ఇన్ఫోసిస్‌ లో ఏం జరిగింది? షేర్ విలువ ఎందుకు పడిపోతోంది?

Infosys
pic credit: https://commons.wikimedia.org/wiki/File:Infosys.JPG

న్ఫోసిస్‌ .. మన దేశంలో అత్యంత విశ్వసనీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటి. కానీ గత ఆరేడేళ్లుగా ఆ సంస్థ ప్రస్థానం రోలర్‌ కోస్టర్‌ను తలపిస్తోంది. ఇన్ఫోసిస్ సంస్థ ఫౌండర్‌ నారాయణమూర్తి తప్పుకున్న తర్వాత సమర్థ నాయకత్వం లేక గాడి తప్పుతోంది.

కాస్త కుదురుకొని మళ్లీ లాభాల బాట పడుతుందనుకున్న సమయంలో ఏదో ఒక సంక్షోభంలో చిక్కుకుంటోంది. తాజాగా ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌వో నిలంజన్‌ రాయ్‌ అన్‌ఎథికల్‌ ప్రాక్టిసెస్‌ (అనైతిక కార్యకలాపాలు)కు పాల్పడినట్లు ఆ సంస్థలోని కొందరు ఉద్యోగులు ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది.

ఈ ఆరోపణలతో ఇన్ఫోసిస్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇంకా పతనమవుతూనే ఉన్నాయి. వీటిపై తీవ్రంగా స్పందించిన సంస్థ చైర్మన్‌ నందన్‌ నీలేకని వెంటనే రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. అత్యుత్తమ కార్పొరేట్‌ పాలనకు ఇన్ఫోసిస్‌ పెట్టింది పేరు. కానీ ఇప్పుడదే సంస్థ కార్పొరేట్‌ పాలనపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో అసలు ఇన్ఫోసిస్‌లో ఏం జరుగుతోంది? సీఈవో, సీఎఫ్‌వో ఎలాంటి అన్‌ఎథికల్‌ ప్రాక్టిసెస్‌కు పాల్పడ్డారు? ఇది సంస్థపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది వంటి అంశాలపై డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్టోరీ ఇది.

అసలేం జరిగింది?

ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) సలీల్‌ పరేఖ్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) నిలంజన్‌ రాయ్‌ అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సంస్థలోని కొందరు ఉద్యోగులు ఆరోపణలు చేశారు. ఎథికల్‌ ఎంప్లాయీస్‌ పేరుతో సెప్టెంబర్‌ 20, 30 తేదీల్లో రెండుసార్లు సంస్థలోని ఓ బోర్డు సభ్యుడికి లేఖలు రాశారు. గత కొన్ని త్రైమాసికాలు (క్వార్టర్స్‌)గా ఈ ఇద్దరూ సంస్థలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని ఆ లేఖలో ఎథికల్‌ ఎంప్లాయీస్ ఫిర్యాదు చేశారు.

తమ ఆరోపణలను నిరూపించడానికి ఈమెయిల్స్‌, కొన్ని వాయిస్‌ రికార్డులు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ లేఖలు, ఆరోపణల పర్వాన్ని సంస్థే బయటకు చెప్పి ఉంటే కాస్తయినా ఇన్వెస్టర్లలో నమ్మకం ఉండేది. కానీ ఇవి మీడియా బయటపెట్టింది.

డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రికలో అక్టోబర్‌ 21న ఈ లేఖలు పబ్లిష్‌ అయ్యాయి. సంస్థ స్వల్పకాలిక ఆదాయం, లాభాలు వృద్ధి చెందడానికి సీఈవో, సీఎఫ్‌వో అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని ఆ లేఖలో ఎథికల్‌ ఎంప్లాయీస్‌ ఆరోపించారు. తాజాగా విడుదల చేసిన త్రైమాసికానికి సంబంధించి కూడా ఆ ఇద్దరూ ఇలాంటి అన్‌ఎథికల్‌ ప్రాక్టిసెస్‌కు పాల్పడినట్లు వాళ్లు స్పష్టం చేశారు.

ఆరోపణ ఇదీ..

