మూడు ఆవులు… మూడు గొర్రెలు.. ఒక ఎమ్మెల్యే

పశ్చిమబెంగాల్ శాసనసభా ఎన్నికలు ముగిశాయి. మళ్లీ దీదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మోదీ మీద అపనమ్మకమో లేక, మమత తెగువ మీద అపారవిశ్వాసమో తెలియదు కానీ, ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది దీదీ పార్టీ. వీల్ ఛైర్ లో కూర్చునే చక్రం తిప్పిందని, కలకత్తా కాళి అని మమతా బెనర్జీని తెగ పొగిడేస్తున్నారంతా.  

పార్టీకి చారిత్రక గెలుపును ఒంటిచేత్తో అందించిందంటూ ఆకాశానికెత్తుతున్నారు. మోదీ, అమిత్ షా ఇచ్చిన అభివృద్ధి నినాదం దీదీ చరిష్మా ముందు నిలబడలేపోయిందని పొగుడుతున్నారు. ఇవన్నీ నిజమే కావచ్చు… కానీ దీదీ ప్రభంజనం, చరిష్మా ఎందుకో కానీ ఓ రోజు కూలీ ముందు మాత్రం చతికిలపడ్డాయి. డబ్బు లేదు, పలుకుబడి లేదు, పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కాదు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఆమెది. అలాంటి ఓ మహిళ…. దీదీ ప్రభంజనం ముందు ఎదురొడ్డి నిలిచింది. గెలిచి చూపించింది.

ఆస్తులు ఇవే…

చందనా బౌరి… వయసు ముఫ్పై ఏళ్లు. బంకుర జిల్లాలోని కెలై గ్రామంలో నివాసం.  భర్త, ముగ్గురు పిల్లలు, అత్తా మామ. ఇదే ఆమె కుటుంబం, లోకం. భర్త శ్రవణ్ బౌరి కూలీ. రోజుకు రూ.400 సంపాదిస్తాడు. అదే ఆ కుటుంబానికి ఆధారం. ఒక్కోసారి ఆదాయం సరిపోకపోతే భర్తతో కలిసి చందనా కూడా కూలి పనులకు వెళ్తుంది. చిన్నగుడిసెలో ఈ కుటుంబం నివాసం ఉంటోంది.

గతేడాది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.60,000 మంజూరైతే రెండు గదులు వేసుకున్నారు. కనీసం ఇప్పటికీ ఇంట్లో టాయిలెట్ కూడా లేని పరిస్థితి. బహిర్భూమికి ఇంకా పొలాల్లోకే పోతున్న కుటుంబం ఇది. వీరికి మూడు ఆవులు, మూడు గొర్రెలు, చిన్న గుడిసె, బ్యాంకు ఖాతాలో రూ.31,000. ఇది చందనా బౌరి ఆస్తులు, అంతస్థులు. చందనా ఇంటర్ పూర్తి చేయగా, ఆమె భర్త ఎనిమిదో తరగతితో ఆపేశాడు.

శ్రవణ బౌరికి రాజకీయాలంటే ఆసక్తి. మొదట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. పార్టీలోని నేతలు వేధించడంతో కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరాడు. చందనా కూడా భర్త వెంటే బీజేపీలో కార్యకర్తగా చేరింది. కొన్నాళ్లకు ఆ ప్రాంతానికి బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అయింది. పేరుకు నాయకురాలే అయినా జీవితంలో ఏ మార్పు లేదు. కూలి పనే ఆధారం.

కాగా తాజా ఎన్నికల్లో సల్టోరా నియోజక వర్గానికి బీజేపీ అభ్యర్థిని వెతికి పనిలో పడింది. ఆ సీటు షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు. దీంతో చందనా బౌరిని ఎంపిక చేసింది హై కమాండ్. నిజానికి తన పేరు పరిశీలిస్తున్నారని చందనకు తెలియదు.

ఆమెకు సీటు కేటాయించారని టీవీల్లో ఇరుగు పొరుగు వారు చూసి చెప్పారు. నిజానికి ఆ విషయం తెలిశాక తాను నమ్మలేక పోయానని చెబుతోంది చందనా. రూపాయి కూడా ఖర్చు పెట్టే స్థోమత లేని తనకు టిక్కెట్ ఎలా కేటాయించారని చాలా ఆశ్చర్యపోయినట్టు చెప్పింది.

గెలుస్తానన్న నమ్మకం ఆమెలో కొంచెం కూడా లేదు. టిక్కెట్ కేటాయించారు కాబట్టి తన ప్రయత్నం తాను చేయాలని భావించింది. ఉదయం ఎనిమిది కల్లా పనులన్నీ పూర్తి చేసుకుని పిల్లలను అత్తా మామకు అప్పగించి ప్రచారానికి వెళ్లేది. ఒక్కోసారి కొడుకును తీసుకునే వెళ్లేది. రాత్రి వరకు ప్రచారం చేసి ఇంటికి చేరేది.  తృణమూల్ కాంగ్రెస్ తరుఫున కూడా ఒక  కొత్త వ్యక్తి పోటీకి నిలుచున్నాడు.

అతడి పేరు సంతోష్ కుమార్ మండల్. చందనాతో పోలిస్తే డబ్బు, పలుకుబడి ఎక్కువ. పోటీ చేయడం మాత్రం తొలిసారి. ఆయన చందనా గురించి తెలిసి తన గెలుపు నల్లేరు మీద నడకే అని అభిప్రాయపడ్డాడు. కానీ ఓ కూలీ చేసుకునే మహిళ కలకత్తా కాళిగా పిలుచుకునే దీదీ ప్రభంజనానికే ఎదురొద్ది నిలుస్తుందని మాత్రం అనుకోలేదు.

ఎన్నికల ఫలితాల్లో చందనా దాదాపు నాలుగు వేల ఓట్ల తేడాతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలిచింది. ఇది చందనే కాదు, ఆ చుట్టుపక్కల వారు, చివరికి సొంత పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోయారట.

ఎలాంటి మద్దతు లేని ఓ రోజు కూలీ పశ్చిమబెంగాల్ శాసనసభలో అడుగుపెట్టబోతోంది. ఆమె ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, తన ప్రాంత అభివృద్ధికి ఎలా సహకరిస్తుందో చూడాలి. 

Previous articleఆక్సిజన్ కొరతేంటి? ఎప్పుడు తీరుతుంది?
Next articleమహిళలకు ఎక్కువగా వచ్చే జబ్బులు ఇవే