kulu manali tour:కులు మనాలి టూర్ మన దేశంలో ముఖ్యమైన విహార యాత్రల్లో ఒకటి. ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు ఇదొక చక్కటి పర్యాటక ప్రాంతం. మంచుతో ఆటలాడుకోవాలంటే కులు మనాలి టూర్ వెళ్లితీరాల్సిందే.
హిమాలయ పర్వతాల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఆస్వాదనకు అనువైన ప్రదేశాల్లో ఒకటి మనాలి. అందరికీ కులు మనాలిగా పరిచితమైనప్పటికీ కులు, మనాలి పక్క పక్కన ఉండే రెండు ప్రాంతాలు.
హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి పర్యాటకంగా ప్రసిద్ధిగాంచినది. ప్రకృతి సోయాగాలు, పర్వత ఒయలు చూడాలంటే మనాలి దర్శించాల్సిందే. ఆనందం, అద్భుతం, భయం, తన్మయత్వం… వీటి కలయికగా సాగే మనాలి యాత్ర మైమరిపిస్తుంది.
kulu manali tour: మనాలి మార్గం
అందమైన నీలాకాశం దానికింద మంచుకిరీటంతో మెరిసే పర్వత ప్రాంతాన్ని చూసేందుకు చేసే ప్రయాణం కూడా ఓ పదిలమైన అనుభూతిగా మిగులుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి చేరుకోవాలంటే 230 కిలోమీటర్ల మేర రోడ్డుమార్గంలో కొండల్లో ఘాట్ రోడ్లపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఢిల్లీ నుంచి 540 కిలోమీటర్ల దూరం ఉండే మనాలికి చేరుకోవాలంటే రోడ్లు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. విమాన మార్గంలో వెళ్తే కులు మనాలి విమానాశ్రయంగా పిలువబడే భుంటార్ చేరుకుంటారు. కులు నగరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, షిమ్లా, ఛండీగఢ్ వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి.
కులు నుంచి మనాలికి 40 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలోనే చేరుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో కూడా చేరుకోవచ్చు. హర్యానాలోని పానిపట్, అంబాలా, చండీగఢ్, పంజాబ్ లోని రోపార్, బిలాస్పూర్, సుందర్ నగర్, హిమాచల్ లోని మండి మీదుగా కులు చేరుకుంటారు. అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలి చేరుకోవచ్చు.
kulu manali tour: మనాలి మైమరపించే నగరం
మనాలి.. భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ పర్వతాలలో ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ, కులు లోయలో సముద్ర మట్టానికి 6,398 అడుగులు ఎత్తులో ఉన్న పర్వత విడిది ప్రాంతం.
మనాలి పరిపాలనాపరంగా కులు జిల్లాలో భాగంగా ఉంటుంది. జనాభా దాదాపు 40,000. ఈ చిన్న పట్టణం లడఖ్ కు ప్రాచీన వర్తక మార్గ ప్రారంభంగా ఉండేది. మనాలి దాని చుట్టపక్కల ఏడు పర్వతాల్లో సప్త రుషులు ధ్యానం చేసిన పవిత్ర ప్రదేశంగా చెప్తారు.
kulu manali tour: ఉష్టోగ్రతలు ఎలా ఉంటాయి?
వేసవికాలంలో సగటు ఉష్ణోగ్రతలు 14 సెంటీగ్రేడ్ నుండి 20 సెంటీగ్రేడ్ వరకు, శీతాకాలంలో -7 సెంటీగ్రేడ్ నుండి 10 సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. వర్షపాతం నవంబర్ నెలలో 24 మిల్లీమీటర్ల నుండి జూలైలో 415 మిల్లీమీటర్ల మధ్య మారుతూ ఉంటుంది.
ఈ ప్రాంతంలో సాధారణంగా మంచు డిసెంబర్ నెలలో కురుస్తుంది కాని, గత పదిహేను సంవత్సరాలుగా ఆలస్యమై జనవరి లేదా ఫిబ్రవరి నెల ప్రారంభంలో కురుస్తోంది.
మనాలి పర్యాటక మజిలీ
హిమాచల్ లో పర్యటించే మొత్తం పర్యాటకులలో నాల్గవవంతు మనాలి సందర్శిస్తున్నారు. మనాలిలో సాహస క్రీడలైన స్కైయింగ్, హైకింగ్, పర్వతారోహణం, పారా గ్లైడింగ్, వాటర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, మౌంటైన్ బైకింగ్ వంటి వాటిని ఆస్వాదించేందుకు వీలవుతుంది.
మనాలిలో వేడి నీటిబుగ్గలు, మత పరమైన పుణ్య స్థానాలు, టిబెటన్ల, బౌధ్దుల ఆలయాలు ఉన్నాయి. మనాలికి దక్షిణంగా ఉన్న నగ్గర్ కోట.. పాల సామ్రాజ్యపు చిహ్నం. శిలలు, రాళ్ళు, విశాల దారు శిల్పాలతో కూడిన ఈ భవనం హిమాచల్ ప్రదేశ్ మహోన్నత, మనోహర కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉంది. ప్రస్తుతం కోటను హోటల్ గా మార్చి హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉంచారు.
