yoga asanas for diabetes: డయాబెటిస్‌ (మధుమేహం): యోగాసనాలతో నియంత్రణ

yoga asanas
Image by NatureFriend from Pixabay

yoga asanas for diabetes: మధుమేహం (డయాబెటిస్‌) ఎందుకు వస్తుంది? యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామాలతో మధుమేహం నియంత్రణ సాధ్యమా? డయాబెటిస్‌కు మూల కారణాలు ఏంటి? వీటిపై సమగ్ర కథనాన్ని యోగా గురు చాడ రంగారెడ్డి డియర్ అర్బన్ ద్వారా మీకు అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

రక్తంలోని గ్లూకోజ్‌ని శక్తిగా మార్చడానికి తగినంత ఇన్సులిన్‌ శరీరంలో తయారుకాకపోవడాన్ని డయాబెటిస్‌ (మధుమేహం) అంటారు. ఆయుర్వేదం ప్రకారం ఇది కఫ దోషం. మధుమేహం ఒక లైఫ్‌స్టయిల్‌ డిసీజ్‌ అని చెప్పొచ్చు.

why diabetes will come: డయాబెటిస్ ఎందుకు వస్తుంది?

మన ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారం అతి నిద్ర, తగినంత శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, తగినంత మానసిక వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆతృత, వంశపారంపర్యం కారణాల వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.

ప్రకృతి విరుద్ధమైన జీవన శైలి వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంటే రాత్రి మెలకువతో ఉండాల్సి వచ్చి పగలంతా పడుకోవాల్సి రావడం.

ఒక్కోసారి కొన్ని వ్యాధులకు స్టెరాయిడ్స్‌ వాడడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. కోవిడ్‌–19 వల్ల న్యుమోనియా వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు స్టెరాయిడ్స్‌ ఇస్తే వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల కొందరిలో డయాబెటిస్‌ వచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి.

జీర్ణ శక్తి తగ్గిపోతే కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అంటే పరిస్థితులను జీర్ణించుకునే శక్తి తగ్గిపోతే భౌతిక జీర్ణశక్తి తగ్గిపోతుంది.

జీవితాన్ని అనుభూతి చెందడం, ఆస్వాదించడం తగ్గి భారంగా నెట్టుకొస్తే జీర్ణశక్తి, రోగ నిరోధక శక్తి తగ్గుతాయి. గత జీవితపు తీపిని గుర్తు చేసుకుని అది మళ్లీ రాదని దాని గురించి దిగులు చెందడం కూడా మధుమేహానికి ఒక కారణం.

మధుమేహ కారణాలను తెలుసుకోకుండా మధుమేహం తగ్గించడం సాధ్యం కాదు. అందువల్ల వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

జీవిత ప్రస్తుత పరిస్థితిని ఆనందించకుండా, ఆస్వాదించకుండా, అనుభూతి చెందకుండా ఎన్ని ఔషధాలు తీసుకున్నా నిరర్థకమే. వృత్తిపరంగా, ఆర్థికంగా, రిలేషన్‌షిప్స్‌ పరంగా జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఈ కష్టాలన్నీ మన ఆలోచనను మార్చాలి తప్ప నిరాశను తీసుకురాకూడదు.

డయాబెటిస్‌ జీవన శైలి జబ్బు అని చెప్పుకొన్నాం కదా.. ఈ కష్టాల నుంచి ఉపశమనం పొందుతామన్న అపోహాలో కొందరు ఆల్కహాల్, స్మోకింగ్‌ను ఆశ్రయించి వాటికి బానిసలు అవుతారు. ఈ వ్యసనాలు కూడా డయాబెటిస్‌కు కారణమవుతాయి.

diabetes prevention: మధుమేహం (డయాబెటిస్) నివారణ

గడిచిపోయిన జీవితంలో తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తు గురించి లక్ష్యాలు, ప్రణాళికలు, వ్యూహాలు ఏర్పరచుకోవాలి. కానీ ఈ రెండింటి కంటే ముఖ్యమైనది వర్తమానం. అంటే ఈ క్షణం ఉత్సాహంగా గడపాలి.

