10 జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు.. మీకోసం

job oriented courses
Image by Alexas_Fotos from Pixabay

జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు.. వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? మనలో చాలా మందిలో ఒక అభిప్రాయం నాటుకుపోయి ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కావాలంటే ఏ ఇంజినీరింగో, ఎంసీయేనో చేస్తే సరిపోతుంది. టీచర్‌ జాబ్‌ కావాలా.. డీఎడ్‌ లేదా బీఎడ్‌ ఎంచుకోండి.. డాక్టర్‌ కావాలంటే ఎంబీబీఎస్‌, లాయర్‌ కావాలంటే లా, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ఎంబీఏ.. ఇలా కేవలం ఉద్యోగం వస్తే చాలు.. లైఫ్‌లో ఎందుకు రిస్క్‌ అనుకుంటూ సాంప్రదాయ కోర్సులకే చాలా మంది పరిమితమవుతున్నారు.

ఫలితంగా సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లకో లేక ప్రభుత్వ ఉద్యోగాలకో విపరీతమైన కాంపిటిషన్‌ ఉంటోంది. దీనిని తట్టుకొని నిలబడలేని వాళ్లు తమకు ఇష్టం లేని ఏదో ఒక చిన్న ఉద్యోగమో లేక మరేదైనా వ్యాపారమో చేసుకుంటున్నారు. తరాలు మారుతున్నా ఈ సాంప్రదాయ కోర్సులను వదలడం లేదు. కానీ ఒక్కసారి ఈ సాంప్రదాయేతర కోర్సుల వైపు చూడండి.. కోర్సు పూర్తవగానే జాబ్‌ పక్కాగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే వీటిని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు అని అంటున్నాం.

పైగా సొసైటీలో మీకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. ఇంటికో ఇంజినీర్‌ ఉన్న ఈ కాలంలో.. మళ్లీ అవే రొటీన్‌ బీటెక్‌లు, ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు అవసరమా? కాస్త కొత్తగా ఆలోచించండి.. జాబ్‌ పట్టేయండి.

ఎందుకీ అన్‌కన్వెన్షనల్‌ కోర్సులు?

కాలంతోపాటు సమాజంలోనూ ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పును ముందుగానే గుర్తించి, దానిని ఆహ్వానించిన వాళ్లు ముందడుగు వేయగలుగుతారు. లేదంటే అలాగే వెనుకబడిపోతారు. అలా మార్పు కోరుకుంటున్న వాళ్లు ఉన్నారు కాబట్టే.. ఈ సాంప్రదాయేతర కోర్సులు ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. పైగా ఇలాంటి కోర్సులు చేస్తున్న వాళ్లు చాలా తక్కువ. దీంతో వీరికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటోంది. ప్రత్యేకమైన నైపుణ్యం మీ దగ్గర ఉండటం వల్ల మీ డిమాండ్‌ ఎప్పటికీ తగ్గదు. మంచి మంచి జీతాలతో కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది.

వాళ్లను పట్టించుకోకండి

అసలు ఈ సాంప్రదాయేతర కోర్సులు అనగానే ఇటు ఇంట్లో వాళ్లు, అటు ఫ్రెండ్స్‌ భయపెడుతుంటారు. అవి ఎలా ఉంటాయో తెలియదు, ఎందుకు రిస్క్‌ చేయడం అంటారు. ఏ డిగ్రీయో, బీటెక్కో చేసుకుంటే చిన్న ఉద్యోగమైనా వస్తుంది కదా, లైఫ్‌ సెటిలైపోతుంది అన్న సలహాలు కూడా ఇస్తుంటారు. కానీ అలాంటి వాటిని పట్టించుకోకండి. ఇవి వందకు వంద శాతం మిమ్మల్ని సొసైటీలో యూనిక్‌గా నిలబెడతాయి.

మీకంటూ ప్రత్యేక గుర్తింపునిస్తాయి. పైగా ఇలాంటి కోర్సులు విదేశాల్లో చాలా కామన్‌. అక్కడ వీటిని సాంప్రదాయ కోర్సులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దేశాల్లో చాలా మంది ఇలాంటి వాటినే ఇష్టపడతారు. ఆ లెక్కన మీరు చేసే కోర్సులకు విదేశాల్లోనూ అవకాశాలు ఉంటాయి. మరి ఆ సాంప్రదాయేతర కోర్సులు ఏంటి? జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు ఇండియాలో ఎక్కడ అందుబాటులో ఉన్నాయో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న ఈ స్టోరీలో తెలుసుకోండి.

