“నేను ఏమేమి కాలేనో వాటన్నిటి గురించి మీరు నాకు ఏకరువు పెట్టిననప్పుడు, ఓ చిరునవ్వు నవ్వి, నేను యుద్ధాన్ని, స్త్రీని రెండిటినీ కూడా అంటాను, మీరు నన్ను ఆపలేరు.”
– నికితా గిల్
* * *
రెండవ ప్రపంచ యుద్ధ గాథల గని ఎన్నటికీ తరిగేది కాదు. అందులోంచి పుట్టుకొచ్చిన సినిమాలకు లెక్కలేదు. ఇటీవలే విడుదలైన ఎ కాల్ టు స్పై వాటన్నిటికి భిన్నమైనది.
మరుగునపడ్డ గతకాలపు ‘కొత్త హీరో’ల కథ. అరకొర శిక్షణతోనే గూఢచారులై నాజీ ఆక్రమిత ప్రాన్స్‌లో అడుగిడి… అడుగడుగునా వేచి చూసే నాజీ గెస్టపో ఏజెంట్లు, వారి ప్రెంచ్ ఇన్ఫార్మర్ల నిఘా నేత్రాలను ఏమార్చి పని చేసిన మహిళా గూఢచారుల చిత్రం.
* * *
ఈ చిత్రం ప్రధానంగా ముగ్గురు మహిళా గూఢచారిణుల కథ. ఒకరు, లండన్‌లోని అమెరికన్ కాన్సులేట్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న అమెరికన్ వనిత వర్జీనియా హాల్ (సారా మేగాన్ థామస్). ఫ్రాన్స్ సహా యూరప్‌లోని పలు దేశాలు తిరిగి, పలు భాషలు నేర్చిన మహిళ. మరొకరు, భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ వనిత నూర్ ఇనాయత్ ఖాన్ (రాధికా ఆప్టే). ఇంకొకరు ఎస్ఓఇ-ఎఫ్ (మహిళా విభాగం) నేత, శిక్షకురాలు వెరా అట్కిన్స్ (స్టానా కాటిక్).
ముగ్గురూ తిరస్కారాలను, అనుమానాలను, వివక్షను ఎదుర్కొన్నవారు. వారే బ్రిటన్‌కు సంబంధించి రెండవ ప్రపంచ యుద్ధంలోని ఓ కీలక ఘట్టాన్ని మలుపు తిప్పే ఆపరేషన్‌లో కీలక పాత్రధారులు కాక తప్పక పోవడమే వైచిత్రి.
* * *
“పోలాండ్, ఆస్ట్రియా, డెన్మార్క్…. గ్రీస్, ఉత్తర ఫ్రాన్స్‌లను ఆక్రమించిన హిట్లర్ ఇప్పుడు ఇంగ్లిష్ ఛానల్‌ను దాటడానికి సిద్ధంగా ఉన్నాడు,” అని మొదట్లోనే వినిపించే రేడియో వార్త ఈ సినిమాకు చారిత్రక నేపథ్యం.
హిట్లర్ సేనల ఆక్రమణ నుంచి బ్రిటన్ను గట్టెక్కించడానికి ఉన్నది ఒకటే మార్గం. ఆక్రమిత ఫ్రాన్స్‌లో విధ్వంస కార్యకలాపాలను సాగించే ఫ్రెంచ్ ప్రజా ప్రతిఘటనను నిర్మించి హిట్లర్ దూకుడుకు కళ్లెం వేయడం.
కానీ, ఫ్రాన్స్‌లోని దైనందిన పరిస్థితులను సైతం తెలుసుకోలేని నిస్సహాయ స్థితి బ్రిటిన్ది. ఫ్రాన్స్‌లో ఉన్న శిక్షితులైన గూఛచారుల యంత్రాంగమంతా ఇప్పటికే ధ్వంసమైంది.
అరకొర శిక్షణతోనే ఔత్సాహిక గూఢచారులతో “స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్” (ఎస్ఓఇ) అనే కొత్త యంత్రాంగాన్ని, ప్రాన్స్ నాజీల చేజిక్కాక 1940లో, ఏర్పాటు చేశారు. ఆ మగ ఏజెంట్లూ రెండు వారాలకు మించి నాజీల కళ్లు కప్పలేకపోయేవారు.
“మహిళా గూఢచారులకు అలవాటుపడండి!”
మహిళా గూఢచారులంటేనే హేళన చేసే చర్చిల్ ప్రభుత్వం చివరకు అందుకు అనుమతించక తప్పలేదు. వారిని రిక్రూట్ చేసి శిక్షణనిచ్చి, వారి కార్యకలాపాలను సమన్వయపరచే “అనధికారిక నాయకురాలు” వెరా అట్కిన్స్.
