్పేస్ ట్రావెల్ కోసమే వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజన్, ఎలన్ మస్క్ కు చెందిన స్సేస్ ఎక్స్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. 

కేవలం పరిశోధనల కోసమే అంతరిక్షానికి వెళ్లిరావడం జరిగేది. కానీ ఇప్పుడు ఆసక్తి కొద్దీ, అంతరిక్షంలో భార రహిత స్థితి ఎలా ఉంటుందో ఒకసారి అనుభూతి చెందాలన్న ఉద్దేశంతో స్పేస్ టూరిజం మొదలైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది కుబేరులు అంతరిక్ష ప్రయాణం కోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి పేర్లను నమోదు చేసుకున్నారు.

వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో దాదాపు 600 మంది ఇప్పటికే తమ స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందుకు ఒక్కొక్కరూ రూ. 19 కోట్లు చెల్లించినట్టు సమాచారం. అలాగే నాసా, స్పేస్ ఎక్స్ కలిసి ఏర్పాటు చేసిన ఆక్సిమ్ సంస్థ కూడా 2022 లో ఎనిమిది రోజుల పాటూ నలుగురిని అంతరిక్షానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు వారి నలుగురి నుంచి దాదాపు రూ. 400 కోట్లు తీసుకుందని సమాచారం.

2001లోనే మొదలు..

నిజానికి స్పేస్ టూరిజం 2001లోనే మొదలైంది. రష్యాకు చెందిన ఓ రాకెట్లో అమెరికాకు చెందిన డెన్నిట్ టిటో అనే బడా వ్యాపారవేత్త అంతరిక్షాన్ని చూసి వచ్చాడు. ఇందుకు ఆయన రూ. 147 కోట్లు చెల్లించాడు. భవిష్యత్తులో స్పేస్ టూరిజం మరింత విస్తృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

 

Previous articlefood for joint pain: ఎముకల నొప్పులకు బలమైన ఆహారం ఈ 3 పొడులు
Next articleలాక్టోజ్ ఇంటోలరెన్స్: కన్నబిడ్డకు తల్లిపాలే పడకపోతే..?