UK student visa |యూకే స్టూడెంట్‌ వీసా ఎలా అప్లై చేసుకోవాలి?

graduation
Image by mohamed Hassan from Pixabay

UK student visa | యూకే స్టూడెంట్‌ వీసా పొందాలనుకుంటున్నవిద్యార్థులకు ఈ మధ్యే అక్కడి ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇంతకుముందు కోర్సు పూర్తయిన తర్వాత కేవలం నాలుగు నెలల వరకే ఈ వీసాపై యూకేలో ఉండే వీలుండేది. కానీ ఇప్పుడు దానిని రెండేళ్లకు పెంచారు. ఈ నిబంధన సడలింపుతో యూకే స్టూడెంట్ వీసాకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. యూకే ప్రభుత్వ నిర్ణయం ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా యూకే స్టూడెంట్‌ వీసా కోసం చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఊరట కలిగించింది.

యూకేలో అండర్‌గ్రాడ్యుయేషన్‌, ఆపై స్థాయి కోర్సులు చదివే విద్యార్థులకు ఉద్యోగాలపైనా ఎలాంటి ఆంక్షలు ఉండబోవని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా ఎలాంటి పరిమితి లేకుండా ఎంతమంది విదేశీ విద్యార్థులైనా స్టూడెంట్ వీసా కోసం అప్లై చేసుకునే వీలు కల్పించింది.

నిజానికి ఇంత వరకూ కోర్స్‌ పూర్తయిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవడానికి కేవలం నాలుగు నెలలే సమయం ఇచ్చే వాళ్లు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మరో కోర్సులో చదువు కొనసాగించడమో లేక వర్క్‌ వీసా కోసమో అప్లై చేసుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధనను 2012లో అప్పటి హోంమంత్రి థెరెసా మే తీసుకొచ్చారు. దీనివల్ల చాలామంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

కొత్తగా వచ్చిన రెండేళ్ల నిబంధన యూకే వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఎంతో మేలు చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో యూకే స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ల సంఖ్య పెరగనుంది. అలాంటి వాళ్లు ఈ UK student visaకు ఎలా అప్లై చేసుకోవాలి? అక్కడ మన విద్యార్థులకు ఉన్న అవకాశాలు ఏంటి? చదువు పూర్తయిన తర్వాత యూకేలోనే ఉండాలంటే ఎలాంటి వీసాలు అందుబాటులో ఉన్నాయన్న సమగ్ర సమాచారంతో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్టోరీ ఇది.

యూకే స్టూడెంట్ వీసా కావాలంటే..

ఏ ఇతర దేశానికి చెందిన విద్యార్థి అయినా యూకేలో చదవాలంటే ముందుగా టైర్‌ 4 స్టూడెంట్‌ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం యూకేలో ఫుల్‌టైమ్‌ యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రమే ఇస్తారు. షార్ట్ టర్మ్‌ లేదా లాంగ్వేజెస్‌ కోర్సులు నేర్చుకునే విద్యార్థులకు ఇవ్వరు. మరి ఈ వీసా ఎలా పొందాలి? దీనికి కావాల్సినవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

యూకే స్టూడెంట్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి?

యూకే స్టూడెంట్‌ వీసా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అయితే కేవలం యూకే బయట ఉన్న వాళ్లు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. యూకేలో ఉన్న వాళ్లు కచ్చితంగా వ్యక్తిగతంగా లేదా పోస్ట్‌ ద్వారా ఈ టైర్‌ 4 స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

యూకే స్టూడెంట్ వీసా దరఖాస్తు చేసుకునేందుకు ఉండాల్సిన అర్హతలు:

– టైర్‌ 4 లైసెన్స్‌ ఉన్న యూనివర్సిటీలో కోర్స్‌ ఆఫర్‌ వచ్చి ఉండాలి.
– ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
– మీ కోర్సు ఫీజుతోపాటు యూకేలో ఉండటానికి తగిన ఆర్థిక స్థోమత కలిగి ఉండాలి.

యూకే స్టూడెంట్ వీసా కోసం ఏ డాక్యుమెంట్స్‌ కావాలి?

టైర్‌ 4 స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కనీసం కొన్ని డాక్యుమెంట్లు కచ్చితంగా కలిగి ఉండాలి. అవి ఏంటంటే..

