ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ .. ఎలా వాడాలి? బెస్ట్‌ ట్రాకర్స్‌ ఏవి?

fitness band

ఫిట్‌నెస్‌కు ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారో మనకు తెలుసు. ఏ పని చేయాలన్నా ముందు ఫిట్‌గా ఉండటం అన్నది చాలా ముఖ్యం. అయితే మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారు? మరింత ఫిట్‌నెస్‌ సాధించడానికి ఏం చేయాలి? ఈ విషయాలు తెలుసుకోవడానికి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ లేదా ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ ఉపయోగపడుతుంది. వీటినే యాక్టివిటీ ట్రాకర్స్‌ అని కూడా అంటున్నాం.

ఓ రిస్ట్‌ వాచ్‌లాగా ఎప్పుడూ మన చేతికి ఉండే ఓ డిజిటల్‌ డివైస్‌ ఇది. ఒకరకంగా మనతోపాటే ఉండే పర్సనల్‌ ట్రైనర్‌లాంటిదీ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌. ఎంత నడిచాం? ఎంత పరిగెత్తాం? ఎన్ని కేలరీలు కరిగించేశాం? వంటి విషయాలన్నీ ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది. మన ఫిట్‌నెస్‌ గోల్స్‌ను రీచ్‌ కావడానికి ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా కొత్తగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన వారికి, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేయని వారికి ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ బాగా యూజ్‌ అవుతాయి. ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌కు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో కంపెనీలకు చెందిన ఫిట్‌నెస్‌ బ్యాండ్స్ ఉన్నాయి. వీటిలో ఏవి బెస్ట్‌? వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎలా వాడాలి వంటి సమాచారంతో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్టోరీ ఇది.

ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ ఎందుకు?

ఈ స్మార్ట్‌ ప్రపంచంలో మన గురించి మన కంటే ఎక్కువ డివైస్‌లకే తెలుస్తున్నాయి. మీ గుండె ఎలా కొట్టుకుంటోంది? మీలో రక్త ప్రసరణ ఎలా ఉంది? ఒంట్లో కొవ్వు శాతం ఎంత ఉందిలాంటి సమాచారాన్ని కూడా ఈ స్మార్ట్‌ డివైస్‌లు పట్టేస్తున్నాయి. అందుకే ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ కు మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. వీటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఏం సాధించారో చూపెడుతుంది

మనం రోజూ ఫిట్‌గా ఉండటానికి ఎక్సర్‌సైజులు చేస్తుంటాం. కానీ ప్రతి రోజూ దాని వల్ల కలిగే ప్రయోజనం ఎంత అన్నది మాత్రం మనకు తెలియదు. ఆ పని ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ చేస్తుంది. రోజువారీ మీరు చేసే కసరత్తులపై ఎప్పటికప్పుడు రిపోర్ట్స్‌ తయారు చేస్తుంది.

ఎన్ని కేలరీలు ఖర్చు చేశారు? ఎన్ని అడుగులు వేశారు? ఎంత దూరం పరుగెత్తారు? మీ గుండె వేగం ఎలా ఉంది అన్న అంశాలను ఇవి రికార్డు చేస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు చూస్తుండటం వల్ల మీ ఫిట్‌నెస్‌ గోల్స్‌ను సాధించడానికి ఇంకా ఏం చేయాలో తెలుస్తుంది.

టిప్స్‌ ఇస్తాయి

జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజులు చేస్తే అక్కడో పర్సనల్‌ ట్రైనర్‌ ఉంటాడు. రోజూ మిమ్మల్ని గైడ్‌ చేస్తాడు. కానీ అలా వెళ్లే వీలు లేని వాళ్లకు ఈ ఫిట్‌నెస్‌ ట్రాకరే ఓ ట్రైనర్‌లాగా పని చేస్తుంది.

ఇప్పుడు మీకున్న ఫిట్‌నెస్‌ లెవల్స్‌కు తగినట్లు ఎలాంటి వర్కవుట్స్‌ చేయాలి? వంటి సమాచారాన్ని అందిస్తుంది. చాలా వరకు ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి.

ఎవరికైనా అర్థమయ్యే రీతిలో మీ ఫిట్‌నెస్‌ సమాచారాన్ని సేవ్‌ చేసి పెడతాయి. స్క్రీన్స్‌, వైబ్రేటింగ్‌ అలారమ్‌, మీ హెల్త్‌ హిస్టరీ, మీ రోజువారీ వర్కవుట్స్‌ వివరాలన్నీ సులువుగా అర్థం చేసుకునేలా ఉంటాయి.

