వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ వచ్చి చేరనుంది. ఇంటరనెట్ లేకున్నా సరే ఫోటోలు, ఫైల్స్ సులభంగా పంపుకునేందుకు ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ కంపెనీ వాట్సాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇంటర్‌నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ అన్నీ షేర్ చేసుకునే వెసులుబాటు కలిగి ఉంటుంది. అంటే వాట్సాప్ యూజర్లందరూ ఆఫ్లైన్‌లో ఉంటూనే ఫోటోలు, ఫైల్స్ అన్నీ కూడా సులభంగా పంపించుకోవచ్చు.
మొబైల్‌లో సాధారణంగా ఇంటర్‌నెట్ సదుపాయం లేకుండా పంపే ఫైల్స్ సైతం ఎన్‌క్రిప్ట్ చేయబడుతాయని.. తద్వారా సెక్యూరిటీ ఉంటుందని సమాచారం. ఇప్పటివరకూ వాట్సాప్ అందించిన కొత్త కొత్త ఫీచర్‌లు ఒక విధంగా ఉంటే ఇప్పుడు ఏకంగా ఇంటర్‌నెట్ లేకుండానే ఫోటోలు, వీడియోలు పంపుకునే సదుపాయం తీసుకురావడానికి సిద్దం అయిపోతుంది. వాట్సాప్‌ను వాడే ప్రతీ ఒక్కరికీ ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. ఇది విజయవంతమైతే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నది. ఇంటర్‌నెట్ లేకుండా ఫోటోలు, వీడియోలు షేర్ చేసేందుకు బ్లూటూత్ టెక్నాలజీ, లేదా షేర్‌ఇట్ వంటి ఫీచర్ల ద్వారా పంపించవచ్చు. ఇదే తరహాలోనే వాట్సాప్ తాజా ఫీచర్ తేబోతోంది.
ఈ ఫీచర్ పనిచేయాలంటే వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఫీచర్ కూడా ప్రవేశపెట్టనుంది. చాట్‌లిస్ట్‌లో ఫేవరెట్స్ ఆప్షన్‌ను తీసుకురాబోతున్నది. ఇందులో యూజర్లు తమకు ఇష్టమైన వ్యక్తులను సులభంగా యాడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తరచూ చాట్‌చేసే వారితో పాటు కాంటాక్ట్స్ మొత్తం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ కూడా టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలో బీటా యూజర్లకు అందుబాటులో ఉంటుందని సమాచారం.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్