ఉత్సాహం తగ్గకుండా, ఈ క్షణాన్ని ఆనందించడం, ఆస్వాదించడం నేర్చుకోవాలి. జీవితం అంటే ఈక్షణం అని అర్థం. ఈ ప్రస్తుత క్షణాన్ని ఆనందంగా గడిపితే మధుమేహం నుంచి బయటపడడం సులభం అవుతుంది.

మన శరీరానికి ఏదైనా నొప్పి, వ్యాధి వచ్చిందంటే మన శరీరం మనతో ఆయా సంకేతాల ద్వారా మాట్లాడుతోందని అర్థం. మన శరీరానికి సరిపడని ఆహారం తీసుకోవడమో, నష్టం కలిగించే అలవాటు కలిగి ఉన్నామో చెప్పే ప్రయత్నం చేస్తుంది.

అలవాట్లు, వ్యసనాలు, ఆలోచనా విధానం, నకారాత్మక భావనలను సరి చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అందువల్ల ఏ వ్యాధి సోకినా మనం జాగ్రత్తగా గమనించాలి.

శరీరంలోని ప్రతి కణానికి మనసు ఉంటుంది. మనం మన ఆలోచనలు, అభిప్రాయాలు, నమ్మకాలు, ఇతరత్రా నేర్చుకున్న జ్ఞానం పక్కనపెట్టి, ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా శరీరాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే శరీరం అద్భుతంగా స్పందిస్తుంది.

తన అవసరమేంటో, తన పట్ల మనం చేసిన లోపమేంటో స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ఈ గమనిక వల్లే చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. బుద్దుని శిశ్య పరంపరలో ‘కాయనపస్సన’ అనే పేరుతో శరీరంలో ప్రతి కణాన్ని శిరస్సు నుంచి పాదాల వరకు గమనించే సాధన చేయిస్తున్నారు.

diabetes cure yoga: డయాబెటిస్‌కు యోగ శాస్త్రం నుంచి పరిష్కారాలు

డయాబెటిస్‌కు యోగశాస్త్రం పలు పరిష్కార మార్గాలను చూపిస్తోంది. మానసిక ఆందోళనను తగ్గించేలా ధ్యానం, ప్రాణాయామాలతో పాటు మధుమేహం నుంచి ఉపశమనానికి, నివారణకు పలు ఆసనాలు ఉపయోగపడతాయి. వీటి ద్వారా శరీరానికి ప్రాణ శక్తి పెరగడమే కాకుండా, కాలేయం, క్లోమ గ్రంథి పనితీరు మెరుగుపడి మునుపటి ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు.

మధుమేహ నివారణ, నియంత్రణకు ఉపయోగపడే ఆసనాలు

1. వజ్రాసనం
2. వక్రాసనం
3. అర్ధమత్సే్యంద్రాసనం
4. హలాసనం

డయాబెటిస్ నివారణ, నియంత్రణకు ఉపయోగపడే ప్రాణాయామాలు

1. భస్త్రికా
2. కపాలభాతి
3. అనులోమ్‌ విలోమ్‌
4. భ్రమరి

అలాగే ధ్యానం కూడా డయాబెటిస్‌ నివారణకు ఉపయోగపడుతుంది.

డయాబెటిస్‌కు వజ్రాసనం నుంచి ప్రయోజనాలుః

1. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. స్థిరత్వం పెరుగుతుంది.
3. ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు.
4. జీర్ణ శక్తి పెరుగుతుంది.
5. వెన్నెముక స్ట్రెయిట్‌గా ఉండడం వల్ల ప్రాణశక్తి ప్రవాహం మూలాధార చక్రం నుంచి సహస్రారం సులభంగా జరుగుతుంది.

vajrasanam
వజ్రాసనం

వజ్రాసనం ఎలా వేయాలి?