మీ ఆరోగ్యం మీ చేతుల్లో..

ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌ ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని మానిటర్‌ చేస్తూ ఉంటాయి. రోజూ ఎంత సేపు నిద్రపోతున్నారు? మీ హార్ట్‌ రేట్ ఎంత? రోజువారీ కరిగించిన కేలరీలు, మీరు నడుస్తున్న దూరం ఇందులో రికార్డవుతూ ఉండటం వల్ల మీ ఆరోగ్యం ఎలా ఉందో మీకే తెలిసిపోతుంది.

దానిని బట్టి సరైన వర్కవుట్స్‌ చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవి రికార్డు చేస్తున్న డేటా ఆధారంగా మీరు ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంతసేపు నిద్రపోవాలి అన్న సలహాలు, సూచనలు కూడా ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌ ఇస్తుండటం విశేషం.

స్టెప్‌ బై స్టెప్‌ ఓ గోల్‌ సెట్‌ చేసుకొని దానిని సాధించిన తర్వాత మరో గోల్‌కు వెళ్లడానికి ఇవి ఎంతగానో సాయపడతాయి. మీరు మీ గోల్స్‌ను సాధించలేకపోతే.. ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ కొంత సమయం తర్వాత దానికదే మళ్లీ కింది స్థాయి లక్ష్యాన్ని సెట్‌ చేస్తుంది. నిజానికి ఈ మధ్య డాక్టర్లు కూడా ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ సజెస్ట్‌ చేస్తున్నారు.

ఏం తినాలి? ఎంత తినాలి?

అసలు మన ఫిట్‌నెస్‌లో మనం రోజూ తీసుకునే ఆహారానిదే కీ రోల్‌. సరైన డైట్‌ ఫాలో అయితే.. సగం ఫిట్‌నెస్‌ సాధించినట్లే. కొవ్వు తక్కువగా, ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ట్రాకర్స్‌ ఎప్పుడూ మీ చేతికే ఉండటం వల్ల ఎప్పటికప్పుడు మీ ఫిట్‌నెస్‌ లెవల్స్‌ను మీరే అంచనా వేసుకోవచ్చు. రోజువారీగా మీరు ఎన్ని కేలరీలు కరిగించారన్నది ఇవి ట్రాక్‌ చేస్తాయి. దీనిని బట్టి హెల్తీ డైట్‌ను ఫాలో కావచ్చు.

మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ట్రాకర్స్‌లో చాలా వరకు మీరు ఎన్ని కేలరీలు కరిగించారన్న సమాచారం చెప్పేవి ఉన్నాయి కానీ.. ఎన్ని కేలరీలు తీసుకున్నారన్నది మాత్రం లేవు. మనం రోజూ ఎన్ని కేలరీలు తీసుకోవాలో మ్యానువల్‌గా ఎంటర్‌ చేస్తే.. కరిగించిన కేలరీలతో వీటిని సరిచూసుకునే వీలుంటుంది.

అయితే Healbe GoBe2 అనే ట్రాకర్‌ మాత్రం మీరు రోజూ ఎన్ని కేలరీల ఆహారం తీసుకున్నారు.. ఎన్ని నీళ్లు తాగారు అన్న ఇన్ఫర్మేషన్‌ కూడా ఇస్తోంది. పైగా మీ ఒత్తిడి స్థాయిని కూడా ఇది పసిగట్టగలదు. ప్రస్తుతం మన ఇండియన్‌ మార్కెట్‌లో ఇది అందుబాటులో లేదు. అమెరికన్ మార్కెట్‌లో దీని ధర 169 డాలర్లుగా ఉంది.

మధ్యలో మానేయకుండా..

మనలో చాలా మంది ఫిట్‌గా ఉండాలి అనుకుంటారు. దానికోసం వర్కవుట్స్‌ చేయడం, సరైన డైట్‌ తీసుకోవడం స్టార్ట్‌ చేస్తారు. నెల రోజుల్లో ఎలా మారిపోతానో చూడండి అంటూ కొందరు ఫ్రెండ్స్‌తో చాలెంజ్‌ కూడా చేస్తారు. కానీ కొన్నాళ్లకే పక్కన పెట్టేస్తారు.

ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ మీ చేతికి ఉంటే.. మిమ్మల్ని ఆ పని చేయనివ్వదు. కాస్త తక్కువ వర్కవుట్‌ చేసినా హెచ్చరిస్తుంది.

