ఉద్యోగం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఓ కీలక మలుపు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి ఆనందానికి అవధులే ఉండవు. మనమూ సంపాదిస్తున్నాం.. ఇక ఎవరిపైనా ఆధారపడాల్సిన పని లేదు అన్న ఫీలింగ్ ఎవరికైనా చాలా బాగుంటుంది. అదే సమయంలో ఆ సంపాదనకు తగిన ఆర్థిక ప్రణాళిక లేక ఇబ్బందులు పడుతుంటారు. ఇన్నాళ్లూ పాకెట్ మనీ కోసం కూడా తల్లిదండ్రులపై ఆధారపడిన వాళ్లు.. ఒకేసారి వేలల్లో సంపాదిస్తే ఎలా ఉంటుంది? ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేస్తుంటారు. అందులోనూ కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకు పెద్దగా బాధ్యతలు కూడా ఉండవు.
చాలా వరకు 25 ఏళ్లలోపు వయసులోనే ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు. అప్పటికి వాళ్ల పేరెంట్స్ కూడా ఇంకా సంపాదిస్తుంటారు. కచ్చితంగా ఎంతో కొంత జీతం ఇంట్లో ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. దీంతో ఆర్థిక క్రమ శిక్షణ లేకుండా పోతుంది. భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సవాళ్లపై ఓ అంచనా లేకపోవడం వల్ల ఎలా పడితే అలా ఖర్చు పెడుతుంటారు. పొదుపు, పెట్టుబడుల్లాంటి వాటికి అర్థమే తెలియదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం.
మీ సంపాదన ఎంత భారీగా ఉన్నా.. ఓ ఆర్థిక ప్రణాళిక లేకపోతే భవిష్యత్తులో లేనిపోని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అందువల్ల కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లు ఎలాంటి ఆర్థికపరమైన చిట్కాలు పాటించాలో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న స్టోరీలో తెలుసుకోండి.
ప్లానింగ్ కు బీజం లెక్కలు రాయడం
కొత్తగా సంపాదించడం మొదలు పెట్టినప్పుడు ఖర్చులు కూడా ఎక్కువగానే చేస్తుంటారు. ఇది సహజం. అయితే ఆ ఖర్చుల లెక్కలన్నీ ఎక్కడో ఓ చోట రాసి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా కొన్ని నెలల పాటు చేస్తే.. మీకే మీ ఖర్చులపై ఓ అవగాహన వస్తుంది.
మీరు సంపాదిస్తోంది ఎంత? ఖర్చు చేస్తోంది ఎంత? దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు? ఆ ఖర్చుల్లో మీ అవసరాలు ఏంటి? విలాసాలకు ఎంత ఖర్చు చేశారు? అనవసర ఖర్చులు ఎన్ని చేశారు అన్న అంశాలపై మీకే స్పష్టమైన అవగాహన వస్తుంది. అవగాహన వచ్చాక ఆర్థిక ప్రణాళిక ప్రారంభించండి.
ఆర్థిక ప్రణాళిక లో నాలుగు ముఖ్యమైన అంశాలు
- లక్ష్యాలకు అనుగుణంగా పొదుపు, పెట్టుబడులు ప్రారంభించడం
- అత్యవసర నిధి సమకూర్చుకోవడం
- జీవిత బీమా పాలసీ తీసుకోవడం
- ఆరోగ్య భీమా పాలసీ తీసుకోవడం
నెలవారీ సంపాదిస్తోంది మొత్తం ఖర్చు చేస్తూ వెళ్తే ఏ ప్రయోజనమూ ఉండదు. అందువల్ల మీ జీతంలో కనీసం 30 శాతాన్ని పొదుపు చేయడం నేర్చుకోండి. అలాగని ఈ డబ్బును ఇంట్లో పెట్టుకుంటే లాభం లేదు. స్వీప్ అకౌంట్ (సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్)లాంటివైతే బెటర్. సేవింగ్స్ అకౌంట్ అయితే ఏడాదికి నాలుగు శాతం మాత్రమే వడ్డీ వస్తుంది. ఇలాంటి స్వీప్ అకౌంట్లో ఆ డబ్బును జమ చేస్తూ వెళ్తే కనీసం 8 శాతం వరకు వడ్డీ ఉంటుంది.
