ఈ స్మార్ట్ ప్రపంచంలో అంతా స్మార్టే. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఏసీ, స్మార్ట్ బల్బ్స్, స్మార్ట్ డోర్‌బెల్స్, స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాస్.. ఇలా అన్నీ స్మార్ట్‌గా మారిపోతున్నాయి. స్మార్ట్ హోం డివైజెస్ మనిషి పనిని మరింత సులువు చేస్తున్నాయి.
ఒకప్పుడు టీవీని రిమోట్‌తో కంట్రోల్ చేసే తెగ మురిసిపోయే వాళ్లం. కానీ ఇప్పుడీ స్మార్ట్ హోం డివైజెస్ తో కూర్చున్న చోటు నుంచే ఇంటి మొత్తాన్నీ కంట్రోల్ చేసేయొచ్చు. ఇంట్లోనే ఉండి కంట్రోల్ చేయాల్సిన అవసరమూ లేదు. ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు.
అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్లాంటివి వచ్చిన తర్వాత ఇంటిని మీ మాటతో కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. దీన్నే ఇంటర్నెంట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అంటున్నాం. కొన్నాళ్ల కిందటి వరకు కూడా స్మార్ట్ హోమ్ అనేది మన ఇండియన్స్‌కు ఒక కలే. వెస్టర్న్ కంట్రీస్‌లో ఈ స్మార్ట్ హోమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మధ్యే మన దగ్గరా స్మార్ట్ హోం డివైజెస్ వాడకం పెరుగుతోంది.
కేవలం మీ వాయిస్‌తో ఏసీ టెంపరేచర్‌ను కంట్రోల్ చేయొచ్చు. లైట్లను ఆన్, ఆఫ్ చేయొచ్చు. ఇంటికి దూరంగా ఉన్నా స్మార్ట్ సీసీటీవీలతో ఎక్కడి నుంచైనా ఇంటిపై ఓ కన్నేసి ఉండవచ్చు. ఇందులో చాలా ఖరీదైనవి కూడా ఉన్నాయి. అదే సమయంలో మధ్య తరగతి వాళ్లు కూడా భరించేలా కేవలం రూ. 50 వేలలోపు బడ్జెట్లోనూ స్మార్ట్ హోం డివైజెస్ ఉన్నాయి. అవేంటో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.
స్మార్ట్ స్పీకర్స్
అసలు స్మార్ట్ హోం డివైజెస్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ స్మార్ట్ స్పీకర్స్. ఇవి రాను రాను మన ఇంట్లో ఒక మనిషిలా స్థిరపడిపోతున్నాయి. అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్లాంటి స్మార్ట్ స్పీకర్స్ ఇప్పుడు దాదాపు ప్రతి అర్బన్ ఇంట్లో దర్శనమిస్తున్నాయి. వీటికి మీ వాయిస్ కమాండ్స్ ఇచ్చి కావాల్సిన పనులు చేయించుకోవచ్చు.
మ్యూజిక్ ప్లే చేయాలన్నా, ఈకామర్స్ సైట్లలో మీకు కావాల్సిన వస్తువులను కొనాలన్నా, క్యాబ్ బుక్ చేయాలన్నా, క్రికెట్ స్కోరు తెలుసుకోవాలన్నా.. జస్ట్ ఓ ఫ్రెండ్‌ని అడిగినట్లు అడిగితే చాలు. పైగా ఈ మధ్య ఈ డివైస్‌లు స్థానిక భాషల్లోనూ మాట్లాడేస్తున్నాయి.
గూగుల్ అసిస్టెంట్ ఇప్పటికే ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీలాంటి భాషల్లోకి వచ్చేసింది. అంటే మీరు తెలుగులో మాట్లాడినా ఇది మీకు కావాల్సిన పని చేసి పెడుతుంది. అమెజాన్ కూడా ఇప్పటికే హిందీలో వచ్చేసింది. ఇతర భారతీయ భాషల్లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. పైగా వీటి ధర కూడా సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలానే ఉంది.
