IVF process: ఐవీఎఫ్ ఎప్పుడు? ఎందుకు? ఎలా? ఖర్చెంత? రిస్క్ ఏంటి?

newborn baby
అప్పుడే పుట్టిన చిన్నారి

ఐవీఎఫ్ అంటే ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌. దీనినే వాడుక భాషలో టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ అంటారు. మరి ఐవీఎఫ్ ప్రక్రియ ఎవరికి అవసరం? ప్రొసీజర్‌ ఏంటి? సక్సెస్‌ రేట్‌ ఎలా ఉంటుంది? రిస్క్‌ ఏంటి? సంతానం లేనివాళ్లంతా తప్పనిసరిగా ఈ ప్రక్రియను అనుసరించాల్సిందేనా? తదితర విషయాలను ఈ కథనంలో డియర్‌ అర్బన్‌ మీకు అందిస్తోంది.

What is ivf: ఐవీఎఫ్‌ అంటే ఏమిటి?

ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) చికిత్స సంతాన లేమి గల వారికి పునరుత్పత్తి ప్రక్రియను వైద్య సహాయం ద్వారా జరిపి పిల్లలు కలిగేలా చేయడం. అంటే అండం, వీర్యం శరీరంలో కాకుండా బయట ల్యాబ్‌లో ట్యూబ్‌లో లేదా డిష్‌లో ఫలదీకరణ జరగడం. ఐయూఐ వంటి పద్ధతులు విఫలమైనప్పుడు సంతాన సాఫల్యతకు చివరగా ఈ ప్రక్రియను ఆశ్రయిస్తారు.

IVF procedure: ఐవీఎఫ్‌ ప్రొసీజర్‌ ఎలా?

మగవారి నుంచి వీర్యకణాలు, ఆడవారి నుంచి అండాలు సేకరించి ల్యాబ్‌లో ఫలదీకరణ జరిపి తిరిగి గర్భాశయంలో ప్రవేశపెట్టడం.. ఫలితం రావడానికి 28 రోజులు పడుతుంది.

అండాశయం (ఓవరీ) నుంచి అండాలు సేకరించే ప్రక్రియః

ఐవీఎఫ్‌ ప్రక్రియ సఫలం కావాలంటే ఎక్కువ అండాలు అవసరం. ఇందుకోసం హార్మోన్‌ ఇంజెక్షన్‌ను పది రోజుల పాటు ఇస్తారు. పీరియడ్స్‌ ప్రారంభమైన రెండో రోజు నుంచి ఈ ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ ఇంజెక్షన్‌ వల్ల అండాలు పెరుగుతాయి. ఇంజెక్షన్‌ మొదలుపెట్టాక నాలుగో రోజు నుంచి రోజూ స్కాన్‌ చేస్తారు. కొన్ని రక్త పరీక్షలు కూడా చేస్తారు. డోస్‌ సరిపోతుందా లేదా అనేది చెక్‌ చేస్తారు.

పది రోజుల్లో ఈ అండాలు తగిన పరిమాణంలో పెరుగుతాయి. ఒక ఆరు నుంచి ఎనిమిది అండాలు 18 మి.మీ. మేరకు పెరిగితే అండాల సేకరణ ప్రక్రియ మొదలుపెడతారు.

స్కాన్‌ ద్వారా తెలుసుకుని చివరగా అండాల సేకరణకు అనస్తీషియా ఇచ్చి స్కాన్‌ చేస్తూ నీడిల్‌ ద్వారా సేకరిస్తారు. ఎలాంటి ఆపరేషన్‌ ఉండదు. కేవలం స్కాన్‌ చేస్తూ నీడిల్‌ ద్వారా సేకరిస్తారు. ఎలాంటి నొప్పి ఉండదు. అయితే ఆసుపత్రిలో ఒక ఏడెనిమిది గంటలు గడపాల్సి వస్తుంది. సేకరించిన అండాలను ఇంక్యుబేటర్‌లో పెడతారు.

వీర్యకణాల సేకరణ: ఇక్సీ ప్రక్రియ

అదే రోజు భర్త నుంచి వీర్యకణాలు తీసుకుని మంచి కణాలను వేరు చేసి హై మొటైల్‌ కాన్సంట్రేట్‌ను తయారు చేస్తారు. మగవారిలో వీర్యకణాల సంఖ్య బాగా తక్కువ ఉన్నప్పుడు, మొటì లిటీ రేటు తక్కువగా ఉన్నప్పుడు వీరి నుంచి నేరుగా వీర్యసేకరణ జరిపి ఐవీఎఫ్‌ ప్రక్రియను పూర్తిచేయలేం. ఈ సందర్భంలో మైక్రో మానిప్యులేటర్‌ అనే మిషన్‌ ద్వారా ఒక స్పెర్మ్‌ను సేకరించి నీడిల్‌ ద్వారా అండంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ఇక్సీ.. అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ అంటారు.

