క్లబ్‌హౌజ్‌ : సోషల్‌ మీడియా యాప్‌.. వినండి.. మాట్లాడండి

clubhouse app
Photo by Prithivi Rajan on Unsplash

క్లబ్‌హౌజ్‌ ఇప్పుడిప్పుడే యూత్‌లో క్రేజీగా మారిన ఆడియో బేస్డ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌. ఇది విభిన్న రకాల క్లబ్‌ల సమూహం. క్లబ్‌ అంటే ఏదైనా అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేసుకునే ఒక వేదిక.

ఈ వేదికలోని సభ్యులు వేర్వేరుగా రూమ్స్‌ ఏర్పాటు చేసుకుని విభిన్న టాపిక్స్‌పై చర్చలకు ఆహ్వానిస్తారు. ఆసక్తిగల వారు ఎవరైనా ఆయా రూమ్స్‌లో చర్చలో పాల్గొనవచ్చు. ఒక్కో గ్రూపులో సుమారు 5 వేల మంది వరకు పాల్గొనవచ్చు.

ఆయా టాపిక్స్‌లో మీకు నైపుణ్యం ఉన్నా, ప్రశ్నలు ఉన్నా ఆయా చర్చల్లో మాట్లాడవచ్చు. ఒకప్పుడు యాహూ మెసెంజర్‌ ఎంత క్రేజీగా ఉండేదో ఇప్పుడు క్లబ్‌హౌజ్‌ కూడా సోషల్‌ మీడియా యూజర్లలో అంతగా క్రేజీనెస్‌ తెచ్చింది.

మన దేశంలో ఇప్పటికే కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు ఈ యాప్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇక విదేశాల్లో అయితే ఎలన్‌ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్‌ వంటి వారు కూడా ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.

ఎవరికైనా ఆసక్తి కలిగించే ఈ యాప్‌ను ఎలా వినియోగించాలి? దీని నుంచి ఎలా ప్రయోజనం పొందాలి? వంటి అంశాలపై స్టెప్‌ బై స్టెప్‌ డియర్‌ అర్బన్‌ మీకోసం ప్రత్యేక కథనం అందిస్తోంది.

క్లబ్‌హౌజ్‌లో రిజిస్ట్రేషన్‌ ఇలా..

ఈ యాప్‌లో ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని మీ కాంటాక్ట్‌ డీటైల్స్‌ ఇవ్వాలి. ఈ యాప్ ఐకన్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది వాస్తవానికి ఇది ఇన్విటేషన్‌ బేస్డ్‌ యాప్‌. ఒకవేళ మీరు డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ చేసుకుని ఉంటే మిమ్మల్ని తెలిసిన వారు ఎవరైనా మీకు అక్కడ ఆహ్వానం పలుకుతారు. 

రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఈమెయిల్‌ ఐడీ ఇవ్వాలి. యూజర్‌ నేమ్‌ క్రియేట్‌ చేయాలి. అలాగే మీ ఫోటోగ్రాఫ్‌ జత చేయాలి.

ఇలా రిజిస్ట్రేషన్‌ కంప్లీట్‌ అయ్యాక మీ ఇంట్రెస్ట్స్ ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు స్టార్టప్స్‌ అంటే ఇష్టం లేదా బ్లాగింగ్‌ అంటే ఇష్టం. ఇలా అనేక రకాల ఇంట్రెస్ట్స్‌ ఉంటాయి. వీటిని మీరు ఎంపిక చేసుకోవచ్చు.

మీ ప్రొఫైల్‌ను కేవలం ఒకటి రెండు వాక్యాలతో రాయడం కంటే మీ అభిరుచులు, మీరు చేస్తున్న ఉద్యోగం వివరాలు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎలాంటి ఉద్యోగం కోరుకుంటున్నారు? ఇలా అన్ని వివరాలు జోడిస్తే మీ ప్రొఫైల్‌ అదిరిపోతుంది. దీని వల్ల మీ ఫాలోవర్స్‌ పెరుగుతారు. ఇందులో మీ ట్విటర్‌ ఖాతాను, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను లింక్‌ చేయొచ్చు.

