ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ఫ్రెషర్స్

intervies tips
Image Credit: Pexels

ఫ్రెషర్స్‌ ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై నా స్వానుభవంతో కొన్ని ఇంటర్వ్యూ టిప్స్‌తో పాటు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉండాలన్న అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకునే సమయంలో నేను ఇదే పద్ధతి పాటిస్తాను. ప్రస్తుత ఆర్టికల్‌లో నేను ఫ్రెషర్స్‌ను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాను.

ముఖ్యంగా ఐటీ సర్వీసెస్, టెలికామ్‌ సర్వీసెస్, స్టాఫింగ్‌ సర్వీసెస్‌ అందించే ఒక సంస్థకు హెచ్‌ఆర్‌ హెడ్‌గా నేను ప్రాథమిక అంశాలను ఇక్కడ రాస్తున్నాను.

కరిక్యులమ్‌ వీటే(సీవీ) తో మొదలు..

1. ఉద్యోగ ప్రయత్నంలో మొదట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఉద్యోగం ఎంత అవసరమో కెరీర్‌ను నిర్ణయించుకోవడం కూడా అత్యంత ముఖ్యమైన అంశం.

2. మనం చదివిన చదువు, మనకు ఉన్న స్కిల్స్‌ ఉద్యోగానికి ఉపయోగపడేలా ఉండాలి. అలాగే ఇష్టం లేని ఉద్యోగాలైతే రాణించలేం. 

3. సీవీ ప్రిపేర్‌ చేసేటప్పుడు ఫేక్‌ ఇన్ఫర్మేషన్‌ రాయాలన్న ఆలోచన రానివ్వకండి. అనుభవం లేనివారు సీవీని ఎంత క్లుప్తంగా ప్రిపేర్‌ చేస్తే అంత మంచిది. రెజ్యుమ్‌ క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని గుర్తించాలి.

4. మన కెరీర్‌ ఆబ్జెక్టివ్‌ను మనం సొంతంగా నిర్ణయించుకుని సీవీలో పొందుపరచాలి. అంతేతప్ప వేరేవారి కెరీర్‌ ఆబ్జెక్టివ్‌ను కాపీ చేసి ఫాలో అయితే మనం పెద్ద తప్పు చేసినట్టే. మనం సొంతంగా నిర్ణయించుకునే కెరీర్ ఆబ్జెక్టివ్‌ మనల్ని ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గా మాట్లాడేలా చేస్తుంది.

5. సీవీలో కెరీర్‌ ఆబ్జెక్టివ్‌ తరువాత టెక్నికల్‌ స్కిల్స్‌ పొందుపరచాలి. తరువాత క్వాలిఫికేషన్స్, లభించిన పర్సంటేజ్, చదివిన ఇనిస్టిట్యూట్‌ తదితర విషయాలు పొందుపరచాలి. లైవ్‌ ప్రాజెక్ట్స్‌ చేసి ఉంటే వాటి వివరాలు, చివరగా పర్సనల్‌ డీటైల్స్‌ పొందుపరచాలి.

6. మన స్ట్రెంత్స్, వీక్‌నెస్‌ సీవీలో యాడ్‌ చేయొద్దు. ఎందుకంటే స్ట్రెంత్‌ను ఇంటర్వ్యూయర్స్‌ పాజిటివ్‌గా తీసుకున్నా.. వీక్‌నెస్‌ను కొన్ని సందర్భాల్లో నెగెటివ్‌గా తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇంటర్వ్యూయర్‌ అడిగినప్పుడు మాత్రమే స్ట్రెంత్‌తో పాటు వీక్‌నెస్‌ చెప్పొచ్చు. వీక్‌నెస్‌ను కూడా ఏరియాస్‌ ఆఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌గా చెప్పాలి తప్ప వీక్‌నెస్‌ అని చెప్పొద్దు.