ఎథికల్‌ హ్యాకింగ్‌

హ్యాకింగ్‌ అంటే ఇల్లీగల్‌. సైబర్ నేరాలకు ఊతమిస్తున్నదే ఈ హ్యాకింగ్‌. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు.. హ్యాకింగ్‌కు హ్యాకింగ్‌తోనే చెక్‌ పెట్టడం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. ఇందులో మీరూ హ్యాకింగ్‌ చేస్తారు. అయితే అది ఇల్లీగల్‌గా కాదు.. లీగల్‌గానే. హ్యాకర్లు ఎన్ని రకాలుగా హ్యాకింగ్‌ చేసే వీలుందో కనిపెట్టి, వాటికి పరిష్కారాలు చెప్పడమే ఈ ఎథికల్‌ హ్యాకర్ల పని. దీనివల్ల సదరు సంస్థ తమ భద్రతా ప్రమాణాలను మరింత మెరుగు పరుచుకునేందుకు వీలు కలుగుతుంది.

ఈ కోర్సుకు కోల్‌కతాలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ చాలా ఫేమస్. ఇక్కడ ఐటీ సెక్యూరిటీపై విద్యార్థులకు లోతైన బోధన ఉంటుంది. నిజానికి ఈ ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సులు హైదరాబాద్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. టెక్‌ మార్షల్స్‌ (క్లాస్‌రూమ్‌, ఆన్‌లైన్‌), జూమ్‌ టెక్నాలజీస్ (క్లాస్‌రూమ్‌), హ్యాకర్స్‌ స్కూల్ (క్లాస్‌రూమ్‌), ఈ మార్షల్స్‌ ఇన్ఫోటెక్‌ (ఆన్‌లైన్‌, క్లాస్‌రూమ్‌)లాంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఎథికల్ హ్యాకింగ్‌పై కోర్సులను నిర్వహిస్తున్నాయి. జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల్లో డిమాండ్ ఉన్న కోర్సు.

ఫుడ్‌ టెక్నాలజీ

ఫుడ్‌ అంటే ఇష్టమా? రకరకాల ఫుడ్ టేస్ట్‌ చేయడం మీకు అలవాటా.. అయితే ఈ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు చేసి.. దాన్నే ఓ కెరీర్‌గా మలుచుకోండి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలో మీకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ పెరిగిపోతున్న ఈ కాలంలో.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు చాలా పుట్టుకొస్తున్నాయి.

అందులో ఆహారాన్ని మరింత క్వాలిటీతో ఎలా ప్రాసెస్‌ చేయాలి? ఎలా నిల్వ చేయాలి? ఎలా ప్యాకింగ్‌ చేయాలన్నదానిపై ప్రధానంగా ఈ కోర్సు దృష్టి సారిస్తుంది. ఇందులో పీజీ చేయగలిగితే.. చాలా అవకాశాలు ఉంటాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలతోపాటు రీసెర్చ్‌ లేబొరేటరీస్‌, హోటెల్స్, సాఫ్ట్ డ్రింక్‌ ఫ్యాక్టరీలు, క్వాలిటీ కంట్రోల్‌, రైస్‌ మిల్స్‌, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి.

హైదరాబాద్‌లో ప్రధానంగా మూడు కాలేజీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ, జోగినపల్లి బీఆర్ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఫోరెన్సిక్‌ సైన్సెస్‌

నేరాల గుట్టు తెలుసుకోవడంలో ఫోరెన్సిక్‌ ప్రముఖ పాత్ర పోసిస్తుందన్న సంగతి తెలుసు కదా. అయితే దురదృష్టవశాత్తూ.. మన దేశంలో ఫోరెన్సిక్‌ నిపుణుల కొరత చాలా ఉంది. దీంతో చాలా వరకు నేరాల్లో నిందితులు తప్పించుకుంటున్నారు. అందుకే ఈ మధ్య ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఇండియన్ ఆర్మీతోపాటు పోలీసులకు కూడా ఫోరెన్సిక్‌ నిపుణుల అవసరం చాలా ఉంది.

బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ కోర్స్‌ చేస్తే ఈ రంగంలో మంచి అవకాశాలు ఉంటాయి. మంచి జీతంతోపాటు సమాజంలో గౌరవం కూడా ఉంటుంది. ఈ కోర్సును అందించే కాలేజీలు హైదరాబాద్‌లోనూ చాలానే ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇక్ఫాయ్‌ లా కాలేజ్‌తోపాటు రాజా బహదూర్ వెంకట్‌రాంరెడ్డి వుమెన్స్‌ కాలేజ్‌ బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేయొచ్చు.

