volodymyr zelenskyy : జెలెన్ స్కీ .. అతని ధైర్యమే ఉక్రెయిన్‌కు రక్ష

zelenskyy
Image Credit: Ukraine government website

వ్లొదిమిర్ జెలెన్ స్కీ (volodymyr zelenskyy) పుతిన్‌కు పక్కలో బల్లెంలా మారిపోయాడు.దేశ అధ్యక్షుడంటే అతనిలా ఉండాలి అనేంతగా ప్రపంచదేశాల ప్రశంసలను దక్కించుకున్నాడు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తాజాగా జెలెన్ స్కీ ముఖచిత్రాన్ని కవర్ పేజీపై ప్రచురించింది. అత్యంత క్లిష్ట సమయంలో ఆయన దేశాన్ని, యుద్ధాన్ని ఎలా నడపగలుగుతున్నాడో వివరించింది.

ఫిబ్రవరి 24, 2022

ఈ తేదీకి ముందు వరకు జెలెన్ స్కీ పేరు మిగతా దేశాల ప్రజలు విననే లేదు. ఆ రోజున రష్యా – ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించి యుద్ధానికి తెరతీసింది. అప్పుడు కనిపించాడు తెరపై ఓ రియల్ హీరో. రూపం చక్కగా ఉండడమో లేక  మాటల్లో బెరుకు లేకపోవడమో తెలియదు కానీ ఇట్టే ప్రపంచదేశాలన్నింటి చూపును తన వైపు తిప్పుకున్నాడు.

జెలెన్ స్కీ ఎలుక కాదు

అతడి మాటలను విన్నవారు మొదట్లో నవ్వుకున్నారు. ‘రష్యాతో యుద్ధం చేస్తాడా? దేశాన్ని వీడి పారిపోడా?’ అంటూ ఎగతాళి చేశారు. ‘కొండను ఢీ కొడుతున్న చిట్టెలుక’ అని భావించారు. కేవలం వారం రోజుల్లోనే వారి అభిప్రాయం తప్పని తేలింది. కొండను ఢీ కొడుతున్నది కూడా మరొ కొండ అనే సంగతి ప్రపంచానికే కాదు పుతిన్‌కూ అర్థమైంది.

దేశంలో సంక్షోభం మొదలవ్వగానే లేదా పక్కదేశాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు తన ప్రాణాన్ని, కుటుంబాన్ని కాపాడుకునేందుకు పారిపోయే నాయకులనే ఇంతవరకు ప్రపంచం చూసింది. రష్యా టార్గెట్ తాను, తన భార్యా, పిల్లలే అని తెలిసినా కూడా జెలెన్ స్కీ దేశాన్ని వీడలేదు. అమెరికా, పోలాండ్, బ్రిటన్ వంటి దేశాలు తాము ఆశ్రయం కల్పిస్తామని రాచమర్యాదలతో ఆహ్వానించినా జెలెన్ స్కీ పట్టించుకోలేదు. సరికదా సైనిక యూనిఫామ్ వేసుకుని తానూ యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు.

అంతేకాదు ‘ఆయుధాలిస్తాం, దేశాన్ని కాపాడేందుకు సాయం చేయండి’ అని సాధారణ ప్రజలను వేడుకున్నాడు. ఆయన పిలుపు విని లక్షల మంది సాధారణ ప్రజలు యుద్ధభూమిలో దిగారు. అందుకే వారం రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం.. రెండు నెలలైనా కొనసాగుతూనే ఉంది.

మాటలే ధైర్యం

ఒక మనిషిలో భయం కలగాలన్నా, ధైర్యం పెరగాలన్నా.. వారు వినే మాటలే స్పూర్తి. భయాన్ని పెంచే ప్రసంగాలు ఏనాడు చేయలేదు జెలెన్ స్కీ. సునామీలా రష్యా సైనికులు విరుచుకుపడుతున్నా అతడి నోటి నుంచి పిరికి మాటలు ఇంతవరకు రాలేదు. ‘అవును.. రష్యన్ సైనికులు మమ్మల్ని చంపవచ్చు, కానీ వారు కూడా ప్రాణాలతో మిగలరు’ అని బాహాటంగానే ప్రకటించారు. నిజం చెప్పాలంటే అతని తెగువ, ధైర్యమే ఉక్రెయిన్‌ను ఇంతవరకు నిలబెట్టగలిగింది. ఆయన దేశం దాటి ఉంటే.. ఎప్పుడో ఆ దేశం రష్యా చేతిలో బందీ అయిపోయేది.