కాంపౌండింగ్ సూత్రం మరవకండి..
కాలం చాలా విలువైనది అని మనం తరచూ అంటుంటాం. అఫ్కోర్స్.. అది డబ్బు కంటే కూడా చాలా చాలా విలువైంది అనుకోండి. అయితే పొదుపు విషయంలో ఇది మీకు మరింత మెరుగ్గా అర్థమవుతుంది. ఉద్యోగం మొదలుపెట్టినప్పుడే సేవింగ్స్ చేయడానికి.. ఎప్పుడో పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత సేవింగ్స్ చేయడానికి చాలా తేడా ఉంటుంది.
నిజానికి అన్నేళ్ల తేడా కూడా అవసరం లేదు.. ఇప్పుడు చెప్పబోయే ఒక్క లెక్క చూడండి.. కేవలం ఒక్క ఏడాదిలో ఎంత నష్టపోతున్నారో మీకే తెలుస్తుంది.
ఉదాహరణకు మీకు 40 ఏళ్ల వయసు ఉన్నపుడు నెలకు పది వేలు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు అనుకోండి. నెలకు 12 శాతం వడ్డీ వేసుకుంటే.. మీకు 60 ఏళ్లు వచ్చే సమయానికి 99.91 లక్షలు మీ చేతికి అందుతాయి. ఇది చాలా పెద్ద మొత్తమే.
కానీ ఒక్క ఏడాది ముందు అంటే మీకు 39 ఏళ్ల వయసున్నపుడే ఈ పని చేయడం మొదలుపెట్టండి. నెలకు అదే పది వేలు.. 12 శాతం వడ్డీకి ఇన్వెస్ట్ చేయండి. మీకు 60 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిలో 1.13 కోట్లు ఉంటాయి. అంటే ఒక్క ఏడాది ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే.. మీకు సుమారు 14 లక్షలు అదనంగా వస్తున్నాయి. ఇది మీరు ఏడాదికి చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ (రూ. 1.2 లక్షలు) కంటే పది రెట్లు ఎక్కువ. ఇంకాస్త ఎక్కువ వడ్డీ రేటు ఉంటే.. ఈ మొత్తం మరింత పెరుగుతుంది.
దీనిని బట్టే అర్థం చేసుకోండి.. కాలం ఎంత విలువైనదో. ఓ ఏడాదో, రెండేళ్లో ఆలస్యమైతే ఏంటి మనం అనుకుంటాం.. కానీ ఈ లెక్క చూసిన తర్వాత మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. మీరు కొత్తగా ఉద్యోగం మొదలు పెట్టిన తొలి నెల నుంచే ఇలా పెట్టుబడి పెడుతూ వెళ్తే.. రిటైర్మెంట్ స్థాయికి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో ఆలోచించండి.
సింపుల్‌గా చెప్పాలంటే ఎంత ఎక్కువ కాలానికి (కనీసం ఐదేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు) మనం ఇన్వెస్ట్ చేస్తామో.. అంత ఎక్కువ రిటర్న్స్ మనకు వస్తాయి. పైగా మీరు ఆలస్యం చేస్తున్న కొద్దీ మీ బాధ్యతలు పెరిగి.. పొదుపు తగ్గిపోతూ ఉంటుంది. ఆలస్యంగా ఇన్వెస్ట్ చేస్తే మొదట్లో కంటే ఎక్కువ మొత్తం చేయాల్సి ఉంటుంది. కానీ మీ ఆర్థిక పరిస్థితి అందుకు ఏమాత్రం సహకరించదు.
కారు, ఇల్లు వంటి గోల్స్ సంగతేంటి?