ఎంబ్రియోగా మారే ప్రక్రియ..

సేకరించిన అండాలను, హై మొటైల్‌ కాన్సంట్రేట్‌ను ల్యాబ్‌లో ఓ డిష్‌లో లేదా ట్యూబ్‌లో కలిపి ఉంచుతారు. ఇప్పుడు ఫర్టిలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 24 గంటల్లోనే ఎంబ్రియో(పిండం) తయారవుతుంది. మూడో రోజు లేదా ఐదో రోజు.. మొత్తంగా ఐదు రోజులలోపు ఈ పిండాన్ని తిరిగి గర్భాశయంలోకి చిన్న ట్యూబ్‌ ద్వారా ప్రవేశపెడతారు.

ఎండోమెట్రియమ్‌ బాగా ఉందా లేదా చూశాక ప్రవేశపెడతారు. ఇందుకు మహిళ నాలుగైదు గంటలు ఆసుపత్రిలో గడపాల్సి వస్తుంది. ప్రవేశపెట్టాక ఒక పదిహేను రోజులపాటు రోజూ చికిత్స ఉంటుంది. కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఐవీఎఫ్‌ సైకిల్‌ మొదలుపెట్టాక 28 రోజులకు ఫలితం తెలుస్తుంది.

ఐవీఎఫ్ లో మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీస్:

నాణ్యమైన పిండాలను ఎంచుకునేందుకు వీలుగా ఎక్కువ సంఖ్యలో అండాలు, ఎక్కువ సంఖ్యలో వీర్యకణాలు సేకరించి ఫలదీకరణ జరిపిస్తారు. సక్సెస్‌ రేటు సగమే ఉంటుంది కాబట్టి ఇందులో దాదాపుగా మూడు పిండాలు ఎంచుకుని గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మిగిలినవాటిని ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా వినియోగించుకునేలా ఫ్రోజెన్‌చేస్తారు.

గర్భాశయంలోకి ప్రవేశపెట్టిన ఎంబ్రియోల్లో ఒకటి ఆరోగ్యంగా ఎదిగితే ఒకరు, రెండు ఆరోగ్యంగా ఎదిగితే కవల పిల్లలు, మూడూ ఆరోగ్యంగా ఎదిగితే ముగ్గురు పిల్లలు పుడతారు.

సహజంగా వీర్యకణాలు, అండం గర్భంలో ఎలాగైతే ఫలదీకరణ చెందుతుందో… దానినే ల్యాబ్‌లో జరిపి ట్యూబ్‌ ద్వారా గర్భంలో ప్రవేశపెట్టడమే ఐవీఎఫ్‌ ప్రక్రియగా ఇప్పుడు అర్థమైంది కదా..

వైద్య సలహా ఎప్పుడు అవసరం అవుతుంది?

పెళ్లి అయ్యాక కొద్దిరోజులు సాధారణంగా అప్పుడే గర్భం వద్దనుకుంటారు. ఒకవేళ గర్భం కావాలనుకుని, సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒకటి నుంచి మూడేళ్లలో సహజంగా గర్భం రానిపక్షంలో వైద్య సహాయం కోసం ఆశ్రయించవచ్చు.

సంతానం కలగకపోవడానికి ఈ కారణాలు అయిఉండొచ్చు..

1. భర్తలో వీర్యకణాలు తక్కువ ఉన్నప్పుడు
2. ఉన్న వీర్యకణాల్లో ఆరోగ్యకరమైనవి లేనప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు
3. భార్యలో నెలసరి చిక్కులు
4. అండాశయాల్లో నీటి బుడగలు
5. హార్మోన్ల లోపాలు ఉన్నప్పుడు
6. అండాలు విడుదల కానప్పుడు
7. అండ వాహిక మూసుకుపోయినప్పుడు
8. వయసు పైబడిన వాళ్లు
9. కారణం లేకుండా సంతాన సాఫల్యత లేనప్పుడు
10. కుటుంబంలో జన్యుపరమైన సమస్యలు

ఐవీఎఫ్‌ ఎప్పుడు అవసరమవుతుంది?