జెనెటిక్స్‌

మైక్రోబయాలజీ ఫీల్డ్‌కు చెందిన కోర్సు ఇది. లైఫ్‌ సైన్సెస్‌ లేదా బయోటెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న వాళ్లు జెనెటిక్ ఎక్స్‌పర్ట్స్‌గా ఉంటారు. మనిషి జన్యువులపై అధ్యయనం చేసే శాస్త్రమిది. మనిషి జీన్స్‌లో వస్తున్న మార్పులు, లోపాలు, వైవిధ్యాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జెనెటిక్స్‌కు ఇండియాలో క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది.

మెడిసిన్‌ ఫీల్డ్‌కు దగ్గరగా ఉండే సబ్జెక్ట్‌ కావడంతో జెనెటిక్‌ ఎక్స్‌పర్ట్స్‌గా స్థిరపడితే సంపాదన బాగానే ఉంటుంది. బీఎస్సీ తర్వాత అడ్వాన్స్‌డ్‌ జెనెటిక్స్‌, లైఫ్‌సైన్సెస్‌ కోర్సులు చేస్తే బాగుంటుంది. హైదరాబాద్‌లో అరోరా, భవన్స్‌, లయోలా వంటి కాలేజీలు జెనెటిక్స్‌తో కూడిన బీఎస్సీ కోర్సులను అందిస్తున్నాయి.

ఆల్కహాల్‌ టెక్నాలజీ

పేరు చూసి ఇంకేదో ఊహించుకోకండి. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న సాంప్రదాయేతర కోర్సుల్లో ఇదీ ఒకటి. పుణెలోని వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీఎస్‌ఐ) ఈ కోర్సును అందిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో షుగర్‌ ఇండస్ట్రీ కోసం అక్కడి చెరుకు రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార సంస్థ ఇది. వీళ్లకు ఓ ఆల్కహాల్‌ టెక్నాలజీ విభాగం కూడా ఉంది.

డిస్టిలరీ ఇండస్ట్రీకి పనికొచ్చే టెక్నాలజీని అందించే దిశగా ఈ ఇన్‌స్టిట్యూట్‌ కృషి చేస్తోంది. కొత్త టెక్నాలజీ ఆధారంగా ఈ ఇండస్ట్రీలో ఉత్పత్తిని పెంచడమే వీరి లక్ష్యం. ఈ విభాగం మూడు రకాల కోర్సులను అందిస్తోంది. రెగ్యులర్‌ కోర్సుతోపాటు షార్ట్‌ టర్మ్‌, జాతీయ స్థాయిలో వర్క్‌షాప్స్‌, సెమినార్లు నిర్వహిస్తోంది. ప్రత్యామ్నాయ ముడి సరుకుల సాయంతో తక్కువ ఖర్చులో ఆల్కహాల్‌ ఉత్పత్తిని పెంచే టెక్నాలజీపై విద్యార్థులు రీసెర్చ్‌ చేయాల్సి ఉంటుంది.

ఈనాలజీ (Oenology) అనే మరో కోర్సు కూడా ఇలాంటిదే. కొత్త కొత్త పద్ధతులు, పదార్థాలు ఉపయోగించి.. వివిధ ద్రాక్ష పళ్ల నుంచి నాణ్యమైన వైన్‌ను తయారు చేసేందుకు ఉపయోగించే సైన్స్‌ ఇది. దేశంలో ఉన్న ప్రముఖ వైన్‌ తయారీ సంస్థలు ఈ ఈనాలజిస్టులను తీసుకుంటున్నాయి. మీరూ ఇనాలజిస్ట్‌గా మారాలని అనుకుంటే.. బీఎస్సీ వైన్‌ టెక్నాలజీ కోర్సు చేస్తే బాగుంటుంది.

టీ టేస్టింగ్‌

కాస్త అలసిపోయినట్లు అనిపించినపుడు ఓ టీ తాగితే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అలాంటి టీకి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. అందుకే టీ తయారీకి పెద్ద పెద్ద సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. అయితే ఇక్కడ టీకి టేస్ట్‌ అన్నది చాలా ముఖ్యం. అదే మార్కెట్‌లో కంపెనీని ముందు వరుసలో నిలబెడుతుంది.

ఇక్కడే టీ టేస్టర్స్‌ కీలకపాత్ర పోషిస్తారు. వీళ్లు కేవలం సదరు కంపెనీ టీ టేస్ట్‌ చేయడమే కాదు.. దానిని ఎలా మరింత క్వాలిటీగా తయారు చేయాలో సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం తేయాకు పండించడం నుంచి తయారీ వరకు పూర్తి అవగాహన ఉండాలి.

