న్యూ పేరెంట్స్ బడ్జెట్ ప్లాన్ సిద్ధం చేయండిలా

new parents
Image by Suchart Sriwichai from Pixabay

న్యూ పేరెంట్స్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటారా? మన పేరెంట్స్‌ బాధ, బాధ్యత మనం పేరెంట్స్‌ అయిన తర్వాతే తెలుస్తాయి అంటారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందటం ఆనందాన్నిచ్చేదే. కానీ ఆ ప్రమోషన్‌తోపాటు వచ్చే బాధ్యత, భారాలను సమర్థంగా మోయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ పూర్తిగా మనపై ఆధారపడే ఓ కొత్త మనిషి మన జీవితంలోకి వస్తున్నపుడు ఊహించని మార్పులు సహజం.

వాటికి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సిద్ధమవడం అన్నది చాలా ముఖ్యం. లేదంటే కుటుంబమనే పడవలో కుదుపులు తప్పవు. అప్పటికే ఇద్దరున్న ఓ కుటుంబంలో మరో వ్యక్తి వచ్చి చేరుతాడు.. అంతే కదా అని చాలా మంది అనుకుంటారు.

కానీ ఈ కాలంలో పిల్లలను కని, పెంచి, ఉన్నత చదువులు చెప్పించి, వాళ్లు జీవితంలో నిలదొక్కుకునేలా చేయడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో తెలుసు కదా. అందుకే కాబోయే పేరెంట్స్‌.. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసిన మరుక్షణం నుంచే ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. డెలివరీకి ముందు, తర్వాత ఆర్థికంగా మీ జీవితంలో వచ్చే మార్పులు, దానికి మీరు సిద్ధమవ్వాల్సిన తీరుపై డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్టోరీ ఇది.

తొలి రోజు నుంచే సేవింగ్స్‌

న్యూ పేరెంట్స్ బడ్జెట్ ప్లాన్ ఎప్పుడు చేసుకోవాలి? గర్భం దాల్చిన తొలి రోజు నుంచీ డెలివరీ వరకే హాస్పిటల్‌ ఖర్చులు లక్షలు దాటుతున్న రోజులివి. రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్స్‌, స్కానింగ్‌లు, మందులు, ఆ తర్వాత డెలివరీకి కలిపి కొన్ని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో లక్ష నుంచి రెండు లక్షల వరకు ఖర్చువుతున్నాయి.

ఆ లెక్కన పది నెలల్లోనే మీ బడ్జెట్‌ అంతా తారుమారవుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎలాగూ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ ఉంటుంది. అందులో మెటర్నిటీ బెనిఫిట్‌ ఉంటే కనీసం డెలివరీ ఖర్చులైనా మిగులుతాయి.

ముందు ఎంప్లాయర్ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌లో మెటర్నిటీ బెనిఫిట్‌ ఉందా లేదా.. ఉంటే ఎంత కవరేజీ ఉందో తెలుసుకోవడం మంచిది. బయట ప్రైవేట్‌గా తీసుకున్న ఇన్సూరెన్స్‌ పాలసీల్లో మెటర్నిటీని అన్నీ కవర్‌ చేయడం లేదు.

ఒకవేళ చేసినా వెయిటింగ్ పీరియడ్‌ కనీసం రెండు నుంచి మూడేళ్ల వరకు ఉంటోంది. చివరికి ఏ ఇన్సూరెన్సూ కవర్‌ కాకపోతే.. అప్పటి వరకు మీరు మరో పని కోసం దాచుకున్న డబ్బును దీనికోసం ఖర్చు చేయాల్సి వస్తుంది.

అలా కాకుండా మీరు పిల్లల కోసం ప్లాన్‌ చేసుకున్నప్పటి నుంచే నెలవారీ చెకప్స్‌, మందులు, స్కానింగ్‌లకు అయ్యే ఖర్చు కోసం ప్రత్యేకంగా సేవింగ్స్‌ చేసుకుంటే మంచిది.

దీనికి అదనంగా ఓ ఎమర్జెన్సీ ఫండ్‌ను కూడా సిద్ధం చేసుకోవాలి. అది కూడా డెలివరీకి ముందే. మీకు బిడ్డ పుట్టగానే ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మెడికల్‌ ఖర్చుల కోసం తీసిపెట్టిన డబ్బుకు అదనంగా ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ ఉంటే డెలివరీ తర్వాత ఆర్థికపరమైన చికాకులు ఉండవు.