మోకాళ్లపై కూర్చుని మన బరువు సమానంగా రెండు కాళ్లపై పడేలా విశ్రాంతిగా కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు మోకాళ్ల మధ్య కొద్దిగా ఖాళీస్తలం ఉండాలి. ఎడమ మోకాలిపై ఎడమ చేతిని, కుడి మోకాలిపై కుడి చేతిని ఉంచాలి.

వక్రాసనం వేయు విధానం :

1. రెండు కాళ్లు ముందుకు చాపి హాయిగా కూర్చోవాలి.
2. రెండు అరచేతులు తొడలకు సమాంతరంగా నేలపై ఆనించాలి.
3. ఎడమ మోకాలిని వంచి ఎడమ కాలు పాదం కుడి మోకాలు ప్రక్కన ఉండేలా చేయాలి.
4. కుడి చేతిని ఎడమ మోకాలి బయట వైపు ఉంచాలి.
5. కుడి మోచేయి ఎడమ మోకాలును తాకాలి.
6. కుడి చేతితో ఎడమ చీలమండను పట్టుకోవాలి.
7. తలను ఎడమ వైపునకు తిప్పాలి.
8. తదుపరి కాలు మార్చి కుడి కాలును వంచి పునరావృతం చేయాలి.

జాగ్రత్తలు: హెర్నియాతో బాధపడేవారు వక్రాసనం వేయకూడదు.

అర్ధ మత్స్యేంద్ర ఆసనము వేసే విధానం :

1. రెండు కాళ్లు ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి.
2. కుడి కాలిని వంచి కుడి కాలి పాదం ఎడమ పిరుదు కిందకు తీసుకురావాలి.
3. ఎడమ కాలిని వంచి, ఎడమ కాలి పాదం కుడి మోకాలు పక్కన, కుడి వైపున నేల వైపు ఆనించాలి.
4. కుడి చేతితో ఎడమ మోకాలి ఎడమ వైపు నుంచి ఎడమ కాలి పాదము పట్టుకోవాలి.
5. ఎడమ చేతిని కుడి తొడ మూల భాగం వద్ద ఆనించాలి.
6. తలను ఎడమ వైపునకు తిప్పాలి.
7. ఈ ప్రక్రియను కాలి మార్చి కూడా చేయాలి.

జాగ్రత్తలు: హెర్నియాతో బాధపడే వారు అర్ధ మత్స్యేంద్ర ఆసనం ప్రయత్నించవద్దు.

హలాసనం :

హలం అనగా నాగలి. ఈ భంగిమ నాగలి ఆకారంలో ఉండడం చేత దీనిని హలాసనం అంటారు.

హలాసనం వేయు విధానం:

halasanam
హలాసనం

1. వెల్లకిలా పడుకోవాలి.
2. రెండు కాళ్లు పైకి లేపి ముఖం మీదుగా తల వెనక నేల మీద ఆనించాలి.
3. మోకాళ్లు వంగకూడదు.
4. కాళ్లు పైకి లేపుతున్నప్పుడు శ్వాస పీల్చుకోవాలి.

హలాసనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

1. సరైన వ్యాయామం లేని కారణంగా నడుము బిర్రబిగిసి ఉండడం వల్ల తొలుత నడుములో నొప్పి పుట్టవచ్చు.
2. ప్రారంభంలోనే ఈ ఆసనం ఎక్కువ సేపు చేస్తే మెడ నొప్పి పుడుతుంది. ప్రారంభంలో కొద్దిసేపు మాత్రమే చేయాలి.
3. గర్భవతులు హలాసనం సాధన చేయవద్దు.

హలాసనం ప్రయోజనాలు :

1. తలనొప్పి, వెన్నునొప్పి, నిద్రలేమిని తగ్గిస్తుంది.
2. థైరాయిడ్‌ గ్రంథి సమస్యలను పరిష్కరిస్తుంది.
3. ఒత్తిడిని తగ్గిస్తుంది.
4. కాలేయ సమస్యలను తగ్గిస్తుంది.
5. సైనస్‌ సమస్యలను పరిష్కరిస్తుంది.