అమెజాన్ ఎకో డివైస్‌లు కనీసం రూ. 3 వేల (ఎకో డాట్) నుంచి రూ.12,000 (ఎకో ప్లస్) వరకు ఉన్నాయి. అదే గూగుల్ హోమ్ విషయానికి వస్తే హోమ్ మినీ రూ. 5 వేలు, హోమ్ రూ. 7,500గా ఉంది. డిస్ప్లేతో కూడిన వర్చువల్ అసిస్టెంట్స్ కావాలంటే మాత్రం కాస్త ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇవి ఇంట్లోని ఇతర స్మార్ట్ డివైస్‌లను కూడా కంట్రోల్ చేస్తాయి.
స్మార్ట్ టీవీలు
ఒకప్పుడు ఇళ్లలో డబ్బా టీవీలు ఉండేవి. వాటిని ఆపరేట్ చేయాలంటే దగ్గరికి వెళ్లి చానెల్ మార్చాల్సి వచ్చేది. ఆ తర్వాత రిమోట్ కంట్రోల్ టీవీలు వచ్చాయి. కాస్త దూరంలో కూర్చున్నా.. రిమోట్‌తో వాటిని ఆపరేట్ చేసే వీలు కలిగేది. ఆ టీవీలు క్రమంగా సైజు తగ్గించుకొని ఫ్లాట్‌గా మారిపోయాయి. ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు వచ్చాయి. కానీ ఇప్పుడు వాటికీ కాలం చెల్లిపోయింది.
ఇప్పుడన్నీ స్మార్ట్ టీవీలే. ఒకప్పటి టీవీలు యాంటెనా, కేబుల్, ఇతర ఆడియో/వీడియో సోర్స్ ద్వారా పనిచేసేవి. కానీ ఈ స్మార్ట్ టీవీకి ఇంటర్నెట్ ఉంటే చాలు. ఒక రకంగా ఈ స్మార్ట్ టీవీలు.. టీవీ పనితోపాటు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ పనులు కూడా చేసి పెడుతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్లు అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్లాంటి స్మార్ట్ స్పీకర్స్ ఇంట్లో ఉంటే చాలు.. ఈ టీవీలకు రిమోట్ కూడా అవసరం లేదు. వాయిస్ కమాండ్స్‌తో పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు.
అతి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు అమ్ముతూ ఇండియన్ మార్కెట్‌ను ఓ ఊపు ఊపేసిన షియోమీ.. ఇప్పుడీ స్మార్ట్ టీవీల్లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రూ. 12,990కే 32 ఇంచుల స్మార్ట్ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోటీ ఎక్కువ కావడంతో ఎల్జీ, సామ్సంగ్, సోనీలాంటి టాప్ కంపెనీలు కూడా సాధ్యమైనంత తక్కువ ధరకు స్మార్ట్ టీవీలను అమ్మడానికి ప్రయత్నిస్తున్నాయి.
షియోమీ నుంచి 43 అంగుళాల ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ రూ. 23 వేలకు, 55 అంగుళాల 4కే అల్ట్రా హెడ్డీ స్మార్ట్ టీవీ రూ. 48 వేలకే అందుబాటులో ఉండటం విశేషం. పైగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఈ-కామర్స్ సైట్లు.. నెలకోసారి సేల్ పేరుతో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
స్మార్ట్ టీవీ లేకపోయినా..
రెండు, మూడేళ్ల కిందటే ఓ టీవీ కొన్నారు. కానీ అది స్మార్ట్ కాదు. అలాగని ఇప్పుడు దానిని తీసేసి కొత్త స్మార్ట్ టీవీ కొనలేరు. అలాంటప్పుడు ఉన్న టీవీనే స్మార్ట్‌గా మార్చేయండి. మూడు, నాలుగు వేలు పెడితే చాలు.. మీ పాత టీవీ స్మార్ట్‌గా మారిపోతుంది. కాకపోతే మీ టీవీకి హెచ్డీఎంఐ పోర్ట్ ఉండాలి. ఆ డివైసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్
అమెజాన్ నుంచి వచ్చిన స్మార్ట్ డివైసెస్‌లలో ఇదీ ఒకటి. ఈ ఫైర్ టీవీ స్టిక్‌తో ఇంట్లోని సాధారణ టీవీ స్మార్ట్‌గా మారిపోతుంది. టీవీకి ఉన్న హెచ్డీఎంఐ పోర్ట్‌లో ఈ స్టిక్‌ను ఉంచితే చాలు. అమెజాన్ ప్రైమ్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, హాట్‌స్టార్, సోనీలివ్లాంటి ఓటీటీ చానెల్స్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. ఏదైనా ఎకో స్పీకర్ మీ ఇంట్లో ఉంటే.. దాంతో ఈ టీవీ స్టిక్‌ను వాయిస్ కమాండ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అమెజాన్ అలెక్సా దీనిని సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 3999.
