Chana masala curry Recipe: ప్రోటీన్లు పుష్క‌లంగా ఉండే శ‌న‌గ‌ల మసాల కూర రెసిపీ.. ఇలా చేస్తే మరింత రుచికరం

sanagala masala
శనగల మసాలా కర్రీ రెసిపీ

Chana masala curry Recipe: శ‌న‌గల‌ మసాల కూర రుచికి రుచి.. పౌష్ఠికాహారం కూడా. అథ్లెట్లు, క్రీడాకారులు ప్రోటీన్ కోసం తరచుగా శనగలు తీసుకుంటారంటే దీని ప్రాముఖ్యత మీకు అర్థమైపోతుంది. ఇలాంటి శ‌న‌గ‌ల‌తో కూరను ఎంతో రుచిగా, ఎంతో సులువుగా కూడా చేసేయ‌చ్చు. ప‌ప్పుధ‌న్యాల్లో ప్ర‌ధాన‌మైన‌వి శనగలు. విట‌మిన్లు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. చ‌పాతీ, రోటీ, రైస్ ఇలా అన్నింటితోనూ తినొచ్చు. స్నాక్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. చట్నీగా వాడుకోవచ్చు. ప‌చ్చి శ‌న‌గ‌లు, మొల‌కెత్తిన శ‌న‌గ‌లు, నాన‌బెట్టి ఉడికించిన శ‌నగ‌ల‌నూ తినొచ్చు. శ‌రీరానికి త‌గు మొత్తంలో ప్రోటీన్ అందడానికి శనగలు తప్పనిసరి. మ‌రి శ‌న‌గ‌ల మ‌సాలా కూర‌ను టేస్టీగా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌న‌గ‌ల మసాల కూర త‌యారీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు

  1. పెద్ద శ‌న‌గ‌లు (చోలే ) – ఒక క‌ప్పు
  2. ఉల్లిపాయ‌లు – పెద్ద‌వి రెండు
  3. ట‌మాటాలు – రెండు
  4. ప‌చ్చి మిర్చి – రెండు
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
  6. కారం – ఒక టేబుల్ స్పూన్
  7. ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
  8. గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్
  9. ఉప్పు – త‌గినంత
  10. కొత్తిమీర – కొద్దిగా
  11. నూనె – రెండు టేబుల్ స్పూన్లు
  12. దాల్చిన చెక్క – చిన్న ముక్క
  13. ల‌వంగాలు – రెండు
  14. బిరియాని ఆకు – ఒక‌టి
  15. యాల‌కులు – రెండు

శనగల మసాలా కూర త‌యారీ విధానం:

1. ముందుగా శ‌న‌గ‌ల‌ను ఒక నాలుగు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి లేదా ముందు రోజు రాత్రి నాన‌బెట్టుకోవాలి.

2. నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను ఇప్పుడు కుక్క‌ర్‌లో వేసి అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసి 5 విజిల్స్ వ‌చ్చేంత‌వ‌ర‌కూ ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్క‌లు, ల‌వంగాలు, దాల్సిన చెక్క‌, యాల‌కులు, వేసి రుబ్బుకోవాలి. ఆ త‌ర్వాత ఆ పేస్ట్‌ను ప‌క్క‌కు తీసుకుని మ‌ళ్లీ ఆదే జార్‌లో ట‌మాటా ముక్క‌ల‌ను వేసి రుబ్బుకోవాలి.

4. ఇప్పుడు స్టౌ మీద క‌ళాయి పెట్టుకుని రెండు, మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కాక అందులో ప‌చ్చిమిర్చి ముక్క‌ల‌ను, ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ను వేసుకుని క‌లుపుతూ వేపుకోవాలి. అది మాడిపోకుండా మంట‌ను సిమ్‌లో పెట్టుకోవాలి.

5. ఆ త‌ర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి ప‌చ్చి వాస‌న పోయేంత వ‌ర‌కూ క‌లుపుకోవాలి.

6. ఇలా క‌లుపుకున్న మిశ్ర‌మంలో ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసుకుని మ‌ర‌లా ఒక‌సారి మ‌సాలాలు అన్నీ బాగా క‌లుపుకోవాలి.

7. ఇప్పుడు అందులో టమాటా పేస్ట్‌ యాడ్ చేసుకోవాలి.

8. ట‌మాటా పేస్ట్ కొంచెం మ‌గ్గిన తర్వాత అందులో ఉడికించిన శ‌న‌గల‌ను వేసుకుని కలుపుకోవాలి.

9. ఆ త‌ర్వాత రెండు గ్లాసుల నీటిని పోసుకుని క‌ల‌పాలి.

10. నీళ్లు ద‌గ్గ‌రికీ అయ్యేంత‌వ‌ర‌కూ, నూనె కొద్దిగా పైకి తేలేంత‌వ‌ర‌కూ కూర‌ను ఉంచాలి. ఆపై కొత్తిమీర‌ను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

అంతే ఎంతో రుచిక‌రంగా ఉండే శ‌న‌గ‌ల మసాలా కూర సిద్దం. ఇది చ‌పాతీ, రోటీ, రైస్, ప‌రోటా వంటి వాటిలో క‌లుపుకుని తింటే ఎంతో టేస్టీ. ఎంతో ఆరోగ్యం.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleParenting Mistakes: పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులు ఈ చిన్న పొర‌పాట్లు చేయ‌కూడదు
Next articleSummer Precautions: వేస‌విలో ఈ నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి ఇలాంటి జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!