మీ గోల్స్‌ చేరుకోవడానికి ఇవి ఓ మోటివేషన్‌లాగా పని చేస్తాయి. వర్కవుట్స్‌ మధ్యలోనే మానేసి ఫ్రెండ్స్‌ ముందు పరువు తీసుకోకుండా చూస్తాయి.

ఎలాంటి ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ కొనాలి?

వీటివల్ల ప్రయోజనాలేంటో మనం చూశాం. మరి ఎలాంటి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను కొనాలి? మార్కెట్‌లో చాలా రకాల బ్యాండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ట్రాకర్‌ కొనేముందు ఏ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం..

మీకు ఏం కావాలి?

ఓ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ కొనే ముందు అసలు మీరు దేనికోసం వాడాలని అనుకుంటున్నారో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్‌లో వెయ్యి నుంచి రూ. 20 వేల వరకు ధరల్లో ఈ ట్రాకర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇప్పుడిప్పుడే వర్కవుట్స్‌ మొదలు పెట్టాలి అనుకుంటున్న వాళ్లకు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో కూడిన కాస్ట్‌లీ ట్రాకర్‌ అవసరం ఉండదు. కేవలం రోజూ ఎంత మేర నడుస్తున్నారు? ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నారులాంటి బేసిక్‌ వివరాలు అందించే ట్రాకర్‌ అయితే చాలు. ఇలాంటివి చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు మీ గుండె వేగాన్ని రికార్డ్‌ చేసేవి.. మీ నిద్రను ట్రాక్‌ చేసేవి.. జీపీఎస్‌ కూడా ఉన్న ట్రాకర్స్‌ కూడా ఉంటాయి. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. కేవలం వాకింగ్‌, రన్నింగ్‌లు రికార్డు చేస్తే చాలు అనుకుంటే.. బేసిక్‌ మోడల్స్‌ ఏవైనా బాగానే ఉంటాయి.

అలా కాకుండా స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, మౌంటేన్‌ క్లైంబింగ్‌లాంటి యాక్టివిటీస్‌ని కూడా రికార్డు చేయాలని అనుకుంటే.. అడ్వాన్స్‌డ్‌ మోడల్స్‌కు వెళ్లాలి. ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌.. మీ గుండె వేగాన్ని బట్టి మీరు శ్వాస తీసుకోవాల్సిన విధానాన్ని కూడా సూచిస్తాయి. ఇదే హార్ట్‌ రేట్‌ ఆధారంగా మీరు కంటి నిండా నిద్రపోతున్నారా లేదా అన్న విషయాన్ని కూడా పసిగడతాయి.

డిస్‌ప్లే ఉన్నవే బెటర్‌

ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ రోజులో చాలా వరకు మీ చేతికి ఉంటుంది. అందువల్ల మీ రిస్ట్‌కి సౌకర్యంగా ఉండే బ్యాండ్స్‌ ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. వీటికి డిమాండ్‌ ఎక్కువ కావడంతో రోజూ కొత్త కొత్త డిజైన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి.

వీటిలో బేసిక్‌ మోడల్స్‌, స్పోర్ట్స్‌ మోడల్స్‌ ఉంటాయి. మరికొన్ని స్మార్ట్‌ వాచ్‌లలాగా ఉంటాయి. మీ టేస్ట్‌, లైఫ్‌స్టైల్‌కి తగ్గట్లు వీటి నుంచి ఎంపిక చేసుకోవచ్చు. ఇక వీటిలో కొన్ని ఎల్‌ఈడీ డిస్‌ ప్లేతో వస్తుండగా.. మరికొన్ని ఎల్‌ఈడీ లైట్స్‌తో ఉన్నాయి. మన రోజువారీ ఫిట్‌నెస్‌ను తెలుసుకోవాలనే వీటిని పెట్టుకుంటాం కాబట్టి.. వీటిలో డిస్‌ప్లే ఉన్నవైతేనే బెటర్‌. డిస్‌ప్లేతోపాటు టచ్‌స్క్రీన్‌ కూడా ఉన్న ట్రాకర్స్‌ ఉన్నాయి.

డిస్‌ప్లే లేనివైతే మళ్లీ మీరు మీ ఫోన్‌తో లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఇక వీటి బ్యాటరీ లైఫ్‌ కూడా సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజుల పాటు ఉంటుంది. కొన్ని మోడల్స్‌ 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌తో వస్తున్నాయి. బ్యాటరీ లైఫ్‌ అయిపోతే వాటిని మార్చుకునే వీలు కూడా ఉంటుంది.