లాడ్జీలకు ఎంత ఖర్చవుతుంది?
మనాలిలో విడిదికోసం లాడ్జీలు ముందుగానే రిజర్వు చేసుకోవడం మంచిది. సీజన్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు కాబట్టి ఆ సమయంలో గదులు దొరకటం కొంచెం కష్టం. గది రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు అద్దె ఉంటుంది.
సాధారణంగా అయితే రూ. 2,500 లకు దొరుకుతాయి. సీజన్ లో ఇద్దరు ఉండేందుకు వీలుగా ఉండే గది ఒక రాత్రికి (మధ్యాహ్నం 1 గంట తర్వాత చెక్ ఇన్ అయితే మరుసటి రోజు ఉదయం 11 గంటల తర్వాత చెక్ అవుట్ కావాలి) రూ. 5,000 పైనే ఉంటుంది.
కొండల అంచులలో ఉన్న గదులు దొరికితే కిటికీల్లోంచి దేవదారు చెట్లతో కప్పబడిన పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. తెల్లవారుజామున పర్వత శిఖరాలు తెల్లని మంచు కిరిటం ధరించి కనిపిస్తాయి.
మనాలిలో భీముడి భార్య హిడింబీకి చెందినదిగా చెప్పుకునే ఓ పురాతన గుడి ఉంది. మన గుడిలో ఉండే గోపురంలా కాక ఒక విధమైన టిబెట్ నమూనాతో గుడి దర్శనమిస్తుంది. చుట్టూ దేవదారు వృక్షాలు ఉంటాయి. అక్కడ అమ్మే చెర్రీస్ చాలా బాగుంటాయి. అక్కడ ఏ ఇంట్లో చూసినా గుత్తులు గుత్తులుగా గులాబీలు రెండో అంతస్తు దాకా తీగలాగా పాకి ఇంటి అందాన్ని ఇనుమడింపజేస్తాయి.
బియాస్ అందాలు.. ట్రెక్కింగ్
బియాస్ నదికి ఇరువైపుల అందమైన హోటళ్లు, షాపింగ్ మాల్స్, కొండ అంచున గృహాలతో మనాలి నగరం అలరిస్తోంది. మనాలి నుంచి ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, పారా గ్లైడింగ్ పాయింట్‌కి ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాల్సి ఉంటుంది. నగరంలోనే బుకింగ్ పాయింట్స్ ఉంటాయి. ధరలు ప్రతి సాహస క్రీడకు ఒక్కో మనిషికి రూ. 2 వేల వరకు ఉంటాయి.
అందాల ప్రకృతి ఒడిలో సేదతీరాలి.. ఆకాశ మార్గంలో విహరించాలంటే రోప్‌వే ఎక్కక తప్పదు మరి. నదిపై సాగే రివర్ రాఫ్టింగ్ జలక్రీడ ఆనందించి తీరాల్సిన అందమైన అనుభూతి. పైకీ, కిందకీ తేలుతూ శిక్షకుల మార్గదర్శకంతో ప్రవాహంపై సాగే ఆ రాఫ్టింగ్ ఒక ఆనందతరంగం. ఇలా మనాలిలో సరదాగా గడిపేందుకు ఒకరోజు సమయం పడుతుంది.
రోహతంగ్ పాస్.. మస్తు టైం పాస్ :
కులు మనాలి టూర్ లో రోహతంగ్ పాస్ ఒక హైలైట్ అని చెప్పాలి. మనాలి నుంచి మంచు శిఖరం చేరుకోవాలంటే రోహతంగ్ పాస్ వెళ్లాలి. మనాలి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని ఆ ప్రాంతం చేరుకోవాలంటే అక్కడి వారి వెహికిల్స్ లో వెళితేనే చాలా బెటర్.
ఆ ఘాట్ రోడ్డులో ప్రయాణం భయానక సంతోషమనే చెప్పాలి. అలాగే కొన్ని నెలలు మాత్రమే అక్కడికి వెళ్లడానికి పర్మిషన్ ఉంటుంది. వెళ్లే వెహికిల్స్ కు కూడా పర్మిషన్ తీసుకోవాలి.
ఇక 40 కి.మీ. దూరం 400 మైళ్లను మైమరిపిస్తుంది. మనాలి నుంచి ఉదయం 5 లేదా 6 గంటలకు బయలుదేరితే మంచింది. ఎందుకంటే వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. అక్కడికి పరిమిత వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అక్కడికి వెళ్లేందుకు ఒక్కో వాహనానికీ రూ. 7000 వరకు తీసుకుంటారు. దాంట్లో ఐదుగురు ప్రయాణించవచ్చు.
