క్రికెట్‌లో స్మార్ట్‌ బాల్‌.. అసలేంటిది?

smart ball
Photo by rawpixel.com from Pexels

క్రికెట్ లో స్మార్ట్ బాల్ గురించి ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో క్రికెట్‌ను ఓ మతంగా భావించే అభిమానులు ఉన్నారు. మన జాతీయ క్రీడ హాకీయే అయినా.. క్రికెట్‌ బ్యాట్‌ ముందు హాకీ స్టిక్‌ దిగదుడుపే. ఎప్పుడైతే 36 ఏళ్ల కిందట హర్యానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని టీమిండియా విశ్వ విజేతగా నిలిచిందో అప్పటి నుంచీ మన దేశంలో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. క్రికెట్‌ ప్లేయర్స్‌ను దేవుళ్లుగా భావించి పూజలు చేసే అభిమానులను కూడా చూస్తున్నాం.  

అయితే క్రికెట్‌ను కూడా ఎప్పటికప్పుడు మరింత జనరంజకంగా మార్చేందుకు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తూనే వస్తోంది. ఈ మార్పులు యూత్‌ని ఆకర్షించేలా ఉంటున్నాయి. ఒకప్పుడు క్రికెట్‌లో కేవలం తెలుపు రంగు దుస్తులతోనే ప్లేయర్స్‌ బరిలోకి దిగేవాళ్లు. కేవలం పగటి పూట మాత్రమే ఆడేవాళ్లు. కానీ 1992 వరల్డ్‌కప్‌ మొత్తంగా ఓ కొత్త అనుభూతిని అభిమానులకు అందించింది. ఆ వరల్డ్‌కప్‌లో ప్లేయర్స్‌ రంగు రంగుల దుస్తుల్లో కనిపించారు. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో వైట్‌ బాల్‌తో ఆట క్రికెట్‌ ఫ్యాన్స్‌ను కట్టి పడేసింది. ఇక అక్కడి నుంచి క్రికెట్‌ వెనుతిరిగి చూడలేదు.

భారత ఉపఖండంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాల్లో క్రికెట్‌ అభిమానులను సంపాదించుకుంది. రంగుల దుస్తులు, ఆటలో మార్పులే కాదు.. టెక్నాలజీ పరంగానూ క్రికెట్‌ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. తాజాగా స్మార్ట్‌ బాల్‌తో ఆటను మరింత రంజుగా మార్చడానికి సిద్ధమైంది. 

క్రికెట్‌ కేరాఫ్‌ టెక్నాలజీ

మనం ఏ 1992 వరల్డ్‌కప్‌ గురించి మాట్లాడుకుంటున్నామో.. ఆ వరల్డ్‌కప్‌కు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. క్రికెట్‌లో తొలిసారి మూడో అంపైర్‌ ఓ బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌గా ప్రకటించాడు. ఫీల్డ్‌లో ప్లేయర్స్‌ ఆడే ఆటను అన్ని యాంగిల్స్‌లో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులు కూడా అనుభూతి చెందాలన్న ఉద్దేశంతో మైదానం చుట్టూ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చిన వీడియోలన్నింటినీ విశ్లేషించి ఓ బ్యాట్స్‌మన్‌ రనౌటయ్యాడా లేదా అని నిర్ణయించే అవకాశం ఫీల్డ్‌ బయట ఉండే థర్డ్‌ అంపైర్‌కు దక్కింది. ఇక అప్పటి నుంచీ ఫీల్డ్‌ అంపైర్లపై ఒత్తిడి తగ్గించే ఎన్నో టెక్నాలజీలు ఒక్కొక్కటిగా క్రికెట్‌ను పలుకరించాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. 

