demat account meaning in telugu: డీమాట్ అకౌంట్ అంటే ఒక బ్యాంకు ఖాతాలాంటిది. బ్యాంకు ఖాతా అయితే నగదు దాచుకోవడానికి, తీసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో.. డీమాట్ అకౌంట్ ఉంటే మనం షేర్స్ దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్స్ కొనుగోలు చేయవచ్చు. అమ్మవచ్చు. ఆ షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకునేందుకే ఈ డీమాట్ ఖాతా ఉండాలి. ఈ డీమాట్ ఖాతాలను నిర్వహించే వ్యవస్థను డిపాజిటరీ అంటాం.
అందుకే డీమాట్ అకౌంట్‌ను డిపాజిటరీ అకౌంట్ అని కూడా అంటాం. ఇలా డిపాజిటరీ సేవలు నిర్వహించేందుకు డిపాజటరీ పార్టిసిపెంట్ల నెట్ వర్క్ ఉంటుంది. దీనినే డీపీ నెట్‌వర్క్ అని కూడా అంటారు. ఈ డీపీలను ఎన్‌ఎస్‌డీఎల్ నియమిస్తుంది. డీపీలు తప్పనిసరిగా సెబీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Demat account benefits: డీమాట్ అకౌంట్ ఉంటే ప్రయోజనం ఏంటి?
డీమాట్ అకౌంట్ ఉంటే షేర్లు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. భౌతికంగా దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటే నష్టభయం కూడా ఉండదు. పేపర్‌లెస్ వర్క్ కాబట్టి మన పని సులువు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, గోల్డ్ బాండ్లు, ఇలా అన్నీ ఒకే డీమాట్‌లో దాచుకోవచ్చు.
demat account opening: డీమాట్ ఖాతా ఎలా తెరవాలి?
ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, కాన్సిల్డ్ చెక్ ఉంటే చాలు మీరు మీ డీమాట్ ఖాతా తెరవొచ్చు. సాధారణంగా త్రీ ఇన్ వన్ అకౌంట్ తెరిచేందుకు అనేక స్టాక్ బ్రోకరేజీ సంస్థలు, బ్యాంకులు అవకాశం కల్పిస్తుంటాయి. అంటే బ్యాంకు ఖాతా, డీమాట్ ఖాతా, అలాగే ట్రేడింగ్ ఖాతా.. మూడూ కలిపి ఒకేసారి తెరవొచ్చు. ట్రేడింగ్ ఖాతా అంటే షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కేవలం కొన్ని క్లిక్‌ల ద్వారా కొనేందుకు, అమ్మేందుకు వీలు కల్పించే ఖాతా. ఇలా అవసరం లేదనుకుంటే కేవలం డీమాట్ ఖాతా తెరవొచ్చు.
ఐసీఐసీఐ డైరెక్ట్ , కోటక్ సెక్యూరిటీస్ , హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఏంజెల్ బ్రోకింగ్.. ఇలా అనేక సంస్థలు డీమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ తెరిచేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. షేర్లలో పెట్టుబడులు పెట్టాలంటే డీమాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా అవసరమైనందున వీటిలో ఒకటి ఎంచుకుని మీ పెట్టుబడుల ప్రస్తానం ప్రారంభించవచ్చు. త్రీ ఇన్ వన్ అకౌంట్ ఎంచుకునే ముందు ఎవరి సేవలు బాగున్నాయో శోధించి తీసుకోండి. రివ్యూలు చదవండి. గూగుల్ ప్లే స్టోర్లో కస్టమర్ల రివ్యూలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా చదవండి.