వాటర్‌ రెసిస్టెంట్‌ అవసరమా?

వాచ్‌లలో వాటర్‌ రెసిస్టెంట్‌ ఉన్నట్లే ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌లోనూ ఉన్నాయి. మీరు రోజూ స్విమ్మింగ్‌ చేస్తున్నా లేదా చెమట ఎక్కువగా వస్తున్నా.. వర్షంలో తడిసే అవకాశం ఉన్నా.. వాటర్‌ రెసిస్టెంట్‌ ట్రాకర్స్‌ తీసుకోవడం మంచిది.

ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కువ దూరంపాటు సైక్లింగ్‌లాంటివి చేసే వాళ్లు జీపీఎస్‌ ఉన్న అడ్వాన్స్‌డ్‌ మోడల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వాతావరణ సమాచారం ఇవ్వడంతోపాటు ఎంత వేగంతో సైక్లింగ్‌ చేశారు? ఎంత దూరం వెళ్లారులాంటి వాటిని సరిగ్గా లెక్కిస్తాయి. కొన్ని ఫిట్‌నెస్‌ ట్రాకర్లకు మీ ఫోన్‌లోని జీపీఎస్‌తోనూ లింక్‌ చేసుకునే వీలుంటుంది.

లేటెస్ట్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌ ఇవీ

ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరిగిపోతుండటంతో రోజుకో మోడల్‌ మార్కెట్‌లోకి వస్తోంది. ఇందులో వెయ్యి నుంచి రూ.20 వేల వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్‌తో పది వేల లోపు ధరల్లోనే మంచి మోడల్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాటిలో బెస్ట్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.

శామ్‌సంగ్‌ గేర్‌ ఫిట్‌ 2 ప్రో

హార్ట్‌రేట్‌ ట్రాకర్‌, జీపీఎస్‌, వాటర్‌ప్రూఫ్‌లాంటి అన్ని టాప్‌ ఫీచర్స్‌ ఈ మోడల్‌లో ఉన్నాయి. ఒకటిన్నర అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లతో పని చేస్తుంది. డిజైన్‌ కూడా చాలా బాగుంది. దీని ధర అమెజాన్‌లో రూ. 7,299గా ఉంది. ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ బ్యాటరీ ఒకసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 3 రోజులపాటు వస్తుంది.

హువావీ బ్యాండ్‌ 2 ప్రో

శామ్‌సంగ్‌ కంటే చాలా తక్కువ ధరలో దాదాపు అవే ఫీచర్స్‌తో ఉన్న ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ఇది. స్లిమ్‌గా కనిపిస్తూ చూడగానే అట్రాక్ట్‌ చేస్తుంది. పైగా బ్యాటరీ స్టాండ్‌బై టైమ్‌ 21 రోజులు కావడం విశేషం.

హార్ట్‌రేట్‌, జీపీఎస్‌, స్లీప్‌ ట్రాకింగ్‌, వాటర్‌ప్రూఫ్‌ ఇలా అన్ని ఫీచర్స్‌ ఉన్నాయి. పైగా ధర కూడా రీజనబుల్‌గానే ఉంది. అమెజాన్‌లో ఈ మోడల్‌ ప్రస్తుతం రూ. 4,990కే అందుబాటులో ఉంది.

అమేజ్‌ఫిట్‌ బిప్‌ (Amazfit Bip)

స్మార్ట్‌వాచ్‌లాగా కనిపించే ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ఇది. నెల రోజుల బ్యాటరీ లైఫ్‌ దీని ప్రత్యేకత. జీపీఎస్‌, హార్ట్‌రేట్‌ ట్రాకర్‌, స్లీప్‌ ట్రాకింగ్‌, మల్టీ స్పోర్ట్‌ ట్రాకింగ్‌, వాటర్‌ప్రూఫ్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్క్రీన్‌ ఉంటాయి. స్టైలిష్‌ డిజైన్‌ కావాలి అనుకున్న వాళ్లు ఈ మోడల్‌కు వెళ్లొచ్చు. దీని లుక్‌ ఆపిల్‌ వాచ్‌లాగా కనిపిస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ. 4,599గా ఉంది.

ఫిట్‌బిట్‌ చార్జ్‌ 2

అసలు తొలి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ వచ్చింది ఈ ఫిట్‌బిట్‌ కంపెనీ నుంచే. 2008లో రిలీజ్‌ చేశారు. ఈ సంస్థ నుంచి పది వేలలోపు రేంజ్‌లో ఉన్న బెస్ట్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ఈ ఫిట్‌బిట్‌ చార్జ్‌ 2. ఇందులో హార్ట్‌రేట్‌ ట్రాకర్‌, యాక్టివిటీ ట్రాకింగ్‌ ఉంటుంది. ఫోన్‌ ద్వారా జీపీఎస్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దీని ధర అమెజాన్‌లో రూ. 9,990గా ఉంది.