పొదుపు చేశారు సరే.. తర్వాత ఏంటి? కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. కారు కొనాలనో, ఇల్లు కొనాలనో కలలు కంటుంటారు. అయితే ఈ లక్ష్యాలకు అనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళిక ఉండేలా చూసుకుంటే మంచిది. కారు కొనడం, ఇల్లు కొనడం ఒక్కటి కాదు. అప్పుడు కారు మీ స్వల్పకాలిక లక్ష్యమైతే.. ఇల్లు దీర్ఘకాలిక లక్ష్యం అవుతుంది.
ఈ లక్ష్యాలకు అనుగుణంగా మీ పొదుపు, పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. ఓ కారు కొనాలంటే ఎంత డబ్బు కావాలి.. దానికి ఎంత సమయం పడుతుంది అన్నది చూసుకుంటే.. దానికి ఎంత పొదుపు చేయాలి.. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అన్నదానిపై స్పష్టమైన అవగాహన వస్తుంది. అలాగే ఇల్లు కొనాలన్నా ఇలాంటి ప్రణాళికే ఉండాలి. మీ లెక్కలు వేసుకునే సమయంలో ధరల పెరుగుదలను కూడా దృష్టిలో ఉంచుకోండి. ప్రతి ఏటా ధరలు పెరుగుతాయే తప్ప తగ్గవు.
మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
కారు, ఇల్లు అన్న మీ ఆర్థిక లక్ష్యాలు సరే.. మరే వాటిని సాధించుకోవడానికి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకు ఇది అంత సులువుగా అంతుబట్టదు. అందుకే ముందుగా మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోమని చెప్పింది. స్వల్పకాలిక లక్ష్యాలైతే ఒకలా, దీర్ఘకాలిక లక్ష్యాలైతే మరోలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఇన్వెస్ట్మెంట్లపై త్వరగా అవగాహన పెంచుకోవాలి. చిన్న వయస్సులో రిస్క్ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కనుక మ్యూచువల్ ఫండ్ల లో సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టండి. అంటే నెలనెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లో పొదుపు చేయవచ్చు.
ఒకసారి మీ లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత మీ పొదుపును పెట్టుబడిగా మార్చుకోవాలి. మీ లక్ష్యాలు, వాటిని చేరుకోవడానికి మీరు నిర్దేశించుకున్న సమయాన్ని బట్టి ఈ పెట్టుబడులు ఉండాలి. స్వల్పకాలిక లక్ష్యాలైతే.. రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్లాంటివి ఉత్తమం.
ఇక దీర్ఘ కాలిక లక్ష్యాలైతే.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్, పీపీఎఫ్, ఈపీఎఫ్లాంటివి బెటర్. చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేయాలని అనుకుంటారు. దీనికోసం స్టాక్ మార్కెట్లను షార్ట్ కట్‌గా ఎంపిక చేసుకొని చేతులు కాల్చుకుంటారు. సరైన అవగాహన లేకుండా షేర్లు కొనడం, అమ్మడం చేస్తే మొదటికే మోసం వస్తుంది.
ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టండి
ఒక్కటి మాత్రం కచ్చితంగా గుర్తు పెట్టుకోండి.. మీకొచ్చే జీతం పది వేలయినా, లక్షయినా.. దానిని నెల రోజుల్లో పూర్తిగా ఖర్చు పెట్టేయొచ్చు. అది పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇలా ఎప్పటికప్పుడు నెలవారీగా మీ జీతం మొత్తం ఖర్చు పెట్టేస్తూ వెళ్తే.. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేస్తారు?
ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మీ ఉద్యోగం పోయినా లేదా ఇంట్లో వాళ్లకు ఏదైనా అత్యవసరం ఏర్పడినా.. మరేదైనా ఊహించని ఖర్చు వచ్చి పడితే ఎలా? దీనికోసమే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ, మీ జీతం ఎంతయినా సరే.. కొంత మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కోసం పక్కన పెట్టాల్సిందే. ఇది కనీసం మూడు నుంచి ఆరు నెలల జీతానికి సరిపడా ఉండాలి. ఇది మీకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది.
