లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ లాక్‌డౌన్ 5.0 కేవలం కంటైన్‌మెంట్ జోన్లకే వర్తిస్తుంది. కంటైన్‌మెంట్ జోన్లు కాని ప్రాంతాల్లో విడతల వారీగా కార్యకలాపాలు పునరుద్ధరించుకోవచ్చని స్పష్టం చేసింది.
ఫేజ్–1 లో జూన్ 8 నుంచి మతపరమైన స్థలాలు, ప్రార్థన మందిరాలను ప్రజల దర్శనార్థం తెరుస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. అలాగే షాపింగ్ మాల్స్ తెరుస్తారు.
ఫేజ్–2లో రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకుంటాయి. రాష్ట్రాలు పాఠశాలలు, కళాశాలల స్థాయిలో తల్లిదండ్రులతో చర్చిస్తాయి. వారి ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ఈ విద్యా సంస్థలు తెరవడంపై జూలై నెలలో నిర్ణయం తీసుకుంటారు.
ఫేజ్ 3 ఇలా
ఫేజ్–3లో పరిస్థితుల అంచనాను బట్టి ఈ కింది కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు తేదీలు ప్రకటిస్తారు.
1) అంతర్జాతీయ విమాన సర్వీసులు
2) మెట్రో రైళ్లు
3) సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, సమావేశ మందిరాలు, ఈ కోవలోకి వచ్చేవి.
4) సామాజిక, రాజకీయ, క్రీడాపరమైన, వినోదపరమైన, బోధనపరమైన, సాంస్కృతిక, మతపరమైన వేడుకలు, ఇతర భారీ సమావేశాలు
కర్ఫ్యూ కొనసాగింపు
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తుల కదలికలపై పూర్తిగా నిషేధం ఉంటుంది.
కంటైన్‌మెంట్ జోన్లలో ఇలా
1) లాక్‌డౌన్ కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు కొనసాగుతుంది.
2) కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను అనుసరించి జిల్లా యంత్రాంగాలు కంటైన్‌మెంట్ జోన్లను ప్రకటించవచ్చు.
3) కట్టడి జోన్లలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంది. వైద్య అత్యవసర సేవలకు, నిత్యావసర వస్తువుల రవాణాకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
4) రాష్ట్రాలు కట్టడి జోన్ల వెలుపల బఫర్ జోన్లను కూడా గుర్తించాలి. ఇక్కడ కొత్త కేసులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ బఫర్ జోన్లలో కూడా జిల్లా యంత్రాంగాలు తగిన ఆంక్షలు విధించవచ్చు.
ప్రత్యేక పాస్‌లు అవసరం లేదు
– రాష్ట్రాలు అవసరాన్ని బట్టి కంటైన్‌మెంట్ జోన్లు కాని ప్రాంతాల్లో వివిధ కార్యకలాపాల నిషేధం విధించవచ్చు.
– వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రత్యేక పాస్, అనుమతి పొందాల్సిన అవసరం లేదు.
– రాష్ట్ర ప్రభుత్వం విధించే ఆంక్షలపై ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి.
– 65 ఏళ్ల వయసు పైబడిన వారు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి.
ఇవీ చదవండి