ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒక రైలు మరో రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇది 20 ఏళ్లలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం. మృతుల సంఖ్య 288కి చేరింది. సిగ్నల్స్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి, విపత్తు నిర్వహణ బృందాలు సమాచారం అందించారు. అలాగే గాయపడిన కొందరిని ఆసుపత్రిలో పరామర్శించారు. రెస్క్యూ కార్మికులు ఇప్పటికీ దెబ్బతిన్న రైలు బోగీల నుండి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొంత మంది మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మూడు రైళ్లు ఉన్నాయి. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరియు గూడ్స్ రైలు. ఈ రైళ్లలో దాదాపు 2,000 మంది ప్రయాణికులు ఉన్నారు. కోల్‌కతాకు దక్షిణాన 250 కి.మీ, భువనేశ్వర్‌కు ఉత్తరాన 170 కి.మీ దూరంలో ఉన్న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఒడిశా రైలు ప్రమాదంపై తాజా సమాచారం
- ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారని సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కేఎస్ ఆనంద్ తెలిపారు.
2. రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. రైలు పట్టాలను పునరుద్ధరించే పని ప్రారంభమైంది. క్రాష్ కారణంగా, 150 కంటే ఎక్కువ రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. కొన్ని రైలు ప్రయాణాలను కుదించారు.
3. ప్రధాన రైలు ట్రాక్‌లోకి ప్రవేశించడానికి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ లభించిందని, అయితే ఆ తర్వాత సిగ్నల్ రద్దు అయ్యిందని ప్రాథమిక పరిశోధనలు చూపిస్తున్నాయి. దీంతో రైలు వేరే ట్రాక్‌పైకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.
4. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలో రైల్వే అధికారులు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లిన తర్వాత గూడ్స్ రైలును ఢీకొట్టిందా లేదా అది పట్టాలు తప్పి ఆగి ఉన్న రైలును ఢీకొట్టిందా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.
5. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చారని, అయితే అది రద్దు అయిందని ప్రాథమిక నివేదిక చెబుతోంది. దీంతో రైలు రాంగ్ ట్రాక్‌పైకి వెళ్లి గూడ్స్ రైలును ఢీకొట్టిందని అవగతమవుతోంది. అదే సమయంలో 12864 నెంబరు గల మరొక రైలు ఇంకో ట్రాక్ గుండా వెళుతుంది. దాని రెండు క్యారేజీలు పట్టాలు తప్పాయి. అవి పల్టీలు కొట్టాయి.
6. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బాలాసోర్‌లోని ఆసుపత్రిని ప్రధాని మోదీ సందర్శించారు. జరిగిన దానికి చాలా బాధగా ఉందని, బాధ్యులను ఎవరైనా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై త్వరితగతిన సమగ్ర విచారణ జరపాలని కూడా ఆయన ఆదేశించారు.
7. శనివారం రాత్రి 8 గంటలకు ఒడిశాలోని ప్రభుత్వ అధికారులు 1,175 మందిని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. వారిలో 793 మంది డిశ్చార్జి అవగా 382 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
8. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి 50 వేల రూపాయలను ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి అందజేస్తానని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చాయి.