గూగుల్ క్రోమ్‌కాస్ట్ 2
అమెజాన్ లవర్స్‌కు టీవీ స్టిక్ ఎలాగో.. గూగుల్ అంటే ఇష్టపడే వాళ్లకు క్రోమ్‌కాస్ట్ అలాంటిది. ఇంట్లో గూగుల్ అసిస్టింట్ ఉన్నవాళ్లు ఈ క్రోమ్‌కాస్ట్ ట్రై చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్ అమెజాన్ టీవీ స్టిక్‌ను కంట్రోల్ చేయలేదు. కానీ క్రోమ్‌కాస్ట్‌ను చేస్తుంది. కాకపోతే ఇది ఫైర్ టీవీ స్టిక్లాగా నేరుగా పని చేయదు. దీనిని మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోన్లో ప్లే చేస్తున్న కంటెంట్ టీవీలో కనిపిస్తుంది. అందువల్ల మీ ఫోన్లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్లాంటివి ఇన్స్టాల్ చేసుకొని.. వాటిని టీవీలో చూడొచ్చు. దీని ధర రూ. 2999.
సెన్సర్ డిటెక్టింగ్ బల్బ్స్
అసలు లైట్ ఆన్, ఆఫ్ చేయాలంటే స్విచ్, మీ వాయిస్ కమాండ్లు కూడా అవసరం లేదు. మీ కదలికను బట్టి ఆన్, ఆఫ్ అయిపోయే సెన్సర్ డిటెక్టింగ్ స్మార్ట్ ఎల్ఈడీ బల్బ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఈ బల్బ్స్లో కదలికలను గుర్తించే చిన్న డిటెక్టర్స్‌ను అమరుస్తారు. హీట్ వేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆధారంగా కదిలే వాటిని ఈ బల్బ్స్ గుర్తిస్తాయి. మూడు నుంచి ఐదు మీటర్ల పరిధిలోని ఆబ్జెక్ట్స్‌ను ఇవి పసిగట్టగలవు. ఈ బల్బ్ ఉన్న గదిలోకి మనం వెళ్లగానే అది ఆటోమెటిగ్గా ఆన్ అవుతుంది. తక్కువ సమయం మాత్రమే లైట్ అవసరమైన, తరచూ ఇంట్లో వాడే ప్రదేశాల్లో ఈ బల్బ్‌లను అమర్చుకోవచ్చు.
ఈ మధ్యే షియోమీ ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 599గా నిర్ణయించారు. ఒరెవా కంపెనీకి చెందిన 10 వాట్స్ బల్బ్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర ఆన్లైన్లో రూ. 495గా ఉంది. ఇవే కాకుండా ఐఎఫ్ఐటెక్, విల్సన్లాంటి కంపెనీలకు చెందిన మోషన్ డిటెక్టింగ్ బల్బ్స్ ఆన్లైన్లో ఉన్నాయి.
స్మార్ట్ లైటింగ్
ఇంట్లో లైట్లను ఆన్, ఆఫ్ చేయడానికి స్విచ్‌లే అవసరం లేదు. ఎందుకంటే అవి కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. స్మార్ట్ స్పీకర్స్‌తో కనెక్ట్ చేస్తే చాలు.. మీ వాయిస్ కమాండ్‌తో ఆన్ లేదా ఆఫ్ అవుతాయి.
