Periods Tablet: పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఇది మీకోసమే..

periods
పీరియడ్స్ ఆలస్యమయ్యేందుకు టాబ్లెట్లు వాడుతున్నారా? (pixabay)
Periods Tablet: పీరియడ్స్ ఆలస్యం చేసుకునేందుకు మందులు వేసుకుంటున్నరా? అయితే ఇది ఎంతమాత్రము మంచి విధానం కాదు అంటున్నారు నిపుణులు. వాటి వల్ల కలిగే ప్రయోజనం కంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. కొంతమంది అమ్మాయిలు, మహిళలు ఫంక్షన్లు ఉన్నాయనో.. లేదంటే ఇంకేవో ముఖ్యమైన పని ఉందనో ఈ పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతుంటారు.
నిజం చెప్పాలంటే ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్ లేదా పని ఉన్నప్పుడే అమ్మాయిలకు పీరియడ్స్ వస్తే అదొక సమస్యగా మారుతుంది. పాపం వాటిని నిలువరించేందుకు ఏవేవో ట్రై చేస్తారు. కొన్నిసార్లు ముందే రావాలని ఏదో ఒకటి తినేస్తారు. కొన్నిసార్లు పీరియడ్స్ ఆపేందుకు మందులు వేసుకుంటారు. మెడిసిన్ అయితే తీసుకుంటారు కానీ అది ఎలా పని చేస్తుందో.. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో గుర్తించరు. 
 
పీరియడ్స్ స్త్రీలలో సహజ ప్రక్రియ. అవి కొన్నిసార్లు ఇబ్బంది పెడతాయి. పైగా రుతుచక్రం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి సమయానికి పీరియడ్స్ వచ్చేస్తాయి. కొందరికి ముందుగా వస్తాయి. మరికొందరి ఆలస్యంగా వస్తాయి. మరికొందరికి చాలా ఆలస్యంగా వస్తాయి. వారి శరీర తత్వాలు, హార్మోన్ల పనితీరును బట్టి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. వీటిని ప్రిడిక్ట్ అస్సలు చేయలేము. అందుకే కొన్ని ఫంక్షన్లకు విఘ్నం కలుగకూడదని చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ నిలువరించేందుకు పిల్స్ తీసుకుంటారు. అయితే వాటిని తీసుకునే ముందు అవి ఎలా పని చేస్తాయి. వాటివల్ల శరీరానికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో వంటి విషయాలపై పూర్తిగా అవగాహన ఉండాలి అంటున్నారు నిపుణులు.

టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయంటే..

పీరియడ్స్ ఆపడానికి తీసుకునే టాబ్లెట్లు మీ సాధారణ రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తాయి. మీ శరీరంలోని సహజ హార్మోన్లను మార్చే సింథటిక్ హార్మోన్లను ఉత్పత్తి చేసేలా పీరియడ్స్ ఆలస్యం చేసే మాత్రలు రూపొందిస్తారు. ఈ సింథటిక్ హార్మోన్లు మీ రుతుచక్రాన్ని నియంత్రించే మీ సహజ హార్మోన్లను అనుకరిస్తాయి. రుతుచక్ర సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్లు మీకు పీరియడ్స్ వచ్చేలా, ఆగేలా చేస్తాయి. పీరియడ్స్ ఆలస్యం చేసే మాత్రలు ఈ హార్మోన్ల సింథటిక్ వెర్షన్లు. అవి ప్రొజెస్టెరాన్ కలిగి ఉండొచ్చు. లేదంటే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ రెండింటీని కలిగి ఉండొచ్చు. ఈ మాత్రలు మీ పీరియడ్స్ ఆలస్యం చేయవచ్చు. కానీ ఇవి మీ గర్భాశయ లైనింగ్‌ను దెబ్బతీస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే సమస్య తీవ్రం కావొచ్చు. కానీ వీటిని తగ్గించేస్తే వీటి దుష్ప్రభావం కూడా తగ్గుతుంది. వీటిని వినియోగం ఆపేసిన తర్వాత శరీరంలో సహజ హార్మోన్ల సమతుల్యత మళ్లీ ప్రారంభమవుతుంది.
 
పీరియడ్స్ ఆలస్యం చేసే మాత్రలు సరిగ్గా పనిచేయాలంటే.. మీ పీరియడ్స్ రావడానికి మూడు రోజుల ముందే మీరు వాటిని తీసుకోవాలి. మీరు వాటిని తీసుకోవడం మానేస్తే సహజ హార్మోన్లు మీకు పీరియడ్స్ వచ్చేలా చేస్తాయి. అవి గర్భనిరోధక మాత్రలు కావు కాబట్టి.. అవి గర్భాన్ని నిరోధించలేవు. కారణం ఏమైనప్పటికీ.. మీరు వాటిని తీసుకునేముందు కచ్చితంగా వైద్యుడి సూచనలు తీసుకోవాలి. 

పీరియడ్స్ డిలే కోసం టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇవీ

మితంగా తీసుకునేది ఏదైనా మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. పనిచేస్తుంది కదా అని ఎక్కువగా తీసుకుంటే.. అది తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది.  పీరియడ్స్ ఆలస్యం చేసే పిల్స్ పరిస్థితి కూడా అంతే. ఏమైనా టాబ్లెట్స్ నిరంతరం తీసుకుంటే అవి భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయి. ముఖ్యంగా మీరు వైద్యుడిని సంప్రదించకుండా వీటిని తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం కావొచ్చు. 
 
కొందరికి మొటిమలు, చర్మంపై పిగ్మెంటేషన్ సమస్యలు వస్తాయి. మరికొందరికి మానసికమైన సమస్యలు, లైంగికమైన కోరికలు కోల్పోవడం, రొమ్ములో నొప్పి, పీరియడ్స్ లేని సమయంలో రక్తస్రావం కావొచ్చు. కాబట్టి ఇలాంటి మాత్రలు అస్సలు తీసుకోకపోవడమే మంచిది. తీసుకుంటే మాత్రం వైద్య సలహా మేరకు చాలా అరుదుగా తీసుకోండి.
Previous articleYoga Poses for Back Pain and Sleep: వెన్నునొప్పి తగ్గడానికి మంచి నిద్రకు 3 సింపుల్ యోగా ఆసనాలు
Next articleDry Hair Remedies: పొడి జుట్టుకు 5 పరిష్కార మార్గాలు.. ఇలా చేస్తే మీ జుట్టు సిల్కీ అవుతుంది