  1. పాస్‌పోర్ట్‌
  2. మీ కోర్సు ఫీజుతోపాటు యూకేలో ఉండటానికి అయ్యే ఖర్చులకు తగిన మొత్తం మీ దగ్గర ఉంది అని చెప్పడానికి తగిన ఆధారాలు.
  3. కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ ఫర్‌ స్టడీస్‌ (సీఏఎస్‌) రిఫరెన్స్‌ నంబర్‌.. ఇది పొందడానికి మీరు వాడిన డాక్యుమెంట్లు
  4. లేటెస్ట్‌ పాస్‌పోర్ట్‌ సైజ్‌ కలర్‌ ఫొటోగ్రాఫ్స్‌
  5. అసెస్‌మెంట్‌ డాక్యుమెంటేషన్‌
  6. ఒకవేళ మీ వయసు 18 ఏళ్ల లోపు ఉన్నా లేదా మీపై ఆధారపడిన వాళ్లు ఉన్నా వీటికి అదనంగా మరికొన్ని డాక్యుమెంట్స్‌ అవసరం అవుతాయి.
  7. ఇవి టైర్‌ 4 వీసాకు దరఖాస్తు చేయడానికి కావాల్సిన కచ్చితమైన డాక్యుమెంట్లు. ఇవి కాకుండా అదనంగా ఏమైనా అవసరమా అన్నది మీ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఐడీపీ) కౌన్సిలర్‌ను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇంగ్లిష్‌ సంగతేంటి?

యూకే స్టూడెంట్‌ వీసా పొందాలంటే.. మీకు ఇంగ్లిష్‌ భాషపై మంచి పట్టు ఉన్నట్లు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం సాధారణంగా యూకే వీసా అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ ఆమోదం పొందిన IELTS (ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌) టెస్ట్‌ పాసవ్వాలి. ఇది ఇంగ్లిష్‌ మాతృభాషగా లేని ఏ ఇతర దేశానికైనా వర్తిస్తుంది. ఏ దేశస్థులకైనా ఒకే రకమైన కంటెంట్‌, ఫార్మాట్‌లో ఈ IELTS టెస్ట్‌ ఉంటుంది. ఈ టెస్ట్‌ పాసైన తర్వాత యూకే ఎంబసీ లేదా కాన్సులేట్‌లో వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి కూడా హాజరవ్వాలి.

యూకే స్టూడెంట్ వీసా ఎప్పుడు అప్లై చేసుకోవాలి?

మీ కోర్సు ప్రారంభమయ్యే మూడు నెలల ముందు యూకే స్టూడెంట్‌ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీలో చదవడానికి మీరు అప్లికేషన్‌ పెట్టుకున్నారనుకోండి. వాళ్లు ఓకే అనుకుంటే.. మీకు ఓ కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ (సీఏఎస్‌) పంపిస్తారు. లేదంటే మీరే అడిగి తీసుకోవచ్చు. యూనివర్సిటీలో సీట్‌ వచ్చిదంటే.. మీరు యూకే వీసా తీసుకోవడానికి అర్హులైనట్లే. స్టూడెంట్‌ వీసా కోసం అప్లై చేసే సమయంలో ఈ సీఏఎస్‌ నంబర్‌ను దానికి జత చేయాలి. యూకే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ Gov.UK లోకి వెళ్లి మీరు ఈ స్టూడెంట్‌ వీసాను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

యూకే స్టూడెంట్ వీసా వీసాకు ఎంత ఖర్చవుతుంది?

మీ జాతీయతను బట్టే యూకే స్టూడెంట్‌ వీసా ఫీజులు ఆధారపడి ఉంటాయి. ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఇవి కూడా తరుచూ మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ ( https://visa-fees.homeoffice.gov.uk/y ) లో చెక్‌ చేసుకోవడం ఉత్తమం. ఇందులోకి వెళ్లి మీరు ఏ దేశం నుంచి అప్లై చేస్తున్నారు? ఏ టైప్‌ వీసా కావాలిలాంటి వివరాలు ఎంటర్‌ చేస్తే కచ్చితమైన ఫీజు తెలుస్తుంది. సాధారణంగా యూకే బయటి నుంచి టైర్‌ 4 స్టూడెంట్‌ వీసా కోసం అప్లై చేసుకుంటే.. 348 పౌండ్లు (సుమారు రూ. 31 వేలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక యూకేలోనే ఉండి చేసుకునే వాళ్లకు సర్వీస్‌ను బట్టి ఫీజు ఉంటుంది.
స్టాండర్డ్‌ సర్వీస్‌ – 457 పౌండ్లు
ప్రయారిటీ సర్వీస్‌ – 916 పౌండ్లు
ప్రీమియం సర్వీస్‌ – 1047 పౌండ్లు

చదువుతూ వర్క్‌ చేసుకోవచ్చా?

