Coconut Pulao Recipe: కొబ్బరి పులావ్ అంటే ఎవరు ఇష్టపడరు? ఈ రెసిపీ చేయడం కూడా చాలా సులువు. అప్పుడప్పుడు రొటీన్‌కు భిన్నమైన వంటకాలు చేయాలనుకుంటే కొబ్బరి పులావ్ రెసిపీ నేర్చేసుకోండి. చాలామంది కొబ్బరిపాలతో, ఇంకొందరు కొబ్బరి తురుము వేసి కూడా చేస్తుంటారు. అయితే ఈ కొబ్బరి పులావ్‌ని పండగ భోజనంలో ఒక భాగంగా చేసుకుంటాం. అందరూ ఇష్టంగా తినే ఈ వంటకాన్ని టేస్టీ గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు:
1. ఒక కప్పు బియ్యం
2. 1\2 కప్పు కొబ్బరి తురుము
3. యాలకులు – 4
4. దాల్చినచెక్క – చిన్నది
5. లవంగాలు – 3
6. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
7. ఉల్లిపాయ – పెద్ద సైజు ఒకటి
8. పచ్చిమిర్చి – 4
9. ఉప్పు రుచికి సరిపడా
10. జీడిపప్పు పలుకులు – 5
11. నూనె లేదా నెయ్యి – 1\4 స్పూన్లు
కొబ్బరి పులావ్ తయారుచేసే విధానం
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత యాలికలు, లవంగాలు, దాల్చినచెక్క మూడింటిని మిక్సీ జార్లో మెత్తని పొడి చేసుకోవాలి. అలాగే కొబ్బరిని తురుముకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి ముందుగా తురుముకుని పక్కన పెట్టుకున్న కొబ్బరిని దోరగా గోధుమ రంగు వచ్చే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. అదే కళాయిలో నూనె వేసి సన్నగా కాస్త పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, ఇంకా పచ్చిమిర్చి ముక్కలను, అందులోనే జీడిపప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న పొడిని అందులో వేసి కలుపుకోవాలి.
4. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకూ వేయించాలి. తర్వాత అందులో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఆ నీటిలో వేసుకోవాలి.
5. కొబ్బరి తురుమును తాలింపులో మరిగించడం వల్ల కొబ్బరి పులావ్ రుచి చాలా బావుంటుంది. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కాస్త రుచికి సరపడా ఉప్పును వేసి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టుకుని నీరు ఇంకేంత వరకూ ఉడకనివ్వాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పులావ్ రెసిపీ రెడీ అయినట్టే. ఈ విధంగా సరైన కొలతలతో చేసారంటే ఇష్టపడని వారు ఉండరు. కనుక రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకునే ఈ కొబ్బరి పులావ్‌ని మీరు కూడా చేసుకొని ఆనందించండి.
కొబ్బరి వల్ల ఉపయోగాలు:
కొబ్బరిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరిలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ వల్ల శరీరానికి శక్తి అందుతుంది. శరీర కండరాలు గట్టిపడడంలో కొబ్బరి సహాయపడుతుంది. అలాగే కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అదేవిధంగా కొబ్బరిని తరుచూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్