బడ్జెట్‌లో మార్పులు తప్పవు

బిడ్డ పుట్టిన తర్వాత మీ బడ్జెట్‌లో కొన్ని మార్పులు తప్పవు. మీ ఖర్చులు కనీసం పది శాతమైనా పెరుగుతాయని గుర్తుంచుకోండి. అందులోనూ మీ తొలి సంతానం అయితే ఖర్చులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. మీ ముద్దుల చిన్నారి కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. అందువల్ల దానికి తగినట్లు ముందుగానే బడ్జెట్‌ తయారు చేసుకోవడం మంచిది.

డైపర్ల నుంచి బేబీ పౌడర్లు, సబ్బులు, ఆయిల్స్‌, లోషన్లకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక అర్బన్‌ ఏరియాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే ఖర్చులు పోను కొన్ని సేవింగ్స్ అయినా ఉంటాయి. కానీ డెలివరీ సమయంలో ఇది కుదరదు.

బిడ్డ పుట్టడానికి కొన్ని నెలల ముందు నుంచి ఆ తర్వాత కొన్ని నెలల వరకు ఒకరి జీతంతోనే ఇల్లు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి వాళ్లు మెటర్నిటీ లీవ్‌ దగ్గరి నుంచి ఆ కొన్ని నెలల పాటు ఒకే జీతంతో ఎలా గడపాలన్నది చాలా ముందుగానే ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దీనికోసం ఓ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. మెటర్నిటీ లీవ్‌ పెట్టడానికి కొన్ని నెలల ముందు నుంచే మీ భార్య జీతం మొత్తం సేవింగ్స్‌లోకి మళ్లించండి. దీనివల్ల ఒకే జీతంతో గడపడం అలవాటు అవుతుంది. పైగా ఈ సేవింగ్స్‌ అన్నీ డెలివరీ తర్వాత మీకు ఎమర్జెన్సీ ఫండ్‌లాగా కూడా పనికొస్తాయి.

ఇక పాప లేదా బాబు పుట్టిన వెంటనే వాళ్ల పేరును మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లో నమోదు చేయించడం మరచిపోకండి. ఎంప్లాయర్‌ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే.. ఆటోమెటిగ్గా పుట్టిన వెంటనే వాళ్లకూ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే మాత్రం ఈ పని చేయాల్సిందే. తొలి రోజే తల్లి పేరుతో బిడ్డను ఇన్సూరెన్స్‌ లిస్ట్‌లో యాడ్‌ చేస్తారు. పేరు పెట్టిన తర్వాత దానిని మార్చుకుంటే సరిపోతుంది.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఉండాల్సిందే..

మన దేశంలో ఇప్పటికీ చాలా మంది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అవసరమా అన్నట్లుగానే ఆలోచిస్తారు. అనవసరంగా అంత డబ్బు పోసి పాలసీ తీసుకోవడం వేస్ట్‌ అన్న ఫీలింగ్‌ చాలా మందిలో ఉంటుంది. కానీ మీ భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు మీపై ఆర్థికంగా ఆధారపడుతున్నారు అంటే.. మీరు కచ్చితంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సిందే అని గుర్తుంచుకోండి.

ఏవైనా ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేది ఈ ఇన్సూరెన్సే. దీనికోసం నెలకు కొంత మొత్తం చెల్లించడంలో తప్పేమీ లేదు. అనవసరమైన వాటిపై మనం ఎంతో ఖర్చు చేస్తుంటాం. అంతకంటే ఎంతో తక్కువ మొత్తాల్లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. నెలకు ఎంత మొత్తం చెల్లించాలి అన్నది చాలా అంశాలపై ఆధారపడుతుంది. మీ కుటుంబానికి ఎలాంటి పాలసీ అవసరమో ఎంచుకోండి.

స్కూలు ఫీజుల కోసం ఇలా చేయండి

ఈ రోజుల్లో నాణ్యమైన చదువు కోసం ఎంతగా ఖర్చు చేయాల్సి వస్తుందో మనకు తెలుసు. అందులోనూ పిల్లల చదువు విషయంలో అసలు రాజీ పడే పరిస్థితే ఉండదు. మీకు నచ్చిన స్కూల్లో అడ్మిషన్‌ కావాలంటే బిడ్డ పుట్టినప్పటి నుంచే అందుకు తగినట్లు ప్లాన్‌ చేసుకోవాల్సిందే.