7. సీవీలో గ్రామెటికల్స్‌ మిస్టేక్స్‌ లేకుండా చూసుకోవాలి. అలైన్‌మెంట్స్‌ ప్రాపర్‌గా ఉండాలి. ఫాంట్‌ సైజ్‌ ప్రాపర్‌గా ఉండాలి. ఫార్మాట్స్‌పై శ్రద్ధ పెట్టాలి. పంక్చువేషన్స్‌పై నిర్లక్ష్యం వద్దు.

ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా సాగాలి?

1. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో భాగంగా ఆ సంస్థ పూర్తి వివరాలు, ఎలాంటి వ్యాపారం చేస్తుంది, వాటి అనుబంధ సంస్థలేంటి? ఎలాంటి సేవలు అందిస్తోంది? మన ప్రొఫైల్‌ ఆ కంపెనీ ఆఫర్‌ చేస్తున్న ఉద్యోగానికి సరిపడుతుందో లేదో చెక్‌ చేసుకోవాలి.

2. పనిచేయబోయే కంపెనీ గురించి అవగాహనతో వెళితే ఇంటర్వ్యూయర్‌ పాజిటివ్‌గా ఫీలవుతారు. సంస్థకు కాంపిటిటర్స్‌ ఎవరు? భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? తదితర అంశాలపై మనం చేసే రీసెర్చ్‌.. మన ఇంట్రెస్ట్‌ లెవెల్స్‌ను తెలియపరుస్తుంది.

3. మనం కంపెనీ సూటబులిటీని చెక్‌ చేసుకున్నట్టే కంపెనీ యాజమాన్యం కూడా సూటబుల్‌ అభ్యర్థిని మాత్రమే నియమించుకోవాలని చూస్తుందని గమనించాలి.

4. కంపెనీ పాటిస్తున్న ఎథిక్స్, నియమాలు, నిబంధనలు ఆయా కంపెనీల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. కొన్ని కంపెనీలు వాటి నుంచి కూడా ప్రశ్నిస్తాయి. 

5. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో అతిముఖ్యమైన పాయింట్‌ ఏంటంటే కంపెనీ అడిగిన రోల్‌ అండ్‌ రెస్పాన్సిబులిటీస్‌. అవి జాగ్రత్తగా చదివి.. అవి మనకు ఎలా సూటవుతాయి? ఆ రోల్‌లో మన రెస్పాన్సిబిలిటీ నిర్వహించేందుకు ఏమేరకు సంసిద్ధంగా ఉన్నామో ఇంటర్వ్యూలో చెప్పగలగాలి. ఆ రోల్‌లో మనకు ఉన్న అనుభవం ఏంటి? ఎలా సక్సెస్‌ కాగలమో చెప్పగలగాలి. రోల్‌ అండ్‌ రెస్పాన్సిబులిటీస్‌కు మనం తగినట్టు లేనిపక్షంలో ఇంటర్వ్యూకు వెళ్లడం వల్ల సమయం వృథా అనే చెప్పాలి. 

6. ఇంటర్వ్యూ పానెల్ లో ఇంటర్వ్యూయర్స్ ఎవరెవరు ఉన్నారో ముందే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నుంచి తెలుసుకోవడం వల్ల వారి ప్రొఫైల్ ను ముందే అర్థం చేసుకునే వీలుంటుంది. 

ఇంటర్వ్యూకు వెళ్లేముందు …

1. ఇంటర్వ్యూకి వెళ్లేముందు ఆ కంపెనీ అడిగిన డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి.

2. ఇంటర్వ్యూ జరిగే వెన్యూకు కనీసం అరగంట ముందే చేరుకోవాలి.

3. ఫార్మల్‌ డ్రెస్‌ ధరించాలి. మగవారైతే క్లీన్‌ షేవ్‌ చేసుకుని, అప్పీయరెన్స్‌ బాగుండేలా చూసుకోవాలి. మన కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గకుండా ఉండేలా కంఫర్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.