ఐవీఎఫ్‌ ప్రక్రియను వైద్యులు ఎప్పుడు ఎంచుకుంటారంటే.. ముందుగా భార్యాభర్తలు ఇద్దరినీ పరీక్షిస్తారు. భర్తలో స్పెర్మ్‌ కౌంట్‌ (వీర్య కణాలు) సరిగ్గా ఉందా? వీర్యకణాల కదలిక (మొటాలిటీ రేటు) సరిగ్గా ఉందా? వాటి ఆకారం తగిన రీతిలో ఉందా? వంటివాటిని పరీక్షిస్తారు.

ఇందుకు వారు స్పెర్మ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే అతడికి ఇతర అనారోగ్యం ఏదైనా ఉందా చూస్తారు. యూరిన్‌ కల్చర్, స్పెర్మ్‌ కల్చర్, షుగర్, థైరాయిడ్, బ్లడ్‌ కౌంట్, వైరల్‌ టెస్టులు వంటివి చేస్తారు.

మహిళల్లో ఈ పరీక్షలు చేస్తారు..

మహిళలకు మూడు రకాలుగా పరీక్షిస్తారు. యుటెరస్‌ (గర్భాశయం) ఎలా ఉంది? ఫాలోపియన్‌ ట్యూబ్స్‌ ఎలా ఉన్నాయి? అండాశయం(ఓవరీ) ఎలా ఉంది చూస్తారు. ఓవరీస్‌లో అండాల ఉత్పత్తి సవ్యంగా ఉందా లేదా చూస్తారు.

ఉత్తత్తి లేకపోయినా, సరైన సమయంలో ఉత్పత్తి లేకపోయినా హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. ఫలదీకరణకు చోటు ఇచ్చేవి ఫాలోపియన్‌ ట్యూబ్స్‌. మరి ఈ ట్యూబ్స్‌ మూసుకుపోయి ఉన్నాయా? వాపు ఉందా? వంటి అంశాలు పరిశీలిస్తారు.

అలాగే యుటెరస్‌ను పరీక్షిస్తారు. ఫైబ్రాయిడ్స్‌ గానీ, పాలిప్స్‌ గానీ ఉంటే సరిచేస్తారు. గర్భ సంచి లైనింగ్‌ ఎలా ఉంది? ఐవీఎఫ్‌ ద్వారా అండం ఫలదీకరణ చెందాక ఇందులోకి ప్రవేశపెడితే గర్భ సంచి అందుకోగలుగుతుందా? అని పరీక్షిస్తారు.

అలాగే జనరల్‌ హెల్త్‌ కూడా చెక్‌ చేస్తారు. థైరాయిడ్, షుగర్, ప్రొలాక్టిన్‌ వంటివి చెక్‌ చేస్తారు. ఇద్దరికీ వైరల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు.

ఐవీఎఫ్ కు ముందుగా ఇతర చికిత్స పద్ధతులు

వైద్యం ద్వారా ఆరోగ్యం సరిచేసి మామూలు పద్ధతుల్లో గర్భం దాల్చేందుకు వైద్యులు సహాయం చేస్తారు. కానీ గర్భాశయ గొట్టాలు మూసుకుపోవడం, వీర్యకణాలు చాలా తక్కువగా ఉండడం, ఆరోగ్యంగా లేకపోవడం, సమయానికి అండం విడుదల కాకపోవడం, ఇలాంటి పెద్ద సమస్యలు ఉంటే ఐవీఎఫ్‌ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. ఈ ప్రక్రియ ఒక సైకిల్‌లో సక్సెస్‌ కాకపోవచ్చు. కొందరిలో నాలుగైదుసార్లు అవసరం కావొచ్చు.

ఐవీఎఫ్ ‌లో ఎదురయ్యే సమస్యలు ఏంటి?

