రోజూ రాత్రి భోజ‌నం త‌ర్వాత బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా!

Jaggery cubes
బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి "Jaggery cubes" by Mangosapiens is licensed under CC BY-SA 4.0

Jaggery Health Benefits: రాత్రి భోజ‌నం తర్వాత చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకుంటే క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చాలా ఉన్నాయ‌ట‌. బెల్లం తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి? దీని ద్వారా ఏ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో ఇప్ప‌డు తెలుసుకుందాం. బెల్లంలో ఎక్కువ‌గా ఐర‌న్ కంటెంట్ ఉండడం వ‌ల్ల శ‌రీరం శ‌క్తి కోల్పోకుండా చేస్తుంది. ఇందులో విట‌మిన్ బి12, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది యాంటీ టాక్సిక్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక ర‌సాయ‌నాల‌తో ప్రాసెస్ చేసిన పంచ‌దార‌ ఉప‌యోగించే బ‌దులు స‌హ‌జమైన బెల్లాన్ని వాడ‌డం ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్త‌హీన‌తకు బెల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. అలాగే జలుబు, దగ్గు ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు బెల్లం ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. ఈ బెల్లం వల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను ఇక్క‌డ చూడొచ్చు.

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

రోగాన్ని నిరోధించ‌డంలో బెల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, ఖనిజాలు, విటమిన్లు ఉండ‌డం వ‌ల‌న రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి వాటి నుంచి రక్షణ అందిస్తుంది.

2. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది:

బెల్లంలో ఉండే అనేక ఆయుర్వేద గుణాలు చ‌ర్మంలో ఉండే అనేక స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో తోడ్ప‌డ‌తాయి. ఇందులో ఉండే గ్లైకోలిక్ ఆమ్లం చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. ఇది ఎక్స్‌ఫోలియేట‌ర్‌గా ప‌నిచేసి ముఖంపై వ‌చ్చే మొటిమ‌లను  త‌గ్గిస్తుంది. అంతేకాదు చ‌ర్మం కాంతివంతంగా ఉండాల‌న్నా మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌కుండా ముఖం అందంగా త‌యార‌వ‌డానికి కూడా బెల్లం ఉప‌యోగ‌ప‌డుతుంది.

3. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది:

బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  అజీర్ణం,మలబద్ధకం, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, వంటి జీర్ణ రుగ్మతలను నివారిస్తుంది. రోజూ రాత్రి ప‌డుకునే ముందు బెల్లం తిన్నారంటే ఈ స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

4. యాంటీ ఆక్సిడెంట్లు అధికం:

బెల్లం యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. స‌హ‌జ‌మైన ఫైటోకెమిక‌ల్స్ వంటి యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల  శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో వచ్చే మంట‌ల‌ను కూడా తగ్గిస్తుంది.  అలాగే గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. రక్త‌హీన‌త స‌మ‌స్య‌ను తగ్గిస్తుంది:

బెల్లంలో ఐర‌న్ సమృద్దిగా ఉంటుంది. క‌నుక ర‌క్త‌హీన‌తతో బాధ‌ప‌డుతున్న వారికి బెల్లం మంచి ఔష‌ధం. ర‌క్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ఈ స‌మ‌స్య‌తో నిత్యం బాధ‌ప‌డేవారు త‌ప్ప‌కుండా బెల్లాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

6. అధిక బరువును నియంత్రిస్తుంది:

బెల్లం ఒక సహజ తీపి ప‌దార్థం. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది జీవ‌క్రియ‌ను పెంచుతుంది. త‌ద్వారా బ‌రువు తగ్గ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది. క్యాల‌రీల‌ను బ‌ర్న్ చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. 

7. రుతుక్ర‌మ స‌మ‌యంలో వ‌చ్చే నొప్పిని తగ్గిస్తుంది:

బెల్లంలో ఐరన్ మరియు ఫోలేట్ కంటెంట్ శ‌రీరంలో వ‌చ్చేట‌టువంటి మార్పులకు, సరైన రక్త ప్రసరణను నిర్వహించడానికి, ఋతుస్రావ సంబంధ స‌మస్య‌ల‌ను త‌గ్గించ‌డానికి నెల‌స‌రి వ‌చ్చినప్పుడు తీవ్ర‌మైన నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.

8. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:

శ‌రీరంలో వ్వ‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే బెల్లం త‌రుచూ తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇది లివ‌ర్ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి కాలేయాన్ని పూర్తిగా శుభ్ర‌ప‌రుస్తుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleవేడి వేడి అన్నంలో మామిడి కాయ పులుసు.. సూప‌ర్ టేస్టీ రెసిపీ
Next articleThis week releases: ఈ వీకెండ్‌లో థియేట‌ర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే