జాబ్‌ గురించి టెన్షన్‌గా ఉందా? ప్లాన్‌ బి రెడీ చేద్దాం రండి..!

job tension
Photo by Tim Gouw from Pexels

వ్యాపారాలేవీ నడవక జాబ్ ఉంటుందో ఊడుతుందోనన్న టెన్షన్ అందరినీ తరుముతోంది. మందుల్లేకపోవడంతో కరోనా వస్తే బతుకుతామో లేదోనన్న భయానికి తోడు.. ఉద్యోగ అభద్రతతో సహజంగానే మనసంతా ఆందోళనగా ఉంటుంది. దేనిపై ఆసక్తి కనిపించదు. దేనిపైనా మనసు లగ్నం కాదు. రోజువారీ పనులపై కూడా ఆసక్తి సన్నగిల్లుతుంది. నిరాశగా, చాలా డల్‌గా ఉంటుంది. నిద్ర పట్టకపోవచ్చు. భవిష్యత్తు ఎలా అన్న బెంగ వెంటాడొచ్చు..

కానీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎదురై.. మానసికంగా కుంగిపోయి.. మళ్లీ నిలదొక్కుకున్నవారెంత మంది లేరు. కరోనా కాకపోవచ్చు.. కానీ ఉద్యోగాలు పోవడం ఏదోరకంగా ఎంతోమందికి జరిగే ఉంటుంది. సరే.. మనవరకూ వచ్చిందనుకుందాం. సో వాట్‌? ఇంతకుముందే చెప్పుకున్నాం కదా.. జాబ్‌ పోతే ఏంటి? మీ కంటే తోపెవ్వరూ లేరని.. మరి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం..

కష్టాలు మబ్బుల్లాంటివి..

ఏ కష్టమూ జీవితాంతం ఉండదు. టీనేజీలో మనకు ప్రాణం కంటే ఎక్కువ అనుకునే విషయాలు పదేళ్లు పోయాక సిల్లీగా అనిపిస్తాయి. కెరీర్‌లో వచ్చే కష్టాలు కూడా అంతే. ఇంతకంటే మెరుగైన అవకాశం ఉండొచ్చు. మీరే బాస్‌గా ఎదిగేందుకు ఇదే టర్నింగ్‌ పాయింటేమో..

సో.. మానసికంగా అందుకు సిద్ధంగా ఉండండి. మీకు స్ఫూర్తినిచ్చే వీడియోలు, ప్రేరణగా నిలిచే వీడియోలు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. మీరు డల్‌గా ఉన్నప్పుడు ఒక్కసారి మోటివేషన్‌ వీడియోస్‌ చూడండి.

మీకోసం ఎవరూ రారు..

గుర్తుంచుకోండి. వచ్చిన సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. మీకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకురాకపోవచ్చు. ఎందుకంటే ఎవరి ప్రయాణం వారిదే. వారి ప్రయాణం విడిచిపెట్టి మీకు సాయంగా వస్తే.. వారి ప్రయాణంలో వెనకబడిపోతారన్న భయం వారికీ ఉంటుంది. అందువల్ల మీ సమస్యను మీరే  పరిష్కరించుకోండి. వెంటనే ఒక ప్లాన్‌ గీయండి.

మీ శక్తి సామర్థ్యాలు ఏంటి? మళ్లీ ఉద్యోగం చేయాలనుందా? లేక చిన్న వ్యాపారం పెట్టుకోవాలనుందా? దేంట్లో అభిరుచి ఉంది? ఏ పనిని మీరు ప్రాణంగా చేస్తారు? ప్రేమగా చేస్తారు? నోట్‌ చేయండి.. దాంట్లో ఉన్న అవకాశాలపై రీసెర్చ్‌ చేయండి. రీసెర్చ్‌ అంటే భయపడకండి. గూగులమ్మ ఉంది కదా.. వెతకండి.. ప్లాన్‌ బీ సిద్ధం చేయండి. ప్లాన్ బీ అంటే.. ప్రస్తుతం చేస్తున్న జాబ్ కు ప్రత్యామ్నాయ మార్గం సిద్ధం చేయడమే. స్టార్టప్ అయి ఉండొచ్చు.. లేక కొత్త ఉద్యోగం వేట కూడా అయి ఉండొచ్చు.

