చక్కెరను తీపి విషంగా చెబుతున్నారు డాక్టర్లు. తీయటి టీ, కాఫీ లేదా కూల్ డ్రింక్ దిగకపోతే చాలా మందికి రోజు గడవదు. ఉదయం లేవగానే చాలామంది టీ, కాఫీలతోనే తమ రోజును ప్రారంభిస్తారు. కొందరు పంచదారను ఎక్కువగానే వాడుతుంటారు. టీ, కాఫీ, స్వీట్స్ ఇలా ఏ తినుబండారాలు చేయాలన్నా ముందుగా గుర్తొచ్చేది చక్కెర.
అలాంటి చక్కెరను మితిమీరి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. హర్మోన్ల సమస్య, మెదడు పనితీరుపై ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. అలాగే శరీర బరువును అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారుతుంది. కొలెస్టరాల్ అధికంగా పెరిగి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చక్కెరతో చేసిన పదార్థాలు అంటే అందిరికీ ఇష్టమే. తియ్యగా నోటికి రుచిగా అనిపిస్తే ఇక విడిచిపెట్టడం కంటే ఇంకో రెండు స్వీట్లు అదనంగా తినేస్తాం. కానీ అది ఆరోగ్యానికి యమ డేంజర్ అని ఆలోచించం. అందుకే చక్కెర వాడకం దేశంలో చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ చక్కెరను తీసుకోవడం వల్ల ఏ విధమైన సమస్యలను తలెత్తవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెరతో సమస్యలు ఇవే
- చక్కెరను ఎక్కువగా వాడుతుంటే జీవక్రియ అస్తవ్యస్తంగా మారుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారు, బరువుతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నవారు చక్కెరను దూరంగా ఉంచడం ఉత్తమం.
- చక్కెరలో సాధారణంగా కార్బొహైడ్రేట్లు తప్ప పోషకాలు ఉండవు. శరీరంలో పోషకాలు లేని వాటిని ఎంత తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదమే అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చక్కెరను ప్రాసెస్ చేయడం వల్ల దానిలో పోషకాలు పూర్తిగా ఆవిరై పోతాయి.
- చక్కెరను తయారు చేసే క్రమంలో ఎక్కువగా కాల్షియం హైడ్రాక్సైడ్, సల్ఫర్‌డైఆక్సైడ్ వంటి కెమికల్స్ ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. దాని వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
- తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకు కూడా ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందువల్ల చక్కెరను పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు.
- పంచదారను అవసరానికి మించి తీసుకోవడం వల్ల బాడీలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల లివర్ పాడవుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు, కిడ్ని సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పంచదారకు ప్రత్యామ్నాయాలు
చక్కెరను ఎక్కువగా వాడే వారు దానికి బదులుగా సహజ తీపి పదార్థాలను వాడొచ్చు. తేనె, బెల్లం, ఎండు ఖర్జూరాలు, తాజా పండ్లు వంటి వాటితో నోరు తీపి చేసుకోవచ్చు. వీటి వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా బెల్లం శరీరాన్ని శుద్ది చేస్తుంది. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఖర్జూరాలలో పోటాషియం, మెగ్నీషియం,ఫైబర్, ఐరన్, కాల్షియం అధికంగా ఉండి శరీరానికి శక్తిని అందివ్వడంలో సహాయపడతాయి. ఇంక తేనె గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్ చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్