మూడు సార్లు హత్యాయత్నం

జెలెన్ స్కీని చంపేందుకు రష్యా ప్రత్యేక దళాలను కీవ్ నగరంలో దించింది. దాదాపు 400 మంది కమాండోలు కేవలం జెలెన్ స్కీని, అతని కుటుంబాన్ని చంపాలన్న లక్ష్యంతోనే వేట మొదలుపెట్టాయి. ఫిబ్రవరి 24 రోజు రాత్రే దాదాపు జెలెన్ స్కీ‌కి దగ్గర వరకు చేరుకున్నారు రష్యా కమాండోలు. ఆ రోజు అర్థరాత్రి భార్యా పిల్లల్ని నిద్రలేపి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నారు జెలెన్ స్కీ. అధ్యక్ష భవనంలో లైట్లన్ని ఆపి ఆ రాత్రంతా మెలకువగానే ఉన్నారు. యుక్రెయిన్ సైనికులు రష్యా కమాండోలను అధ్యక్ష భవనంలో అడుగుపెట్టనివ్వలేదు.

zelenksy
Image Credit: Ukraine Government

అలా చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఏ నాయకుడైనా మరుసటి రోజే ప్రత్యేక విమానంలో మరో దేశానికి పారిపోతాడు. కానీ జెలెన్ స్కీ మాత్రం మొండిగా పోరాటాన్ని మొదలుపెట్టాడు. అతని మొండితనం, పోరాట శైలే దేశాలను ఆకర్షించాయి. ఉక్రెయిన్ కు సాయం చేయాలన్న తపనను పెంచాయి. అతను పోలాండ్ పారిపోయాడంటూ రష్యా చాలా సార్లు ఆరోపించింది. అలాంటి ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కీవ్ లో ఏదో ఒక బిల్డింగ్ ముందు నిల్చుని మరీ ‘నేను కీవ్ లోనే ఉన్నాను, ఎక్కడికీ పారిపోను, దేశం కోసం పోరాడుతూనే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. అమెరికా, కొన్ని ఐరోపా దేశాలు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా భారీగా ఆధునిక ఆయుధాలను మాత్రం సరఫరా చేస్తున్నాయి. దీని వల్లే పుతిన్‌కు గట్టిగా ఎదురు దెబ్బ తగులుతోంది.

ఓడిపోయినా విజేతే

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఇంకా ముగియలేదు. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. జెలెన్ స్కీ గెలవచ్చు, ఓడిపోనూ వచ్చు. కానీ ఈ మొత్తం యుద్ధ పోరాటాన్ని తరచి చూస్తే జెలెన్ స్కీ ఓడిపోయినా కూడా విజేతగానే చరిత్రలో నిలిచిపోతాడు.

50 లక్షల మంది శరణార్ధులు

2020 జనాభా లెక్కల ప్రకారం ఉక్రెయిన్ జనాభా 4.41 కోట్లు. యుద్ధం ప్రారంభమయ్యాక వారిలో 50 లక్షల మంది దేశం విడిచి పారిపోయారు. వారిలో 90 శాతం మంది మహిళలు, పిల్లలే. వీరిలో 28 లక్షల మంది దాకా పొరుగు దేశమైన పోలాండ్‌లో తలదాచుకుంటున్నారు. ఇక మిగతావారు స్లొవేకియా, హంగేరీ, రొమానియా, మాల్డోవా, బ్రిటన్ వంటి దేశాలకు శరణార్ధులుగా చేరుకున్నారు. కొంతమంది రష్యాకు కూడా చేరుకున్నారు.

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleAkshaya tritiya: అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి? ఎలా జరుపుకోవాలి?
Next articleమాతృదినోత్సవం కోసం “అవంత్రా బై ట్రెండ్స్” ప్రత్యేక కలెక్షన్