జీఓక్యూఐఐ వైటల్‌ 2.0 (GOQii Vital)

రెగ్యులర్‌ యాక్టివిటీస్‌తోపాటు మీ బ్లడ్‌ ప్రెజర్‌ (బీపీ)ని మోనిటర్‌ చేసే  ట్రాకర్‌ కావాలి అనుకుంటే… ఈ జీఓక్యూఐఐ వైటల్‌ 2.0కి వెళ్లడం మంచిది. బీపీతోపాటు హార్ట్‌ రేట్‌, కేలరీస్‌ రికార్డ్‌, ఎక్సర్‌సైజ్‌ లాగ్‌, యాక్టివ్‌ హవర్స్‌, స్లీపింగ్‌ ట్రాక్‌లాంటి ఎన్నో ఫీచర్స్‌ కూడా ఇందులో ఉన్నాయి.

వర్టికల్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. వాటర్‌రెసిస్టెంట్‌ కూడా. ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. బ్లూటూత్‌ ద్వారా మీ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. వీటన్నితోపాటు మూడు నెలల పాటు మీకు ఓ పర్సనల్‌ కోచ్‌, డాక్టర్‌ కూడా దీని ద్వారా అందుబాటులో ఉంటారు. దీని ధర అమెజాన్‌లో రూ. 1,749గా ఉంది.

హానర్‌ బ్యాండ్‌ 4

తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో ఉన్న మోడల్స్‌లో ఇదీ ఒకటి. టచ్‌తో కూడిన అమోలెడ్‌ కలర్‌ డిస్‌ప్లే, హార్ట్‌ రేట్‌, యాక్టివిటీ ట్రాకింగ్‌, స్విమ్మింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్లీపింగ్ ట్రాకింగ్‌లాంటి ఫీచర్స్‌ ఉన్నాయి.

పైగా వాటర్‌ రెసిస్టెంట్‌ కూడా. యూసేజ్‌ను బట్టి బ్యాటరీ ఆరు నుంచి 17 రోజుల వరకు వస్తుంది. దీని ధర అమెజాన్‌లో రూ. 2,970గా ఉంది.

ఎంఐ బ్యాండ్‌ 3 (Mi Band 3)

ఏ డివైస్‌నైనా సాధ్యమైనంత తక్కువ ధరల్లో అందించే షియోమీ సంస్థ నుంచి వచ్చిన ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ మోడల్‌ ఎంఐ బ్యాండ్‌ 3. రోజువారీ యాక్టివిటీస్‌తోపాటు హార్ట్ రేట్‌, స్లీప్‌ ట్రాకింగ్‌ ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. ఇక బ్యాటరీ లైఫ్‌ అయితే 25 నుంచి 30 రోజులు ఉండటం విశేషం.

కాకపోతే మీ హార్ట్‌రేట్‌ మోనిటర్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచితే మాత్రం రెండు రోజుల కన్నా ఎక్కువ రాదు. గంటలోనే ఫుల్‌ చార్జ్‌ అవుతుంది. దీనికితోడు వెదర్‌ ఫోర్‌క్యాస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌, ఫోన్‌ లొకేటర్‌లాంటి ఫీచర్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. దీని ధర అమెజాన్‌లో రూ. 1,599గా ఉంది.

రూ. 1,500లోపు కూడా ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ అందుబాటులో ఉంది. ఎంఐ నుంచి బ్యాండ్‌, బ్యాండ్‌ 2, హెచ్‌ఆరెక్స్‌ ఎడిషన్‌.. ఫాస్ట్‌ట్రాక్‌ రెఫ్లెక్స్‌, హెల్త్‌సెన్స్‌లాంటి ట్రాకర్స్‌ తక్కువ ధరల్లో మన రోజువారీ యాక్టివిటీస్‌ను ట్రాక్‌ చేయగలవు.

ఇవి కూడా చదవండి

ఒంట్లో కొవ్వు మలినాలు తగ్గించడం ఎలా?

Previous articleఓకే గూగుల్ .. నువ్వు ఏవిధంగా సాయపడగలవు?
Next articleఇన్ఫోసిస్‌ లో ఏం జరిగింది? షేర్ విలువ ఎందుకు పడిపోతోంది?