– ఐవీఎఫ్‌ సక్సెస్‌రేటు 40 శాతం మాత్రమే అంటారు వైద్యులు. అందువల్ల ఐవీఎఫ్‌ ప్రక్రియను ఒకటి కంటే ఎక్కువసార్లు ఆశ్రయించాల్సి రావొచ్చు.
– ఒకవేళ గర్భంలో ప్రవేశపెట్టిన మూడు ఎంబ్రియోలు ఆరోగ్యంగా ఎదిగితే గర్భాశయంలో ముగ్గురికి సరిపడా చోటు ఉండదు. అందువల్ల ప్రసవం ముందస్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏడో నెల లేదా ఎనిమిదో నెలలో రావొచ్చు. ఇలాంటప్పుడు పిల్లల్లో ఎదుగుదల సమస్యలు తలెత్తే రిస్క్‌ ఉంటుంది. ట్విన్‌ ప్రెగ్నెన్సీకి రిస్క్‌ తక్కువ.
– కృత్రిమ పద్ధతుల్లో సంతాన సాఫల్యత సాధిస్తున్నందున దీనిని హైరిస్క్‌ ప్రెగ్నెన్సీగా వ్యవహరిస్తారు.
– మహిళల్లో కొన్ని సాధారణ సమస్యలు రావొచ్చు. వెయిట్‌ పెరగొచ్చు. థైరాయిడ్, షుగర్‌ వంటివి రావొచ్చు. అందువల్ల 9 నెలలపాటు వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

IVF Cost: ఐవీఎఫ్ కు ఎంత ఖర్చవుతుంది?

ఐవీఎఫ్‌ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నదే. అండాల సేకరణ వంటి ప్రక్రియకు ఇప్పటికీ ఇంకా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఇంజెక్షన్లే వినియోగిస్తున్నారు. ల్యాబ్‌ ఫీజు సుమారుగా రూ. లక్ష ఉంటుంది. దీనికి తోడు స్కానింగ్, ఇంజెక్షన్ల ఖర్చు ఉంటుంది. ఇది సుమారుగా రూ. 50 వేల నుంచి 80 వేల వరకు ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి కొద్దిగా ఖర్చులో మార్పు ఉండొచ్చు.

మొత్తంగా రూ. 1.50 నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేసుకోవచ్చు. అయితే ఒకసారి ఫెయిలైనప్పుడు అప్పటికే ఉన్న ఫ్రోజెన్‌ ఎంబ్రియోలను ప్రవేశపెడతారు కాబట్టి ఖర్చు తక్కువగా ఉంటుంది.

IVF precautions: ఐవీఎఫ్‌ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలిః

– ఐవీఎఫ్ ప్రక్రియలో సాఫల్యత రేటు తక్కువ కాబట్టి.. ముందుగా మానసిక సిద్ధంగా ఉండాలి.
– ప్రక్రియకు వెళ్లే ముందు మనలో ఉన్న ఆరోగ్య సమస్యలను సరిచేసే ప్రయత్నం చేసినా.. అవి సఫలం కాక గర్భం నిలువక పోవచ్చు. అందువల్ల మిస్‌ కారేజ్‌ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
– హై రిస్క్‌ ప్రెగ్నెన్సీ కాబట్టి వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలి. ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతర మందులు వాడే ముందు డాక్టర్లను సంప్రదించాలి.
– వైద్యుల సలహా మేరకు ప్రెగ్నెన్సీ తరగతులకు హాజరుకావొచ్చు.
– అధిక బరువు పెరగకుండా కాపాడుకోవడం.

ముఫ్ఫై ఏళ్ల క్రితమే టెస్ట్‌ట్యూబ్‌ బేబీ

1978లో తొలిసారిగా టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ లేదా ఐవీఎఫ్‌ ప్రక్రియ ద్వారా సంతానం కలగడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఐవీఎఫ్‌ అమల్లో ఉంది. ఎగ్, స్పెర్మ్‌ జెనటిక్‌గా హె ల్తీగా ఉంటే సక్సెస్‌ రేటు 40 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. జెనటిక్‌గా సమస్యలు ఉంటే డోనర్స్‌ నుంచి ఎగ్‌ గానీ, స్పెర్మ్‌ గానీ తీసుకోవచ్చు. అప్పుడు సక్సెస్‌రేటు ఎక్కువగా ఉంటుంది.

ఇది కేవలం ఐవీఎఫ్ పై మీకు ప్రాథమిక అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన కథనం. వైద్యనిపుణులను సంప్రదించే ముందు మీకు ఎలాంటి బెరుకూ లేకుండా ఉండేందుకు, మీరు మరిన్ని సందేహాలు అడిగి వారి నుంచి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

  1. స్పెర్మ్‌కౌంట్‌ పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి
  2. ఆరోగ్యంగా ఉండేందుకు మార్గాలేంటి
  3. ఆర్గానిక్‌ వే జీవించడం ఎలా?
  4. మహిళల్లో అవసరమయ్యే ఆరోగ్య పరీక్షలు ఏంటి
  5. సిగరెట్ మానాలంటే ఇలా చేయండి
Previous articleరెమ్డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూలం
Next articleఆమె మనసులో ఏముంది?