హైపర్‌ యాక్టివా.. ఏడీహెచ్‌డీ ఉందా?

adhd
Photo by rawpixel.com from Pexels

హైపర్‌ యాక్టివ్‌ పిల్లలను జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్లు ఏడీహెచ్‌డీ తో బాధపడుతున్నారేమో చూడండి. ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌. దీనిని గతంలో అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ అనేవాళ్లు. మీ పిల్లాడు హైపర్‌ యాక్టివ్‌ గా ఉన్నంత మాత్రాన ఈ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని భయపడిపోకండి.

తాజా అధ్యయనాల ప్రకారం పిల్లల్లో ఈ డిజార్డర్‌ గురించి తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాళ్లు చెప్పిన లక్షణాలు మీ హైపర్‌యాక్టివ్‌ పిల్లల్లో ఉన్నాయేమో చూసుకోండి. స్కూల్ వయసు పిల్లల్లో ఈ డిజార్డర్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు పెరిగి పెద్దవుతున్నా.. ఈ డిజార్డర్‌ వేధిస్తూనే ఉంటుంది.

అమెరికన్‌ సైకియాట్రిక్‌ అసోసియేషన్‌కు చెందిన డయాగ్నోస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మ్యానువల్‌ ఆఫ్‌ మెంటల్‌ డిజార్డర్స్‌ (డీఎస్‌ఎం) ప్రకారం ఏడీహెచ్‌డీని గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. మీ పిల్లలు హైపర్ యాక్టివ్ ఉండి.. అప్పటికప్పుడు చేసే పనిపై ఏకాగ్రత కోల్పోతున్నంత మాత్రాన వాళ్లు ఈ ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నట్లు కాదని గ్రహించండి. 

పిల్లల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు

ఏడీహెచ్‌డీ లక్షణాలను కూడా రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఈ డిజార్డర్‌కు సంబంధించి డీఎస్‌ఎం తీసుకొచ్చిన మార్గదర్శకాలను ఇప్పుడు చూద్దాం.

ఏకాగ్రత కోల్పోవడం

  చేసే పనులపై శ్రద్ధ వహించకపోవడం లేక స్కూల్‌ లేదా ఇతర పనులలో అజాగ్రత్తగా వ్యవహరించడం
  ఏదైనా పని లేదా ఆటపాటల పట్ల ఎక్కువసేపు దృష్టి నిలుపలేకపోవడం (ఉదాహరణకు స్కూల్లో పాఠం శ్రద్ధగా వినకపోవడం, ఎక్కువసేపు చదవలేకపోవడం)
  తరచూ నేరుగా తనతోనే మాట్లాడుతున్నా వినిపించుకోకపోవడం (ఉదాహరణకు ఏకాగ్రతను దెబ్బతీసే ఘటనలు ఏవీ జరగకపోయినా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండిపోవడం)
  తరచూ మనం ఇస్తున్న సూచనలను పాటించకపోవడం, స్కూల్‌ వర్క్‌ లేదా ఇతర పనులను పూర్తి చేయలేకపోవడం (ఉదాహరణకు ఏదైనా పని మొదలుపెట్టి వెంటనే ఏకాగ్రత కోల్పోయి దానిని మధ్యలోనే వదిలేయడం)
  రోజువారీ పనులు లేదా కార్యకలాపాలను కూడా చేయడానికి ఇబ్బంది పడుతుండటం (ఉదాహరణకు తనకు సంబంధించిన వస్తువులను సరిగా చూసుకోలేకపోవడం, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ లేకపోవడం, గడువులోపు పనులను పూర్తి చేయేలకపోవడం)
  కాస్త ఎక్కువ సేపు బుర్రకు పదును పెట్టి చేయాల్సిన పనులను ఇష్టపడకపోవడం, చేయకపోవడం (ఉదాహరణకు స్కూలు పిల్లలైతే స్కూల్‌ వర్క్‌ లేదా హోమ్‌ వర్క్‌ చేయకపోవడం.. అదే పెద్దవాళ్లయితే రిపోర్టులు తయారు చేయడం, ఓ భారీ ఫైలును సమీక్షించలేకపోవడం)
  పనులు పూర్తి చేయడానికి కావాల్సిన వస్తువులను తరచూ పోగొట్టుకోవడం (ఉదాహరణకు స్కూలు పిల్లలైతే పెన్సిల్స్‌, బుక్స్‌, ఇతర స్కూలుకు సంబంధించిన వస్తువులను పోగొట్టుకోవడం.. అదే పెద్ద వాళ్లయితే పర్సులు, కీస్‌, మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకోవడం)
  చేస్తున్న పనికి సంబంధం లేని ఆలోచనలతో సులువుగా ఏకాగ్రత కోల్పోతుండటం (పెద్ద వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అనవసర ఆలోచనలు చేస్తుంటారు)
  రోజువారీ చేయాల్సిన పనులను మరచిపోవడం

