కంప్యూటర్ ముందు కూర్చొని గంటల కొద్దీ పనిచేస్తున్నారా? అయితే మీరు కొన్ని యోగాసనాల ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. కుర్చీకి అతుక్కుపోయే వారు తమకు తెలియకుండానే రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. అందులో ఒక చోటే ఎక్కువగా కూర్చొని పని చేయడం వల్ల తీవ్రమైన మెడ నొప్పి, భుజాల నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
అంతేకాకుండా దీని వల్ల గర్భాశయ సమస్యలు కూడా వస్తున్నాయంటున్నారు నిపుణులు. గంటల తరబడి ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల శరీరానికి తగిన వ్యాయామం, శారీరక శ్రమ ఉండవు. ఫలితంగా పొట్ట పెరిగిపోయి ఊబకాయం వంటి సమస్యల చిక్కుల్లో పడి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. క్రమంగా షుగర్ వ్యాధులను కూడా కొని తెచ్చుకుంటున్నారు. అందువల్ల ప్రతీ మనిషి రోజులో కొంత సమయాన్ని వ్యాయామానికి తప్పనిసరిగా కేటాయించాలని అంటున్నారు నిపుణులు. దీని వల్ల శరీరం ఫిట్‌గా ఉండడమే కాకుండా ఒత్తిడితో కూడిన రకరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి యోగాసనాలు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
ధనురాసనం:
ఈ ధనురాసనం శరీరం విల్లు ఆకారంగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలూ తగ్గించకోవచ్చు. ఇది చేతులు, కాళ్ళ కండరాలను టోన్ చేయడం, బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం జీర్ణక్రియకు మంచిది. అలాగే ఆస్తమా సమస్యలు కూడా తగ్గుతాయి. రోజూ ఈ ధనురాసనాన్ని చేస్తే ఎన్నో ఆనారోగ్య పరమైన సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ధనురాసనం ఎలా చేయాలి:
ఈ ఆసనం వేయడానికి యోగా మ్యాట్‌పై బోర్లా పడుకోవాలి. శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచాలి. దీని తరువాత నెమ్మదిగా మీ మోకాళ్ళను వంచి కాళ్లను పైకి లేపండి. మీ అరిచేతులతో మడమల దగ్గర పట్టుకోండి. గాలి పీల్చేటప్పుడు ఛాతీని ఎత్తండి. తొడలను నేలపైకి ఎత్తండి. ఆపై కాళ్ళను చేతులతో లాగండి. ఈ సమయంలో ముందువైపు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ శ్వాసపై దృష్టిని ఉంచండి. శరీరాన్ని విల్లులా సాగదీయండి. సౌకర్యంగా అనిపించే వరకు 15 నుండి 20 సెకన్ల పాటు ఈ ఆసనాన్ని వేయండి. శ్వాసను వదులుతూ నిదానంగా చేతులను వదిలి మళ్లీ యథాస్థితికి రావాలి. అంటే మళ్లీ బోర్లా పడుకుని రిలాక్స్ అవ్వాలి.
తాడాసనం:
ఒకే చోట కూర్చోని పని చేయడం వల్ల నడుములోనే కాకుండా మోకాళ్లు, కాలి వేళ్లు, చేతుల్లో కూడా నొప్పి వస్తుంది. కనుక వాటిని బలోపేతం చేసేందుకు ఈ తాడాసనం చేయవచ్చు. వెన్నెముఖను సాగదీయడం, కాళ్లకు బలం పెంచుకోవడం కోసం ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
తాడాసానం ఎలా చేయాలి?
ఈ ఆసనం వేయడానికి ముందు నిటారు పొజిషన్‌లో నిలబడండి. దీని తరువాత రెండు చేతులను తలపైకి ఎత్తి తీసుకోండి. ఇప్పుడు మీ చేతులను నిటారుగా ఉంచి, మీ మడమలను పైకెత్తి, మీ కాలి వేళ్ళపై నిలబడి.. నెమ్మదిగా మీ చేతులను క్రిందికి దింపి సాధారణ స్థితికి రండి. 10 నుండి 15 సెకన్ల వరకు ఈ స్థితిలో ఉండండి. దీని వలన వెన్నెముఖలో రక్తసరఫరా మెరుగుపడుతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్