ఇక మీరు స్క్రోల్‌ చేస్తూ ఉంటే క్లబ్స్, వాటిల్లోని రూమ్స్‌ కనిపిస్తూ ఉంటాయి. మీ కాంటాక్ట్స్‌ లిస్ట్‌ లో ఉన్న వారు అప్పటికే యూజర్లుగా ఉంటే మీకు తెలిసిపోతుంది. వారిని ఫాలో కావొచ్చు.

క్లబ్‌ హౌజ్‌లో క్లబ్స్‌ ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా.. అంటే ఒకే ఆసక్తి గల విభిన్న యూజర్లు ఆ క్లబ్‌లో మెంబర్స్‌గా ఉంటారు. వారు విభిన్న అంశాలపై చర్చ కోసం రూమ్స్‌ ఓపెన్‌చేస్తారు. మీరు మెంబర్‌ కాకపోయినా ఆయా గ్రూపుల్లో చర్చల్లో పాల్గొనవచ్చు.

క్లబ్‌ హౌజ్‌ హోం పేజీలో ప్రస్తుతం ఏ క్లబ్ లైవ్‌లో ఉందో మీకు కనిపిస్తుంది. ఆయా క్లబ్‌ చర్చ మీకు ఆసక్తిగా ఉంటే ఎంటర్‌ అవ్వొచ్చు.

మీ స్నేహితులు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే ఎలా?

మీ స్నేహితులు ఏదైనా రూమ్‌లో ఉంటే మీకు తెలిసిపోతుంది. క్లబ్‌హౌజ్‌ యాప్‌ హోమ్‌ పేజీలో కింద కుడివైపు 9 చుక్కలతో కూడిన బటన్‌ ఉంటుంది. ఆ బటన్‌ నొక్కగానే అవైలేబుల్‌ టు చాట్‌ అనే లిస్ట్‌ కనిపిస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్, ఫాలోవర్స్‌ లిస్ట్‌ అది. వారు ఏయే రూమ్స్‌లో ఉన్నారో అక్కడ మీరు తెలుసుకోవచ్చు.

అలాగే మీరు మెంబర్స్‌గా ఉండి యాక్టివ్‌గా ఉన్న క్లబ్స్‌ వివరాలు కూడా ఈ పేజీలో పైన సూచిస్తుంది.

ప్రతి రూమ్‌లో మోడరేటర్స్‌ ఉంటారు. మీరు కూడా మోడరేటర్స్‌గా ఉండొచ్చు. అంటే వాట్సాప్‌ గ్రూప్‌లో అడ్మిన్‌ తరహాలో వ్యవహరించవచ్చు.

మీరు పరిమితంగా క్లబ్స్‌ క్రియేట్‌ చేయొచ్చు. క్లబ్‌ క్రియేట్‌ చేశాక రూమ్స్‌ హోస్ట్‌ చేస్తున్నకొద్దీ మీకు ఇన్వైట్‌ చేసేందుకు లింక్స్‌ జనరేట్‌ అవుతుంటాయి. అప్పుడు మీరు ఇంకా యూజర్లను ఇన్వైట్‌చేయొచ్చు. యాక్టివ్‌గా ఉంటే కూడా మీకు లింక్స్‌ జనరేట్‌ అవుతుంటాయి.

హోం పేజీలో మీకు ఇన్వైట్‌ లింక్స్‌ బటన్‌ పక్కన క్యాలెండర్‌ బటన్‌ ఉంటుంది. అందులో అప్‌కమింగ్‌ ఈవెంట్స్‌ తెలుసుకోవచ్చు. అంటే ఆయా క్లబ్స్‌లో షెడ్యూల్‌ చేసిన ఈవెంట్స్‌ తెలుసుకోవచ్చు. పక్కన బెల్‌ బటన్‌ కూడా ఉంటుంది. దీనిలో మీరు ఫాలో అవుతున్న మెంబర్స్, గ్రూప్స్, మీ స్నేహితుల యాక్టివిటీస్‌ తెలుసుకోవచ్చు.

క్లబ్‌ ఎలా క్రియేట్‌ చేయాలి?

మీ ఫోటోను క్లిక్‌ చేస్తే మీ ప్రొఫైల్‌ వెలువడుతుంది. దానిలో మీరు ఏ యే గ్రూపుల్లో మెంబర్‌గా ఉన్నారో కింద వివరాలు ఉంటాయి. అక్కడ ఉన్న ప్లస్‌ బటన్‌ నొక్కి మీరు కొత్త క్లబ్‌ క్రియేట్‌ చేయొచ్చు. అందులోకి మీ స్నేహితులను, నిపుణులను మెంబర్స్‌గా ఇన్వైట్‌ చేయొచ్చు.