దీనికోసమే ప్రత్యేకంగా కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. కోల్‌కతాలోని ద టీ రీసెర్చ్‌ అసోసియేషన్‌, అస్సాం అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌, కోల్‌కతాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యూచరిస్టిక్‌ స్టడీస్ ఈ టీ టేస్టింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి.

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌

ఈ సాంప్రదాయేతర కోర్సుకు కూడా ఇప్పుడు మార్కెట్‌లో మండి డిమాండ్‌ ఉంది. రోజు రోజుకూ ప్రపంచంలో పెరిగిపోతున్న చెత్త మానవ మనుగడకే పెను ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా మన దేశంలో ప్రతి ఏటా 5.2 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.

దీనివల్ల నీరు, గాలి, నేల కాలుష్యమవుతున్నాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం.. ఘన వ్యర్థాల నిర్వహణ. ఇక్కడే ఈ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అవసరం చాలా ఉంది.

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. భోపాల్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ దీనికి సంబంధించిన కోర్సులు అందిస్తోంది.

యూఏవీ పైలట్‌, డ్రోన్‌ టెక్నాలజీ

అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికిల్స్‌ లేదా డ్రోన్స్‌కు ఇండియాలో ఇప్పుడు డిమాండ్‌ పెరిగిపోతోంది. నిజానికి వీటిని చాలా రోజుల వరకు రక్షణ కోణంలోనే ఉపయోగించారు. అయితే ఈ మధ్య ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు కూడా ఫొటోలు, వీడియోల కోసం విరివిగా డ్రోన్లను వాడుతున్నాయి.

అమెజాన్‌లాంటి సంస్థలు వేగవంతమైన డెలివరీ కోసం కూడా ఈ డ్రోన్లను వినియోగిస్తుండటం విశేషం. దీంతో ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేసే వాళ్లకు కూడా మార్కెట్‌లో బాగానే డిమాండ్‌ ఉంది. యూఏవీ పైలట్‌ లేదా డ్రోన్‌ టెక్నాలజీ కోర్సు చేస్తే మంచి కెరీర్‌ మీ సొంతమవుతుంది.

హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రోన్స్‌లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్‌ కూడా ఇస్తారు. రెండు కిలోల నుంచి 25 కిలోల బరువున్న డ్రోన్లను ఎలా ఆపరేట్‌ చేయాలో ఈ కోర్సుల్లో నేర్పుతారు.

మెటరాలజీ

వాతావరణాన్ని అంచనా వేసే విభాగమిది. మెటరాలజిస్టులకు ఈ మధ్య బాగా డిమాండ్ ఏర్పడింది. వెదర్‌ ఫోర్‌క్యాస్ట్‌ చేయడం ఒక్కటే కాదు.. వీళ్లకు వివిధ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద టీవీ చానెల్స్‌లో ప్రజెంటర్‌గానూ చేరొచ్చు. ఎయిర్‌లైన్స్‌, షిప్పింగ్ కంపెనీలు కూడా వాతావరణాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా మీటియొరాలజిస్టులను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. ఇక ఆయిల్‌, గ్యాస్‌లను అన్వేషించే సంస్థల్లో అయితే వీళ్లకు మరింత ఎక్కువ డిమాండ్‌ ఉంది.

హైదరాబాద్‌లోని జేఎన్టీయూ దీనిపై రెండేళ్ల వ్యవధి ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును అందిస్తోంది. ఎమ్మెస్సీ శాటిలైట్‌ మీటియొరాలజీ అండ్‌ వెదర్‌ ఇన్ఫర్మేటిక్స్‌ పేరుతో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

ఆర్కియాలజీ

తెలుగులో పురాతత్వ శాస్త్రం అంటారు. తవ్వకాలు జరిపి పురాతన నాగరికతలను వెలికి తీయడం ఈ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ పని. వీటిపై ఆసక్తి ఉన్న వాళ్లు ఆర్కియాలజీ కోర్సు చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ ఉంటుంది. ఏన్షియంట్‌ ఇండియన్‌ హిస్టరీ, కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ పేరుతో కోర్సు అందుబాటులో ఉంది. 

జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు కథనం మీకు నచ్చితే షేర్ చేయడం మరిచిపోకండి.

ఇవీ చదవండి

♦ యూత్ మెచ్చే యాప్ తో డబ్బు సంపాదించండి

♦ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌.. బెస్ట్‌ వెబ్‌సైట్స్‌, యాప్స్‌ ఇవే..

Previous articleటెల్ మీ అబౌట్ యువర్‌ సెల్ఫ్‌? అని అడిగితే ఏం చెప్పాలి?
Next articlepregnancy symptoms in telugu: ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులకు తెలుస్తుంది ? గర్భ ధారణ లక్షణాలు ఏంటి?