4. టైంపాస్‌కు వెళుతున్నట్టు కాకుండా.. ఇంటర్వ్యూను ఎలాగైనా జయించాలన్న లక్ష్యంతో వెళితే కొంతవరకు సక్సెస్‌ సాధించినట్టే. అయితే ఒక్కోసారి కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ సాధించాలన్న లక్ష్యం మీపై ఒత్తిడిని పెంచి ఇంటర్వ్యూను ఎదుర్కోవడంలో వైఫల్యాన్ని ఇస్తుంది. ఒత్తిడి లేకుండా, రిలాక్స్‌డ్‌గా ఇంటర్వ్యూకు హాజరుకండి.

ఇంటర్వ్యూ మొదలైంది..

1. బాడీ లాంగ్వేజ్, ప్రెజెంటేషన్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, కాన్ఫిడెన్స్‌ లెవల్‌లో ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్తపడాలి. అభ్యర్థి దృక్పథం సానుకూలంగా ఉండాలి. ఇంటర్వ్యూయర్‌తో మాట్లాడుతున్నప్పుడు అణకువగా ఉండాలి.

2. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఐ టూ ఐ కాంటాక్ట్‌ మేయింటేన్‌ చేయాలి. అది మనలోని కాన్ఫిడెన్స్‌ను చూపిస్తుంది.

3. మిమ్మల్ని మేం ఎందుకు తీసుకోవాలని అడిగినప్పుడు కంపెనీ మీకు ఆఫర్‌ చేసే ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలు, పనులు మీరు స్టడీ చేశారు కాబట్టి మీ స్కిల్స్‌ కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పొచ్చు.

4. ఇంటర్వ్యూయర్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం మీ వద్ద లేకపోతే నిజాయతీగా తెలియదనే చెప్పండి.

5. కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్‌ అయ్యాక దానికి సంబంధించి ప్రశ్నలేవైనా ఉంటే (పాలసీస్, టర్నోవర్, మాన్‌పవర్‌ కల్చర్‌ వంటివి) ఇంటర్వ్యూయర్‌ అనుమతితో తెలుసుకోవడంలో మీ పైన పాజిటివ్‌ ఒపీనియన్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ మధ్యలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు వేయకూడదు. అలా ప్రశ్నలు వేస్తే మీ ఓపిక సామర్థ్యాన్ని నిర్ణయిస్తారు.

5. కంపెనీతో లాంగ్‌ రన్‌ అసోసియేషన్‌ ఉండాలంటే అభ్యర్థి యొక్క, కంపెనీ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌ అలైన్‌ అయి ఉండాలి.

6. ఇంటర్వ్యూ అయిపోయాక మీకు పాజిటివ్‌గా అనిపించినా, నెగెటివ్‌గా అనిపించినా ముఖకవలికలు ఎప్పుడూ ఒకేలా ఉండేలా జాగ్రత్త పడాలి. చివరగా చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పండి.

చివరగా ఒక్క మాట.. మనం హాజరయ్యే ప్రతి ఇంటర్వ్యూ మనం ఎంత బాగా ఫేస్‌ చేసినా ఒక్కోసారి సక్సెస్‌ కాకపోవచ్చు. సంస్థ యొక్క అవసరాన్ని బట్టి, సూటబులిటీని బట్టి మాత్రమే అవకాశం దక్కుతుంది. అయితే ఇంటర్వ్యూలో ఫెయిలైనప్పుడు మనం ఇంకా ఏయే అంశాల్లో ఫోకస్‌ చేయాలో తెలుస్తుంది. అది భవిష్యత్తు ఇంటర్వ్యూలకు ఉపయోగపడుతుంది.

 

గణేషన్ మాధవి,

హెడ్, హ్యూమన్ రీసోర్సెస్

పీఎస్ఆర్ ఐటీ సర్వీసెస్ ఫ్రయివేట్ లిమిటెడ్ , (పీఎస్ఆర్ గ్రూప్ సంస్థ)

Previous articleఎలన్ మస్క్ …  ఓటమే అతడి మొదటి మెట్టు
Next articleవీరయ్య : తెలుగు గడ్డపై మరో ఏడు తరాల కథ