ఇలా క్లబ్‌ ఏర్పాటు చేశాక, ఆసక్తిగల టాపిక్‌ ఎంచుకుని రూమ్స్‌ క్రియేట్‌ చేసి ఈవెంట్‌ షెడ్యూలు చేయొచ్చు. ఇందులో క్లబ్‌ మెంబర్స్‌ను కో హోస్ట్‌గా వ్యవహరించేలా అధికారం ఇవ్వొచ్చు. ఈ రూమ్స్‌ను ప్రయివేటు రూమ్స్‌గా కూడా మార్చుకోవచ్చు.

క్లబ్‌ హౌజ్‌లో చర్చ ఎలా నడుస్తుంది?

ఇలా క్లబ్‌ ఏర్పాటయ్యాక అందులో సభ్యులు రూమ్స్‌ క్రియేట్‌ చేస్తారు కదా. షెడ్యూలు చేసిన సమయానికి ఆయా రూమ్స్‌లో హోస్ట్‌ చర్చను ప్రారంభిస్తారు. చర్చకు ముందే షెడ్యూలు లింక్‌ను ట్విటర్, వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు షేర్‌ చేయొచ్చు. చర్చ ప్రారంభమయ్యాక ముందుగా ఆడియెన్స్‌గా ఎవరైనా ఆయా రూమ్స్‌లో చేరొచ్చు.

ఆడియెన్స్‌కు ఆసక్తి ఉంటే అక్కడ చేయి లేపే ఆప్షన్‌ ఉంటుంది. మాడరేటర్‌ అనుమతిస్తే వారు మాట్లాడే సమూహంలోకి చేరుతారు. ఆడియెన్స్‌ మాట్లాడేందుకు మోడరేటర్‌ స్వయంగా ఇన్వైట్‌ చేయొచ్చు. మాట్లాడే సమూహం ఉండేదానిని స్టేజ్, డయాస్, వేదిక అని వ్యవహరిస్తారు.

ఆడియెన్స్‌ సమూహం నుంచి స్పీకర్స్‌ గ్రూప్‌లోకి చేరినప్పుడు మన మైక్‌ మ్యూట్‌లో పెట్టుకోవాలి. మోడరేటర్స్‌ అవకాశం ఇచ్చినప్పుడు అన్‌ మ్యూట్‌ చేసుకోవాలి. స్పీకర్స్‌ గ్రూప్‌లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఇంటర్నెట్‌ లభ్యత బాగున్నచోటి నుంచే మాట్లాడాలి.

మనం పాల్గొన్న చర్చ మనకు నచ్చితే ఇతరులు పాల్గొనేందుకు వారిని ఇన్వైట్‌ చేసేలా ఆ రూమ్‌లో కింద ఒక ప్లస్‌ బటన్‌ ఉంటుంది. దానిని నొక్కి మన ఫాలోవర్స్‌ను ఆహ్వానించొచ్చు.

తెలుగు సమూహాలు చాలానే ఉన్నాయి

తెలుగు వారు తెలుగు వాళ్ల కోసం నిర్వహిస్తున్న క్లబ్స్ చాలా ఉన్నాయి. తెలుగు ట్రైబ్, తెలుగు ఫ్యామ్, ది తెలుగు క్లబ్, తెలుగు యూత్ క్లబ్, తెలుగు క్లబ్ హౌజ్, ది తెలుగు ప్రాజెక్ట్, యూఎస్ఏ తెలుగు, తెలుగు రైటర్స్ క్లబ్, తెలుగు ఇన్వెస్టర్స్, తెలుగు కామెడీ క్లబ్, తెలుగు సినిమా, తెలుగు ఫిల్మ్ మేకర్స్, ఇలా చాలానే క్లబ్స్ ఉన్నాయి. మ్యూజిక్ రూమ్స్ చాలా పాపులర్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక క్లబ్స్ అందుబాటులో ఉండడం విశేశం.

క్లబ్‌హౌజ్‌తో ఏం లాభం?