– ఈ స్మార్ట్ బల్బ్స్ను మొదటగా తయారు చేసిన కంపెనీ ఫిలిప్స్. హ్యూ సిరీస్ బల్ప్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఎల్ఈడీ బల్బ్స్ రంగులు కూడా మారుస్తుంటాయి.
తక్కువ రేంజ్లో ట్రై చేయాలి అనుకుంటే.. ఫిలిప్స్ హ్యూ మినీ స్టార్టర్ బెటర్. ఇందులో ఒక పది వాట్ల బీ22 బల్ప్తోపాటు ఓ హ్యూ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ స్మార్ట్ బల్బ్స్ పని చేయాలంటే బ్రిడ్జ్ తప్పనిసరి. ఆ తర్వాత ఇంట్లో ఎన్ని స్మార్ట్ బల్బ్స్ పెట్టుకున్నా.. ఈ బ్రిడ్జ్ ద్వారా అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి.
అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఒక బల్బ్, బ్రిడ్జ్ సెట్ ధర రూ. 6499గా ఉంది. అదే మూడు బల్బ్స్ ఉన్న కిట్ కావాలంటే రూ. 12480 ఉంటుంది.
– సిస్కా స్మార్ట్‌లైట్
ఇక స్మార్ట్ బల్బ్స్ను తయారు చేస్తున్న మరో ప్రముఖ సంస్థ సిస్కా. అంత ధర పెట్టి ఫిలిప్స్ బల్బులు కొనలేము అనుకున్న వాళ్లకు సిస్కా చాలా మంచి ఆప్షన్. ఇది కూడా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సాయంతో పని చేస్తుంది. సిస్కా స్మార్ట్‌లైట్ 7 వాట్స్ ఎల్ఈడీ బల్బ్ రూ. 1440 నుంచి అందుబాటులో ఉంటుంది.
– టీపీ – లింక్ ఎల్బీ120 వై-ఫై స్మార్ట్ ఎల్ఈడీ లైట్ బల్బ్
స్మార్ట్ ఎల్ఈడీ బల్బ్స్ను తయారు చేస్తున్న మరో సంస్థ ఇది. ఫిలిప్స్, సిస్కాలాగే అన్ని ఫీచర్స్ ఇందులోనూ ఉంటాయి. కాకపోతే రెగ్యులర్‌గా బల్బ్‌లకు వాడే బీ22 సాకెట్ దీనికి పనికి రాదు. ఇందులో ఈ 26 సాకెట్ ఉంటుంది. అందువల్ల టీపీ లింక్ బల్బ్ కొనేముందు ఇంట్లో ఎలాంటి సాకెట్ ఉందో చూసుకోవడం మంచింది. మన దేశంలో సాధారణంగా ప్రతి ఇంట్లోనూ బీ22 సాకెట్ ఉంటుంది. అమెజాన్‌లో రూ. 1700 నుంచి ఈ బల్బ్‌లు అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ ప్లగ్స్
ఇంట్లో వాడే స్మార్ట్ ప్రోడక్ట్స్‌లో ఈ స్మార్ట్ ప్లగ్స్ కూడా ఒకటి. ఏదైనా స్మార్ట్ ప్లగ్‌కు కనెక్ట్ చేసే డివైస్‌కు వాయిస్ కమాండ్ ద్వారా పవర్ సప్లైను ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఈ స్మార్ట్ ప్లగ్స్‌ను కంట్రోల్ చేసుకునే వీలుంటుంది.
డీ-లింక్, సిస్కాలాంటి కంపెనీలు ఈ స్మార్ట్ ప్లగ్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వీటిని టీవీ, వాషింగ్ మెషీన్, లైట్స్‌లాంటి వాటికి కనెక్ట్ చేసుకుంటే.. ఈజీగా ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. వీటిలోనే కాస్త ఎక్కువ పవర్ ఉన్న స్మార్ట్ ప్లగ్స్ కూడా ఉంటాయి.
