సూర్య నమస్కారం అనేది ఆధ్యాత్మికంగానే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకోడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సూర్యుడు ఒక అపారమైన శక్తి. ఎంతో తేజోపవేతంగా కనపించే సూర్యుడి వల్ల అనేక ఆరోగ్య లాభాలు చేకూరతాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా సరైన నియమాలను పాటించి వ్యాయామాలు చేయడం వల్ల అధ్భుత లాభాలు పొందవచ్చని యోగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సూర్యనమస్కారాలను సాధారణంగా 12 రకాలుగా చెప్పవచ్చు.
యోగాసనాలలో ప్రధానంగా చెప్పేది సూర్యనమస్కారం. సూర్యుడు అత్యంత శక్తి సంపన్నుడు. సూర్యరశ్మి నుంచి మనకు కలిగే లాభాలు అపారం. అందుకే ఇది ప్రాచీన కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుత జనరేషన్‌లో సూర్యనమస్కారాలు చేయడానికి ఆసక్తి చూపేంత తీరిక లేకుండా పోయింది. రోజులో కనీసం ఒక అరగంట పాటు వ్యాయామాలు చేయడం ద్వారా మన శరీరంలో కలిగే మార్పులు, ఇంక ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సర్వ రోగాలకు పరిష్కారంగా సూర్యనమస్కారాన్ని చెప్పవచ్చు.
మానసిక ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు
సూర్య నమస్కారం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్యోదయాన వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన శరీరం సంపూర్ణంగా శ్వాసను తీసుకోవడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యం కలిగి ఉండడం మనలో సంతోషానికి సూచికగా తెలియజేస్తుంది. సూర్య నమస్కారం చేయడం వల్ల మానసికంగా చాలా ధృఢంగా ఉండగలం.
రోగనిరోధక శక్తిని పెంచడానికి
రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సూర్యరశ్మి వల్ల మన శరీరంలో విటమిన్ డి అధికంగా లభిస్తుంది. డీ విటమిన్ లోపం అరికట్టడం వల్ల అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. ఇటీవలి కాలంలో మారిన జీవన శైలి కారణంగా పిల్లలు, పెద్దల్లో విటమిన్ డి లోపం అధికంగా కనిపిస్తోంది. ఈ కారణంగా అందరూ డీ విటమిన్ సప్లిమెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే నిత్యం మనం సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. తద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
బరువు తగ్గించడానికి
చాలామంది బరువు పెరగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు అభ్యసించే వారికి బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో క్యాలరీలు బర్న్ అవడం వల్ల అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. తద్వారా కండరాలు బలోపేతం అవుతాయి. శరీర కదలికలు, కండరాల వ్వవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. పొత్తికడుపు భాగంలో పెరిగే కొవ్వు అదుపులో ఉంటుంది. శరీర ఆకృతి మెరుగవుతుంది.
ముఖ చర్మం మెరిసిపోవాలంటే:
సూర్యనమస్కారం చర్మ సంబంధ సమస్యలకు బాగా పనిచేస్తుంది. ముఖం తేజస్సును సంతరించుకుంటుంది. సూర్య నమస్కారం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ముఖానికి సహజమైన కాంతిని అందివ్వడంలో సహాయపడుతుంది. నిద్ర లేమిని దూరం చేస్తుంది. ముఖంలో కనిపించే వృద్దాప్య ఛాయలను దూరం చేస్తుంది. మనసు ప్రశాంతతను అందిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడంలో ఈ తేలికపాటి వ్యాయామం ఉపయోగపడుతుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
నిత్యం ఈ సూర్య నమస్కారాలు అభ్యసిస్తే జీర్ణవ్వవస్థ మెరుగుపడి జీవక్రియకు సంబంధించిన అనేక వ్యాధులు నయమవుతాయి. మధుమేహం, థైరాయిడ్, రక్తపోటు వంటి జీవనశైలి సమస్యలు దూరం అవుతాయి. మలబద్దకం, అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
మన అలోచన ధోరణిలో స్పష్టత కలిగేలా చేస్తుంది. దృష్టిని సరైన విధంగా కేంద్రీకరించేలా చేస్తుంది. అలాగే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను తొలగించి శ్వాసకోశ వ్వవస్థ మెరుగుపడుతుంది. తద్వారా హార్మోన్ల సమస్యను అధిగమించవచ్చు. ఒత్తిడి, ఆందోళన దూరం చేసుకోవచ్చు. సూర్యనమస్కారాలు చేయడం వల్ల భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్