మళ్లీ కొండలు, లోయల మధ్యగా 3500 మీటర్ల ఎత్తు వరకూ వెళ్తారు. పైకి పోయే కొద్దీ చెట్లు కనపడవు. మంచుతో కప్పిన శిఖరాలు కనువిందు చేస్తాయి. అక్కడ సూర్యరశ్మికి ద్రవీభవించే హిమశైలాలు అందమైన జలపాతాలుగా మారి, కిందికి దుముకుతూ ఉంటాయి. గలగలా రహదారులపై నుంచి పారుతూ ఉంటాయి.
రహదారిపై చాకచక్యంగా కారును నడపాల్సి ఉంటుంది. ఏ కొంచెం ఏమరపాటు కలిగినా ప్రాణాలకు ప్రమాదం. ఓ పక్కన లోతైన లోయలు, మరోపక్క గడ్డకట్టిన మంచు మధ్యలో మనం. అదో అద్భుతమైన అనుభూతి అనే చెప్పాలి.
దుస్తులు అద్దెకు తీసుకొవచ్చు..
అద్దెకి వెహికిల్స్ దొరికే చోటే చలికి తట్టుకునే దుస్తులు(ఫుల్ లెన్త్ జాకెట్స్) అద్దెకి ఇస్తారు. అవి లేకుండా శిఖరంపైన తిరగడం కష్టం. రూ. 200 లకు ఒకరికి ఆ జాకెట్ దొరుకుతుంది. షూ కూడా ఇస్తారు. ఫోటో షూట్ కోసం స్టైలిష్ స్పెడ్స్ పెట్టుకుని వెళ్తే బాగుంటుంది.
రోహతంగ్ పాస్ చేరుకోవడానికి దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వెహికిల్స్ చాలా మెల్లగా వెళుతుంటాయి. మధ్యలో భోజనం చేయడానికి ఫస్ట్ స్నో పాయింట్ వద్ద కొన్ని హోటెల్స్ ఉంటాయి. అక్కడ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ దొరుకుతాయి. చల్లని ప్రాంతంలో వేడివేడి మ్యాగీ నోట్లో వేసుకోని వెళ్తే ఆ మజానే వేరు.
అలా అలా ఎత్తుకు వెళ్లాక రహదారి మంచు ముక్కల మధ్య ప్రయాణిస్తూ ఒకచోట ఆగిపోవాలి. ఇంకా శిఖరం అటువైపు వరకు కూడా రహదారి ఉంటుంది. అవతలవైపు ఉన్న స్థితి, లేహ్ నగరాలకు ఆ రహదారి వెళ్తుంది. కానీ అందరిని అటు అనుమతించరు.
kulu manali tour: మధురానుభూతి
ఇక అక్కడ ఒక మంచు ప్రాంతం పై నుంచి ఎండవేడి, కింద నుంచి మంచు అదో వింత అనుభూతి. ఈ చలిని తట్టుకోవడానికి అద్దెకు తీసుకున్న దుస్తులు, లెదర్ బ్లోక్స్, సాక్సులు, ఒకలాంటి గమ్ బూట్స్ తప్పనిసరి. మంచులో అవి లేకుండా నడవలేం.
ఇక ఇష్టానుసారంగా ఆ మంచులో ఆడుకోవచ్చు. కానీ సాధ్యమయినంత తర్వగా అంటే మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న తర్వాత 2 నుంచి 3 గంటలు మాత్రమే సరదాగా గడిపి దిగిపోతే మంచిది. ఎందుకంటే వాతావరణం త్వరగా మారిపోతూ ఉంటుంది.
వానపడితే మళ్లీ వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటాయి. అంటే ఒకే లైనులో వందల కొద్దీ కార్లు ఉంటాయి. తిరుగు ప్రయాణంలో కొంతసేపు ఆగి అల్బుకారా, చిరోంజి లాంటి పళ్లు కొనుక్కుని తింటూ ఆ అనుభూతులన్నీ నెమరువేసుకుంటూ మనాలి రాత్రి వరకు చేరుకోవచ్చు.
kulu manali tour: తిరుగు ప్రయాణం..
ఇక మనాలి చేరుకున్నాక ముందే బుక్ చేసుకున్న హోటల్ లో అక్కడే బస చేసి తర్వాతి రోజు తిరుగుపయనం అయితే మంచిది. మనాలి అందాల వీక్షణ కొంత ఖర్చుతో కూడుకున్న పని.
కులు మనాలి టూర్ వెళ్లాలంటే ఢిల్లీ నుంచి నలుగురు కుటుంబ సభ్యుల బృందానికి సుమారుగా 60 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. యువత, పిల్లలు అమితంగా ఆనందించగలిగే అద్భుతమైన స్థలం మనాలి. జీవితంలో ఒకసారైనా చూడాల్సిన అద్భుత ప్రదేశం..
– జీవీఎస్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు
ఈ టూర్లు ప్లాన్ చేస్తారా?