గ్రోత్ ఉన్న రంగాన్ని ఎంచుకోండి..

సమీప భవిష్యత్తులో గ్రోత్ ఉండే రంగాలేవో శోధించండి. ఉదాహరణకు దేశంలో ప్రస్తుతం డిజిటల్ మీడియా ఊపందుకుంటోంది. 2025 నాటికి డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ల టర్నోవర్ దేశంలో రూ. 58 వేల కోట్ల మేర ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ దిశగా వెళితే తక్కువ పెట్టుబడితో నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్యను పరిష్కరించగల యాప్ తయారు చేయడం, ఆకట్టుకునే వెబ్ సైట్ రూపొందించడం, యూట్యూబ్ ఛానెల్ లాంఛ్ చేయడం, ఇంకా ఏదైనా సరే.. ఒక సమస్యకు పరిష్కారం ఇవ్వగల ఆలోచన ఉంటే అది వర్కవుట్ అవుతుంది. ఇలా డిజిటల్ మార్గంలో వెళితే తక్కువ పెట్టుబడితో మీకు ప్లాన్ బీ సిద్ధమవుతుంది.

ఛేంజ్‌ మీకోసమే..

చాలా మంది ఛేంజ్‌ అంటే ఇష్టపడరు. సేఫ్‌ జోన్‌లో ఉండేందుకే మొగ్గు చూపుతారు. రిస్క్‌ లేకుండా, శ్రమించకుండా ఫలితం రాదు. పైసలు అంతకంటే రావు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్ర పోయేవరకు మీ లక్ష్యం మీకు ఒక సినిమాలా కనిపిస్తూ ఉండాలి. ప్లాన్‌ బీ లో లాభనష్టాలు బేరీజు వేయండి. కష్టపడగలరో లేదో అంచనా వేసుకోండి.

లోన్‌ తీసుకునేందుకు వెనకాడకండి..

ఎంతటి తోపు కంపెనీ అయినా లోన్‌ లేకుండా ఆ స్థాయిలో ఉండదు. మీరు ఒక వేళ మీ సొంతకాళ్లపై నిలబడాలనుకుంటే.. ఏదైనా స్టార్టప్‌ ఆలోచన ఉంటే లోన్‌ తీసుకునేందుకు వెనకాడకండి. మీ ఆలోచనలే మీ స్నేహితులెవరికైనా ఉంటే వారితో కలిసి అడుగు ముందుకేయండి. మీ వద్ద ఉన్న బడ్జెట్‌ ఎంత? లోన్‌ ఎంత తీసుకోవాలి? ఎప్పటివరకు ప్రతిఫలం వస్తుంది? అప్పటివరకు రోజువారీ జీవనం సాగేందుకు ఎన్ని డబ్బులు అవసరం? వంటి ప్రణాళికను రూపొందించుకుని ధైర్యంగా అడుగు ముందుకేయండి.

కుటుంబ సభ్యులను ప్రిపేర్‌ చేయండి..

మీ లక్ష్యాల వైపు మీరు దూసుకెళ్లాలంటే మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది. మీ లక్ష్యాలను మీ కుటుంబ సభ్యులకు వివరించండి. వారిని మీ ప్రయాణంలో అండగా నిలబడమని కోరండి. మీరు చెప్పే సర్దుబాట్లకు వారు సిద్ధమయ్యేలా ఒప్పించండి.

Previous articleభుజ్‌ : ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా : పాక్‌తో యుద్ధంలో ఆ మహిళ ఏంచేసింది?
Next articleకూరగాయలు వాష్ చేసే మార్గాలివిగో..