కచ్చితంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం యూకే స్టూడెంట్‌ వీసా రూల్స్‌ ప్రకారం.. చదువుతూ పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసుకునే వీలుంది. ప్రభుత్వం స్పాన్సర్‌ చేస్తున్న అంతర్జాతీయ విద్యార్థిగా యూకేలో కనీసం ఆరు నెలలు, అంతకన్నా ఎక్కువ గడువు ఉన్న కోర్స్‌ చదువుతుంటే.. వారానికి 20 గంటల వరకూ పని చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరు చదువుతున్న యూనివర్సిటీ యూకే గుర్తింపు యూనివర్సిటీల జాబితాలో ఉందో లేదో ముందుగానే చూసుకోండి. https://www.gov.uk/check-a-university-is-officially-recognised/recognised-bodies ఈ వెబ్‌సైట్‌పై క్లిక్‌ చేస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీల వివరాలు తెలుస్తాయి.

డిపెండెంట్స్‌ను తీసుకెళ్లొచ్చా?

యూకే స్టూడెంట్‌ వీసా ఉన్న వాళ్లు కూడా తమ వెంట డిపెండెంట్స్‌ను తీసుకెళ్లొచ్చు. ఇక్కడ డిపెండెంట్స్‌ అంటే మీ భర్త/భార్య, పిల్లలు మాత్రమే. పిల్లల వయసు 18 ఏళ్ల కన్నా తక్కువుండాలి. మిగతా బంధువులు ఎవరూ డిపెండెంట్స్‌ కిందికి రారు. దీనికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆరు నెలల కన్నా ఎక్కువున్న అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్స్‌ లేదా 12 నెలల కన్నా ఎక్కువున్న పీజీ కోర్స్‌ చదివే స్టూడెంట్స్‌కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

ఇక మీపై ఆధారపడిన వాళ్లు యూకే రావాలంటే అందుకు తగిన ఆర్థిక వనరులు చూపించాల్సి ఉంటుంది. ఇది కనీసం నెలకు 680 పౌండ్లు (సుమారు రూ. 60 వేలు)గా ఉంటుంది. అంటే వాళ్లకు ఓ ఆరు నెలలకు వీసా ఇచ్చారు అనుకోండి.. మీరు కనీసం 4080 పౌండ్లు (సుమారు రూ. 3.64 లక్షలు) ఆర్థిక వనరులు చూపించాలి. ఆ మొత్తం వాళ్ల దగ్గరున్నా లేక మీ దగ్గరున్నా ఓకే.

మీరు ఆరు నెలల కన్నా ఎక్కువ గడువున్న అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్స్‌ లేదా 12 నెలల కన్నా ఎక్కువ గడువున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్స్‌ చేస్తుంటే.. మీ డిపెండెంట్స్‌కు కూడా యూకేలో పని చేసే అవకాశం ఉంటుంది.

వర్క్‌ వీసా ఎలా?

మీ చదువులు పూర్తయిన తర్వాత కూడా యూకేలోనే కొంతకాలం ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీ వీసాను పొడిగించుకోవడానికి కొన్ని ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. కోర్సు అయిపోయిన తర్వాత మీ స్టూడెంట్‌ వీసా గడువు ముగిసే వరకూ మీరు యూకేలో ఫుల్‌టైమ్‌ జాబ్‌ చేసుకోవచ్చు. వీసా గడువు ముగిసిన తర్వాత మాత్రం పొడిగించుకోవాల్సిందే. కానీ దీనికి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి. అన్ని ఉద్యోగాలు చేసుకునే అవకాశం మీకు ఉండదు.

మీరు ఏయే జాబ్స్‌ చేయకూడదంటే..

– పర్మనెంట్‌ ఫుల్‌టైమ్‌ జాబ్‌
– ఫ్రీలాన్సర్‌ లేదా సొంత ఉద్యోగం
– శిక్షణలో ఉన్న డాక్టర్‌, కోచ్‌, స్పోర్ట్స్‌పర్సన్

కోర్సు పూర్తయిన తర్వాత యూకేలోనే ఉండాలంటే..

దీనికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటికోసం ఎలాంటి వీసాలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం..

టైర్‌ 4 డాక్టరేట్‌ ఎక్స్‌టెన్షన్‌ స్కీమ్‌

యూకేలో పీహెచ్‌డీ కోర్సు చివరి దశలో ఉన్న విద్యార్థులు దీనికి అర్హులు. ఒకవేళ వాళ్లు పీహెచ్‌డీ పూర్తయిన తర్వాత అక్కడే ఏదైనా జాబ్‌ చేయాలన్నా, బిజినెస్‌ ఏర్పాటు చేయాలనుకున్నా.. గరిష్ఠంగా 12 నెలల వరకు వీసాను పొడిగించుకునే వీలుంటుంది. అయితే ఈ వీసా పొందడానికి మీ యూనివర్సిటీ నుంచి స్పాన్సర్‌షిప్‌ అనేది తప్పనిసరిగా ఉండాలి.