హైపర్‌ యాక్టివిటీ.. ఇంపల్సివిటీ

  తరచూ ఒక చోట కుదురుగా ఉండలేకపోవడం (చంచలత్వం) అంటే ఎప్పుడూ కాళ్లూ, చేతులూ ఆడిస్తుండటం, కుర్చీలో కుదురుగా కూర్చోలేకపోవడం
  ఓ చోట కచ్చితంగా ఉండాల్సిన సమయంలో ఉండకుండా ఎక్కడికో వెళ్లిపోవడం (స్కూల్‌లో క్లాస్‌ జరుగుతుంటే బయటకు వెళ్లిపోవడం లేదా ఆఫీసులో ఉండాల్సిన సమయంలో ఉండకపోవడం)
  అనవసర సందర్భాల్లో అతిగా స్పందించడం
  తరచూ ఖాళీ సమయాల్లో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండకపోవడం
  హడావిడిగా ఉండటం.. ఎవరో వెనక తరుముతున్నట్లుగా వ్యవహరిస్తుండటం (ఉదాహరణకు ఎక్కువసేపు ఓ చోట ఉండలేకపోవడం అంటే మీటింగ్స్‌లోగానీ, నలుగురితో కలిసి మాట్లాడుతున్నపుడుగానీ మధ్యలోనే వెళ్లిపోవడం)
తరచూ అతిగా మాట్లాడుతుండటం
తరచూ అవతలి వాళ్లు అడిగిన ప్రశ్న పూర్తవకుండానే సమాధానం ఇస్తుండటం (ఉదాహరణకు అవతలి వాళ్ల వాక్యాన్ని వీళ్లే పూర్తి చేస్తుంటారు.. ఏదైనా చర్చలో పాల్గొన్నపుడు తమ వంతు వచ్చే వరకు వేచి చూడలేరు)
ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం (ఉదాహరణకు ఇతరుల సంభాషణలోకి హఠాత్తుగా వచ్చేయడం, వాళ్ల పనుల్లో జోక్యం చేసుకోవడం, ఇతరుల వస్తువులను వాళ్ల అనుమతి లేకుండానే తీసుకోవడం)

ఏడీహెచ్‌డీ ని ఎలా గుర్తించాలి

రెండు సందర్భాల్లోని లక్షణాలను మీరు పూర్తిగా చదివారు కదా. రెండింట్లోని లేదా కనీసం ఒక దాంట్లోని ఆరు లక్షణాలు కనుక ఆరు నెలల పాటు మీ పిల్లల్లో కనిపిస్తూ.. అది వాళ్ల విద్య, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అనిపిస్తేనే దీనిని ఏడీహెచ్‌డీగా అనుమానించండి. అదే పెద్ద వాళ్లలో అయితే వీటిలోని కనీసం ఐదు లక్షణాలు ఆరు నెలలపాటు ఉన్నాయేమో గమనించండి. చాలా వరకు 12 ఏళ్లలోపు పిల్లల్లోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. 

ఏడీహెచ్‌డీకి చికిత్స ఉందా?

కచ్చితంగా దీనికి చికిత్స ఉంది. అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మందుల ద్వారా అయితే రెండోది థెరపీల ద్వారా. రెండూ ఒకేసారి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా ఏడీహెచ్‌డీతో బాధపడే చిన్నారులు భవిష్యత్తులో అపోజిషనల్‌ డిఫయంట్‌ డిజార్డర్‌, కండక్ట్‌ డిజార్డర్‌లాంటి వాటి బారిన పడే ముప్పు ఉండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇలాంటి పిల్లల చికిత్సలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. మొదట వారి ద్వారానే ఈ డిజార్డర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారు. పిల్లల ప్రవర్తన మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై తల్లిదండ్రులకు నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇక క్లాస్‌ రూమ్‌లలో పిల్లల ప్రవర్తన మార్చడానికి టీచర్లకు కూడా శిక్షణ ఇస్తారు.

