ఎన్పీఆర్‌ : జాతీయ జనాభా రిజిస్టర్‌ అంటే ఏంటి?

NPR
దేశంలో నివసించే వారి అందరి వివరాల సేకరణ ఎన్పీఆర్ లక్ష్యం

నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌) అంటే దేశం యొక్క సాధారణ నివాసితుల కోసం రూపొందించిన ఒక రిజిస్టర్‌. ఇది స్థానిక (విలేజ్‌ / ఉప టౌన్‌), ఉప–జిల్లా, జిల్లా, రాష్ట్ర మరియు పౌరసత్వం చట్టం– 1955 యొక్క నిబంధనలు, అలాగే పౌరసత్వ నిబంధనలు – 2003 ఆధారంగా సిద్ధం అవుతోంది. ఎన్పీఆర్‌ లో నమోదు భారతదేశం యొక్క ప్రతి సాధారణ నివాసి కోసం ఇది తప్పనిసరి. దీని కోసం ఎలాంటి ధ్రువీకరణలు, డాక్యుమెంట్లు అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. బయోమెట్రిక్ డేటా కూడా అవసరం లేదని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇది కేవలం సెల్ఫ్ సర్టిఫికేషన్ వంటి ప్రక్రియ అని స్పష్టం చేసింది.

ఎన్పీఆర్‌ లక్ష్యాలుఏంటి?

ఎన్పీఆర్‌ యొక్క లక్ష్యం దేశంలో ప్రతి సాధారణ పౌరుడి సమగ్ర గుర్తింపు డేటాబేస్‌ రూపొందించడం. జనాభా డేటాబేస్‌ అలాగే బయోమెట్రిక్‌ వివరాలు సేకరించడం.

ఎన్‌పీఆర్‌లో ఏ వివరాలు సేకరిస్తారు.. (కేంద్రం మొబైల్‌ యాప్‌ ప్రకటించనుంది)

1. వ్యక్తి పూర్తి పేరు మరియు నివాస స్థితి
2. జాతీయ జనాభా రిజిస్టర్‌లో ఉండవలసిని విధంగా వ్యక్తి పేరు
(30 అక్షరాలకు మించకుండా.. అవసరమైతే సంక్షిప్తంగా రాయొచ్చు)
3. కుటుంబ యజమానితో గల బంధుత్వం
4. లింగ బేధంః పురుషుడు లేదా స్త్రీ
5. పుట్టిన తేదీ
6. వైవాహిక స్థితి
7. విద్యార్హత
8. వృత్తి/ వ్యాసంగం
9. తండ్రి, తల్లి మరియు భార్య లేదా భర్త పూర్తి పేర్ల
10. జన్మస్థలంః భారత దేశంలో ఉన్నట్లయితే, గ్రామం/ పట్టణం, జిల్లా, రాష్ట్ర వివరాలు; భారత దేశంలో వెలుపల ఉన్నట్లయితే ఆ దేశం పేరు, చిరునామా రాయాలి
11. జాతీయత
12. సాధారణ నివాసం యొక్క ప్రస్తుత చిరునామా (ఈ చిరునామాలో ఆ వ్యక్తి 6 నెలల కన్న ఎక్కువ కాలం నుంచి నివసిస్తున్నా లేక నివసించాలనుకున్నట్లయితే ఆ చిరునామా ఇవ్వాలి.
13. ప్రస్తుత చిరునామాలో నివసిస్తున్న కాలం.. ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయో చెప్పాలి.
14. శాశ్వత నివాస చిరునామాః మీ ప్రస్తుత చిరునామా కూడా శాశ్వత చిరునామా అయితే అదే మాదిరి అని రాయాలి. లేదంటే శాశ్వత చిరునామా ఏదైతే అది రాయాలి.

ఎన్పీఆర్‌ ఇదివరకు ఉందా?

జాతీయ జనాభా రిజిస్టర్‌ డేటాను భారతదేశ జనాభా లెక్కలు– 2011తో పాటే సేకరించారు. 2015లో మరోసారి ఇంటింటికీ తిరిగి డేటా అప్‌ డేట్‌చేశారు. ఈ సేకరించిన సమాచారం డిజిటైజేషన్‌ కూడా పూర్తయింది. ఇప్పుడు దీనిని తిరిగి అన్ని రాష్ట్రాలలో (అస్సాం మినహా ) జనాభా గణన–2021లో భాగంగా ఏప్రిల్‌ 1, 2020 నుంచి సెప్టెంబర్‌ 30, 2020 వరకు నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ అప్డేట్‌ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంబంధిత గెజిట్‌ విడుదల చేశాయి. భారత పౌరసత్వం పొందేందుకు ఇది ఎలాంటి హక్కును ఇవ్వదని కూడా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

బయోమెట్రిక్‌ కూడా అవసరం లేదుః ప్రకాష్‌ జవదేకర్‌

‘ఇందులో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్‌ కూడా అవసరం లేదు.. ఇది కొత్తది కాదు.. ప్రతి పదేళ్ల కోసారి జరుగుతుంది. యూపీయే హయాంలో 2010లో ప్రారంభమైంది..’ అని ప్రకాష్‌ జవదేకర్‌ డిసెంబరు 24, 2019న కేంద్ర మంత్రి మండలి సమావేశం అనంతరం పేర్కొన్నారు. ‘ఆయుష్మాన్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు సులువుగా చేరవేసేందుకు ఇది పనిచేస్తుంది..’ అని పేర్కొన్నారు. ‘ఈసారి పెద్ద ఫారం కూడా ఫిల్‌ చేయాల్సిన అవసరం లేదు. యాప్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు..’ అని పేర్కొన్నారు. యూపీయేలో 2010లో చేసినప్పుడు లేని సందేహాలు ఇప్పుడు అవసరం లేదని ఓ ప్రశ్నకు ఆయన బదులుగా చెప్పారు.

ఎన్నార్సీ అంటే ఏంటి?

ఈ ఎన్పీఆర్‌ డేటా ఆధారంగానే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సిటిజెన్స్‌(ఎన్నార్సీ)ను రూపొందిస్తాయని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే తాము అలా ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండి

పౌరసత్వ సవరణ చట్టం ఏంటి? ఎందుకు వివాదాస్పదమైంది..

Previous articleపౌరసత్వ సవరణ చట్టం ఎందుకు వివాదాస్పదమైంది?
Next articleన్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌ .. ఫాలో అయితే లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