టస్కాన్ పాస్తా సలాడ్ .. ఆహా ఒక్కసారి తిని చూస్తే అసలు ఇలాంటి హెల్తీ ఫుడ్ మన వాడుకలో ఎందుకు లేదూ అనిపిస్తుంది. చాలా సింపుల్ ఫుడ్. కానీ కడుపు నిండా తిన్నట్టే ఉంటుంది. కేవలం లంచ్ గానో, డిన్నరో గానో కాకుండా అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. 300 గ్రాముల టస్కాన్ పాస్తా సలాడ్ తీసుకుంటే 550 కాలరీల ఆహారం మనకు అందుతుంది. అప్పుడప్పుడు ట్రై చేయండి.. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం తరచూ ప్రయత్నించండి.
అసలేంటీ టస్కాన్ పాస్తా సలాడ్
టస్కాన్ అనేది మధ్య ఇటలీలోని సముద్ర తీర ప్రాంతంలో ఒక భాగం. అక్కడ బాగా ప్రసిద్ధి చెందిన వంటకాలన్నీ టస్కాన్ వంటకాలే. అందులో ఇదొకటి. నిజానికి ఇది ఒక సలాడ్. మనం విభిన్న రకాల కూరగాయలతో చేసే సలాడ్ వంటిదే. కానీ దీని తయారీ కొంత భిన్నమైంది.
టస్కాన్ పాస్తా సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి?
♦ 500 గ్రాముల బటర్ ఫ్లై పాస్తా ( బటర్ ఫ్లై ఆకారంలో ఉండే పాస్తా.. దీనినే ఫార్ ఫాలే (farfalle pasta) అని బౌ టై (bow tie) పాస్తా అని అంటారు. ఇది దొరకని పక్షంలో అందుబాటులో ఉన్న పాస్తా వాడుకోవచ్చు..) ను ఉడికించి నీళ్లు తీసేసి ఒకసారి చన్నీళ్లలో నుంచి తీసి పక్కన పెట్టాలి.
♦ 200 గ్రాముల మేర టమాట (నీరు తీసేసి ఎండలో ఎండబెట్టి, ఆ తరువాత ఆలివ్ ఆయిల్ లో ముంచి తీయాలి.. వాడుక భాషలో చెప్పాలంటే టమాటా వరుగు చేసుకుని ఆలివ్ ఆయిల్ లో కొద్ది సేపు ఉంచి తీయాలి)
♦ 1 ఎర్రని కాప్సికం (రెడ్ బెల్ పెప్పర్) వలయాలుగా తరగాలి.
♦ 200 గ్రాముల స్లైస్డ్ ఆలివ్స్ (అమెజాన్ లో దొరుకుతాయి)
♦ 1 కప్పు పాలకూర
♦ 1 కప్పు బ్రకోలి
♦ పావు కప్పు తులసి ఆకులు
♦ కొత్తిమీర జాతికి చెందిన అజామోద ఆకు (పార్స్లీ)
♦ అరకప్పు పర్మేషన్ చీజ్ (తురమాలి)
డ్రెసింగ్ కోసం (సాస్ లేదా చట్నీలా వినియోగించుకునేందుకు)
♦ ముప్పావు కప్పు ఆలివ్ ఆయిల్
♦ 2 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్
♦ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు
♦ 1 టీ స్పూన్ ఉప్పు
♦ 1 టీ స్పూన్ చక్కెర
♦ 1 టీ స్పూన్ వాము
♦ 1 టీ స్పూన్ ఎండు తులసి
♦ 1 లవంగం
♦ 1 వెల్లుల్లి రెబ్బ (సన్నగా తురుముకోవాలి)
♦ 1 కొద్దిగా మిరియాల పొడి
టస్కాన్ పాస్తా సలాడ్ ఎలా తయారు చేయాలి
ఒక పెద్ద గిన్నెలో పాస్తా, సన్ డ్రైడ్ టమాటా, రెడ్ కాప్సికం ముక్కలు, బ్రకోలీ ముక్కలు, ఆలివ్స్, పాలకూర, తులసి, వీటన్నింటినీ నెమ్మదిగా కలపాలి. వీటికి పర్మేషన్ చీజ్ ముక్కలు జత చేయాలి.
ఇక డ్రెసింగ్ (సాస్ లేదా చట్నీ వంటి డ్రెసింగ్)
ఒక చిన్న గిన్నెలో ఆలివ్ ఆయిల్, వైట్ వెనిగర్, నీళ్లు, ఉప్పు, చక్కెర, వాము(ఓమ), తులసి, వెల్లుల్లి, మిరియాల పొడి.. వీటన్నింటినీ వేసి ఈ మొత్తం ద్రవపదార్థాన్ని బాగా కలపాలి. నిమ్మ రసం, సుగంద ద్రవ్యాలు కూడా కలుపుకోవచ్చు.
దీనినే పాస్తాపై వేసి వడ్డించాలి.
ఒక 300 గ్రాముల టస్కాన్ పాస్తా సలాడ్ 550 కాలరీల ఆహారాన్ని అందిస్తుంది.
ఇవీ చదవండి
బొబ్బర పప్పు గారెలు ఎలా చేయాలి