చాలా మంది కొత్తగా ఉద్యోగం రాగానే.. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టేస్తుంటారు. కుటుంబ బాధ్యతలు ఉన్న వాళ్లు కూడా నెలవారీ అవసరాల కోసమే జీతం మొత్తాన్నీ ఖర్చు చేస్తారు. ఇది చాలా తప్పు. మీ బడ్జెట్, ఆర్థిక లక్ష్యాలతోపాటు ఎమర్జెన్సీ ఫండ్ కూడా చాలా ముఖ్యమైనదని గుర్తించండి. నెలవారీ దీనికోసం తీసి పెట్టిన మొత్తాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటే లాభం లేదు.
రానున్న రోజుల్లో పెరిగిపోయే ధరలతో ఆ డబ్బు విలువ తగ్గిపోతుంది. అందువల్ల ఈ మొత్తాన్ని మంచి రిటర్న్స్ ఇచ్చే వాటిలో పెట్టుబడిగా పెడితే ప్రయోజనం ఉంటుంది. స్వల్పకాలిక మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ లేదా స్వీప్ అకౌంట్ (సేవింగ్స్ కమ్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్)లు ఇన్వెస్ట్‌మెంట్‌కు బాగా పనికొస్తాయి.
అప్పుల ఉచ్చులో చిక్కుకోవద్దు
కొత్తగా ఉద్యోగం వచ్చిందంటే చాలు.. లోన్లని, క్రెడిట్ కార్డులని బ్యాంకులు మీ చుట్టూ తిరుగుతుంటాయి. మీ జీతం కాస్త ఎక్కువగా ఉందంటే.. వీళ్ల బెడద తీవ్రంగా ఉంటుంది. అప్పుడప్పుడే సంపాదించడం మొదలు పెడతారు కాబట్టి.. వీటిలో మతలబేంటో మీకు పూర్తిగా అర్థం కాదు. క్రెడిట్ కార్డులు, పర్సనల్, హోమ్, వెహికిల్ లోన్లన్నీ అప్పులే తప్ప.. సంపాదన కాదని గుర్తుంచుకోండి.
– ముఖ్యంగా క్రెడిట్ కార్డులతో చాలా డేంజర్. మీతో సాధ్యమైనంతగా ఎక్కువ ఖర్చు పెట్టించడానికి బ్యాంకులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. పైగా నెలవారీ ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా కొంతమంది మొత్తం కట్టేయకుండా మినిమం పేమెంట్‌తో సరిపెడతారు. ఇది చాలా ప్రమాదం. బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్‌పై మినిమం పేమెంట్ ఆప్షన్ ఇస్తాయి కానీ.. మీరు కట్టాల్సిన మిగిలిన మొత్తంపై భారీగా వడ్డీ వేస్తాయి. ఇది నెలకు 3 శాతం ఉంటుంది. అందువల్ల కచ్చితంగా క్రెడిట్ కార్డు బిల్లును నెలవారీగా మొత్తం కట్టేయడం మేలు. ఇక ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నెల క్రెడిట్ కార్డులతో చేసే ఖర్చుకు పరిమితి ఉండాల్సిందే.
– ఇక బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి కదా అని.. ఇబ్బడిముబ్బడిగా తీసుకున్నారంటే చిక్కుల్లో పడతారు. ఒకేసారి హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ ఉంటే.. నెలవారీ కట్టాల్సిన ఈఎంఐలు తడిసి మోపెడవుతాయి. మీ నెల జీతంలో ఈఎంఐలు 40 నుంచి 45 శాతం మించకుండా చూసుకుంటే మంచిది. ఇందులోనూ 25 నుంచి 35 శాతం హోమ్ లోన్ ఉంటే బెటర్. సాధ్యమైనంత వరకు పర్సనల్ లోన్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
ఎందుకంటే క్రెడిట్ కార్డుల తర్వాత ఎక్కువ వడ్డీ బాదేవి ఈ పర్సనల్ లోన్లే. ఏడాదికి 18 నుంచి 25 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. సాధారణ ఖర్చుల కోసం కూడా కొంత మంది పర్సనల్ లోన్లు తీసుకుంటారు. ఇంత భారీ మొత్తంలో వడ్డీ చెల్లించి పర్సనల్ లోన్ తీసుకోవడం అవసరమా అని ఆలోచించండి.
