charles sobhraj: నలభై ఏళ్లు జైల్లోనే చార్లెస్ శోభరాజ్ – అతనెందుకంత కిరాతకంగా మారాడు?

charles shobhraj
Frederick Noronha [email protected], CC BY-SA 2.0 , via Wikimedia Commons
charles sobhraj: మానవ చరిత్రలో అత్యంత క్రూరులు లేదా హంతకుల గురించి చెప్పాల్సి వస్తే అందులో మొదటి పేరు చార్లెస్ శోభరాజ్‌దే అయి తీరుతుంది. కూల్ డ్రింకు తాగినంత సులభంగా మనిషిని చంపేస్తాడు. పైగా ముఖంలో టెన్షన్ ఉండదు, సాధువులా శాంతంగా కనిపిస్తాడు. అందుకే అలాంటివారిని సైకోలు, మానవ మృగాలు అని పిలుస్తారు. ఇన్నాళ్లు చార్లెస్ శోభరాజ్ పేరు సినిమాల్లో అడపా దడపా వినిపించింది, కానీ ఇప్పుడు వార్తల్లో వినిపిస్తోంది. కారణం అతను మళ్లీ జన జీవనంలోకి అడుగు పెట్టాడు. ఇన్నాళ్లు నాలుగ్గోడల మధ్య మగ్గిన మృగం మనిషిలా బతుకుతానంటూ బయటికి వచ్చింది. ఇప్పుడు కూడా ఆ మృగం ముఖంలో అదే చిరునవ్వు, ప్రశాంతత. అతడిని చూసి చుట్టుపక్కవాళ్లు భయపడుతున్నారు కానీ, అతనిలో మాత్రం ఎలా బతుకుతానన్న బెంగా, తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఎక్కడా లేదు. ఎంచక్కా ఫ్లైటెక్కి ఫ్రాన్స్ వెళ్లిపోయాడు. చరిత్రలో మంచికి, చెడుకూ… రెండింటికీ పేజీలు కేటాయించే ఉంటాయి. మంచి పేజీల్లో మహోన్నతుల పేర్లు రాసి పెట్టి ఉంటే, చెడు కేటగిరీలో కిరాతకుల గురించి ప్రస్తావిస్తారు. ఆ కోవలోదే చార్లెస్ శోభరాజ్ చరిత్ర.

నలభై ఏళ్లు జైల్లోనే

నేపాల్ జైలు నుంచి విడుదలయ్యే సరికి చార్లెస్ శోభరాజ్‌కు 79 ఏళ్లు. ఆ వయసే అతడిని మానవతా దృక్పథంతో జడ్జిల మనసు మార్చి, బయటికొచ్చేలా చేసింది. నేపాల్ జైల్లో 2003 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడతని వయసు 59 ఏళ్లు. అంటే గత ఇరవై ఏళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నాడు. అంతకు ముందు కూడా మనదేశంలో ఇరవై ఏళ్ల పాటూ జైల్లో ఉన్నాడు.అంటే తన జీవితంలో 40 ఏళ్ల పాటూ జైలు జీవితమే గడిపాడు.

ఇంతకీ ఎవరీ ఛార్లెస్ శోభరాజ్

ఇతను ఏ దేశస్తుడు? ఈ విషయం తేల్చడం కష్టమే. తల్లిది వియత్నాం. తండ్రిది భారతదేశమే కానీ వియత్నాంకు బతుకుదెరువు కోసం వెళ్లాడు. అక్కడ వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చార్లెస్ శోభరాజ్ పుట్టాక విడాకులు తీసుకున్నారు. తండ్రి వేరే అమ్మాయిని, తల్లి వేరే వ్యక్తితో మళ్లీ ప్రేమలో పడ్డారు. అదే ఇతని జీవితాన్ని నరకప్రాయం చేసింది. తాను ఏ దేశానికి చెందని వ్యక్తిగా కొన్నాళ్ల పాటూ మిగిలిపోయాడు. తల్లిదండ్రులు కొత్త జీవిత భాగస్వాముల మాయలో పడి ఇతడిని నిర్లక్ష్యం చేశారు. తల్లి ప్రియుడు ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తి. అతను చార్లెస్ శోభరాజ్‌ను దత్తత తీసుకున్నాడు కానీ, ఎవరూ ప్రేమను మాత్రం అందించలేకపోయారు. అదే శోభరాజ్ గతి తప్పడానికి కారణమైందని విశ్లేషిస్తారు మానసికవేత్తలు. తల్లికి, ఆమె ప్రియుడికి బిడ్డలు పుట్టాక ఇతడిని పూర్తిగా పట్టించుకోలేదు. దీంతో చార్లెస్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చెడు వ్యసనాలు చిన్న వయసులోనే మొదలయ్యాయి. కేవలం 19 ఏళ్ల వయసులోనే తొలిసారి జైలుకి వెళ్లాడు. ఇక అప్పట్నించి నేరాలు చేయడం, జైలుకి వెళ్లి రావడం అలవాటై పోయింది.