‘మేము ఇన్ఫోసిస్‌ ఉద్యోగులమే. ఈ ఆరోపణలకు సంబంధించి మా దగ్గర పూర్తి ఆధారాలు ఈమెయిల్స్‌, వాయిస్‌ రికార్డింగ్స్‌ రూపంలో ఉన్నాయి. దీనిపై బోర్డు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఆ లేఖలో ఎథికల్‌ ఎంప్లాయీస్‌ రాశారు. అకౌంటింగ్‌ ప్రమాణాలకు విరుద్ధంగా పని చేయాలని తమపై ఆ ఇద్దరూ ఒత్తిడి తెచ్చినట్లు వాళ్లు వెల్లడించారు. వీళ్ల లేఖలో ప్రధానంగా మూడు ఆరోపణలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

‘‘ సంస్థ ఈ మధ్య పొందిన భారీ కాంట్రాక్టుల్లో అసలు ఏమాత్రం లాభం లేకపోయినా లేదా నామమాత్రపు లాభాలు ఆర్జించినా కూడా వాటిని ఎక్కువ చేసి చూపించాల్సిందిగా సీఈవో పరేఖ్‌, సీఎఫ్‌వో రాయ్‌ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఈ డీల్స్‌పై పూర్తిస్థాయి సమీక్ష, ఆమోదం ప్రక్రియను సంస్థ  పట్టించుకోలేదు.
ఈ డీల్స్‌కు సంబంధించిన అసలు సమాచారాన్ని ఆడిటర్లు, బోర్డు సభ్యులకు తెలియకుండా దాచారు.
సంస్థ స్వల్పకాలిక లాభాల కోసం అకౌంటింగ్‌ ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ భారీ డీల్స్‌లోని ఆదాయం, వ్యయాల విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇన్వెస్టర్లకు ఇచ్చారు. ముఖ్యంగా వెరిజాన్‌, ఇంటెల్‌, జేవీఎస్‌, ఏబీఎన్‌ ఆమ్రో సంస్థ కొనుగోలులాంటి భారీ కాంట్రాక్టుల్లోని ఆదాయవ్యయాల వివరాలు అకౌంటింగ్‌ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయి..‘ అని ఆ లేఖలో ఎథికల్‌ ఎంప్లాయీస్‌ ఆరోపించారు.

విచారణ సమయంలో అధికారులు అడిగితే.. ఈ ఆరోపణలకు సంబంధించిన ఈమెయిల్స్‌, వాయిస్‌ రికార్డింగ్స్‌లాంటి ఆధారాలను ఇస్తామని చెప్పారు. విధానాలను మార్చి, ఎక్కువ రిస్క్‌ తీసుకొని ట్రెజరీలో లాభాలు ఎక్కువగా వచ్చినట్లు చూపించాల్సిందిగా తమపై ఆ ఇద్దరూ ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు.

ఆరోపణల వల్ల నష్టం ఎంత?

ఈ లేఖ బయటకు రాగానే ఇన్ఫోసిస్‌ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఏకంగా 17 శాతం వరకూ షేరు ధర పడిపోయింది. గత ఆరేళ్లలో సంస్థ షేర్లు ఇంత భారీగా దెబ్బతినడం ఇదే తొలిసారి. స్టాక్‌ మార్కెట్‌లో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సుమారు రూ. 50 వేల కోట్ల వరకూ తగ్గిపోయింది. అటు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లో ఉన్న అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (ఏడీఆర్‌) కూడా 15 శాతం వరకూ నష్టాలను చవిచూసింది.

నందన్‌ నీలేకనీ ఏమంటున్నారు?

సంస్థపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి కావడం, అవి భారీ నష్టాలను మిగుల్చుతుండటంతో చైర్మన్‌ నందన్‌ నీలేకనీ వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో పరేఖ్‌, సీఎఫ్‌వో రాయ్‌లను దీర్ఘకాలిక సెలవుపై పంపించారు. ఆడిట్‌ కమిటీ, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మెంబర్స్‌తో ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.  నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన చైర్మన్‌ నీలేకని.. ఇన్ఫోసిస్‌ ఆడిట్‌ కమిటీ ఆ లేఖలను పరిశీలిస్తోందని, ఈ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.

అత్యుత్తమ కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు తమ బోర్డు కట్టుబడి ఉన్నదని, సంస్థ భాగస్వాములందరి ప్రయోజనాలు కాపాడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే సంస్థ ఆడిట్‌ కమిటీ విచారణకు సంబంధించి సంప్రదింపులు మొదలుపెట్టింది. ప్రముఖ న్యాయ సంస్థ శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ కంపెనీతోపాటు సంస్థలోని స్వతంత్ర ఆడిటర్లతో విచారణ ప్రక్రియపై చర్చిస్తోంది.

బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయి?