టైర్‌ 2 (జనరల్‌)

యూకేలో పని చేయడానికి సాధారణంగా ఈ టైర్ 2 జనరల్‌ వీసానే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది పొందాలంటే.. టైర్‌ 2 లైసెన్స్‌ ఉన్న కంపెనీ మీకు ఉద్యోగం ఆఫర్‌ చేసి ఉండాలి. ఈ వీసా గడువు ఐదేళ్ల వరకు ఉంటుంది.

టైర్‌ 1 గ్రాడ్యుయేట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌

కోర్స్‌ తర్వాత యూకేలో ఏదైనా బిజినెస్‌ ప్రారంభించాలని అనుకుంటే ఈ టైర్‌ 1 వీసా ట్రై చేయొచ్చు. దీనికి ఏ స్పాన్సర్‌షిప్‌ అవసరం లేదు. అయితే యూనివర్సిటీ లేదా యూకే ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుమతి మాత్రం తప్పనిసరి. ఈ వీసా గడువు 12 నెలలు ఉంటుంది. దీనిని మరో 12 నెలలు పొడిగించుకోవచ్చు.

యూకే పూర్వీకులు (UK Ancestry)

ఒకవేళ మీ గ్రాండ్‌ పేరెంట్‌ యూకేలో జన్మించి ఉంటే.. ఈ వీసా తీసుకొని యూకేలో వర్క్‌ చేసుకోవచ్చు. ఈ వీసా గడువు ఐదేళ్లు ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం ఈ వీసాలు పొందాలంటే ముందుగా మీ యూనివర్సిటీ అక్కడి హోమ్‌ శాఖ కార్యాలయానికి ఓ లేఖ రాయాల్సి ఉంటుంది. మీ టైర్‌ 4 వీసా గడువు ముగిసినట్లుగా యూనివర్సిటీ ధృవీకరించాలి. https://visaguide.world/ లోకి వెళ్తే యూకే వీసాకు సంబంధించిన మొత్తం సమాచారం మీరు తెలుసుకోవచ్చు.

ఇండియన్స్‌ ఎక్కువగా వెళ్తున్న యూనివర్సిటీలు..

విదేశాలకు వెళ్లి చదవాలని అనుకుంటున్న ఇండియన్స్‌లో అత్యధికంగా యూకేనే ఎంచుకుంటున్నారు. ఇక్కడ అవకాశాలు కూడా ఎక్కువ కావడం దీనికి ఒక కారణం. పైగా ప్రపంచంలోని పది బెస్ట్‌ యూనివర్సిటీలలో నాలుగు యూకేలోనే ఉన్నాయి. అయితే యూకేలోని ప్రధానంగా కొన్ని యూనివర్సిటీలను ఇండియన్స్‌ ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. అవేంటో ఇక్కడ చూడండి

– సిటీ యూనివర్సిటీ, లండన్‌
– హెరియోట్‌-వాట్‌ యూనివర్సిటీ, ఎడిన్‌బర్గ్‌ (స్కాట్లాండ్‌)
– మిడిల్‌సెక్స్‌ యూనివర్సిటీ, లండన్‌
– ఎడిన్‌బర్గ్‌ నేపియర్‌ యూనివర్సిటీ, ఎడిన్‌బర్గ్‌
– స్వాన్‌సీ యూనివర్సిటీ, స్వాన్‌సీ
– యూనివర్సిటీ ఆఫ్‌ వోల్వర్‌హ్యాంప్టన్‌, వోల్వర్‌హ్యాంప్టన్‌
– బకింగ్‌హామ్‌షైర్‌ న్యూ యూనివర్సిటీ, హై వైకోంబ్‌
– కీల్‌ యూనివర్సిటీ, ఇంగ్లండ్‌
– స్టాఫర్డ్‌షైర్‌ యూనివర్సిటీ, స్టాఫర్డ్‌షైర్‌
– యూనివర్సిటీ ఆఫ్‌ చెస్టర్‌, చెస్టర్‌, నార్త్‌వెస్ట్‌ ఇంగ్లండ్‌

