ప్రీ ఓన్డ్ కార్ తో లాభ నష్టాలేంటి?

pre owned car
Photo by JAGMEET SiNGH from Pexels

ప్రీ ఓన్డ్ కార్ కారు.. తరచుగా మనం వినే పదం. కార్ అంటే ఒకప్పుడు లగ్జరీ. కానీ ఇప్పుడు అవసరం. ఒకప్పుడు గొప్పోళ్ల ఇళ్లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు సాధారణ మధ్య తరగతి వాళ్ల ఇళ్ల ముందు కూడా కనిపిస్తోంది. నలుగురు కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఆటోలు, బస్సుల కంటే కారే చీప్‌ అన్న ఫీలింగ్‌ ఇప్పుడు చాలా మందిలో ఉంది.

పైగా సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు పెరిగిన తర్వాత మిడిల్‌ క్లాస్‌ వాళ్లు కూడా వీటిని కొనే సాహసం చేస్తున్నారు. తమ రేంజ్‌కు తగినట్లు చిన్న హ్యాచ్‌బ్యాక్‌ కారు నుంచి లగ్జరీ ఎస్‌యూవీల వరకు అన్నీ సెకండ్‌ హ్యాండ్‌లో దొరుకుతున్నాయి. అయితే సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలంటే చాలా మంది వెనకడుగు వేస్తారు? కొత్త కారైతే కంపెనీ వారెంటీ ఉంటుంది.

కారుకు ఏమైనా అయినా వాళ్లే చూసుకుంటారు. కానీ సెకండ్‌ హ్యాండ్‌ కారుతో రిస్క్‌ ఎక్కువని, కారు గురించి పూర్తిగా తెలిస్తేనే కొనండి అని చెప్పేవాళ్లు కూడా చాలా మంది ఉంటారు. దీంతో సెకండ్‌ హ్యాండ్‌ కొనాలని అనుకున్న వాళ్లు కూడా కాస్త ఎక్కువ పెట్టి కొత్త కారే కొందామని అనుకుంటారు.

అయితే ఆ కొత్త కారు కంటే చాలా తక్కువ ధరలో, వారెంటీ, ఫ్రీ సర్వీస్‌తో కూడిన సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయన్న విషయం కొంత మందికే తెలుసు. వాటినే మనం ప్రీ ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్లు అంటున్నాం.

అసలేంటీ ప్రీ ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్లు

సాధారణంగా సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలంటే మన బంధువులు, స్నేహితులపైనే ఆధారపడతాం. తెలిసిన వాళ్ల దగ్గర కారు కొంటే కాస్త నమ్మకంగా ఉంటుంది అన్నది మన ఫీలింగ్‌. లేదంటే మనకు తెలిసిన ఏ మెకానిక్‌నో తీసుకెళ్లి కారును మొత్తం చూసి అంతా బాగుందనిపిస్తే కొనేస్తాం. ఈ మధ్య వాడిన వస్తువులు కొనడానికి ఆన్‌లైన్‌లోనే ఎన్నో సైట్లు కూడా ఉన్నాయి. మన అదృష్టం బాగుంటే ఇలా కొన్న కార్లు ఎలాంటి రిపేర్లు లేకుండా బాగానే నడుస్తాయి. లేదంటే ప్రతి రోజూ వాటితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైగా ఇలా కొన్న కార్లకు ఏవైనా రిపేర్లు వచ్చినా, సర్వీసింగ్‌ చేయించాలన్నా కారు కొన్న మరుసటి రోజు నుంచే మన జేబులో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ తలనొప్పంతా ఎందుకు అనుకున్నవాళ్లకు బెస్ట్‌ ఆప్షన్‌ ఈ ప్రీ ఓన్డ్ సర్టిఫైడ్‌ కార్లు. ఇవి కూడా సెకండ్‌ హ్యాండ్‌ కార్లే. కానీ మంచి కండిషన్‌లో ఉంటాయి. వీటిని అమ్మే డీలర్లు ఈ కార్లను సర్టిఫై చేసి ఇస్తారు. వీటిని అమ్మే ముందే అన్ని రకాలుగా పరీక్షిస్తారు. మళ్లీ అమ్మడానికి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు. మొత్తానికి దాదాపుగా ఓ కొత్త కారునే కొన్నామన్న ఫీలింగ్‌ కస్టమర్లకు కలిగేలా చేయడమే ఈ ప్రీ ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్ల ఉద్దేశం.

రిపేర్లు, మెయింటెన్స్‌  ఫ్రీ

ఇంతకుముందు చెప్పినట్లు తెలిసిన వాళ్ల దగ్గర కారు కొన్నా.. మరుసటి రోజు నుంచే దానికి వచ్చే రిపేర్లు, మెయింటెనెన్స్‌కు మనమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఒక్కోసారి తడిసి మోపెడవుతుంది. అయితే ఈ సర్టిఫైడ్‌ కార్లకు మాత్రం పరిమిత కాలానికి సంబంధిత డీలర్‌ వారెంటీ కూడా ఉంటుంది. ఆ కాలంలో కారుకు ఏమైనా రిపేర్లు వచ్చినా, సర్వీసులు చేయాలన్నా ఫ్రీగానే చేస్తారు.

