ఫ్యాటీ లివర్ అనే కాలేయ వ్యాధి మన శరీరంలో ముఖ్యమైన అవయవమైన లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీ లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడమే. మీ కాలేయం బాగుంటే మీ శరీరంలోని మలినాలన్నీ శుభ్రం అవుతాయి. జీవక్రియ, కొవ్వుల జీర్ణక్రియతో సహా అనేక విధులు సక్రమంగా సాగుతాయి. కానీ ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తే ఈ విధులకు ఆటంకం కలుగుతుంది. అయినా కంగారు పడాల్సిన పనిలేదు. ఆహార మార్పులు, తగిన చికిత్స ఈ వ్యాధిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఏం తినాలి? ఏం నివారించాలనే విషయాలను ఇక్కడ గమనించవచ్చు.
ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎన్ని రకాలు
హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలిచే ఈ ఫ్యాటీ లివర్ వ్యాధి కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోవడం ద్వారా ఏర్పడుతుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి.
- నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD): ఈ పరిస్థితి అధిక ఆల్కహాల్ వినియోగానికి సంబంధించినది కాదు. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్‌తో సంబంధం కలిగి ఉంటుంది.
- ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD): ఈ రకమైన ఫ్యాటీ లివర్ వ్యాధి అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది.
రెండు రకాలు కూడా చికిత్స చేయకుండా వదిలేస్తే నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH), సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ పరిస్థితులకు దారితీయవచ్చు. అదృష్టవశాత్తూ, ఈ పరిస్థితులను నిర్వహించడానికి ఆహారం ఒక శక్తివంతమైన సాధనం.
ఫ్యాటీ లివర్ డైట్: ఏం తినాలి?
- లీన్ ప్రొటీన్: చికెన్, ఫిష్ వంటి లీన్ ప్రొటీన్ కలిగిన మాంసం, అలాగే టోఫు, చిక్కుళ్ళు వంటి మొక్కల ఆధారిత ఆహారం మీ డైట్లో భాగంగా తినండి. ప్రోటీన్ కాలేయ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరుకు ఊతమిస్తుంది.
- అధిక ఫైబర్ కలిగిన డైట్: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బరువును అదుపులో ఉంచుతాయి.
- ఆరోగ్యకరమైన కొవ్వులు: అవకాడోలు, నట్స్, గింజలు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ కొవ్వులు అవసరమైన పోషకాలను అందిస్తాయి. కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
- యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్: బెర్రీలు, సిట్రస్ పండ్లు, పాలకూర, ఇతర యాంటీఆక్సిడెంట్ అధికంగా కలిగిన ఆహారం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
- కాఫీ: మితమైన కాఫీ వినియోగం కాలేయ వ్యాధిని, వాపు ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే మీరు కాఫీ తీసుకోవచ్చా లేదా అని మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.
- గ్రీన్ టీ: గ్రీన్ టీలో కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మీరు రోజులో ఒకటి లేదా రెండు కప్పులు గ్రీన్ టీ తీసుకుంటే సరిపోతుంది.
- పోషకాహార సప్లిమెంట్లు: కొన్ని సందర్భాల్లో వైద్యులు కాలేయ ఆరోగ్యానికి మద్దతుగా విటమిన్ ఇ, విటమిన్ డి లేదా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి సప్లిమెంట్లను సిఫారసు చేస్తారు. ఒకవేళ చేయకపోయినా ఆయా విటమిన్లు కలిగిన ఆహారంపై మీరు ఫోకస్ చేయడం మంచిది.
ఫ్యాటీ లివర్ ఉంటే ఏం తినకూడదు?
- షుగర్ డ్రింక్స్: సోడా, కూల్ డ్రింక్స్ వంటి చక్కెర పానీయాలకు దూరంగా ఉండండి. ఇవి బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి.
- ప్రాసెస్ చేసిన ఫుడ్: వైట్ బ్రెడ్, చక్కెరతో కూడిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్‌తో సహా ప్రాసెస్ అయిన, ఎక్కువగా శుద్ధి చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండండి.
- హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్: అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉన్న ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అధిక ఫ్రక్టోజ్ తీసుకోవడం కాలేయ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే వీటిని అవాయిడ్ చేయాలి.
- ఆల్కహాల్: మీకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఉంటే, ఆల్కహాల్‌ను దూరం పెట్టడం చాలా అవసరం. AFLD ఉన్నవారైనా సరే మీ వైద్యుడి సిఫార్సు మేరకు ఆల్కహాల్‌ను నియంత్రించండి లేదా పూర్తిగా మానుకోండి.
- ట్రాన్స్ ఫ్యాట్స్: తరచుగా వేపుడు పదార్థాలు, కాల్చిన పదార్థాల్లో కనిపించే ట్రాన్స్ ఫ్యాట్స్ కాలేయ మంటను పెంచుతాయి. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి.
- మితిమీరిన ఉప్పు: ఉప్పు వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఉప్పుతగ్గిస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది.
ఫ్యాటీ లివర్ వ్యాధిని ఎదుర్కోవడంలో మీదే ముఖ్యమైన పాత్ర. ఆహార పానీయాల్లో ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవడం, తగిన చికిత్స అందుకోవడం వల్ల మీరు ఈ వ్యాధి నుంచి దూరమవుతారు. దీర్ఘకాలిక లివర్ సిరోసిస్ ముప్పును తప్పించుకున్న వారవుతారు.