పవన్‌ కళ్యాణ్‌ బలగం బండి సంజయ్‌కు బలమవుతుందా?

bandi sanjay

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పవర్‌ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో సోమవారం ఇక్కడ భేటీ కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. పవన్‌ కళ్యాణ్‌ పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు లాక్‌డౌన్‌కు కొద్దిరోజుల ముందు బండి సంజయ్‌ బీజేపీ తెలంగాణ పగ్గాలు చేపట్టారు. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా ఆయనకు ఉన్న ఫ్యాన్స్‌ బలగం తక్కువేమీ కాదు.

తెలంగాణ బీజేపీ నాయకత్వంలో గడిచిన 20 ఏళ్లుగా కొత్త రక్తానికి చోటు దక్కలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డ బండి సంజయ్‌.. ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి చేజిక్కించుకున్నారు.

అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు ఆయనకు ఎలాంటి మొహమాటం ఉండదు. బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి దక్కగానే సోషల్‌ మీడియాలో జైజైల హోరెత్తింది. ఇప్పుడు తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌ పార్టీ నేరుగా బీజేపీతో పొత్తు లేకపోయినప్పటికీ.. ఆయన ఫ్యాన్స్‌ మాత్రం బండి సంజయ్‌కు అండగా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎంతమేరకు లాభం?

బీజేపీ ఏదైనా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి రావడానికి కారణాలను విశ్లేషిస్తే.. చిన్నచిన్న పార్టీలు, బలమైన సామాజిక వర్గాలను కలుపుకుపోవడం ప్రధానంగా కనిపిస్తుంది. అందువల్ల బండి సంజయ్, పవన్‌కళ్యాణ్‌ల సమావేశం పైకి కర్టెసీ మీటింగ్‌లా కనిపిస్తున్నా.. దీర్ఘకాలిక సంబంధాలను కొట్టిపారేయలేం.

ఇప్పటికిప్పుడు పవన్‌కళ్యాణ్‌తో పనిలేకపోయినా, ఓట్ల రాజకీయాలేవీ లేకపోయినా, ఈ సమావేశం ఇరు వర్గాల అభిమానులు ఐక్యతను ప్రదర్శించేందుకు దోహదం చేస్తుంది. హైదరాబాద్‌లోని పవన్‌ కళ్యాణ్‌ ఆఫీస్‌లో ఈ మీటింగ్‌ దాదాపు గంటపాటు జరిగింది.

బండి సంజయ్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన పవన్‌.. సమావేశం పట్ల చాలా సంతోషం వ్యక్తంచేశారని సమాచారం. ఇరు రాష్ట్రాల్లో రాజకీయాలపై సుదీర్ఘ చర్చలకు వేదికగా నిలిచిన ఈ సమావేశం అటు బీజేపీలో, ఇటు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది.

బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను విభిన్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు కూడా పలు కార్యక్రమాలను అమలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోతందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే తెలంగాణ బీజేపీలోని సీనియర్ నేతలు, 20 ఏళ్లుగా పాతుకుపోయిన నేతలు బండి సంజయ్ కు ఎంతవరకు సహకరిస్తారన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. పార్టీ నాయకులను, శ్రేణులను కలుపుకుపోతూ, పార్టీ వెలుపలి శక్తులను కూడా సమీకరిస్తే తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ బలగం ఎంత వరకు సహకరిస్తుందో వేచి చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ లో ఒకే సీటుకు పరిమితమైన పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడగలరన్న ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది. కానీ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన వ్యూహాలు గమనిస్తే అన్ని శక్తులనూ సమీకరించి బలమైన శక్తిగా ఎదిగిందన్న సంగతిని విస్మరించలేం.

ఇవీ చదవండి

మీ కలల వేటలో ఫెయిల్యూర్ వెంటాడుతోందా?

Previous articleమూవీ రివ్యూ: ఆర్టికల్ 15 : ముగ్గురమ్మాయిలపై గ్యాంగ్ రేప్, హత్య
Next articleకరోనా వైరస్ ‌పై తొలి సినిమాః లాక్‌డౌన్‌లోనే షూటింగ్‌ చేసిన వర్మ