స్కోరుబోర్డు గ్రాఫిక్స్‌

మ్యాచ్‌లో స్కోరు ఎంతైందో గ్రౌండ్‌లో కూర్చున్న ప్రేక్షకుల కంటే ముందుగానే టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకుడికి తెలిసిపోతోంది. దీనికి కారణం స్కోరు బోర్డు గ్రాఫిక్స్‌. ఓ టీమ్‌ స్కోరు కార్డుతో మొదలై.. ఏ బ్యాట్స్‌మన్‌ ఎంత స్కోరు చేశాడు. అతడు ఎక్కడెక్కడ బౌండరీలు బాదాడు.. ఏ బౌలర్‌ బంతి ఎక్కడ 
వేశాడు.. ఏ పొజిషన్‌లో ఏ ఫీల్డర్‌ నిల్చున్నాడులాంటి ఎన్నో గ్రాఫిక్స్‌ ఇప్పుడు క్రికెట్‌లో కనిపిస్తున్నాయి. 

స్నీకో మీటర్‌

బంతి బ్యాట్‌కు తగిలిందా లేదా తెలుసుకోవడానికి తీసుకొచ్చిన టెక్నాలజీ ఇది. స్టంప్స్‌ దగ్గర స్నీకో అనే ఓ మైక్రోఫోన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది బంతి ఒక్కో ఉపరితలాన్ని తాకినప్పుడు ఒక్కోలా స్పందిస్తుంది. దీని ద్వారా బంతి బ్యాట్‌కు తగిలిందా లేక ప్యాడ్‌కు తగిలిందా లేదా బ్యాట్‌ గ్రౌండ్‌కు తగిలిందా అన్నది అంపైర్‌ తేల్చుకోగలుగుతాడు. 

హాక్‌ ఐ

క్రికెట్‌లో పెను మార్పులకు కారణమైన టెక్నాలజీ ఇది. ఈ మధ్య డీఆర్‌ఎస్‌లో తరచూ వాడుతున్న టెక్నాలజీ ఇదే. బౌలర్‌ విసిరిన బంతి ఏ దిశలో వెళ్తుందో చూడటానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఓ బ్యాట్స్‌మన్‌ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడా లేదా అన్నది దీని ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వివిధ కెమెరాలను విశ్లేషించి బంతి గమనాన్ని ఈ టెక్నాలజీ పసిగడుతుంది. 

హాట్‌స్పాట్‌

బంతి దిశను గుర్తించేందుకే వాడుతున్న మరో టెక్నాలజీ ఇది. ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను ఉపయోగించి బ్యాట్స్‌మన్‌కు బంతి ఎక్కడ తగిలిందో గుర్తిస్తారు. బంతి తగిలిన చోట ఓ తెల్లని మచ్చ (హీట్‌ సిగ్నేచర్‌)లా కనిపిస్తుంది. అంపైర్‌ గుర్తించడానికి కష్టంగా ఉండే ఎల్బీడబ్ల్యూలు, క్యాచ్‌ ఔట్లను నిర్ణయించడానికి 
ఈ టెక్నాలజీ వాడుతున్నారు. 

స్టంప్‌ కెమెరా

గ్రౌండ్‌ చుట్టూ ఎన్నో కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగానే స్టంప్స్‌లోనూ ఓ చిన్న కెమెరాను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల బ్యాట్స్‌మన్‌ లేదా బౌలర్‌ యాంగిల్‌ నుంచి చూసే అవకాశం కూడా టీవీ ప్రేక్షకులకు దక్కుతుంది. పైగా రనౌట్లు, స్టంపౌట్‌ల విషయంలోనూ ఈ కెమెరాలు థర్డ్‌ అంపైర్‌కు సాయపడుతున్నాయి. 

స్పీడ్‌ గన్‌

ప్రస్తుతం బౌలర్‌ విసిరిన బంతి వేగాన్ని గుర్తించడానికి వాడుతున్న టెక్నాలజీ ఇది. ఇదొక డాప్లర్‌ రాడార్‌ యూనిట్‌. ఫీల్డ్‌లో కదులుతున్న వారి వేగాన్ని గుర్తిస్తుంది. సాధారణంగా బంతి వేగాన్ని అంచనా వేయడానికే ఈ స్పీడ్‌ గన్‌ను వాడుతున్నారు. ఇప్పుడు స్మార్ట్‌ బాల్‌ దీనికి ప్రత్యామ్నాయంగా 
మారనుంది. 