అటు బ్రోకరేజీ సంస్థలు ఇన్ఫోసిస్‌ షేర్‌హోల్డర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా స్వల్పకాలిక ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఈ ఆరోపణలు కచ్చితంగా సంస్థకు చేటు చేసేవే. షేరు ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉంది అని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ స్పష్టం చేసింది. ఈ అంశం కచ్చితంగా సంస్థ ప్రస్తుత యాజమాన్య విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిందని మరో సంస్థ జెఫరీస్‌ అభిప్రాయపడింది.

ఓ సెక్యూరిటీస్‌ స్పందిస్తూ.. ‘ఇది చాలా తీవ్రమైన అంశం. కార్పొరేట్‌ పాలనకు సంబంధించిన అంశమే ఇది. డిప్యూటీ సీఎఫ్‌వో కూడా తనకు తానుగా తప్పుకున్నారు. అంటే కచ్చితంగా ఏవో అవకతవకలు జరిగినట్లే. ఉత్తమమైన కార్పొరేట్‌ పాలనకు పెట్టింది పేరైన ఇన్ఫోసిస్‌లాంటి సంస్థ ఈ స్థాయికి దిగజారడం విచారకరం..‘ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక విచారణ పూర్తి పారదర్శకంగా జరగడంతోపాటు దలాల్‌ స్ట్రీట్‌లో ఉన్న గందరగోళాన్ని, ఆందోళనను తగ్గించే ప్రయత్నం సంస్థ చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ వార్త బయటకు రాగానే సంస్థ షేర్లు భారీగా పతనమవడం ఇప్పటికే ఇన్ఫోసిస్‌ షేర్‌ హోల్డర్లను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.

సెబీ ఏమంటోంది?

అటు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) కూడా ఇన్ఫోసిస్‌ వ్యవహారంపై దృష్టి సారించింది. సంస్థలోని ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించాలని సెబీ భావిస్తోంది. అదే జరిగితే ఇన్ఫోసిస్‌ ప్రతిష్ఠ మరింత దెబ్బ తింటుంది.

కేంద్ర ప్రభుత్వం మాట ఇదీ!

ఇన్ఫోసిస్‌ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటి. అలాంటి సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయంటే అది పరోక్షంగా దేశ ప్రతిష్ఠనూ దెబ్బ తీస్తుంది. దీంతో ఈ సంస్థలో తాజాగా జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు సంస్థలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించడం తొందరపాటు చర్యే అవుతుందని ప్రభుత్వంలోని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

భయపెడుతున్న అమెరికా సంస్థ

మరోవైపు ఇన్ఫోసిస్‌లో జరిగిన అనైతిక కార్యకలాపాలపై క్లాస్‌ యాక్షన్‌ లాసూట్‌ సిద్ధం చేస్తోంది అమెరికాకు చెందిన రోజెన్‌ లా ఫర్మ్‌. ఇన్ఫోసిస్‌పై ఉన్న ఆరోపణల వల్ల షేర్ల ధరలు భారీగా పతనమై ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారని ఆ సంస్థ తెలిపింది. ఈ నష్టాలను రాబట్టేందుకే లాసూట్‌ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

భారత స్టాక్‌ మార్కెట్లతోపాటు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లోనూ ఇన్ఫోసిస్‌ ఓ లిస్టెడ్‌ కంపెనీ. ఈ ఆరోపణల తర్వాత అక్కడ కూడా సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. వ్యాపారానికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ఇన్వెస్టర్లకు ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలపై షేర్‌హోల్డర్ల తరఫున తమ సంస్థ కూడా విచారణ జరపనున్నట్లు రోజెన్‌ లా ఫర్మ్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

బయటి వాళ్లు వచ్చినప్పటి నుంచే..

ఇన్ఫోసిస్‌ సంస్థకు 38 ఏళ్ల చరిత్ర ఉంది. 1981లో ఈ సంస్థను నారాయణమూర్తితోపాటు ఇప్పటి చైర్మన్‌ నందన్‌ నీలేకని, మరికొందరు కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత విశ్వసనీయ ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్‌ ఎదిగింది. సుమారు మూడు దశాబ్దాల పాటు సహ వ్యవస్థాపకులే ఒకరి తర్వాత మరొకరు సీఈవో పదవి చేపట్టారు. వాళ్లు ఆ పదవిలో ఉన్నంత వరకూ అంతా సాఫీగానే సాగిపోయింది. తొలిసారి 2014, జూన్‌లో విశాల్‌ సిక్కా రూపంలో ఓ బయటి వ్యక్తికి సీఈవో పదవి అప్పగించారు. అప్పటి నుంచే సంస్థలో ఒడిదొడుకులు ప్రారంభమయ్యాయి.