వీటి ద్వారా ఎక్కువగా కరెంటు వాడే ఏసీ, గీజర్, నీళ్ల మోటర్లాంటి వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓక్టర్ (Oakter) అనే సంస్థ ఈ హై పవర్ స్మార్ట్ ప్లగ్స్‌ను తయారు చేస్తోంది. వీటిలో టైమ్ షెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా ఉండటం విశేషం.
చాలా మంది ఇళ్లలో నీళ్ల కోసం మోటర్ వేసి మరచిపోతుంటారు. నీళ్లు వృథాగా పోతుంటాయి. అలాంటి వాళ్లు ఈ స్మార్ట్ ప్లగ్‌ను వాడితే ముందుగానే ఎంత సమయం పాటు మోటర్ నడవాలో సెట్ చేసుకునే వీలుంటుంది. దీంతో కరెంటు, నీళ్లు ఆదా అవుతాయి. ఈ ఓక్టర్ హైపవర్ స్మార్ట్ ప్లగ్స్ రూ. 3,490 నుంచి అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ సెక్యూరిటీ డివైసెస్
హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటిని వదిలి పెట్టి ఎక్కడికైనా వెళ్లాలంటే భయం. ఎవరైనా ఇంట్లో చొరబడితే ఎలా అని. అయితే ఈ స్మార్ట్ సెక్యూరిటీ డివైసెస్ మీ ఇంట్లో ఉంటే.. మీరు ఎక్కడున్నా ఇంటిపై ఓ కన్నేసి ఉండొచ్చు. ఇంట్లో ఉన్నా కూడా ఎవరైనా అపరిచితులు వచ్చినపుడు పసిగట్టవచ్చు. ఆ స్మార్ట్ సెక్యూరిటీ డివైసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్ డోర్‌బెల్
ఇంట్లో ఉన్న వాళ్లను బయటకు పిలవడానికి మాత్రమే ఒకప్పుడు డోర్‌బెల్స్‌ను వాడే వాళ్లు. ఇప్పుడు బయట ఎవరు వచ్చారన్నది కూడా ఇంట్లో కూర్చొనే తెలుసుకునే డోర్‌బెల్స్ వచ్చేశాయి. అలాంటి వాటిలో రింగ్ డోర్‌బెల్ ఒకటి. ఇందులో కెమెరా ఉంటుంది.
దీనిని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే చాలు.. బయట ఎవరు వచ్చారన్నది చూడొచ్చు. తెలిసిన వాళ్ల మొహాలను గుర్తించే టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. దీంతో ఎవరైనా కొత్త వాళ్లు వచ్చినపుడు మాత్రమే ఈ రింగ్ డోర్‌బెల్ ప్రత్యేకంగా మొబైల్‌కు నోటిఫికేషన్ పంపిస్తుంది.
ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలకు ఈ స్మార్ట్ డోర్‌బెల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రింగ్ వీడియో డోర్‌బెల్ ధర అమెజాన్‌లో రూ. 14,799గా ఉంది. ఇదే కాకుండా యాక్టివ్ పిక్సెల్ స్మార్ట్ వీడియో బెల్ (రూ. 7,199), గోద్రెజ్ సోలస్ ఎస్టీ 7 వీడీపీ (రూ. 16,500), పానాసోనిక్ వీఎల్-ఎస్డబ్ల్యూ251బీఎక్స్ వీడీపీ (రూ. 18,149)లాంటివి అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా సిస్టమ్
ఇంతకుముందు కేవలం ఆఫీస్‌లు, పెద్ద పెద్ద దుకాణాలకే పరిమితమైన సెక్యూరిటీ కెమెరాలు ఇప్పుడు ఇంటికీ వచ్చేశాయి. స్మార్ట్ హోం డివైజెస్ పుణ్యమాని.. ఇప్పుడు వైర్లెస్, వాటర్‌ప్రూఫ్ కెమెరాలు కూడా వచ్చేశాయి. దీంతో వీటిని ఇంటి బయట ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు.
పైగా అన్ని కంపెనీలు కొంత మేర ఫ్రీ క్లౌడ్ రికార్డింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. అతి తక్కువ ధరలో 360 డిగ్రీల సెక్యూరిటీ కెమెరాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరాలు కేవలం రూ. 1,999 నుంచే లభిస్తున్నాయి.
