నిండా పద్దెమినిదేళ్లు కూడా లేవు. చేతిలో ఆరు నెలల చంటి బిడ్డతో రోడ్డున పడింది. ఆ పరిస్థితిలో ఎక్కువ మందికి వచ్చేవి ఆత్మహత్యా ఆలోచనలే. కానీ ఆ అమ్మాయి అలా ఆలోచించలేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి, ఎక్కడ పడ్డామో అక్కడే కెరటంలా ఎగిసి పడాలని అనుకుంది. అదే జరిగింది.
పదేళ్ల పాటూ ఒంటరిగా బతుకుపోరాటం చేసింది. ఆ పోరాటంలో ఆమె విజేతగా నిలిచింది. ఎక్కడైతే ఐస్ క్రీములు, నిమ్మసోడా, బొమ్మలు అమ్మిందో ఆ ఏరియాకే ఎస్ఐగా ఉద్యోగం సాధించింది. ఎక్కడైతే చంటి బిడ్డతో తిండి పెట్టే వారు కూడా లేక ఒంటరిగా నిల్చుందో అక్కడే శాంతిభద్రతలను కాపాడే అధికారిగా జీవితంలో ప్రమోట్ అయ్యింది. ఆమె ఆనీ శివ. కేరళలోని వర్కలా వాస్తవ్యురాలు. ఇప్పుడు ఆ ఏరియా సబ్ ఇన్ స్పెక్టర్ కూడా.
ఆనీ శివ ఇంటర్ పూర్తి చేసింది. ఎప్పటికైనా ఐపీఎస్ అవ్వాలని లక్ష్యం. కానీ ఓ మోసగాడి ప్రేమ ఉచ్చులో చిక్కుకుంది. అతడి ప్రేమను నిజమని నమ్మింది. తల్లిదండ్రులకు తన ప్రేమ విషయం చెబితే వారు ఒప్పుకోలేదు. సరికదా ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రేమించిన వాడిని నమ్మి ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. పెళ్లి చేసుకున్నాక బాబు పుట్టాడు. బాబుకి ఆరునెలలు వచ్చేసరికే ఆనీ అంటే మొహం మొత్తేసింది భర్తకి. నిర్ధాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటికి గెంటేశాడు.
షెడ్లో తలదాచుకున్న అనీ శివ
చంటి బిడ్డతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది ఆనీ. వాళ్లు కనీసం జాలి చూపించలేదు. ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. దీంతో ఆమె నాన్నమ్మ ఉన్న ప్రాంతానికి వెళ్లి ఓ షెడ్ లో తలదాచుకుంది. ఆ క్షణం ఆమెకు తన బిడ్డ భవిష్యత్తు మాత్రమే కనిపించింది. చేతిలో చిల్లిగవ్వలేదు. నాన్నమ్మ పెట్టిన ఆహారమే తినేది. లేకపోతే పస్తులుండేది. ఇలా ఎన్నాళ్లు? తాను ఏదోఒక పనిచేసి బిడ్డను సొంతంగా పెంచుకోవాలని నిర్ణయించుకుంది.
కేరళలోని టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో వర్కలా ఒకటి. ఇది తిరువనంతపురంలోని ఓ మున్సిపాలిటీ. అక్కడ రెండే వేళ ఏళ్ల నాటి జనార్థన స్వామి దేవాలయం ఉంది. అక్కడికే దగ్గర్లోని బీచ్ లు ఉన్నాయి. తిరువనంతపురంలో చూడదగ్గ స్థలాల్లో వర్కలా కూడా ఒకటి. ఆ స్వామి దేవాలయం దగ్గర్లోనే ఆనీ శివ నిమ్మ సోడా అమ్మడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల అమ్మాక పెద్దగా లాభాలు కనిపించలేదు. దాంతో ఐస్ క్రీములు అమ్మింది. మరోసారి ప్లాస్టిక్ బొమ్మలు అమ్మడం మొదలుపెట్టింది. చంకలో చంటి బిడ్డతో మండుటెండలో బతుకుపోరాటం చేసింది.
ఆమె ఎంతగా కష్టపడుతుందో భర్తకు, తల్లిదండ్రులకూ తెలుసు. అయినా వారి మనసు కరగలేదు. చేరదీయలేదు. కానీ అక్కడికి వచ్చే భక్తుల్లో కొందరు తరచూ వచ్చే వాళ్లు ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి ఆమె కష్టాన్ని గుర్తించాడు. మాట్లాడి ఆమె జీవిత కథను తెలుసుకున్నాడు. ‘ఇలాంటి వీధి వ్యాపారాలతో నీ జీవితాన్ని, నీ బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దలేవు. కేవలం చదువు మాత్రమే నీ తలరాతను మారుస్తుంది. డబ్బులు నేనిస్తాను. డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు చదువు’ అని సలహా ఇచ్చాడు. అన్నట్టు గానే ఆర్ధికంగా సాయం చేశాడు.
