మెంతి కూర, మెంతులు అంటే డయాబెటిస్ ఉన్న వారి కోసమే కాదు. మెంతులతో బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇది షుగర్ కంట్రోల్‌లో ఉంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. నిత్యం మనం వాడే దినుసుల్లో మెంతులు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది మెంతి ఆకు. ఈ మెంతి ఆకును రోజూ మనం తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని చాలా వరకూ కాపాడుకున్నట్లే.
ఈ మెంతుల్లో అనేక రకాలైన ఔషధ గుణాలు, ఆయుర్వేద మూలికలు దాగి ఉంటాయి. కానీ చాలా మంది ఆకుకూరలు తినడానికి ఎక్కువ శ్రద్ద చూపరు. మారుతున్న జీవన శైలిలో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం చిక్కుల్లో పడినట్టే. జంక్ ఫుడ్ ప్రభావం ఇప్పుడున్న యువతరంపై అధికంగా పడుతుంది. కనుక ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరల్ని తినాల్సిన అవసరం పెరుగుతోంది. ఆకుకూరల్లో ఒక్కోటి ఒక్కో విధమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మెంతులు, మెంతి ఆకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం
మెంతులు అనేవి డయాబెటిస్‌కి బెస్ట్ అని చెప్పవచ్చు. వీటిని సరైన మోతాదులో క్రమం తప్పకుండా వాడడం వల్ల చక్కెర లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక టీ స్పూన్ మెంతి గింజలని ఒక గ్లాసు నీటిలో మరిగించి దాన్ని రెండు సార్లు అంటే ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. మెంతి గింజలు అనేవి మంచి ఔషధంగా పనిచేస్తాయి. అలాగే రోజూ రాత్రి ఒక టీస్పూన్ మెంతులు నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. లేదా పెరుగులో నానేసుకుని ఉదయాన్నే పెరుగుతోపాటు మెంతులు తినేయొచ్చు. అయితే అతిగా తీసుకోవడం వల్ల కూడా సైడ్‌ఎఫెక్ట్స్ ఏర్పడుతాయి.
అధిక బరువు
మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగడం లేదా నానబెట్టిన మెంతులను తినడం వల్ల అకలి తగ్గుతుంది. ఆ విధంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
కొలెస్ట్రాల్
మెంతులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించవచ్చు. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కనుక శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అదే విధంగా మంచి కొలెస్ట్రాల్‌ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేందుకు కూడా దోహదం చేస్తుంది.
జీర్ణశక్తి
జీర్ణసంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఔషధం అని చెప్పవచ్చు. ఇది కఫం, వాత దోషాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కడుపుఉబ్బరం వంటి సమస్యలకు సరైన మందు. దీనిలో కావలసినంత పీచు, ఇనుము పుష్కలంగా ఉంటాయి.
మహిళల సమస్యలు
మహిళలకు బహిష్టు సమయంలో ఉండే నొప్పులకు మెంతులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే పాలిచ్చే తల్లులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. శిశువులకు తగినన్ని తల్లిపాలు అందేలా మెంతులు దోహదం చేస్తాయి.
జుట్టు సంరక్షణకు
మెంతుల్లో విటమిన్ సి, బీ1, బీ2, కాల్షియం ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. మెంతి పొడి, పెరుగు రెండింటిని కలిపి ఉపయోగించడం వల్ల జుట్టులో ఉండే చుండ్రు తగ్గుతుంది. అలాగే జుట్టు చిట్లకుండా, జీవాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్