నాజీల భయానికి రుమేనియా నుండి ఐదేళ్ల క్రితమే బ్రిటన్‌కు పారిపోయి వచ్చినా, ఎస్ఓఇలో కీలక పాత్ర పోషిస్తున్నా ఆమెను నమ్మడానికి వీల్లేదు… ఆమె యూదు జాతీయురాలు! బ్రిటన్ పౌరసత్వానికే దిక్కులేదు, ఆమెకు ఇక ర్యాంక్ ఎక్కడిది?
వర్జీనియాకు దౌత్యవేత్త కావాలని ఆశ. ఆమెకు అందుకు అవసరమైన వాటి కంటే ఎక్కువ అర్హతలున్నాయి. అయినా ఆమె మహిళ కావడం ఒక దోషం అయితే, మరొకటి అంగవైకల్యం!
ఆమె ఎడమ కాలు చెక్కది. రెండు కాళ్లు చచ్చుబడిపోగా వీల్‌చైర్‌లో తప్ప కదలలేదని రూజ్వెల్ట్ ప్రభుత్వ యంత్రాంగమే కాదు, ఆయన కూడా ఆమె మొర వినలేదు.
దౌత్యవేత్తకావాలనే ఆమె కల నెరవేరలేదు. నూర్ ఇనాయత్ ఖాన్ అప్పటికే వైమానిక విభాగానికి అనుబంధంగా ఉన్న వైర్లెస్ రేడియా విభాగంలో పనిచేస్తున్నది. అతి వేగంగా వైర్లెస్ సందేశాలను పంపగల నేర్పరి. పైగా ఆమెకు ప్రెంచ్ రావడమే కాదు, ఆమె చిన్నతనమంతా ఫ్రాన్స్‌లోనే గడిచింది.
కాకపోతే ఆమె రాజ సంతతికి చెందడం, సూఫీ ముస్లిం మతస్తురాలిగా శాంతివాది కావడం అమెకున్న అనర్హతలని అట్కిన్స్ పై అధికారులు తేలుస్తారు. ఆమెను గూఢచారిగా ఫ్రాన్స్‌కు పంపడానికి నిరాకరిస్తారు.
మొట్టమొదటి మహిళా గూఢచారులు
గత్యంతరం లేని పరిస్థితులలో ముందుగా వర్జీనియాను, ఆ తర్వాత నూర్‌ను నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌కు పంపక తప్పదు. వెళ్లిన వారు తిరిగి వస్తారనే ఆశ లేదు. అందుకే వారికి సైనైడ్ పిల్స్ ఇచ్చి పంపుతారు.
వర్జీనియా ఫ్రాన్స్ చేరిన మొట్టమొదటి మహిళా గూఢచారి. ఈ “చెక్క కాలు ఆడదే” నాజీల దృష్టిలో “అతి ప్రమాదకరమైన వ్యక్తి”గా మారుతుంది. రహస్యంగా ఫ్రెంచ్ ప్రతిఘటనా ఉద్యమాన్ని నిర్మిస్తుంది.
వారికి ఆయుధాలు, డబ్బు సమకూరుస్తూ నాజీల వెనుకతట్టున విధ్వంస కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తుంది.
నూర్‌కు ఫ్రాన్స్‌లో దిగినప్పటి నుండి నిలకడగా ఒక చోట ఉండే అవకాశమే దొరకదు. ఒక చేత్తో బరువాటి వైర్లెస్ రేడియో సెట్‌ను, మరో చేత్తో సూట్‌కేస్‌ను పట్టుకుని ఒకచోటి నుంచి మరో చోటికి పరుగుల తీస్తూ బ్రిటన్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తుంటుంది.
పారిస్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అట్కిన్స్ వారిస్తున్నా వినకుండా నూర్‌ను అక్కడికి వెళ్లమని ఎస్ఓఇ నాయత్వం ఆదేశిస్తుంది. దీంతో నూర్ అత్యంత ప్రమాదకరమైన పారిస్‌కు చేరుతుంది.
ఆమె పంపే రేడియో సందేశాలను గుర్తించినా డీకోడ్ చేయలేని నాజీలు ఆ సిగ్నల్స్‌ను బట్టి ఆమెను మొదటి నుండి వేటాడుతూనే ఉంటారు. నూర్ మొట్టమొదటి మహిళా వైర్లెస్ రేడియో ఆపరేటర్ కమ్ స్పై.
ఈ మహిళా ఏజంట్లను పట్టుకోవడానికి “లయన్ కసాయి”గా పేరు మోసిన నరహంతకుడు, గెస్టపో ఉన్నతాధికారి నికోలస్ క్లాస్ బార్బీ స్వయంగా రంగంలోకి దిగుతాడు.
ఫ్రెంచ్ ప్రజా ప్రతిఘటనలోకి చొరబడిన ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో వర్జీనియా నిర్మించిన రహస్య నెట్వర్క్ చిన్నాభిన్నమౌతుంది. నూర్ రాత్రుళ్లు తలదాచుకునే నీడైనా లేక వీధులలోనే రోజుల తరబడి తిరుగుతూ బ్రిటన్‌కు సందేశాలను పంపుతుంటుంది.