అనీ ఆశలన్నీ డిపార్ట్మెంట్పైనే
ఆ డబ్బును తన చదువుకు, పుస్తకాలకు ఉపయోగించింది. పగలంతా ఎంత కష్టపడినా రాత్రి చదువుకునేది. అలా డిగ్రీ పూర్తి చేసింది. ఐపీఎస్ అవ్వాలన్న తన కలను నిజం చేసుకోవాలంటే నిర్విరామంగా చదవాలి, ఆ పుస్తకాలు కూడా ధర ఎక్కువే, కోచింగ్ కూడా అవసరం పడొచ్చు. అందువల్ల ఐపీఎస్ కాలేకపోయినా పోలీస్ డిపార్ట్ మెంట్లో ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఎస్ఐ ఉద్యోగం లక్ష్యంగా చదువు ప్రారంభించింది. దేహదారుఢ్య పరీక్షలతో పాటూ, రాత పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించింది. ఈ మధ్యనే పోస్టింగ్ కూడా పొందింది.
ఆమె మొదటి పోస్టింగ్ వర్కలా పోలీస్ స్టేషన్. ఎక్కడైతే ఆమె బతుకుపోరాటం మొదలైందో, తోడు లేక అల్లాడిందో, ఆహారం కోసం వెతికిందో అక్కడే ఆమె శాంతి భద్రతలను కాపాడే అధికారణి. ఈ విషయం ఆనీకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ‘వర్కలా లో పోస్టింగ్ ఇస్తారని ఊహించలేదు… నా జీవితంలో ఇది నిజంగా ఒక అద్భుతం’ అంటోంది ఆనీ.
ఆమెకు ఇప్పుడు 31 సంవత్సరాలు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పన్నేండేళ్ల కొడుకు శివ సూర్యతో కలిసి జీవిస్తోంది. బుల్లెట్ బైక్ పై తల్లీ కొడుకులిద్దరూ దర్జాగా ఇప్పుడు వర్కలా ప్రాంతంలో షికారులు కొడుతున్నారు. ఆమె గురించి కేరళ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో తొలిసారి రాశారు. ‘ఆత్మ విశ్వాసానికి, సంకల్ప శక్తికి ఆమె నిజమైన మోడల్’ అంటూ ఆమె ఫోటోతో సహా ట్వీట్ చేశారు. అది కేరళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ప్రశంసల వర్షం
అంతేకాదు కేరళలోని ప్రతి పక్షనేత వీడీ సతీశన్ కూడా ప్రత్యేకంగా ఆనీ గురించి సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఆమెను ఎంతో కొనియాడారు. ‘చాలా మంది ఆడపిల్లలు సమాజానికి, అత్తింటి ఆరళ్లకు బలైపోతున్నారు. ఆత్మ న్యూనతతో, బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థిత్తులో ఆనీ శివ లాంటి వారి జీవితం ఆశాకిరణం’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సోషల్ మీడియా కూడా ఆనీ విషయంలో సానుకూలంగా స్పందించింది. వేల మంది ఆనీని ప్రశంసిస్తూ పోస్టింగులు పెడుతున్నారు.
ఇదంతా చూసినా ఆనీ ‘మొన్నటి వరకు నేను, నా కొడుకు ఒంటరి వాళ్లమనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా మెసేజులు, నెటిజన్ల స్పందన చూస్తుంటే ఈ లోకంలో మాకు మద్దతుగా చాలా మంది ఉన్నారనిపిస్తుంది. నాలాగా భర్త, తల్లిదండ్రుల ఆదరణ కరువైన ఆడపిల్లలు ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా, తమ కాళ్ల మీద తాము నిల్చుంటారని నేను ఆశిస్తున్నాను. అలాంటివారిలో ఒక్కరికి నేను ఆదర్శమైనా చాలు’ అంటోంది. ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం ఉద్యోగం బాధ్యతలు సమర్థం నిర్వర్తించడం, కొడుకును మంచి చదువులు చదివించడమేనని అంటోంది.
మళయాళ సినిమా స్టార్లు కూడా ఆనీని ప్రశంసలతో ముంచెత్తుతూ పోస్టులు పెడుతున్నారు. త్వరలో అనీ శివ జీవిత కథతో సినిమా వచ్చే అవకాశం కూడా ఉంది.
– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్