రెండేళ్ల కిందట కూడా 20 కోట్ల డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన ఓ సంస్థ విషయంలో అక్రమాలు జరిగాయని ఇన్ఫోసిస్‌లోని ఉద్యోగులే ఆరోపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అప్పటి సీఈవో విశాల్‌ సిక్కాను ఆ పదవికి దూరం చేశాయి. నందన్‌ నీలేకని మళ్లీ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టింది కూడా అప్పుడే. అదే సమయంలో సంస్థకు మరో బయటి వ్యక్తి సలీల్‌ పరేఖ్‌ సీఈవోగా నియమితులయ్యారు.

2018, జనవరిలో పరేఖ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ఫోసిస్‌ షేరు ధర 50 శాతం వరకూ పెరిగింది. అంతకుముందు మూడేళ్ల సిక్కా హయాంలో ఇది 20 శాతానికే పరిమితమైంది. మళ్లీ ఇన్ఫోసిస్‌ గాడిలో పడుతోంది అనుకున్న సమయంలో తాజా అనైతిక కార్యకలాపాల ఆరోపణలు సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టాయి.

ఇన్ఫోసిస్‌కు తీరని నష్టమే..

విశాల్‌ సిక్కా, సలీల్‌ పరేఖ్‌ సీఈవోలుగా ఉన్న కాలంలో ఇలాంటి ఎన్నో ఆరోపణలు వచ్చినా.. తాజా లేఖలు మాత్రం సంచలనం రేపాయి. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ రంగంలో వచ్చిన ప్రాథమిక మార్పులు ఆ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టింది. కొత్త కొత్త టెక్నాలజీలతో చిన్న చిన్న సంస్థలు కూడా క్లైంట్లను ఎగరేసుకుపోతున్నాయి. ఇప్పటికే సంస్థ ఆదాయ వృద్ధి రేటు భారీగా తగ్గిపోయింది. మరోవైపు నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి.

తాజా త్రైమాసిక ఫలితాల్లో సంస్థ లాభాలు రెండు శాతం మేర పతనమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనైతిక కార్యకలాపాల ఆరోపణలు ఇన్ఫోసిస్‌ ప్రతిష్ఠను మరింత దెబ్బతీశాయి. సంస్థ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. విచారణ పూర్తయ్యే వరకూ ఇదిలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

సత్యం కుంభకోణం కథేంటి?

పదేళ్ల కిందట వెలుగు చూసిన సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం ఐటీ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ రంగంలో ఎంత వేగంగా పైకి దూసుకొచ్చిందో.. అంతే వేగంగా ఆ సంస్థ పతనమైంది. లేని లాభాలను ఉన్నట్లుగా చూపించి, సంస్థ విలువను పెంచి ఇన్వెస్టర్లును మోసం చేసినట్లు చైర్మన్‌ రామలింగరాజు అంగీకరించారు.

2009, జనవరి 7న ఆయన ఈ ప్రకటన చేశారు. సుమారు ఏడు వేల కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు రాజు వెల్లడించారు. ఆ వెంటనే సంస్థను స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల నుంచి తొలగించారు. ఈ కేసును సీబీఐ విచారించింది. ఈ కుంభకోణంలో రామలింగరాజుతోపాటు చీఫ్ ఫైనాన్షియల్‌ ఆఫీసర్లు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌, ఇతర భాగస్వాములు, ఆడిటర్స్‌ అందరూ పాలుపంచుకున్నారు.

మొత్తం ఇన్వెస్టర్లకు వచ్చిన నష్టంతో కలిపి ఈ కుంభకోణం విలువ రూ. 14 వేల కోట్లుగా తేలింది. ఈ స్కాం ద్వారా రామలింగరాజు, ఇతరులు అక్రమంగా సుమారు రూ. 2700 కోట్ల వరకు సంపాదించినట్లు తేలింది. రాజుతోపాటు మరో 9 మంది ఈ కేసులో దోషులుగా తేలారు. వీళ్లందరికీ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి

బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఏంటి?

Previous articleఫిట్‌నెస్‌ బ్యాండ్‌ .. ఎలా వాడాలి? బెస్ట్‌ ట్రాకర్స్‌ ఏవి?
Next articleక్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ .. ఈ 7 నివారించండి..