కరోనా చికిత్స కోసం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కూడా సిద్ధమైంది. సోమవారం నుంచే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దీని ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్టు హెటిరో డ్రగ్స్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
కోవిఫర్ బ్రాండ్‌నేమ్‌తో ఇది మార్కెట్లోకి రానున్నట్టు హెటిరో డ్రగ్స్ తెలిపింది. ఈ సంస్థ హైదరాబాద్‌కు చెందినది. దీని ఛైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి ‘క్లినికల్ ట్రయల్స్ జరుపుకొని వస్తున్న కోవిఫర్ కోవిడ్ నియంత్రణలో ఒక గేమ్ చేంజర్‌గా ఉండబోతోంది’ అని పేర్కొన్నారు.
కోవిడ్ –19కు చికిత్సగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలను సాధించినట్టు ఏప్రిల్ 29న అమెరికా కంపెనీ గిలియాడ్ సైన్సెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎబోలా వైరస్ చికిత్సలో వాడే ఈ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను కోవిడ్–19 వ్యాధికి నేరుగా ఉపయోగించేలా గిలియాడ్ సైన్సెస్ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
397 మంది కోవిడ్ పేషెంట్లపై ట్రయల్స్ చేయగా రెమ్‌డెసివిర్ కోవిడ్ వైరస్‌ను నియంత్రించడంలో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని గిలియాడ్‌సైన్సెస్ తెలిపింది.
ఈ ఇంజెక్షన్‌ను ఇవ్వగా వెంటిలేటర్ అవసరం లేకుండానే న్యూమోనియో నుంచి కూడా కరోనా పాజిటివ్ రోగులు కోలుకున్నట్టు తెలిపింది.
గిలియాడ్ సైన్సెస్ ఆవిష్కరించిన ఈ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను భారత మార్కెట్లో విక్రయించేందుకు హెటెరో డ్రగ్స్, సిప్లా కంపెనీలు లైసెన్స్ తీసుకున్నాయి.
కోవిడ్ చికిత్స కోసం ఫాబిఫ్లూ టాబ్లెట్ విక్రయానికి అనుమతి లభించిందని శనివారం గ్లెన్‌మార్క్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ చికిత్స కోసం ఇంజెక్షన్లు, టాబ్లెట్లు అందుబాటులోకి రావడం గొప్ప ఊరటనిచ్చే అంశం.