మెంతికూర కుడుములు .. హెల్తీ బ్రేక్ ఫాస్ట్

menthi kudumulu
మెంతి కుడుములు

రొటీన్‌ బ్రేక్‌ఫాస్ట్‌లతో బోర్‌ కొడుతోందా.. అయితే ఈ మెంతికూర కుడుములు ఓసారి ట్రై చేయండి. చాలా మందికి ఈ వంటకం తెలియకపోవచ్చు. పేరు వినడం కూడా ఇదే ఫస్ట్‌ టైమ్‌ అనే వాళ్లూ ఉంటారు. కానీ ఇలాంటి వెరైటీ వంటకాలు చేస్తేనే కదా.. కాస్త నాలుకకు కూడా కొత్త రుచి తగిలేది. ఎప్పుడూ ఆ ఇడ్లీ, వడ, దోశలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు విసుగు తెప్పిస్తాయి. పిల్లలైతే వీటిని చూడగానే మొహం పక్కకు తిప్పుకుంటారు.

మెంతికూర కుడుములు వంటి వెరైటీ వంటకాలు వాళ్లలోనూ కాస్త తినాలన్న ఆసక్తిని రేపుతాయి. చేయడం కూడా చాలా సింపుల్‌. మామూలుగా ఇంట్లో రెగ్యులర్‌గా ఉండే పదార్థాలతోనే వీటిని చేసుకోవచ్చు. పెద్దగా టైమ్‌ కూడా పట్టదు. మీరు రొటీన్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్‌లకు ఎంత టైమ్‌ పడుతుందో దీనికీ అంతే అవసరం అవుతుంది.

పైగా మెంతి కూరను మీ రోజువారీ వంటల్లో భాగం చేస్తే ఆరోగ్యానికీ మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ మెంతి కుడుముల రెసిపీ డియర్‌ అర్బన్‌.కామ్‌ మీకు అందిస్తోంది. ఇది ఫాలో అయిపోయి వెంటనే మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి.

కావాల్సిన పదార్థాలు

  బియ్యం పిండి – ఒక కప్పు
  గోధుమ పిండి – అర కప్పు
♦  మెంతి కూర – ఒక కప్పు
♦  పల్లీల పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు
♦  పచ్చిమిర్చి పేస్ట్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
♦  కొత్తిమీర – తగినంత
♦  జీలకర్ర – ఒక టేబుల్‌ స్పూన్‌
♦  ఆవాలు – ఒక టేబుల్‌ స్పూన్‌
♦  ఉప్పు – తగినంత
♦  అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌
♦  ఎండు మిరపకాయలు – నాలుగు లేదా ఐదు
♦  పసుపు – చిటికెడు
♦  నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు
♦  చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు
♦  పల్లీలు – ఒక టేబుల్‌ స్పూన్‌
♦  కరివేపాకు – కొన్ని ఆకులు

తయారు చేసే విధానం స్టెప్ బై స్టెప్

  1. బియ్యం పిండి, గోధుమ పిండిని తడుపుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి ముద్దలాగా చేసుకోవాలి
  2. ఆ పిండిని జంతికల పీటలో వేసి మురుకులలాగా వత్తుకోవాలి
  3. ఇప్పుడా కుడుములను ఆవిరితో ఉడకబెట్టాలి
  4. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి
  5. ఆ తర్వాత పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉల్లిపాయలు వేయాలి
  6. కాస్త వేగిన తర్వాత మెంతికూర వేసి కాసేపు ఉడకనివ్వాలి
  7. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి పేస్ట్‌ వేయాలి
  8. కాసేపటి తర్వాత అందులో ముందుగానే ఉడకబెట్టుకున్న కుడుములు వేయాలి
  9. దానికి తగినంత ఉప్పు, పల్లీల పొడి వేసి బాగా కలపాలి
  10.  చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే.. మెంతికూర కుడుములు రెడీ.

ఆరోగ్యానికీ మంచిది

  • తక్కువ నూనె.. పైగా ఉడకబెట్టిన బియ్యం పిండి, గోధుమ పిండి కావడంతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదు.
  • మెంతి కూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
  • అసలు ఈ మెంతికూరను రసంలా చేసుకొని తాగినా శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి.

– శిరీష, ఫ్రీలాన్స్ రైటర్

ఇవి కూడా చదవండి

♦ షీర్ ఖుర్మా ఎలా తయారు చేయాలి?

♦ వెజ్ బిర్యానీ తయారీ చాలా సింపుల్

Previous articleన్యూ పేరెంట్స్ బడ్జెట్ ప్లాన్ సిద్ధం చేయండిలా
Next articleబొబ్బర పప్పు గారెలు .. బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయండిలా