ఎండాకాలం వచ్చిందంటే చాలు ముందుగా గుర్తొచ్చేది కూల్‌డ్రింక్. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల కూల్‌డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. చల్లగా గొంతులో దిగడం మాత్రమే చూసుకుంటారు కానీ తర్వాత దాని వల్ల కలిగే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని గ్రహించరు.
కొందరైతే అదే పనిగా కూల్‌డ్రింక్ తాగేస్తూ ఉంటారు. ఇంట్లో ఎక్కువగా స్టాక్ కూడా పెట్టుకుంటారు. ఎవరైనా చుట్టాలు వస్తే ఈజీగా సర్వ్ చేసెయచ్చుగా. కొందరు చిన్న సందర్భం వచ్చినా సరే కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే. ఈవిధంగా కూల్‌డ్రింక్స్‌ని మంచినీళ్లలా వాడడం అతి సాధారణమైపోయింది. దీనివల్ల లేని రోగాలను మనమే కొనితెచ్చుకుని దానికోసం మళ్లీ వైద్యానికి ఖర్చు పెడుతున్నాం. మరి ఈ కూల్‌డ్రింక్స్ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కూల్‌డ్రింక్స్ తాగడం వలన వచ్చే సమస్యలు:
- డయాబెటిస్
- ఇన్ఫర్టిలిటీ
- ఒబెసిటి
- అధిక బరువు
- గుండె సంబంధిత వ్యాధులు
- కడుపు నొప్పి
- క్యాన్సర్
కూల్‌డ్రింక్స్ ఎందుకు హానికరం
కూల్‌డ్రింక్స్‌లో కలిపే రసాయనాలు కార్బన్ డయాక్సైడ్, స్వీటెనర్స్, యాసిడ్స్, ఫ్లేవర్స్, కలర్స్, ఫోమింగ్ ఏజెంట్స్, నిల్వ ఉంచేందుకు రసాయనాలు వాడడం వలన అవి మన శరీరంలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. శరీరంలో ఉన్న ప్రతీ భాగాన్ని పాడుచేసే సామర్థ్యం కూల్‌డ్రింక్‌కి ఉందని చెప్తున్నారు వైద్య నిపుణులు. మానవ శరీరంలో ఎముకలు చాలా ముఖ్యమైనవి. అలాంటి ఎముకలను పిండిగా చేయడంలో కూల్‌డ్రింక్ ప్రథమంగా ఉంటుందట. కూల్‌డ్రింకుల్లో ఉండే ఫాస్పరిక్ యాసిడ్ ఎముకలలో ఉండే కాల్షియంను తినేస్తుంది. ఇది కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది.
గుండె సమస్యలకు కూల్‌డ్రింక్స్ పెద్ద ముప్పు. వీటిని సేవించిన వారికి ప్రమాదం దగ్గరలో ఉంటుందని పరిశోధకులు మొత్తుకుంటున్నారు. అంతేకాదు పురుషుల గుండెలకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడతాయట. ఏదేమైనా గుండె సమస్యలు ఉన్నవారు వీటికి వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమం. ఈ కూల్‌డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకుంటే ముసలితనం కూడా తొందరగా వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కూల్‌డ్రింక్స్ శరీర బరువును పెంచుతాయి. ఈకారణంగా రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. కూల్‌డ్రింక్‌లో ఉండే షుగర్, యాసిడ్లు బరువును పెంచుతాయి. తీయదనం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు దానిని విడిచిపెట్టకుండా అదే పనిగా తాగుతూ ఉంటారు. దీనిద్వారా వీరు సంవత్సరానికి 3 నుండి 5 కిలోల బరువు పెరుగుతారని తాజా పరిశోధనలో తేలింది.
కూల్‌డ్రింక్స్ అతిగా తాగడం వలన శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోయి డీ హైడ్రేషన్ ఏర్సడుతుంది. ఎందుకుంటే వీటిలో కెఫిన్, ఇంకా షుగర్ ఉంటాయి. అవి మన బాడీని హైడ్రేట్‌గా ఉంచకుండా చేస్తాయి. వీటిలో ఉండే రసాయనాల వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని కడుపులో నొప్పి ఏర్పడుతుంది. కొందరికి కడుపులో తీవ్రమైన మంటను కలగజేస్తుంది.
కూల్‌డ్రింక్‌లో అధిక మొత్తంలో షుగర్ కంటెంట్ ఉండడం వలన మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి క్రమంగా అవి ప్రమాదంలో పడేలా చేస్తాయి. అలాగే కూల్ డ్రింక్స్ క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో రుతుసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని, తద్వారా రుతుక్రమం అగిపోవడం కాకుండా వివిధ రకాల క్యాన్సర్ సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కనుక కూల్‌డ్రింక్స్‌కు బదులు ఇంట్లో చక్కటి పండ్ల రసాలను సేవించడం ఆరోగ్యానికి ఎంతో మేలు. బయటకు వెళ్లనప్పుడు వేడిన తట్టుకోలేక తాగాల్సివచ్చినపుడు తాజా పండ్ల రసాలను, లేదా కొబ్బరినీళ్లు, చెరుకు రసం తాగడం శ్రేయస్కరం.