ముఖ్యంగా మెట్రో నగరాల్లో అయితే స్కూలు ఫీజులు ఏడాదికి కనీసం రూ. 50 వేల నుంచి నాలుగు లక్షల వరకూ ఉంటున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే డే కేర్‌, ప్రీ స్కూల్‌ కోసమే ఏడాదికి కనీసం లక్ష వరకైనా ఖర్చు చేయాల్సి వస్తోంది.

బిడ్డ పుట్టిన రెండు, మూడేళ్ల తర్వాత ఈ ఖర్చులు వస్తాయని ముందే తెలుసు. కాబట్టి ఇప్పటి నుంచే దాని కోసం డబ్బులు జమ చేసుకుంటే మంచిది. దీనికోసం సింపుల్‌గా రికరింగ్‌ డిపాజిట్‌ చేయడమో లేదంటే సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) తీసుకోవడం బెటర్‌.

పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న మొత్తాలను జమ చేస్తూ మనకు అవసరమైన సమయానికి చేతికి డబ్బు అందించే ప్లాన్స్‌ ఇవి. ముఖ్యంగా సిప్‌ ద్వారా మీకు వారం, నెల లేదా మూడు నెలలకోసారి ఎంతో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ కల్పిస్తున్నాయి. పిల్లలను స్కూల్లో చేర్పించే సమయానికి ఈ డబ్బు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

సేవింగ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయండి

బిడ్డ పుట్టిన తొలి రోజే వాళ్ల పేరు మీద ఓ సేవింగ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడమన్నది చాలా మంచి పని. దాదాపు అన్ని బ్యాంకులూ ఇప్పుడీ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఐసీఐసీఐనే తీసుకోండి.. తొలి రోజు నుంచి 18 ఏళ్ల వయసు వరకు యంగ్‌ స్టార్స్ పేరుతో పిల్లలకు సేవింగ్‌ అకౌంట్‌ ఇస్తోంది. సాధారణంగా బిడ్డ పుట్టిన కొన్ని నెలలు, సంవత్సరాల వరకు స్నేహితులు, బంధువులు వాళ్లకు డబ్బు రూపంలో బహుమతులు ఇస్తూనే ఉంటారు.

బారసాల నుంచి బర్త్‌ డేల వరకు ఇలా మనకు తెలియకుండా కనీసం కొన్ని వేల రూపాయల డబ్బు వస్తుంటుంది. ఈ డబ్బు ఇంట్లో ఉంటే ఎలా ఖర్చయిపోతుందో కూడా తెలియదు. అందువల్ల ఈ మొత్తాన్ని వాళ్ల సేవింగ్‌ అకౌంట్‌లో వేసేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. ఈ సేవింగ్ అకౌంట్‌ నుంచే పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్లు కూడా చేసుకోవచ్చు.

వాళ్ల ఉన్నత చదువుల కోసం ఈ ఇన్వెస్టుమెంట్లు ఉపయోగపడతాయి. మన దగ్గర తక్కువే కానీ.. బయటి దేశాల్లో ఈ సేవింగ్‌ అకౌంట్‌ అన్నది దాదాపు ప్రతి పుట్టిన పిల్లాడికీ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ల అకౌంట్‌ను వాళ్లే మెయింటేన్‌ చేసుకునే అవకాశం ఇస్తే.. బ్యాంకింగ్‌, పర్సనల్‌ ఫైనాన్స్‌ అంశాలపై కూడా వాళ్లకు అవగాహన కలుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా సేవింగ్స్‌ ప్రాధాన్యతను వాళ్లకు తెలిసేలా చేస్తుంది.

బట్టలు, బొమ్మల జోలికి వెళ్లొద్దు

బిడ్డ పుట్టగానే ఎక్కడలేని ఆనందంతో చాలా మంది ఏవేవో కొనేస్తుంటారు. అందులోనూ తొలి సంతానమైతే ఇక హద్దే ఉండదు. బొమ్మలు, బట్టలపై విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. కానీ ఇక్కడే కాస్త ఆగండి. అవి మీ చిన్నారికి ఎంత వరకు ఉపయోగపడతాయో ఆలోచించండి. కొన్ని నెలల వరకు పిల్లలు రోజంతా దాదాపు నిద్రలోనే ఉంటారు.