పైగా కారు అమ్మకానికి పెట్టినపుడే దానిని క్షుణ్నంగా పరిశీలిస్తారు కాబట్టి.. రిపేర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక సాధారణంగా ఇలాంటి కార్లు అమ్మే డీలర్లు మొదటి మూడు, నాలుగు సర్వీసులను ఫ్రీగానే చేస్తారు. నిజానికి కొత్త కారు కొన్నా కూడా కంపెనీ వాళ్లు దాదాపుగా ఇవే ఆఫర్లు ఇస్తారు.

తక్కువ వడ్డీకే లోన్లు

కొత్త కారు కొంటే ఎలా అయితే వెహికిల్‌ లోన్‌ అందుబాటులో ఉంటుందో ఈ సర్టిఫైడ్ కార్లు కొనాలన్నా లోన్లు ఇస్తారు. నేరుగా డబ్బు చెల్లించి కారు కొనే స్థోమత లేకపోతే లోన్‌ తీసుకోవచ్చు. పైగా బయటి సెకండ్‌ హ్యాండ్‌ కార్లతో పోల్చి చూస్తే ఈ సర్టిఫైడ్‌ కార్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంకులూ ఉన్నాయి. మీ బ్యాంక్‌తో సంప్రదించి వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు ఏ వడ్డీకి లోన్‌ ఇస్తున్నారు.. సర్టిఫైడ్‌ కార్లకు ఏ వడ్డీకి లోన్‌ ఇస్తున్నారన్న విషయం తెలుసుకుంటే తేడా మీకే అర్థమవుతుంది.

రేటు కాస్త ఘాటే

ప్రీ ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్లు కొత్త కార్ల కంటే చీపే. అలా అని మరీ అంత చవకేమీ కాదు. బయట కొనే సెకండ్‌ హ్యాండ్‌ కార్లతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీరు అనుకున్న బడ్జెట్‌లో మీకు నచ్చిన కారు కొనలేకపోవచ్చు. నిజానికి కొత్త కారు రేంజ్‌లో బెనిఫిట్స్‌ను మీరు పొందాలనుకుంటే ఆ మాత్రం
ఎక్కువ ధర చెల్లించక తప్పదు.

మీ ఏరియాలో ఉన్న ఈ సర్టిఫైడ్‌ కారు డీలర్లందరి దగ్గరా ఉన్న కార్లను పరిశీలించి మీకు నచ్చిన, మీ బడ్జెట్‌లో వచ్చే కారును మీ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత సంవత్సర మోడల్ నుంచి మొదలు పదేళ్ల పాత కార్లు కూడా అందుబాటులో ఉంటాయి. బీఎండబ్ల్యూ, మారుతీ తదితర సంస్థలు తమ సర్టిఫైడ్ కార్ల అమ్మకాలపై వాణిజ్య ప్రకటనలు కూడా ఇస్తుంటాయి.

దొరుకుతాయంటే..

ప్రి ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్లు అమ్మే డీలర్లు చాలా మందే ఉన్నారు. మీకు కావాల్సిన కంపెనీ కారును బట్టి ఆయా డీలర్లను సంప్రదించవచ్చు. సాధారణంగా ఇండియాలో మధ్య తరగతి మెచ్చిన, వాళ్లకు అందుబాటు ధరలో ఉండే కార్లను తయారు చేసే కంపెనీ మారుతి సుజుకి.

ఈ కంపెనీకి చెందిన సర్టిఫైడ్‌ కార్లను అమ్మే డీలర్లు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. https://www.marutisuzukitruevalue.com వెబ్ సైట్ లో ఈ కార్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవచ్చు. మారుతీ ట్రూ వాల్యూ పేరుతో హిమాయత్‌నగర్‌, నాగోల్‌, గచ్చిబౌలి, మదీనాగూడా, ఎల్బీనగర్‌, మలక్‌పేట్‌, మల్లేపల్లి, బేగంపేట్‌, టోలీచౌకీలాంటి ప్రాంతాల్లో సర్టిఫైడ్‌ మారుతి కార్లు లభిస్తాయి.

ఇక హ్యుండాయ్‌ కార్లు ( https://hpromise.hyundai.co.in/ ) కావాలనుకుంటే.. హైదరాబాద్ లోని సనత్‌నగర్‌లోని తల్వార్‌ హ్యుండాయ్‌, ఎల్బీ నగర్‌లోని లక్ష్మీ హ్యుండాయ్‌, లక్డీకాపూల్‌లోని కున్‌ యునైటెడ్‌ హ్యుండాయ్‌, రాణిగంజ్‌లోని సాబూ హ్యుండాయ్‌, బంజారాహిల్స్‌లోని తల్వార్‌ హ్యుండాయ్‌ షోరూమ్‌లను సంప్రదించవచ్చు.

దాదాపుగా ఇవే ప్రాంతాల్లో టాటా, హోండా, షెవర్లేలాంటి కంపెనీల సర్టిఫైడ్‌ కార్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, అత్తాపూర్‌, యూసుఫ్‌గూడ, ఎల్బీ నగర్‌లాంటి ప్రాంతాల్లో మల్టీ బ్రాండ్‌ కార్లను అమ్మే షోరూమ్స్‌ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీ బడ్జెట్‌లో ఉన్న సర్టిఫైడ్‌ సెకండ్‌ హ్యాండ్‌ కార్లను సొంతం చేసుకోండి.

ఇవి కూడా చదవండి

Previous articleఇంట్లో స్వచ్ఛమైన గాలినే పీలుస్తున్నారా..
Next articleక్రికెట్‌లో స్మార్ట్‌ బాల్‌.. అసలేంటిది?