భార్య తోడుగా చార్లెస్ శోభరాజ్ హత్యలు

పారిస్‌లోనే ఛాంటల్ పరిచయం అయింది చార్లెస్ శోభరాజ్‌కు. ఆమెను పెళ్లిచేసుకున్నాడు. ఆమె భర్త చేసే నేరాలకు తోడుగా నిలిచేది. కేసుల నుంచి తప్పించుకునేందుకు భార్యతో కలిసి 1970లో ఆసియా వచ్చేశాడు. ఆ ప్రయాణంలో పర్యాటకులతో మాట కలుపుతూ వారిని డబ్బు కోసం దోచుకునేవారు భార్యాభర్తలు. చివరికి  వారిద్దరూ ముంబై చేరుకున్నారు. ఇక్కడే వారికి ఒక కూతురు పుట్టింది. ఆమెకు ఉష అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చాక కూడా దొంగతనాలు, స్మగ్లింగ్ చేసేవాడు. కేసుల నుంచి తప్పించుకుని కుటుంబమంతా కాబూల్, అక్కడ్నించి ఇరాన్ కు పారిపోయారు. ఈ జీవితంతో విసిగిపోయినా భార్య కూతురిని తీసుకుని చార్లెస్‌ను వదిలి ఫ్రాన్స్ వెళ్లిపోయింది. ఒంటరి వాడైన ఛార్లెస్ మరింతగా నేరాలు చేయడం మొదలుపెట్టాడు. టర్కీ, గ్రీసు ఇలా చాలా దేశాలు తిరుగుతూ, అరెస్టువుతూ, మళ్లీ విడుదలవూ, మళ్లీ నేరాలు చేస్తూ… ఇలాగే జీవితాన్ని గడిపాడు.

వరుస హత్యలు చేసిన చార్లెస్ శోభరాజ్

తన నేర ప్రయాణంలో అజయ్ చౌదరి అనే వ్యక్తి కలిసాడు. అతనితో కలిసి హత్యలు చేయడం మొదలుపెట్టాడు. తొలిసారి 1975లో హత్య చేసినట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. బాధితులతో మొదట స్నేహం చేశాక వారిని చంపేవాడు. సీటెల్ కు చెందిన టెరాస నోల్టన్‌ను చంపి స్విమ్మింగ్ పూల్ లో పడేశారు. అప్పుడామె కేవలం బికినీతోనే ఉంది. థాయిలాండ్లో ఉన్నప్పుడు ఎక్కుమ మందిని చంపాడు. అక్కడ విహార యాత్రకు వచ్చేవారిని పరిచయం చేసుకోవడం, విష ప్రయోగంతో చంపేయడం చేసేవాడు. కొంతమందిని కాల్చేశాడు కూడా. అతని చేతిలో చనిపోయిన వారందరూ యువతే. థాయిలాండ్ నుంచి తాము చంపేసిన ఇద్దరు వ్యక్తుల పాస్ పోర్టులు ఉపయోగించి నేపాల్ చేరుకున్నారు అజయ్ చౌదరి,చార్లెస్ శోభరాజ్. అక్కడ కూడా కెనడా పర్యాటకులను చంపేశారు. అక్కడ్నించి థాయిలాండ్ వెళ్లాడు.
పోలీసులు తన గురించి వెతుకుతున్నారని తెలిసి ఇండియా వచ్చాడు. వారణాసి, కోల్ కతాలలో తిరిగాడు. కేవలం పాస్ పోర్ట్ కోసం ఒక వ్యక్తిని చంపేశాడు. తిరిగి తన స్నేహితుడు చౌదరితో మలేషియా చేరాడు. అక్కడ రత్నాల దొంగతనం చేశారు. ఆ ప్రయాణంలో చౌదరిని చార్లెన్ శోభరాజ్ చంపేశాడని అంటారు. ఇప్పటివరకు చౌదరి ఆచూకీ దొరకలేదు. ఇండియాలో ఉన్నప్పుడు ఇరవై ఏళ్ల పాటూ జైలు జీవితం అనుభవించి విడుదలయ్యాక నేపాల్ వెళ్లాడు. అక్కడ ఒక విలేకరి అతడిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అరెస్టు చేసి మరో 20 ఏళ్లు జైల్లో ఉంచారు. ఇప్పుడు అనారోగ్య కారణాలతో 79 ఏళ్ల వయసులో విడిచి పెట్టారు. 2018లో అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగాయి.
ఇతను చేసిన కిరాతకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే వాటిపై నాలుగు పుస్తకాలు, ఒక సినిమా వచ్చింది. ఇతడిని బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు.
Previous articlesushant singh rajput: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదా? అతనిది హత్యేనా?
Next articleDiabetes symptoms, test treatment: డయాబెటిస్ లక్షణాలు, పరిష్కారం.. నార్మల్ రేంజ్ తెలుసుకోండి