భ్రమరి ప్రాణాయామం పద్ధతి :

1. పద్మాసనంలో గానీ, సిద్ధాసనంలో గానీ, వజ్రాసనంలో గానీ కూర్చోవాలి.
2. నాలుకను వెనకకు మరల్చి కొననాలుకకు ఆనించాలి.
3. సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాలి.
4. బొటన వేళ్లతో చెవులను మూయాలి.
5. ఓం శబ్దం చేస్తూ శ్వాసను వదలాలి. నోరు మూసి ఉంచాలి.
6. కనీసం పది నుంచి 12 సార్లు చేయాలి.

భ్రమరి ప్రాణాయామం ప్రయోజనాలు :

1. బీపీ తగ్గిస్తుంది.
2. కోపాన్ని జయిస్తాం.
3. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
4. థైరాయిడ్‌ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది.
5. క్రమం తప్పకుండా చేస్తే జీవితంలో తృప్తి లభిస్తుంది.

భస్త్రికా ప్రాణాయామము :

1. సుఖాసనం లేదా పద్మాసనం లేదా వజ్రాసనంలో కూర్చోవాలి.
2. వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్లు మూసి ఉంచాలి
3. శ్వాసను సుదీర్ఘంగా తీసుకుంటూ ఊపిరితిత్తులను గాలితో నింపాలి.
4. తీసుకున్న గాలిని మొత్తం బయటకు వదలాలి.
5. ఇలా గాలిని పీలుస్తూ వదిలేస్తూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు చేయాలి.
6. ప్రాణాయామం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి.

కపాలభాతి ప్రాణాయామము :

1. సుఖాసనంలో గానీ, పద్మాసనంలో గానీ కూర్చోవాలి. కళ్లు మూసుకోవాలి.
2. వెన్నెముక నిటారుగా ఉండాలి.
3. ఊపిరితిత్తులను పూర్తిగా గాలితో నింపాలి.
4. కడుపును సంకోచింపజేస్తూ (లోపలికి వెళుతూ) గాలిని బయటకు వదలాలి. ఇలాగే గాలిని బయటకు పదేపదే వదిలేయాలి.
5. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాణాయామమం చేయాలి.

అనులోమ్‌ విలోమ్‌ ప్రాణాయామం :

1. సుఖాసనం లేదా ఏదైనా అనుకూలమైన ఆసనంలో కూర్చోవాలి.
2. వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్లు మూసుకోవాలి.
3. కుడి బొటన వేలితో ముక్కు కుడి రంద్రాన్ని మూసివేసి ఎడమ ముక్కు రంద్రం ద్వారా గాలిని నెమ్మదిగా సుదీర్ఘంగా పీల్చాలి.
4. కుడి చేతి ఉంగరపు వేలితో ఎడమ ముక్కు రంద్రాన్ని మూసివేసి కుడి ముక్కు రంద్రం నుంచి గాలిని నెమ్మదిగా వదలాలి.
5. కుడి ముక్కు రంద్రం నుంచి గాలిని పీల్చి ఎడమ ముక్కు రంద్రం నుంచి వదలాలి. ఇలా కనీసం 15 నిమిషాలు చేయాలి.
6. ఈ ప్రాణాయామం ఏ సమయంలోనైనా చేయవచ్చు.

దీని వల్ల సూర్య నాడి, చంద్ర నాడీ రెండు శుద్ధి చెంది లెఫ్ట్‌ బ్రెయిన్, రైట్‌ బ్రెయిన్‌ పనితీరు మెరుగుపడుతుంది.

యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయమాలతో జీవనశైలిలో మార్పులు చేసుకుని డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీర్ఘకాలంలో డయాబెటిస్ నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.

Ranga Reddy

– చాడ రంగారెడ్డి,

యోగా గురు,

ప్రిన్సిపల్, ఎస్.ఆర్.కె. పబ్లిక్ స్కూల్ 

Previous articleBhimashankar jyotirlinga: భీమశంకర జ్యోతిర్లింగం.. జ్యోతిర్లింగ దర్శన యాత్ర
Next articleCalcium rich foods: కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు .. వీటితో ఎముకలు స్ట్రాంగ్