మెడికేషన్‌

ఏడీహెచ్‌డీకి నిపుణుల సమక్షంలో చికిత్స అందిస్తారు. పీడియాట్రిషన్‌, సైకియాట్రిస్ట్‌లాంటి వాళ్లు ప్రత్యేకంగా వీళ్లకు ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. మెడికేషన్‌ పరంగా చూస్తే ఐదు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 

ఇవి ఏడీహెచ్‌డీకి శాశ్వతమైన పరిష్కారం చూపకపోయినా.. చాలా వరకు పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఏకాగ్రత పెరగడం, ప్రశాంతంగా పనిచేయడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సారించే అవకాశాలు ఉంటాయి.

కొన్ని ప్రతి రోజూ తీసుకోవాల్సిన మందులు కాగా.. కొన్ని కేవలం స్కూలుకు వెళ్లే రోజుల్లో తీసుకుంటే సరిపోతుంది. మధ్యమధ్యలో పిల్లల ప్రవర్తనను గమనిస్తూ చికిత్సను కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. మొదట్లో స్వల్ప మోతాదుల్లో ఇస్తూ తర్వాత క్రమంగా పెంచుతూ వెళ్తారు. 

థెరపీ

మందులు వాడుతూనే కొన్ని రకాల థెరపీలు చేయించుకుంటే కూడా ప్రయోజనం ఉంటుంది. ఏడీహెచ్‌డీ ద్వారా వచ్చే ప్రవర్తనాపరమైన లోపాలను ఈ థెరపీల ద్వారా అధిగమించవచ్చు. 

సైకోథెరపీ

ఏడీహెచ్‌డీతో బాధపడే చిన్నారులకు సైకోథెరపీలు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా సామాజిక నైపుణ్యాలు, కోపాన్ని అదుపు చేసుకోవడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలాంటి వాటిపై శిక్షణ ఇస్తారు.

బిహేవియర్‌ థెరపీ

ఈ థెరపీలో భాగంగా పిల్లల ప్రవర్తన మార్చడానికి ప్రయత్నిస్తారు. ఏడీహెచ్‌డీ లక్షణాలను తగ్గించుకునేలా వాళ్లకు ఏదో ఒకరకమైన బహుమతులు ఇస్తూ ప్రోత్సహించడం ఇందులో ఒక భాగం. తినే సమయంలో అయినా, హోంవర్క్‌ చేసే సమయంలో అయినా తాము చెప్పినట్లు చేస్తే చిన్న చిన్న బహుమతులు ఇస్తూ మెల్లగా వాళ్ల ప్రవర్తన మార్చాలి. అటు స్కూల్‌లో అయితే ఇలాంటి పిల్లలను టీచర్లు ప్రత్యేకంగా చూస్తూ.. వాళ్లు సాధించే చిన్న చిన్న విజయాలను కూడా మెచ్చుకోవడం, ప్రోత్సహించడంలాంటి చేయాలి. వాళ్లకు ఇష్టమైన రీతిలో చదువు నేర్పించడం కూడా ఇందులో ఒక భాగం. 

తల్లిదండ్రులకు శిక్షణ

ఏడీహెచ్‌డీతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. వాళ్లతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి.. వాళ్లతో ఎలా పని చేయించుకోవాలి.. ఏం చేస్తే వాళ్ల ఏకాగ్రత పెరిగి, ప్రవర్తన మెరుగవుతుందో ఈ శిక్షణలో చెబుతారు. దీనివల్ల అలాంటి పిల్లలతో మీ సంబంధాలు మరింత మెరుగై.. వాళ్లను ఆ డిజార్డర్‌ బారి నుంచి మీకు మీరుగా రక్షించుకోగలుగుతారు.

ఇక సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణను కూడా ఏడీహెచ్‌డీ పిల్లలకు ఇస్తారు. బయటకు వెళ్లినపుడు ఎలా ఉండాలి.. వాళ్ల ప్రవర్తన అవతలి వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అన్న అంశాలపై పిల్లలకు శిక్షణ ఇస్తారు. 

చివరిగా మరోసారి మేము చెప్పేది ఏంటంటే.. మీ పిల్లలు హైపర్ యాక్టివ్ అయినంత మాత్రాన ఈ ఏడీహెచ్‌డీ బారిన పడ్డారని ఆందోళన చెందకండి. పైన చెప్పిన లక్షణాలన్నింటినీ ఓసారి గమనించి, అనుమానం వస్తే నిపుణులను సంప్రదించండి.


Previous articleగూగుల్ ఫ్యామిలీ లింక్ ఖాతాతో పిల్లల బ్రౌజింగ్ సేఫ్
Next articleహైదరాబాద్ లో ఆకట్టుకునే 6 థీమ్ రెస్టారెంట్లు