ఈలోగా లండన్‌లోని అట్కిన్స్ నూర్, వర్జీనియాల భద్రత గురించి ఆందోళన చెందుతుంది. పై అధికారులకు తెలియకుండా… ఇక పని కట్టబెట్టి, తిరిగి బ్రిటిన్‌కు వచ్చేయమని నూర్‌కు సందేశం పంపుతుంది. అందుకు నిరాకరించిన నూర్ పారిస్‌లోనే ఉండిపోతుంది.
నమ్మక ద్రోహానికి గురై, నాజీల చేత చిక్కి చిత్రహింసలకు గురైనా నోరు మెదపదు, వర్జీనియా ఆనుపానులు బయటపెట్టదు. చివరకు ఆమెను కాన్సంట్రేషన్ క్యాంప్‌కు పంపుతారు.
“ఈ యుద్ధం ఎవరినీ గాయపరచకుండా వదల్లేదు”
నిజ జీవితగాథల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లిడియా డీన్ పిల్చర్, రచన, నిర్మాణ బాధ్యతలు వహించిన సారా మేగాన్ థామస్ మహిళలే కావడం కాకతాళీయమే కావచ్చు.
కానీ, వారు మహిళలు కావడం వల్లనే యుద్ధాన్ని, గూఢచర్యాన్ని గ్లోరిఫై చేయకుండా డీరొమాంటిసైజ్ చేసి, అవి కోరే త్యాగాలను, చిత్రహింసలను, కష్టాలను కన్నీళ్లను ప్రతిఫలింపజేస్తూ తీర్చిదిద్దగలిగారని అనిపిస్తుంది.
హాలీవుడ్ నుంచి ఇప్పటికే వచ్చిన లెక్కలేనన్ని రొడ్డకొట్టుడు వార్, స్పై బాక్సాఫీస్ హిట్ల కంటే దీనిని భిన్నమైనదిగా, ఉన్నతంగా నిలిపారు.
చరిత్ర అంటే తప్పులను, బలహీనతలను, ఓటములను కప్పిపుచ్చేసి, కేవలం విజయగాథలను గానం చేయడం కాదన్న వైఖరితో వారు ఈ కథను అల్లారు, చెప్పారు.
యుద్ధ కృషిలో పురుషులకు దీటుగా నిలిచినా మహిళలు ఎదుర్కొన్న లింగ, జాతి, మత, వికలాంగ వివక్షను కప్పిపుచ్చక, ధైర్యంగా చూపించారు.
సినిమా ముగింపుకు వస్తుండగా అట్కిన్స్ “ఈ యుద్ధం ఎవరినీ గాయపరచకుండా వదల్లేదు” అంటుంది. సినిమా ముగిసాక కూడా ప్రేక్షకులకు ఆ నొప్పి తెలుస్తూనే ఉంటుంది.
అమెజాన్ వీడియో ఈ ఏడాది ఉత్తమ చిత్రం
వర్జీనియాగా మేగాన్ థామస్, నూర్ ఇనాయత్ ఖాన్‌గా రాధికా ఆప్టే, అట్కిన్స్గా స్టానా కాటిక్లు చక్కటి నటనతో మూడు ప్రధాన పాత్రలకు ప్రాణం పోసారు.
రాధికా ఆప్టే, తనకంటే ముందుగా హాలీవుడ్‌కు చేరి మేకప్ అయినా చెదరని గ్లామర్ డాల్స్‌గా మిగిలిపోయిన “బడా బాలివుడ్ స్టార్” హీరోయిన్లకు భిన్నంగా సంక్లిష్టమైన వైవిధ్యభరితమైన పాత్రలలో నటిస్తుండటం విశేషం.
ఈ చిత్రం విడుదలకు ముందే విస్లెర్ ఫిల్మ్ ఫెస్టివల్, శాంతా బార్బరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, అలయన్స్ అఫ్ విమెన్ ఫిలిం జర్నలిస్ట్స్ అవార్డ్‌లను అందుకుంది. విడుదల తర్వాత అటు విమర్శకులను, ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ రెండు గంటల చిత్రం ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది, కదలకుండా ఏకబిగిన చూసేసాలా చేస్తుంది.
ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది విడుదల చేసిన ఉత్తమ చిత్రలలో ఒకటి అవుతుంది.
మూవీ రివ్యూ : ఎ కాల్ టు స్పై
రేటింగ్ : 4.5/5
నటీనటులు : సారా మేగాన్ థామస్, స్టానా కాటిక్, రాధికా ఆప్టే
ప్రొడ్యూసర్ : సారా మేగాన్ థామస్
దర్శకురాలు: లిడియా డీన్ పిల్చర్
విడుదల : అక్టోబర్ 2, 2020
నిడివి : 124 నిమిషాలు
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియోస్
దేశం: అమెరికా
ఆడియో: ఇంగ్లిష్, హిందీ
సబ్‌టైటిల్స్: ఇంగ్లిష్, హిందీ
రివ్యూ: పీవీఆర్