ముఖంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతున్నాయా? సింపుల్‌గా ఇలా తొలిగించండి

Portrait of Young Woman
అవాంఛిత రోమాలకు చెక్ పెట్టండిలా Photo by Dana Tentis on Pexels

అవాంఛిత రోమాలు మ‌హిళ‌ల‌కు పెద్ద స‌మ‌స్యగా మారింది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల‌కు ఈ స‌మ‌స్య ఒక పెద్ద స‌వాలుగా త‌యార‌యింది. దీని వ‌ల్ల ఎంతో వేద‌న‌కు, ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఈ అవాంఛిత రోమాలు రావ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి. శ‌రీర‌త‌త్వాన్ని బ‌ట్టి ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో  హార్మోన్ల సమస్యలు ఎక్క‌వ‌గా క‌నిపిస్తాయి. క‌నుక అవాంఛిత రోమాలకు ఇది ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. 

చాలామంది ఈ అవాంఛిత రోమాలను తొల‌గించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్‌లో దొరికే అనేక ర‌కాల హెయిర్ రిమూవ‌ల్ క్రీముల‌ను, వ్యాక్సింగ్‌ను వాడి ఈ అవాంఛిత రోమాల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు. కానీ వాటి వ‌ల్ల తాత్కాలిక ప్ర‌యోజ‌న‌మే కానీ శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించ‌దు. దానికి తోడు చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. వీటిని తొలగించడానికి ఇంట్లోనే స‌హ‌జ‌సిద్దంగా కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌కు చ‌క్క‌ని ప‌రిష్కారాన్ని అందించ‌వ‌చ్చు. అలాగే వీటిని తొల‌గించ‌డానికి ముందు వీటికి గ‌ల కార‌ణాల‌ను కూడా తెలుసుకోవ‌డం మంచిది. క‌నుక అవాంఛిత రోమాలు రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను, తొల‌గించే మార్గాల‌ను ఈ స్టోరీలో చూద్దాం.

అవాంఛిత రోమాలు రావ‌డానికి గ‌ల కార‌ణాలు:

1. కొన్ని ర‌కాల హ‌ర్మోన్లు అవ‌స‌రానికి మించి విడుద‌ల అవుతూ ఉంటాయి. అలాంట‌ప్పుడు ఈ అవాంఛిత రోమాలు ఏర్ప‌డతాయి. టెస్టోస్టిరాన్ అనే హ‌ర్మోన్ ఆడవారిలో ఎక్కువ‌గా ఉత్పత్తి అవడం వ‌ల్ల అవాంఛిత రోమాల‌కు కార‌ణం అవుతుంది.

2. ఆడ‌వారిలో పీసీఒఎస్ స‌మ‌స్య కూడా అవాంఛిత రోమాల‌కు మ‌రొక కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. అంతేకాకుండా హైప‌రాండ్రోజ‌నిజం కూడా టెస్టోస్టిరాన్ పెరుగుద‌ల‌కు, త‌ద్వారా అవాంఛిత రోమాలు రావ‌డానికి కారణం. దీని ప్ర‌భావం కారణంగా మ‌హిళ‌ల్లో ముఖంపై జుట్టు పెర‌గ‌డానికి దారితీస్తుంది.

3. కొంత‌మందిలో జ‌న్యుప‌రంగా కూడా ఇలాంటి స‌మ‌స్య‌లు రావచ్చు. జ‌న్యుప‌ర‌మైన మార్పుల ప్ర‌భావం ఈ అవాంఛిత రోమాల‌కు కార‌ణం అవుతుంది. 

4. కొన్ని ర‌కాల మందులు వాడ‌డం వ‌ల్ల కూడా ముఖంపై జుట్టు పెరుగుద‌ల‌కు కార‌ణం అవుతుంది. గ్లూకోకోర్టికోస్టెరాయిడ్స్, సైకియాట్రిక్ డ్ర‌గ్స్, ఇమ్యునోస్ప్రెసివ్ మెడికేషన్స్, యాంటీ సీజ‌ర్, టెస్టోస్టిరాన్ వంటి హ‌ర్మోన్లకు సంబంధించి కొన్ని ర‌కాల మందులు అవాంఛిత రోమాలు పెర‌గ‌డానికి సైడ్ ఎఫెక్ట్‌గా మార‌తాయి.

5. కొంద‌రు మ‌హిళ‌ల్లో కార్టిసాల్ త‌క్కువగా విడుద‌ల అవుతుంది. శ‌రీరంలో విడుద‌ల అవ్వాల్సిన దానికంటే త‌క్కువగా ఉత్ప‌త్తి అయినా లేదా అవ‌స‌రానికంటే ఎక్కువగా విడుద‌ల అయినా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఈ స‌మ‌స్య ఎక్కువగా ఆర్ధ‌రైటిస్, ఆస్త‌మా వంటి వాటికి వాడే మందుల కార‌ణంగా వ‌స్తుంది.

6. కొందరు మ‌హిళ‌లు గ‌ర్భ‌నిరోధ‌క మందుల‌ను వాడుతుంటారు. అలాంటి వారికి ఆండ్రోజ‌న్ స్థాయి ఎక్కువగా విడుద‌ల అవుతుంటుంది. ఇలాంటి వారికి అవాంఛిత రోమాలు ఏర్ప‌డుతుంటాయి.

7. హైప‌ర్‌థైరాయిడ్ ఉన్న‌వారిలో కూడా ముఖంపై జుట్టు అధికంగా పెర‌గ‌డానికి అవ‌కాశం ఉంది. థైరాయిడ్ హ‌ర్మోన్లు అద‌నంగా విడుద‌ల అవుతూ ఉండ‌డం వ‌ల్ల వెంట్రుక‌లు పెరుగుతాయి. ఇది ఆండ్రోజ‌న్ స్థాయిని పెంచుతుంది. ఇది శ‌రీర భాగాల్లో జుట్టు పెరుగుద‌ల‌కు దారితీస్తుంది.

అవాంఛిత రోమాలకు స‌హ‌జ‌సిద్ద‌మైన చిట్కాలు:

1. శ‌న‌గ‌పిండి- ప‌సుపు

రెండు టీ స్పూన్ల శనగ పిండికి కొంచెం పసుపు, పాలు కలుపుకొని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో పూయాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది. 

2. షుగ‌ర్ స్క్ర‌బ్బింగ్

ఒక గ్లాసు నీటిని  తీసుకుని ఇందులో సగం కప్పు పంచ‌దార వేసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించాలి. ఇది పాకంలాగా మారాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పాకంలో రెండు స్పూన్లు నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరచాలి. దీని ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

3. వేపాకు- ప‌సుపు

కొంచెం పసుపు తీసుకొని అందులో రెండు స్పూన్ల శనగ పిండి ఒక స్పూన్ వేపాకు పొడి, కొంచెం పచ్చిపాలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై పూసి నెమ్మదిగా మర్దన చేయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు పెరగవు.

4. బొప్పాయి – శ‌న‌గ‌పిండి

రెండు స్పూన్ల పచ్చి బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్ కలబంద గుజ్జు, ఒక స్పూన్ శనగపిండి, కొంచెం పసుపు కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛితరోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం అవాంఛిత రోమాల సమస్యను శాశ్వతంగా తొలగిస్తుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleస‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా మ్యాంగో మిల్క్ షేక్.. పిల్ల‌ల‌కు అందించ‌డిలా!
Next articleఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు ఇలా ట్రై చేయండి.. రెసిపీ వెరీ టేస్టీ!