క్లబ్‌హౌజ్‌లో చేరాక చాలా క్రేజీగా ఉంటుంది. మీకు బాగా నచ్చుతుంది. ఉదాహరణకు మీకు అమెరికా వెళ్లాలని, అక్కడ చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని ఉంటుంది. కానీ మీకు ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు. ఇందులో సంబంధిత టాపిక్‌ ఉన్న రూమ్‌లో ఇవన్నీ తెలుసుకోవచ్చు. అనేక రంగాల్లోని నిపుణులు ఆయా చర్చల్లో మాట్లాడుతుంటారు. సో ఆయా రంగాల కష్టసుఖాలు తెలుసుకోవచ్చు.

అలాగే మీకు స్టార్టప్‌ పెట్టాలని ఉంది. ఈ రంగంలో ఇప్పటికే నిపుణులైన వారు వారి అనుభవాలు వివరిస్తారు. అందులో మీరు తెలుసుకోవచ్చు. మీకున్న అనుమానాలు నివృతి చేసుకోవచ్చు.

మీకు పాలిటిక్స్‌ అంటే ఇష్టం. వినొచ్చు. మాట్లాడొచ్చు. కరెంట్‌ ఎఫైర్స్‌పై చర్చ నడుస్తుంది. మీ అవగాహన పెంచుకోవచ్చు. మీ నెట్‌వర్క్‌ పెంచుకోవచ్చు.

పబ్లిక్‌ స్పీకింగ్‌ ఫియర్స్‌ను తొలగించుకోవచ్చు. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఇబ్బందిగా ఉండి ప్రాక్టీస్‌ లేక చాలా మంది దాని జోలికి వెళ్లరు. ఇలాంటి వారు ప్రాక్టీస్‌ చేసేందుకు లెటజ్‌ స్పీక్‌ ఇంగ్లిష్‌ వంటి గ్రూపులు కూడా ఉన్నాయి.

పాటల పోటీలు నిర్వహించే మ్యూజిక్‌ కాంపిటీషన్‌ గ్రూప్స్‌ ఉన్నాయి. మీరు బాగా పాడే సింగర్‌ అయితే ఆయా గ్రూపులు నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొని బహమతులు గెలుచుకోవచ్చు. అంత ఎంకరేజ్‌మెంట్‌ దొరుకుతుంది.

క్లబ్‌హౌజ్ ప్రైవసీ మాట ఏంటి?

ఈ మధ్య క్లబ్‌హౌజ్‌ ప్రయివసీపై చర్చ నడుస్తోంది. అంటే ఉదాహరణకు మీరు మీకు ఆసక్తి ఉండి ఓ గ్రూప్‌ చర్చలో పాల్గొంటారు. మీరు ఏ గ్రూపులో ఉన్నారో మీ ఫాలోవర్స్‌కు తెలిసిపోతుంది. అంటే మీ ఆసక్తి తెలిసిపోతుంది.

ఇందులో తప్పేముంది? అంటారా? ఉదాహరణకు కొన్ని గ్రూప్స్‌ ఉంటాయి. అప్రెస్డ్‌ హజ్బెండ్స్‌ క్లబ్, సెక్సువల్‌ ఫ్రస్టేషన్‌ వంటి గ్రూపు చర్చల్లో పాల్గొనేవారు ప్రైవసీ కోరుకుంటే అది లభ్యంకాదు.

అలాగే చర్చలన్నింటినీ క్లబ్‌హౌజ్‌ నిక్షిప్తం చేస్తుంది. ఎవరైనా కంప్లయింట్‌ చేసినప్పుడు వాటిని అలాగే ఉంచుతుంది. లేదంటే కొద్దికాలంలోనే డిలీట్‌ చేస్తుంది.

ఇక యూజర్లు స్క్రీన్ రికార్డర్ ద్వారా ఈ సంభాషణలు రికార్డు చేసుకోవచ్చు. అందువల్ల బాధ్యతాయుతంగా చర్చల్లో పాల్గొనడం మంచిది. క్లబ్ హౌజ్ యాప్ కోసం ముందుగా ఆ వెబ్ సైట్ పరిశీలించండి. దానిలో యాప్ గురించిన విశేషాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి.

Previous articleఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ .. ఇదిగో లిస్ట్
Next articleనిమ్మసోడా అమ్మిన ఏరియాకే.. ఎస్ఐ అయ్యింది