Nuvvula Laddu recipe in Telugu: నువ్వుల లడ్డు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని ఏడాది పొడవునా తినడం చాలా మంచిది. పిల్లలు, పెద్దలతో సహా నువ్వులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇది నీరసం తగ్గించి తక్షణ శక్తిని ఇవ్వగలదు. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం రోజుకొక లడ్డు తినడం చాలా అవసరం. ముఖ్యంగా వీటిని మహిళలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
రక్తహీనత, నడుము నొప్పి లాంటి వివిధ రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే నువ్వులను వంటల్లోనే కాకుండా తీపి పదార్థాలు, పిండి వంటల్లో కూడా వినియోగిస్తాం. వాటిల్లో నువ్వుల లడ్డూలు కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో లభించే నువ్వుల లడ్డూలను మనం చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రుచిగా నువ్వుల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు
- నువ్వులు – ఒక కప్పు
- బెల్లం తురుము – ముప్పావు కప్పు
- వేరుశనగ పప్పు – అర కప్పు
- నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
- యాలకుల పొడి – చిటికెడు
నువ్వుల లడ్డూ తయారీ విధానం:
స్టెప్ 1: ముందుగా కడాయిలో నువ్వులను వేసి మీడియం మంటపై దోరగా 7 నుండి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి.
స్టెప్ 2: ఇలా వేయించుకున్న తరువాత ఈ నువ్వులను ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: తరువాత అదే కడాయిలో వేరుశనగ పప్పును వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన వేరుశనగ పప్పును ఒక ప్లేట్‌లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 4: ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన నువ్వులను, పల్లీలను వేసి రుబ్బుకోవాలి.
స్టెప్ 5: ఇప్పుడు అందులోనే బెల్లం తురుమును వేసి మళ్లీ మెత్తగా రుబ్బుకోవాలి.
స్టెప్ 6: ఆపై మిశ్రమాన్ని ప్లేట్‌లో తీసుకుని అందులో యాలకుల పొడి వేసి, నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత చేతికి నెయ్యిని రాసుకుంటూ తగినంత మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలలాగా కట్టుకోవాలి.
ఈ విధంగా చేయడం వల్ల నువ్వులతో ఎంతో రుచిగా ఉండే లడ్డూలతోపాటు చిక్కీలను కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నువ్వుల లడ్డూలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ లడ్డూలను రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. నువ్వుల లడ్డూలను పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్