చిట్టి ఉసిరికాయలు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? వీటితో ఉసిరికాయ పప్పు రెసిపీ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఉసిరికాయ పేరు వింటే చాలు వెంటనే నోట్లో నీళ్లూరుతాయి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయతో సాధారణంగా ఊరగాయ పెట్టుకుంటాం, ఇంక ఎండబెట్టి పొడిగా చేసుకొని జుట్టుకు పోషణగా వాడుతుంటాం. చర్మసౌందర్యానికి వాడుతుంటాం. ఈ ఉసిరి చలికాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఉసిరి వల్ల మేలు చేసే గుణాలు అధికంగానే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే పోతే ఉసిరి అనేక రకాలుగా మనకు ఔషధంలా పనిచేసే ఒక మందు.
కనుక మనం ఇంట్లో అతి సులువుగా చేసుకునే వాటిలో ఉసిరి కాయ పప్పు ఒకటి. పప్పులో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. కనుక వారానికి ఒక్కసారైన పప్పును మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ఉసిరికాయ అన్ని వేళల్లో మనకు అందుబాటులో ఉండదు. కనీసం ఉసిరికాయ దొరికే సీజన్లో అయినా దాన్ని మరవకుండా మనం వాడుకున్నట్లైతే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి ఈ ఉసిరికాయ పప్పును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఉసిరికాయ పప్పుకు కావల్సిన పదార్థాలు:
- ఉసిరికాయలు – ఒక కప్పు
- కందిపప్పు – 3\4 కప్పు
- ఉల్లిపాయ – ఒకటి
- పచ్చిమిర్చి – నాలుగు
- పసుపు – చిటికెడు
- ఉప్పు – రచికి సరిపడా
- నీరు – రెండు కప్పులు
- జీలకర్ర – 1 టీ స్పూన్
- ఆవాలు – 1 టీ స్పూన్
- ఎండుమిర్చి – రెండు
- వెల్లుల్లి – ఐయిదు
- కరివేపాకు – నాలుగు రెమ్మలు
- నూనె – రెండు టేబుల్ స్పూన్లు
- నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
ఉసిరికాయ పప్పు తయారీ విధానం:
1. కందిపప్పును ముందుగా శుభ్రంగా రెండు సార్టు కడిగి ఒక అరగంట పాటు నానపెట్టండి. ఇలా నానపెట్టడం వల్ల పప్పు చాలా బాగా ఉడుకుతుంది. ఇంక రుచిగా ఉంటుంది.
2. ఇలా నానబెట్టిన పప్పులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉసిరికాయ ముక్కలు మరియు కొద్దిగా నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చేవరకూ ఉడకనివ్వాలి.
3. ఇప్పుడు కుక్కర్ మూత ఆవిరి పోవడానికి కొంత సమయం పడుతుంది.
4. ఆవిరి పోయిన తర్వాత నెమ్మదిగా మూత తీసుకుని పప్పును ఒక గిన్నెలోకి తీసుకోండి.
5. కొంచెం మెత్తగా అయ్యే విధంగా పప్పు గుత్తి సహాయంతో పప్పును మెదుపుకొని పక్కన పెట్టుకోండి.
6. ఇప్పుడు అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పును వేసి అవసరమైతే కొంచెం నీటిని కూడా పోపి ఒకసారి కలుకోండి.
7. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని నూనె వేసి, కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి అవి చిటచిట పటలాడుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసి వేయించండి.
8. తాలింపు వేగాక పక్కన పెట్టుకన్న పప్పును అందులో వేసి ఒక 30 సెకన్ల పాటు ఉడికించండి.
అంతే ఎంతో రుచిగా, కమ్మకమ్మగా, పుల్లపుల్లగా ఉసిరికాయ పప్పు రెడీ. ఇది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి కలుపుకుని తింటుంటే మాటలు ఉంటాయా చెప్పండి.
ఉసిరికాయ ఆరోగ్య ప్రయోజనాలు:
ఉసిరికాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉండడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణసంబంధ వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది. రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె సంబంధ రోగాలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి ఎంతగానో శక్తిని అందిస్తుంది. మలబద్దకం సమస్య ఉన్న వారికి ఇది దివ్య ఔషధమే అని చెప్పొచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్