360 డిగ్రీ విజన్తోపాటు నైట్ విజన్, ఏఐ మోషన్ డిటెక్షన్, టాక్బ్యాక్లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎంఐతోపాటు డీ-లింక్, శ్రీకామ్, గోద్రెజ్, సీపీ ప్లస్లాంటి కంపెనీలు అందుబాటు ధరల్లోనే స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలను అందిస్తున్నాయి.
స్మార్ట్ లాక్స్
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళం సరిగా పడిందా లేదా అని మనం ఒకటికి రెండుసార్లు చూస్తుంటాం. కొంతమందికైతే ఎప్పుడూ అదే ఆలోచన ఉంటుంది. అసలు డోర్‌కి తాళం వేశామా లేదా అన్న ఆందోళనలో ఉంటారు. అలాంటి వాళ్లు ఈ స్మార్ట్ లాక్స్ సిస్టమ్‌ను వాడొచ్చు.
అలాంటి స్మార్ట్ లాక్‌లలో బెస్ట్ ప్రోడక్ట్ కావాలంటే ఆగస్ట్ స్మార్ట్ లాక్కి వెళ్లండి. సింగిల్ సిలిండర్ డెడ్బోల్ట్స్ ఉన్న మెయిన్ డోర్‌కు లోపలి నుంచి ఈ స్మార్ట్ లాక్‌ను ఇన్స్టాల్ చేస్తారు. ఈ స్మార్ట్ లాక్‌ను ఇన్స్టాల్ చేస్తే.. ఒకవేళ మీరు డోర్ లాక్ చేయడం మరచిపోయినా సరే.. కాసేపటి తర్వాత దానికదే లాక్ చేస్తుంది. అంతేకాదు ఎక్కడి నుంచైనా మీ డోర్ లాక్ లేదా అన్‌లాక్ చేయొచ్చు.
ఇక ఇంటికి వచ్చే ఫ్రెండ్స్, గెస్ట్‌లకు మీరు లేకపోయినా.. డిజిటల్ కీస్ పంపించే సౌకర్యం కూడా ఉంటుంది. దీనికోసం ఆగస్ట్ స్మార్ట్ లాక్ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ల ద్వారా కూడా ఈ లాకింగ్ సిస్టమ్‌ను కంట్రోల్ చేసే అవకాశం ఉండటం వల్ల మీ వాయిస్ కమాండ్లతో లాక్, అన్‌లాక్ చేయొచ్చు. ఆగస్ట్ స్మార్ట్ లాక్స్ ఆన్లైన్లో రూ. 17,500 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాచిలర్స్.. ఇది మీ కోసమే
ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం అన్నది బ్యాచిలర్స్‌కు అస్సలు నచ్చని విషయం. రూమ్ అంతా ఎప్పుడూ చెత్తా చెదారంతో నిండిపోయి ఉంటుంది. నెలకోసారి రూమ్ ఊడ్చుకోవడానికి కూడా కొంతమంది బద్ధకిస్తారు. అలాంటి వాళ్లు యూఫీ రోబోవాక్ 11 (Eufy RoboVac 11) ట్రై చేయొచ్చు.
ఇదొక రొబోటిక్ వాక్యూమ్ క్లీనర్. అమెజాన్ అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సింపుల్‌గా దీనికి ఓ కమాండ్ ఇచ్చేసి బయటకు వెళ్లిపోండి. మీరు తిరిగి వచ్చేసరికి ఇంటిని నీట్‌గా ఉంచుతుంది. పైగా దానికదే చార్జింగ్ చేసుకోగలదు. అమెజాన్ ఇండియాలో రూ. 15,990 నుంచి ఇది అందుబాటులో ఉంది.
స్మార్ట్ హోం డివైజెస్ లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. మార్కెట్లోకి వచ్చిన వెంటనే కాకుండా.. కొద్ది రోజులు ఆలస్యంగా ట్రై చేస్తే అవి అందుబాటు ధరల్లోకి వస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇవి కూడా చదవండి