యూకే అడ్మిషన్‌ టైమ్‌లైన్‌

జులై-ఆగస్ట్‌ : మీకు నచ్చిన యూనివర్సిటీలు, ఆప్షన్లను వెతుక్కోవాలి
ఆగస్ట్‌: ప్రామాణిక టెస్ట్‌ కోసం రిజిస్టర్‌ చేసుకొని, టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది
సెప్టెంబర్‌ : మీ టెస్ట్‌ స్కోర్లు తెలుస్తుంది. అప్లికేషన్లు సిద్ధం చేసుకోవాలి.
సెప్టెంబర్‌- అక్టోబర్‌: దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టాలి
అక్టోబర్‌-నవంబర్‌: అప్లికేషన్ల ప్రక్రియ ముగుస్తుంది
జనవరి-ఫిబ్రవరి: మీ దరఖాస్తులకు కాలేజీలు రిప్లై ఇవ్వడం మొదలుపెడతాయి
మార్చి: యూకే వెళ్లడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి. స్కాలర్‌షిప్‌ల కోసం వెతకడం, లోన్ల కోసం అప్లై చేసుకోవడం లాంటివి.
మే-జూన్‌: యూకే స్టూడెంట్‌ వీసా కోసం అప్లై చేసుకోవాలి
సెప్టెంబర్‌ : యూకేకి వెళ్లడానికి సిద్ధం కావాలి
సెప్టెంబర్‌-అక్టోబర్‌ : కోర్సు మొదలయ్యే సమయం ఇదే.

స్కాలర్‌షిప్స్‌ ఎలా?

విదేశాల్లో చదువులంటే ఈ రోజుల్లో మాటలు కాదు. అందులోనూ యూకేలో ఈ ఖర్చులు కాస్త ఎక్కువే. ట్యూషన్‌ ఫీజు, అకామడేషన్‌ కలుపుకుంటే.. ఏడాదికి కనీసం తక్కువలో తక్కువ పది లక్షలైనా ఖర్చవుతాయి. అసలు టైర్‌ 4 స్టూడెంట్‌ వీసా పొందాలన్నా నెలకు ఖర్చులకు కనీసం రూ. లక్ష చూపించాల్సిందే. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల కొన్ని స్కాలర్‌షిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ స్కాలర్‌షిప్స్‌

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకనమిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ కోర్సులు చేయాలనుకునే వాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు. వయసు 35 ఏళ్లలోపే ఉండాలి. ప్రతి ఏటా జనవరి మధ్యలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తారు.

ఆక్స్‌ఫర్డ్‌ అండ్‌ కేంబ్రిడ్జ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌

30 ఏళ్లలోపు ఉన్న భారతీయ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు. కేంబ్రిడ్జ్‌ లేదా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌, సెకండ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ స్టడీ లేదా ఏ సబ్జెక్ట్‌పై అయినా రీసెర్చ్‌ చేయాలి అనుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య అప్లై చేసుకోవాలి.

ఇన్‌లాక్స్‌ స్కాలర్‌షిప్స్‌ (Inlaks Scholarships)

ఇది కూడా ఇండియన్‌ స్టూడెంట్స్‌ కోసమే. ఏదైనా సబ్జెక్ట్‌లో రీసెర్చ్‌, ట్రైనింగ్‌ లేదా ప్రొఫెషనల్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కోర్స్‌ చేయాలనుకున్న వాళ్లకు వర్తిస్తుంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో దీనికి అప్లై చేసుకోవచ్చు.

ఫీలిక్స్‌ స్కాలర్‌షిప్స్‌ (Felix Scholarships)

యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌, స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌)లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ చదివే భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ ఇస్తారు. నవంబర్‌ నుంచి జనవరి మధ్య దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాట్లాండ్స్‌ సాల్టైర్‌ స్కాలర్‌షిప్స్‌

స్కాట్లాండ్‌లోని ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా ఏడాది ఫుల్‌టైమ్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌, మాస్టర్స్‌, పీహెచ్‌డీ కోర్సులు చేసే వాళ్లకు ఇస్తారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు.

ద గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ స్కాలర్‌షిప్స్‌

అండర్‌గ్రాడ్యుయేషన్‌, పీజీ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే వీలుంది. సెప్టెంబర్‌, డిసెంబర్‌ మధ్య కాలంలో అవకాశం కల్పిస్తారు.

యూకే స్టూడెంట్‌ వీసా గురించి తెలుసుకున్నారు కదా.. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మీ మిత్రులు, బంధువులతో షేర్ చేయగలరు.

ఇవి కూడా చదవండి

Previous articleమీ పిల్లలు మొబైల్ ఎక్కువ చూస్తున్నారా?
Next articleకోవర్కింగ్‌ స్పేస్‌ .. స్టార్టప్ ఫ్రెండ్లీ