Home Remedy for Migraine : మైగ్రేన్ ఒకరకమైన తలనొప్పి. ఇది మిమ్మల్ని తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. అయితే ఇది ఎన్ని మాత్రలు వేసుకున్న అంత తేలిగ్గా తగ్గదు. కానీ చిన్నచిన్న కారణాలకే మైగ్రేన్ ఎటాక్ అవుతుంది. ఎక్కువ వెలుతురు, ధ్వనిని భరించలేరు. ఎక్కువసేపు ఎండలో ఉండలేరు. కొన్ని వాసనలు (సువాసనలైనా సరే) వారికి మైగ్రేన్ రప్పిస్తాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా ఈ సమస్య ఎటాక్ అవుతుంది.
మైగ్రేన్ లక్షణాలు
మైగ్రేన్ ఎటాక్ అయినప్పుడు వికారం, తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు రావడంతో పాటు దేనిపైనా సరిగ్గా శ్రద్ధ చూపించలేరు. దృష్టి అస్పష్టంగా ఉంటుంది. అలసట, మానసిక స్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటప్పుడు చాలా మంది వైద్యులను సంప్రదిస్తారు. మరికొందరు ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తారు.
సింపుల్ టెక్నిక్..
చాలామంది ఈ నొప్పిని వదిలించుకోవడానికి, ఉపశమనం పొందడానికి అనేక ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. నొప్పి తగ్గించుకోవడానికి ఐస్ ప్యాక్లను కూడా ఉపయోగిస్తారు. అయితే అందరికీ పని చేసే.. మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చిట్కా ఇక్కడ ఉంది. అదే వేడినీటిలో కాళ్లు ఉంచడం.
అవును మీరు చదువుతుంది కరెక్టే. సాధారణంగా పెడిక్యూర్ లేదా మసాజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కాళ్లు వేడి నీటిలో ఉంచుతారు. అయితే మైగ్రేన్ తగ్గించుకోవడానికి కూడా ఈ ప్రక్రియను ఫాలో అవ్వొచ్చు అంటున్నారు నిపుణులు. ఇది మీ కాళ్లతో పాటు.. మైగ్రేన్ నుంచి ఉపశమనం అందిస్తుంది.
ఒత్తిడి తగ్గుతుంది..
సాధారణంగా మైగ్రేన్ మెదడు కణాల సమూహం, కార్యకలాపాల తరంగాల వల్ల వస్తుంది. ఇవి సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ప్రేరేపించి.. రక్త ధమనులు తగ్గిపోవడానికి కారణమవుతాయి. దీనివల్ల తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే వేడి నీటిలో కాళ్లు ఉంచినప్పుడు తల నుంచి రక్తాన్ని లాగేందుకు పాదాలలోని రక్తనాళాలు విస్తరిస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించి.. నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్
దీనివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇది విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించే పురాతన టెక్నిక్. కాబట్టి ఇది విశ్రాంతినివ్వడంతో పాటు నొప్పిని దూరం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో మీ పాదాలు ఉంచి.. లైట్లు కాస్త డిమ్ చేసి.. మైగ్రేన్ సమస్యను దూరం చేసుకోండి.