తొలి ఏడాదిలో వాళ్ల గ్రోత్‌ రేట్‌ చాలా వేగంగా ఉంటుంది. ఏడాది గడిచేసరికి మీరు కొన్న వాటిలో చాలా వరకు మీ పిల్లలకు పనికి రాకుండా పోతాయి. పైగా పిల్లాడు పుట్టినప్పటి నుంచీ ఇంటికి వచ్చే స్నేహితులు, బంధువులు బట్టలో, బొమ్మలో తెస్తూనే ఉంటారు. మీరూ వాటిపైనే ఖర్చు చేయడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదని గుర్తుంచుకోండి. అందువల్ల పిల్లల అవసరాలకు తగినట్లు ఒకటి వెంట ఒకటి కొనండి.

ఎమర్జెన్సీ కిట్‌ తప్పనిసరి

పుట్టిన పిల్లలకు కొన్నేళ్ల వరకు ఏవో చిన్న చిన్న జబ్బులు తరచూ వస్తూనే ఉంటాయి. ఇవి చాలా కామన్‌. కానీ ఇలా వచ్చిన ప్రతిసారీ డాక్టర్‌ దగ్గరికి వెళ్లడం వల్ల మీ డబ్బు, సమయం ఖర్చయిపోతాయి. అలా చేయడం కంటే మీ బిడ్డ కోసం ప్రత్యేకంగా ఓ ఎమర్జెన్సీ కిట్‌ను సిద్ధంగా ఉంచుకుంటే మంచిది. సాధారణ జ్వరం, జలుబు, కడుపు నొప్పి, పంటి నొప్పి, విరేచనాలకు వాడే మందులను ఈ కిట్‌లో ఉంచుకోవాలి.

ముందుగా మీ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి ప్రతిసారీ వాళ్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వీటికోసం ఎలాంటి మందులు వాడాలో తెలుసుకోవాలి. దీనివల్ల మీ డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి. మీరు ఆఫీస్‌లో ఉన్న సమయంలో పిల్లలకు ఇలాంటి సమస్యలు వచ్చినా ఇంట్లో వాళ్లు ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. మీరు ఎక్కడికైనా టూర్‌కు వెళ్లినా ఈ కిట్‌ను వెంట తీసుకెళ్లొచ్చు.

ఉన్నత చదువుల కోసం ఇన్వెస్ట్‌మెంట్‌

పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనని పేరెంట్స్‌ ఉండరు. వాళ్ల లక్ష్యాలు, అభిరుచులకు తగినట్లుగా ఉన్నత చదువులు చదివించడం, కెరీర్‌లో స్థిరపడేలా చేయడం పెద్ద సవాలే. ఆడపిల్లల తల్లిదండ్రులకైతే పెళ్లిళ్ల ఖర్చు అదనం. వీటి కోసం కూడా వాళ్లు పుట్టినప్పటి నుంచే ప్రత్యేకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పీఎఫ్‌, గోల్డ్‌, సుకన్య సమృద్ధి యోజనలాంటివి తక్కువ రిస్క్‌తో కూడిన ఇన్వెస్టుమెంట్లు. ఇవి ఎప్పటికీ సేఫ్‌.

ఎక్కువ రిటర్న్స్‌ అవసరం లేదు అనుకుంటే.. వీటిని ట్రై చేయొచ్చు. కాస్త రిస్క్‌ అయినా పర్వాలేదు అనుకుంటే.. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు.

ఇక స్టాక్‌ మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌లాంటి హై రిస్క్‌తో కూడుకున్న ఇన్వెస్ట్‌మెంట్లు మంచి రిటర్న్స్ కూడా ఇస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి, రిస్క్‌ తీసుకునే స్వభావాన్ని బట్టి ఎందులో ఇన్వెస్ట్‌ చేయాలో తేల్చుకోండి. 

పిల్లలు కావాలని నిర్ణయించుకున్నప్పడే ఈ న్యూ పేరెంట్స్ బడ్జెట్ ప్లాన్ కూడా తయారుచేసుకోండి. ఆల్ ది బెస్ట్.

ఇవి కూడా చదవండి

Previous articleసిమ్లా టూర్ ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంతవుతుంది?
Next articleమెంతికూర కుడుములు .. హెల్తీ బ్రేక్ ఫాస్ట్