మొదటగా తీసుకోవాల్సింది బీమా
ఇన్సూరెన్స్‌కు ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఉంది. అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా.. ప్రతి ఒక్కరికీ అవసరం. కొత్తగా ఉద్యోగంలో చేరితే ఈ ఇన్సూరెన్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఆర్థిక విషయాలపై సరైన అవగాహన లేనట్లే.. ఇన్సూరెన్స్పైనా కొత్త ఉద్యోగులకు అవగాహన ఉండదు. దీంతో ఇన్సూరెన్స్ అంటే మంచి రిటర్న్స్ ఇచ్చేది లేదంటే.. ట్యాక్స్ సేవింగ్స్ కోసం వాడుకునేది అన్నట్లుగా చూస్తారు. కేవలం కొంత ట్యాక్స్ మినహాయింపు పొందడానికి భారీ మొత్తం పెట్టి అవసరం లేని ఇన్సూరెన్స్‌లు తీసుకుంటారు.
– ఉదాహరణకు లైఫ్ ఇన్సూరెన్సే తీసుకుంటే.. ఇందులో టర్మ్ ప్లాన్ బెస్ట్. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా కల్పిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి రిటర్న్స్ ఉండవు. దీంతో చాలా మంది టర్మ్ ప్లాన్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇక రెండోది మనీబ్యాక్లాంటి సాంప్రదాయ పాలసీలు. వీటిలో ప్రీమియం ఎక్కువ.. కవరేజీ చాలా తక్కువ. రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. మూడోది యూలిప్స్. మార్కెట్‌తో అనుసంధానమై ఉండే ఇన్సూరెన్స్ ప్లాన్లివి. వీటిలో ప్రీమియం చాలా ఎక్కువ. కవరేజీ తక్కువగా ఉంటుంది. అయితే మార్కెట్‌తో అనుసంధానమై ఉండటంతో అందుకు తగినట్లు రిటర్న్స్ వస్తాయి.
లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీకు సడెన్‌గా ఏదైనా జరగరానిది జరిగితే.. మీపై ఆధారపడిన వాళ్లు ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు అన్నది గుర్తుంచుకోండి. ఆ లెక్కన చూసుకుంటే.. టర్మ్ ప్లాన్ చాలా బెటర్. తక్కువ ప్రీమియంతో మంచి జీవిత బీమా అందిస్తాయి. మీపై ఆర్థికంగా ఆధారపడిన వాళ్లు ఉంటే.. మీ ఏడాది జీతానికి కనీసం పది రెట్లు ఎక్కువ మొత్తంలో కవరేజీ ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ సహా పలు ప్రయివేటు బీమా సంస్థలు పాలసీలు అందిస్తున్నాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
ఇక మారుతున్న జీవన శైలి కారణంగా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. హాస్పిటల్‌కు వెళ్తే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. చాలా వరకు కంపెనీలు గ్రూప్ ఇన్సూరెన్స్‌లు ఇస్తున్నాయి. అయితే వాటి కవరేజీ తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఐదు లక్షల కవరేజీ ఉన్న ప్లాన్ ఉంటే బాగుంటుంది. మీ కంపెనీ 2 లక్షల కవరేజ్ ఉన్న ప్లాన్ ఇస్తుంది అనుకోండి.. అదనంగా మరో మూడు లక్షల టాప్ అప్ కవరేజ్ కోసం కొంత అదనపు ప్రీమియంను మీరు చెల్లించవచ్చు. బయట ప్రత్యేకంగా మరో ఇన్సూరెన్స్ తీసుకునే బదులు.. ఇలా చేస్తే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ వస్తుంది.
ఇవీ చదవండి