అసలేంటీ స్మార్ట్‌ బాల్‌

ఇప్పుడు ప్రపంచమంతా స్మార్ట్‌ అయిపోతోంది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు కనిపిస్తున్నాయి. క్రికెట్‌ కూడా ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోతోంది. అందులో భాగంగా వస్తోందే ఈ స్మార్ట్‌ బాల్‌. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్‌ బాల్స్‌ తయారీ కంపెనీ కూకాబుర్రా ఈ స్మార్ట్‌ బాల్స్‌ను తయారు 
చేస్తోంది. ఈ స్మార్ట్‌ బాల్‌ ద్వారా క్రికెట్‌ ఆడే విధానంతోపాటు కోచింగ్‌ కూడా మారిపోనుంది. ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతి చెందనున్నారు. కూకాబుర్రా రెండేళ్లుగా ఈ స్మార్ట్‌ బాల్‌ను అభివృద్ధి చేస్తోంది. స్పోర్ట్‌ కార్‌ అనే తన టెక్నాలజీ పార్ట్‌నర్‌తో కలిసి ఈ స్మార్ట్‌ బాల్‌ను కూకాబుర్రా తయారుచేస్తోంది. 

ఎందుకీ స్మార్ట్‌ బాల్‌

స్టంప్స్‌లో కెమెరా, పక్కకు మైక్రోఫోన్‌లాంటివి ఇప్పటి వరకు మనం చూశాం. కానీ తొలిసారి క్రికెట్ బాల్‌లో ఓ మైక్రో చిప్‌ను ఈ స్మార్ట్‌ బాల్‌ ద్వారా చూడబోతున్నాం. ఈ మైక్రోచిప్‌ ద్వారా బౌలర్లు ఎప్పటికప్పుడు తాము విసిరిన బంతి వేగం, స్పిన్‌ అయితే ఎన్ని డిగ్రీల కోణంలో అయిందన్న విషయాలు తెలుసుకోవచ్చు. తమ చేతికి ఓ స్మార్ట్‌ఫోన్‌ పెట్టుకుంటే సరిపోతుంది. స్మార్ట్‌ బాల్‌తో దానిని కనెక్ట్‌ చేస్తే బంతి విసరగానే వాచ్‌లో దాని స్పీడ్‌, యాంగిల్‌ వివరాలు నమోదవుతాయి. బంతి విసిరే సమయానికి ఉన్న వేగం, పిచ్‌పై బౌన్స్‌ అయ్యే ముందున్న వేగం, బౌన్స్‌ అయిన తర్వాత బంతి వేగాన్ని కూడా ఈ స్మార్ట్‌ బాల్‌ నమోదు చేయగలదు. 

ఇప్పటికిప్పుడు చూడలేం

అయితే ఈ స్మార్ట్‌ బాల్‌ను ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో వాడేంతగా పరీక్షించలేదు. ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉంది. వచ్చే కొన్ని నెలల వ్యవధిలో ఓ మేజర్‌ టీ20 టోర్నీలో ఈ స్మార్ట్‌ బాల్‌ను వాడాలని ఐసీసీ భావిస్తోంది. వచ్చే ఏడాదినాటికి ఈ స్మార్ట్‌బాల్‌ను ఐసీసీతోపాటు అన్ని క్రికెట్‌ బోర్డులకు ఇవ్వాలని కూకాబుర్రా నిర్ణయించింది. ఆ తర్వాత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో ఈ స్మార్ట్‌బాల్‌ను మనం చూడొచ్చు.

author

రచయిత: హరిప్రసాద్ శీలమంతుల, ఫ్రీలాన్స్ జర్నలిస్టు

Previous articleప్రీ ఓన్డ్ కార్ తో లాభ నష్టాలేంటి?
Next articleమంచి తల్లిదండ్రులుగా ఉండేందుకు మార్గాలు